Thursday, June 28, 2012

విశిష్టాద్వైతం


దీని ప్రవర్తకుడు శ్రీ రామానుజాచార్యులవారు. వీరు బ్రహ్మసూత్రాలకు భాష్యం శ్రీభాష్యం అనే పేరుతో రచించారు. మరికొన్ని విషయాలను పొందుపరుస్తూ వేదాంత దీపం,వేదాంత సారం అనే మరో రెండు రచనలు చేయడం జరిగింది. వీరిది వైష్ణవసాంప్రదాయంలో శ్రీవైష్ణవం అని చెబుతారు.
వీరు బ్రహ్మము లేక ఈశ్వరుడు అంటే నారాయణుడు లేక విష్ణువు అని చెబుతారు. ఈశ్వరుడు సర్వోత్కృష్ట మైన వాడు. అత్యున్నతమైన గుణములన్నీఉన్నవాడు సర్వస్వతంత్రుడు అంటారు. ఆయనకు సాటి వేరెవ్వరూ లేరు. ఆయనే సర్వేశ్వరుడని అన్నిటినీ నియంత్రిస్తాడనీ చెబుతారు. ఈ నారాయణుడే బ్రహ్మను,శివుడినీ సృష్టించి వారి కార్యాలలో నియంత్రిస్తాడని చెబుతారు. ఈశ్వరుడు ఒక్కడే. వీరు నిర్గుణ బ్రహ్మమును అంగీకరించరు. 

వీరు ఈశ్వరుడు(నారాయణుడు), జీవుడు, జగత్తు అనే మూడు తత్వాలను అంగీకరిస్తారు. ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈమూడూ సత్యమే అంటారు. ఈశ్వరునిలో చిత్ , అచిత్ అని రెండు భిన్నమైన తత్వాలు ఉన్నాయి. చిత్ అనేది జీవాత్మ .ఇది శాశ్వతము చైతన్యవంతమైనది. అచిత్ అనేది జడమైన ప్రకృతి/ జగత్తు. జీవుడు, జగత్తు పరమాత్మలో ఉండే అంశాలే. వీటికి పరమాత్మ వలె స్వతంత్రమైన ఉనికి లేదు.

జీవాత్మయొక్క  స్వభావం పరమాత్మ వలె సచ్చిదానంద స్వరూపమైనది. కాని జీవాత్మ పరమాత్మపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచం/జగత్తు ఎపుడూ ఒక స్థితి నుంచి మరో స్థితికి నామరూపాత్మకంగా మారుతూ ఉంటుంది. కాని దాని ఉనికి ఉంటూనే ఉండటం వల్ల అది నిత్యమైనదిగానే పరిగణించ బడుతుంది. ఆత్మ అణుపరిమాణం కలది. అనేక  అత్మలుంటాయి. ఆత్మకు జ్ఞానం ఉంటుంది. అంతర్యామి ప్రేరేపించినట్లుగా గాని, తన అభీష్టం మేరకు గాని కర్మలు చేసి వాటి ఫలితాలను కూడ అనుభవిస్తుంది. కొన్ని ఆత్మలు బద్దమై ఉంటాయి. కొన్ని ముక్తిపొందిన అత్మలుంటాయి. బద్ధమైన ఆత్మలు భక్తిమార్గంలో ఉండి పరమాత్మ అనుగ్రహంతో ముక్తిని పొందుతాయి. సర్వేశ్వరుడైన నారాయణునికి, ఆత్మకు, జగత్తుకు భేదం ఉంది. జగత్తు , జీవులూ ఈశ్వరుని శరీరమైతే ; ఈశ్వరుడు విశ్వానికే ఆత్మ. జీవులు చేసే కర్మలను బట్టి , వర్ణాశ్రమ ధర్మాలను బట్టి , భక్తి ప్రపత్తుల వల్ల ముక్తి/ మోక్షం కలుగుతుందని అంటారు. మోక్షం లభించాక కూడ ఆత్మలు విడిగానే ఉంటూ విష్ణు సేవచేస్తూనో, విష్ణువును ధ్యానిస్తూనో ఉంటాయని చెబుతారు.  

ఉపనిషత్తులలో జీవాత్మ పరమాత్మలకు భేదం తెలియజేసే కొన్ని శ్రుతులున్నాయి. వాటిని భేదశ్రుతులంటారు. కొన్ని శ్రుతులు భేదం లేవని చెప్పేవి ఉన్నాయి . వాటిని అభేదశ్రుతులంటారు. మరికొన్ని శ్రుతులలో పరమాత్మకూ, జీవత్మకూ జగత్తుకూ గల సంబంధాన్నిశరీరము , ఆత్మకు గల సంబంధంగా చెప్పబడటం వల్ల వాటిని ఘటకశ్రుతులని అంటారు. ఈ ఘటకశ్రుతుల ఆధారంగా శరీరము (జగత్పదార్ధం ), ఆత్మకు గల సంబంధాన్ని బట్టి ఈశ్వరుడే శరీరంలో ఉన్న ఆత్మయొక్క ఆత్మగా (అంతర్యామి) వీరు చెబుతారు. అంతర్యామి అంటే లోపల ఉండి  అన్నిటినీ నియంత్రించే వాడని.

మనం ఇలా చెప్పుకోవచ్చు. రామ అని చెప్పినపుడు రాముని శరీరం , రాముని ఆత్మ అని అర్ధం. పైన చెప్పినట్లు ఇంకా కొద్దిగా విపులీకరిస్తే రాముని ఆత్మయొక్క ఆత్మను ఈశ్వరుడు(అంతర్యామి) అని చెప్పాలి. జీవుని ఆత్మకు శరీరం ఎలాగో,అలా జీవాత్మను ఈశ్వరుని శరీరం అని చెప్పాలి. మరోవిధంగా ఈశ్వరుడే జీవాత్మయొక్క ఆత్మ. తేలిందేమంటే రామ అని అన్నపుడు
1) రాముని శరీరం.
2) రాముని ఆత్మ.
3) రాముని ఆత్మ యొక్క ఆత్మ (బ్రహ్మము). 
ఇప్పడు తెలిసేదేమంటే బ్రహ్మమే జీవాత్మ యొక్క ఆత్మ. అదే నేను అని మార్పులూ కూర్పులూ చేసుకొనేది.

విశిష్టాద్వైతం అంటే ప్రత్యేకంగా రెండు కాదు. ప్రత్యేకంగా ఒక్కటే.
జీవాత్మ పరమాత్మలు ఎలా వేరైనవంటే – జీవాత్మ శరీరమైతే దీని ఆత్మ పరమాత్మ.
ఆత్మ శరీరం కన్న భిన్నమైనది. అంచేత జీవాత్మ పరమాత్మ కన్న భిన్నమైనది.
అవి రెండు కాదు, ఒక్కటే . ఎలా అంటే – శరీరానికీ ఆత్మకూ ఉండే సంబంధం వల్ల .
రాముడు ఒక్కడే అయినా రాముని శరీరం, రాముని ఆత్మ అని చెప్పుకున్నట్లుగా ; జీవాత్మ శరీరమైతే పరమాత్మ దానికి ఆత్మగా చెప్పినపుడు ప్రత్యేకంగా ఒక్కటే.
జీవాత్మ పరమాత్మలు రెండూ వేరు. ఇలా రెండు అని చెప్పేది  ద్వైతం. జీవాత్మ పరమాత్మలు వేరుగా రెండు కాదు, ఒక్కటే అని చెప్పేది అద్వైతం.
జీవాత్మ ఎప్పటికీ అన్నివిధాలా పరమాత్మతో సమానం కాలేదు - ఇది ద్వైతం.
కాని జీవాత్మకు పరమాత్మ ఆత్మగా ఉండటం వల్లను, పరమాత్మకు జీవాత్మశరీరం కావడం వల్లనూ ఆత్మకూ  – శరీరానికీ  ఉండే సంబంధం వల్ల ఈ రెండూ ఒక్కటే-  ఇది అద్వైతం.

ఇక్కడ  ద్వైతానికీ , అద్వైతానికీ మధ్యలో ఉంటూ  రెండూ భిన్నమైన వైన ఆత్మకూ శరీరానికీ ఉండే ప్రత్యేకమైన సంబంధం వల్ల; జీవాత్మ పరమాత్మలు ఒక్కటే అని చెప్పడం వల్ల ఈ విధంగా  - విశిష్టాద్వైతం అని పిలువబడుతోంది. ఒక ఉదాహరణను తీసుకుందాం. 
సముద్రం అంటే దాన్లో తరంగాలు ఉంటాయి.
సముద్రంలో ఉండే తరంగాలు ఎప్పుడూ సముద్రానికన్న వేరైనవే అని చెప్పేది – ద్వైతం.
తరంగాలు , సముద్రం అంతా దాన్లో ఉండే నీరే. తరంగం , సముద్రం అనేవి మనస్సులో ప్రతిఫలిస్తున్నాయి. వాస్తవానికి అక్కడ ఉన్నది నీరు మాత్రమే అని చెప్పేది – అద్వైతం.
తరంగాలు సముద్రానికన్న భిన్నమైనవైనా అవి సముద్రానికన్న వేరు కాదు. ఇదే భిన్నత్వంలో ఏకత్వం. ఇదే విశిష్టాద్వైతం
        
     


Tuesday, June 26, 2012

ద్వైతం


ద్వైత సాంప్రదాయానికి మూల పురుషుడు మధ్వాచార్యుల వారు. వైష్ణవ సాంప్రదాయంలో వీరిది సద్వైష్ణవం అంటారు. వీరి విచారణను తత్వవాదం అని చెబుతారు . మధ్వాచార్యులవారికి  తల్లితండ్రులు వాసుదేవ అని నామకరణం చేసేరు. క్రమంగా ఆనంద తీర్ధుడని, పూర్ణ ప్రజ్ఞ అనీ మద్వాచార్యులని  నామాంతరాలు పొందేరు.
ముఖ్య ప్రాణమైన  వాయువు యొక్క మొదటి అవతారం హనుమంతుడు. రెండవ అవతారం భీముడు .
శ్రీ మధ్వాచార్యుల వారు ముఖ్య ప్రాణం యొక్క మూడవ అవతారంగా చెప్పబడినది.

బ్రహ్మసూత్ర భాష్యం , అనుభాష్యం , న్యాయ వివరణం , అనువ్యాఖ్యానం అని సూత్ర ప్రస్థానంపై భాష్యం రచించేరు. వీటితో బాటు మొత్తం ముప్పై ఏడు రచనలను చేసేరు. వీటన్నిటినీ కలిపి సర్వమూలం అని పిలుస్తారు.
  
వీరి ద్వైతం ప్రకారం జీవాత్మ , పరమాత్మలు వేర్వేరుగా ఉంటాయి. అవి ఎప్పటికీ ఒక్కటి కాలేవు. జీవుడు ఎప్పటికీ నారాయణుడు కాలేడు. ఈ భేదం శాశ్వతంగా ఉంటుంది. 

శ్రుతిలో చెప్పబడిన బ్రహ్మము - హరి లేక  విష్ణువే . నారాయణుడని కూడ పిలుస్తారు. విష్ణువు సర్వ శ్రేష్ఠుడనీ , వైకుంఠం లేక స్వర్గం ఆయన నివాస స్థానం అనీ అక్కడ ఆయన సతి లక్ష్మీ దేవితో ఉంటాడనీ బోధిస్తారు. హరి సర్వ స్వతంత్రుడనీ, ఏ పేరుతో పిలచినా అది విష్ణువునే సూచిస్తుందని అంటారు.

జీవాత్మలూ , జగత్తు కూడ సత్యమైనవే కాని  స్వతంత్రమైనవి కావు. హరి కన్న భిన్నమైనవి. జీవులందరూ హరిపై ఆధారపడి ఉంటారు. జీవులు హరికి సేవ చెయ్యడానికే. పరిపూర్ణమైన భక్తి , సరైన జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే బ్రహ్మముతో ఐక్యమవ్వడం కాదు. దుఖం పోయి ఆనందమయ స్థితిని పొందటమే.  
ముఖ్యంగా అయిదు విషయాలను ఎప్పటికీ భిన్నమైనవి అని  చెబుతారు. అవి    
1) జీవుడు ఈశ్వరుడు ఎప్పుడూ భిన్నమైన వారే. ఇక్కడ ఈశ్వరుడు అంటే   బ్రహ్మము లేక  విష్ణువు.
2) జడమైన వాటికి, ఈశ్వరునకు భేదం ఉంది.
3) రెండు జీవులు ఎపుడూ ఒకే లక్షణాలను కలిగి ఉండరు. రెండుజీవులకు మధ్య ఉండే భేదం.
4) జడమైన వాటికీ జీవునకూ  భేదం ఉంది .
5) రెండు జడమైన పదార్దాలకూ భేదం ఉంటుంది.

జగత్తు ఎలా సత్యమో , అలా ఈ భిన్నత్వమూ సత్యమే.
ఇలా ఈశ్వరునికీ జీవుడికీ , జీవుడికీ జగత్తుకీ , ఈశ్వరునికీ జగత్తుకీ ,జీవుడికీ జీవుడికీ , జగత్తులోని విషయాలలోనూ భిన్నత్వం చెప్పటం వల్ల ద్వైతంగా చెప్పబడుతోంది.



Monday, June 25, 2012

అద్వైతం

ఆస్తిక దర్శనాలన్నీ జీవాత్మ, పరమాత్మ, జగత్తు లను గురించి  చర్చించి ఈ మూడిటికీ పరస్పరం ఉండే సంబంధాన్నే తెలిపాయి.  ఇవన్నీ మానవుడి  దుఖాన్ని తొలగించుకొని మోక్షం పొందటాన్ని  ధ్యేయంగా చెబుతున్నాయి. నాస్తిక దర్శనాలు కూడ దుఖం పోగొట్టుకొనేందుకే ఉద్దేశించబడ్డాయి . జీవుడు /పురుషుడు/ జీవాత్మను గురించి దాదాపు  అందరూ ఒప్పుకుంటారు. పరమాత్మ ఉన్నాడని కొందరు, లేదని కొందరు చెప్పడం జరిగింది. కనిపించే దృశ్య ప్రపంచంలోనే భిన్నాభిప్రాయాలు . కొందరు బ్రహ్మము కారణమంటే , మరికొందరు ప్రధానం కారణమని అలా వేర్వేరు ఆభిప్రాయాలను ఇదివరలో దర్శనాలు  శీర్షికలో చెప్పుకున్నట్లుగా వెల్లడించారు. 

బ్రహ్మము ఉందని చెప్పేవారిలో భేదాప్రాయాలు ఉండటం వల్ల వీరిలో అద్వైతులూ , ద్వైతులూ , విశిష్టా ద్వైతులని ముఖ్యంగా ప్రచారంలోకి రావడం జరిగింది. శంకరులు భగవద్గీత, ముఖ్యమైన పది ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలకూ భాష్యం వ్రాసి అద్వైత వేదంత సాంప్రదాయాన్ని స్థాపించారు. వేదాంతం అంటే అద్వైత వేదాంతమే అన్నంతగా బహుజన ప్రాచుర్యంలోకి వచ్చింది. వీరు చెప్పేది బ్రహ్మ ఒక్కటే సత్యం. జగత్తు మిధ్య. జీవుడు బ్రహ్మము కన్న వేరైనవాడు కాదు. అంటే విశ్వంలో ఉన్నది ఒక్క ఆత్మ మాత్రమే. జీవాత్మలన్నీ బ్రహ్మము యొక్క అంశాలే గాని వేరుకాదు.

వీరు బ్రహ్మమును రెండు విధాలుగా చెప్పేరు. నామరూపాలతో అనేక ఉపాధులతోను కూడిన బ్రహ్మము - సగుణ బ్రహ్మము   లేక అపర బ్రహ్మము .  ఈ అపర బ్రహ్మమే  జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయాలకు కారణం. నామరూపాత్మకంగా కన్పించే జగత్తు అవిద్య వల్ల ఏర్పడిన అధ్యాస . ఇది చీకటిలో వంకర టింకరగా పడిఉన్న త్రాడును చూసి పాము అనుకున్నట్లు అన్నమాట. దీన్ని అధ్యాస / అధ్యాసారోపణ అంటారు. ఇది అవిద్యవల్ల ఏర్పడుతోంది. వివేకంతో చూస్తే అపవాదు తొలగిపోయి సత్యం తెలుస్తుంది.
రెండవది -ఏ ఉపాధులూ లేని బ్రహ్మము - నిర్గుణ బ్రహ్మము  లేక పర బ్రహ్మము  .

జీవులు చైతన్య స్వరూపులు. స్వచ్చమైన ఎరుకతో ఉంటారు . నిత్య, శుద్ధ, బుద్ధ , ముక్తులైనప్పటికీ అంతఃకరణంతో తాదాత్మ్యం చెందటం వల్ల తామే కర్త, భోక్త అనుకుంటారు. శంకరులు  మరణానంతరం కలిగే క్రమ ముక్తిని ( అంటే మరణించిన పిదప కలిగే దేవయానం , బ్రహ్మలోక ప్రాప్తి తర్వాత కలిగే ముక్తి ) అంగీకరిస్తారు. అయినా సద్యో ముక్తి / జీవన్ముక్తి  జ్ఞానంవల్ల లభిస్తుందని చెబు తారు. బ్రహ్మము తనలో ఉండే మాయా శక్తివల్ల జగత్తును సృష్టించినట్లుగా శంకరులు చెబుతారు. ఏదైనా ఒకరి శక్తి అనేది తన కంటే భిన్నం కాదు. అలాగే బ్రహ్మం తన మాయా శక్తి చేత జగత్తు యొక్క సృష్టిని జరిపారని చెబుతారు.

తర్వాత కాలం వారిలో వల్లభాచార్యుల వారు శుద్ధ అద్వైత తత్వాన్ని ప్రతిపాదించారు. వీరు అనేదేమంటే శంకరులు బ్రహ్మం కంటే మాయ ఉందని అంగీకరించడంవల్ల అది ‘కేవల అద్వైతం’ అనబడుతోంది అని.

    








Friday, June 22, 2012

ఉత్తర మీమాంస దర్శనం (2) – ఆస్తిక దర్శనం

ఈ అద్వైత సిద్ధాంతానికి అధ్యాస అనేది ఆయువుపట్టు. ఉన్నది ఒక వస్తువైతే దాన్ని మరో వస్తువుగా గ్రహించడం భ్రమ/ అధ్యాస. అంటే లేనిచోట ఉన్నట్లుగా భావించబడే వస్తువు. ఎండలో తళతళ లాడుతూ తెల్లగా  మెరిసే ముత్యపు చిప్పను వెండి అనుకుంటాం. దూరంగా పడిఉన్న వంకర టింకరగా పడిఉన్న త్రాడును చూచి పాము అనుకుంటాం. అక్కడ పామూ లేదు, వెండీ లేదు. అవి లేని స్థలంలో ఉన్నట్లుగా భాసించే వెండికీ, పాముకీ అధ్యాస అని పేరు. పూర్వం వెండినీ పామునూ చూసిన సంస్కారం మనసులో ఉండటం వల్ల నేత్రాది దోషం వల్ల ఆ రెండూ భాసిస్తున్నాయి. అద్వైతుల ప్రకారం వెండి, త్రాడులమీద కనపడుతున్న రజిత సర్పాదులు ఉన్నవని చెప్పడానికి వీలు లేదు; లేవని చెప్పడానికీ వీలు లేదు. అవి నిజంగా ఉంటె క్షణా౦తరంలో  కల్గే జ్ఞానం వల్ల లేవని చెప్పకూడదు. పోనీ లేవని చెబుదామంటే ఆ క్షణం లోఅవి ఉన్నట్లు కనబడుతున్నాయి కదా! అందు చేత అక్కడ కన్పించిన రజతాదికం ఉంది అని కాని, లేదు అనికాని నిర్వచించడానికి శక్యం కాదు. ఇలా భ్రమ స్థలంలో అద్వైతులు అనిర్వచనీయ౦ అని అంగీకరించారు .ఈ అధ్యాసనే పండితులు అవిద్య అంటారు.

వేదాంత వాక్యాల సహాయంతో అద్వైతాత్మ విచారణ చెయ్యాలి. ఈ శాస్త్ర విచారణ వల్ల నేను కర్తను, నేను సుఖ దుఃఖాది భోక్తను మొదలైన భ్రాంతి కల్పితాలైన అనర్ధం తొలగి మోక్షం కల్గుతుంది. వాస్తవానికి ఆత్మచైతన్యరూపమైనది. దేహము, ఇంద్రియములు జడములు. దేహమే ఆత్మ ,ఇంద్రియాలు ఆత్మకు సబంధించినవి , దేహానికి చైతన్యం ఉంది అనే ఆత్మా అనాత్మల పరస్పర అధ్యాస అనాదిసిద్ధంగా వస్తుంది.
ఈ యాగాది కర్మలు చెయ్యాలి,ఇవి చెయ్యకూడదు , ఇలా సాధన చేస్తే మోక్షం కల్గుతుంది అనేటి లోకవ్యవహారమంతా నడుస్తోంది. ఈ అధ్యాస ఉన్నంత వరకే ఇవన్నీ. అధ్యాస తొలగిపోతే ఇక లోకవ్యవహారం ఏమీ ఉండదు. వేదాంత శాస్త్రమంతా ఆత్మతత్వ జ్ఞానాన్ని కలిగించి అధ్యాస తొలగడానికి ఉపకరిస్తుంది.

అందుచేత చిత్తశుద్ధి లేనివాడు బ్రహ్మచర్యం పూర్తిచేసుకొని గార్హస్థ, వానప్రస్థాలు స్వీకరించి కర్మాలనాచరించి చిత్తశుద్ధిని సంపాదించుకొని సన్యాసియై బ్రహ్మజిజ్ఞాసకు పూనుకోవాలి. మొదటినుంచీ చిత్తశుద్ధి ఉంటే కర్మలజోలికి పోనవసరం లేదు. ధర్మాన్ని తెలిసికొని ఆచరించడం వల్ల కలగే ఫలితం విషయాది సుఖం. బ్రహ్మజిజ్ఞాసకు ఫలం మోక్షం. బ్రహ్మ జ్ఞానం తర్వాత ఇక అనుష్టించాల్సిందేమీ లేదు.

ఈ లోకంలో కృషిచేసి సంపాదించేదంతా వస్తువుగాని, కర్మ సంపాదితమైన పరలోక భోగాలుకాని  నశించేవే. నిత్యము, అనంతము, శుద్ధము, సర్వజ్ఞము అయిన బ్రహ్మముందనేది అందరికీ తెలిసనదే.  ఆత్మయే బ్రహ్మము. అట్టి ఆత్మయొక్క విశిష్ట స్వరూపాన్ని గురించి అభిప్రాయభేదాలున్నాయి. అలాంటి పరిస్థితులలో జాగ్రత్తగా విచారించకుండా ఏదొక మతాన్ని అనుసరిస్తే మోక్షానికి దూరమవ్వుతాం. 

బ్రహ్మను సూచించడానికి జగత్తుయొక్క  సృష్టి  స్థితి లయాలనే సాధనంగా చెప్పాలి. బ్రహ్మ ఇంద్రియగోచరమైనది  కాదు కాబట్టి జగత్తుకూ బ్రహ్మకూ ఉన్న సంబంధం జగత్తు రూపమైన కార్యం మాత్రమే, ఇంద్రియాలచేత గ్రహించబడుతుంది. జన్మ స్థితి లయాలను బట్టి ఈశ్వరుడిని ఊహించాలి. శాస్త్రం ఆధారంగా తెలిసికోవాలి. అన్ని ఉపనిషద్వాక్యాలూ ఆ బ్రహ్మను ప్రతిపాదించడానికే.

అవిద్య, అస్మిత(అహంకారం), కామం , క్రోధం, భయం అనే దోషాలు ఉండటంవల్ల తదనుగుణంగా శరీరాలు పొంది మానవులు సుఖదుఃఖాలను అనుభవిస్తున్నారు. ఈ సుఖదుఃఖాల భేదానికి కారణం ధర్మాధర్మాల ఆచరణే. శరీరం ధరిస్తే సుఖదుఃఖాలతో (ప్రియాప్రియాలతో) సంబంధం లేకుండా ఉండదు. ఈ శరీర సంబంధం లేకుండా ఉండాలంటే ధర్మాధర్మాలు చెయ్యకూడదు. శరీరం లేకపోవడం అంటే మోక్షం. అది జీవునికి  స్వభావసిద్ధమైనది.

 నేను శోకంతో ఉన్నాను. శోకానికి అవతలి ఒడ్డుకు చేర్చమని నారదుడు ప్రార్ధించగా , పూజ్యుడైన సనత్కుమారుడు ; తపస్సుచే పాపాలన్నీ దగ్ధమైన నారదునికి అజ్ఞానం యొక్క అవతలి  ఒడ్డైన బ్రహ్మమును చూపినట్లు శృతి చెబుతోంది. మిధ్యాజ్ఞానం నశిస్తే రాగ, ద్వేష ,మొహాలు తొలగిపోయి ధర్మాధర్మరూప ప్రవృత్తి నశిస్తుంది. అపుడిక జన్మ ఉండదు. జన్మలేకపోతే దుఖముండదు. అదే మోక్షం. బ్రహ్మాత్మైకత్వ జ్ఞానమే తత్వ జ్ఞానం. ఇదే వేదాంతం. ఇదే ఈ దర్శనంలో  బోధించబడే విషయం.


Thursday, June 21, 2012

ఉత్తర మీమాంసా దర్శనం (1) – ఆస్తిక దర్శనం


జైమిని మహర్షి  వేదాలకు పూర్వభాగాలను తీసుకొని కర్మ కాండ ఆధారంగా పూర్వ మీమాంసా సూత్రాలను రచిస్తే, బాదరాయణుడు వేదాలలో చివరి భాగాలను తీసుకొని పైకి పరస్పరము విరుద్ధంగా కనిపించే వేద వాక్యాలకు / ఉపనిషత్వాక్యాలకు బ్రహ్మానికి సంబంధించినవిగా బ్రహ్మ సూత్రాలురచించడం జరిగింది. కాల క్రమేణా ఈ బ్రహ్మ సూత్రాలకు పలువురు భాష్య కారులు , భాష్యాలను వ్రాశారు.  భారతీయ తత్వ జ్ఞానానికి శాస్త్రీయతా దృక్పధమంతా ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత అనే ఈ మూడిటి ఆధారంగా గుర్తించబడుతోంది. ఈ మూడిటిని ప్రస్థాన త్రయం అని పిలుస్తారు. బ్రహ్మసూత్రాలు ముఖ్యంగా బ్రహ్మమును  అన్నివైపులనుంచీ విచారించడం ఇందులో విషయం. దీన్ని ఉత్తర మీమాంసా సూత్రాలనీ , శరీరంతో ఉన్న జీవుని యదార్ధ స్వరూపాన్ని చర్చిస్తుంది కాబట్టి శారీరకమీమాంస అనీ  అంటారు .

బాదరాయణుడు రచించిన సూత్రాలకు శ్రీ శంకర భగవత్పాదులు శారీరక మీమాంసా భాష్యం వ్రాసా రు. వేదాంతం అంటే అద్వైత వేదాంతం అనే ప్రచారంలోకి వచ్చింది. బ్రహ్మ సూత్రాలు నాల్గు అధ్యాలుగా ఉంది. ప్రతి అధ్యాయమూ నాలుగు పాదాలుగాను, ఒక్కొక్క పాదమూ కొన్ని అధికరణాలుగ, ఒకో అధికరణము కొన్ని సూత్రాలతోను ఉంది. 

మొదటి అధ్యాయంలో 134 సూత్రాలు 39 అధికరణాలు సమన్వయాధ్యాయంగా చెప్పబడింది . ఉపనిషత్తులలో చెప్పబడిన వాక్యాలకు బ్రహ్మం తో సమన్వయం చెప్పబడింది. ఆత్మయే బ్రహ్మమనీ , సృష్టి స్థితి లయాలకు కారణమనీ ఆనందమయుడని , అన్నీటి యందు ఉండే పురుషుడు బ్రహ్మమే ననీ,  బ్రహ్మమే జగత్తునకు నిమిత్త ఉపాదాన కారణమని సమన్వయం చెప్పబడింది.

రెండవ అధ్యాయంలో 157  సూత్రాలు 47   అధికరణాలుగ అవిరోధాధ్యాయం ఉంది. దీన్లో వేదాంత వాక్యాలకు సృష్ట్యాది  విషయాలలో ఎట్టి విరోధమూ లేదనేది  చెప్పబడింది. ఇలా చెప్పడానికి బాదరాయణుని కాలంలో ప్రముఖంగా ఉండే అన్ని మతాలను ఖండిస్తూ తన వాదాన్ని స్థాపించడం జరిగింది.

మూడవదైన సాధనాధ్యాయంలో 186  సూత్రాలు 67 అధికరణాలుగ పొందు పరచబడింది. దీన్లో వివిధ ఆశ్రమ ధర్మాలను , స్వప్నాలను, జీవుడు వివిధ శరీరాలను పొందటాన్ని కర్మానుభవాన్ని విద్యలను గురించి ఇలాంటి  కొన్ని విషయాలు విశదీకరించ బడ్డాయి.

నాల్గవదైన ఫలాధ్యాయంలో  78   సూత్రాలు, 38  అధికరణాలు ఉన్నాయి. దీన్లో జీవుడు మరణాంతరం బ్రహ్మలోకం చేరే మార్గాలను చెప్పడం జరిగింది. చివరగా బ్రహ్మలోకాన్ని పొందిన జీవుడు తిరిగి సంసారంలోకి రాడు ఆని శ్రుతులు అలా చెప్పబడటం చేత  రాడు అని చెప్పబడింది.

బాదరాయణుడు శ్రుతినే ప్రమాణంగా తీసుకొని ఈ బ్రహ్మసూత్రాలను రచించేడు. బ్రహ్మమే ఈ  ప్రపంచానికి మూలకారణం అని శృతి చెబుతోంది. జగత్తుకు బ్రహ్మమే నిమిత్తకారణము , ఉపాదాన కారణము కూడ. బాహ్య విషయాల సహాయం/అవుసరం  లేకుండా బ్రహ్మమే దృశ్య జగత్తుగా పాలనుండి ఇతరపదార్దాలు ఏర్పడినట్లు తనంత రూపు దాల్చడం జరిగింది. అలాగే సంకల్పం చేత ఆకాశము, వాయువు మొదలైనవి  ఏర్పడ్డాయి . బ్రహ్మమే ఈ ప్రపంచంగా రూపు దిద్దుకొనడం వల్ల జగత్తు బ్రహ్మము కన్నా వేరైనది కాదు. జీవుల కర్మలననుసరించే సృష్టి జరుగుతోంది. అంతేకాని పక్షపాత బుద్ధిని బ్రహ్మమునకు చెప్పటం  సరి కాదు.  ఆత్మ నిత్యము, అణు పరిమాణం గలది. జీవ బ్రహ్మముల సంబంధం అధ్యాస వల్ల ఏర్పడినది. అధ్యాస అనే అవిద్య తొలగితే మోక్షం వస్తుంది. 




Wednesday, June 20, 2012

పూర్వ మీమాంసా దర్శనం – ఆస్తిక దర్శనం


వేదాలు అపౌరుషేయాలు. అంటే ఎవరో మానవ మాత్రుడు వ్రాసినవి కావు. వీరు వేద ప్రమాణాన్ని అంగీకరిస్తారు . కాని ఈశ్వరత్వాన్ని అంగీకరించరు. వేద ప్రమాణాన్ని అంగీకరించడం వల్ల ఆస్తికులుగా పరిగణించ బడుతున్నారు. వేదాల యొక్క పూర్వ భాగాల ఆధారంగా ఉన్దేడవడం వల్ల దీనికి పూర్వ మీమాంస దర్శనం అని పిలువబడుతోంది.

ఈ పూర్వ మీమాంసా దర్శనానికి జైమిని మహర్షి మూలపురుషుడు. జైమిని వ్రాసిన సూత్రాలకు శబర స్వామి భాష్యం రచించడం జరిగింది. ఈ భాష్యానికి ప్రభాకరుడు, కుమారిల భట్టు వ్యాఖ్యానాలు వ్రాశారు. వీరిరువురిలో ముఖ్యవిషయాలలో భేదం లేపోయినా , కొన్ని అంశాలలో అభిప్రాయ భేదాలున్నాయి. వీట్లో భట్ట మతానికే అధికంగా ప్రాధాన్యత లభించింది. ప్రభాకరులు ప్రత్యక్షం, అనుమానం , ఉపమానం , శబ్దం , అర్ధాపత్తి అనే అయిదు ప్రమాణాలను అంగీకరిస్తే, కుమారిలభట్టు అనుపలబ్ది అనే ఆరవ ప్రమాణాన్ని కూడ తీసుకున్నారు. 

ఒక ఫలితాన్ని బట్టి దాని కారణాన్ని ఊహించడం – అర్ధాపత్తి.
ఉదా – ఒక వ్యక్తి పగలు భోజనం చెయ్యడు కాని బలిసి ఉన్నాడు అంటే రాత్రి పూట గుప్తంగా భోజనం చేస్తాడు అనేది గ్రహిస్తాం . ఇదీ అర్దాపత్తి అంటే.

 అనుపలబ్ది - ఇక్కడ ఘటం లేదు . ఉంటె కనపడేది కదా అన్నపుడు , ఘటం లేదని చెప్పడానికి ప్రమాణం అది అక్కడ లేపోవడం. ఇది అనుపలబ్ది ప్రమాణం అంటే. 

ఈ శాస్త్రం కర్మకాండను సమర్ధిస్తుంది . ఇలా చెయ్యాలి అని వేదంలో చెప్పినదంతా ధర్మం. ఇలా చెయ్యకూడదని నిషేధించినదంతా అధర్మం. అంచేత వేద విహితాలైన కర్మలను స్వధర్మంగా ఆచరిస్తుండాలి. ఇలా స్వధర్మాన్ని అనుష్ఠానం చేస్తే క్రమంగా చిత్త శుద్ది కల్గి  కర్మబంధం నశించి మోక్షం లభిస్తుందని చెబుతారు. ప్రస్తుతం జరుగుతున్న జన్మ, ప్రారబ్ధ కర్మ వల్ల లభించిందనీ శరీరం పతనమైన పిదప ఇక మిగిలి మరోజన్మను కలిగించేది ఏదీ ఉండదని, అదే మొక్షంగా పరిణమిస్తుందనీ కొందరు నమ్ముతారు. మరి కొందరు మోక్షమంటే అవిచ్చిన్నమైన ఆనందరూమైనదని చెబుతారు.

ఆత్మ నిత్యము , మరణ రహితము . దానికి జ్ఞానం సహజం కాదు. ఆత్మ దేహేన్ద్రియాదులతో సంబంధ పడినపుడే అవి విషయాలను గ్రహించే సమయంలో మాత్రమే జ్ఞానం కల్గుతుంది. దేహ భేదాలను బట్టి జీవులు అనేకులుగా ఉంటారు. అలా ఆత్మలు కూడ అనేకం ఉంటాయి. ఆత్మ నిత్యమైనదైనా కర్మల ఫలితాల వల్ల వివిధ శరీరాలను పొంది ఈ సంసారంలో చిక్కుకొని ఉంటుంది. జీవుల కర్మలననుసరించే ప్రపంచంలో పదార్ధాలు పుడుతున్నాయి.కర్మయే సర్వ శక్తిగా లోకవ్యవహారాన్ని నడుపుతూ ఉంది. మానవుడు ఇక్కడ చేసిన కర్మలచేత అతని ఆత్మలో ఒక శక్తి పుడుతుంది. దీన్ని అపూర్వం అని అంటారు వీరు. చేసిన కర్మ నశించి పోయినా , ఈ అపూర్వం జీవుణ్ణి అంటిపెట్టుకుని దేశాంతర , కాలాంతరాలలో జీవునికి తగిన ఫలాలను ఇస్తుందని పూర్వ మీమాంసకులు అంటారు.
 
వీరు ఈ కన్పించే జగత్తంతా సత్యమని, ఆద్యంతాలు లేనిదనీ, అన్ని కాలాలలోనూ జగత్తు యొక్క వ్యవహారం ఇలా సాగుతున్నదనీ , అంచేత భగవంతుడిని అంగీకరించా వలసిన పని లేదని చెబుతారు. ప్రాచీన మీమాంసకులు స్వధర్మానుష్టానం చేత స్వర్గం లభిస్తుందని అంగీకరిస్తే, తర్వాతి వారు నిష్కామ కర్మ చేత మోక్షం కలుగుతుందని చెబుతారు.

Monday, June 18, 2012

వైశేషిక దర్శనం (2) - ఆస్తిక దర్శనం

2) గుణం - గుణం ఎపుడూ ద్రవ్యంతోనే ఉంటుంది.
ఒక గుణంలో మరొక గుణం గాని , కర్మగాని ఉండదు.
ఇలాంటి రసాది గుణాలు ఇరవై నాలుగు ఉన్నాయి.
అవి స్పర్శ , రస,రూప, గంధాలనేవి ,సంఖ్య, పరిమాణం, ప్రుతక్త్వ (ప్రత్యేకత్వం), సంయోగ
విభాగ, పరత్వ , అపరత్వ , గురుత్వ, ద్రవత్వ , స్నేహ, శబ్ద, బుధ్ధి
సుఖ, దుఃఖ, ఇచ్ఛ ,ద్వేష , ప్రయత్న, ధర్మ, అధర్మ, సంస్కారాలనేవి.
పదార్ధాలకు ఉనికి ఉంటుంది గాని గుణాలకు లేదు.

3) కర్మ - కర్మలు నాల్గు విధాలు. అవి
ఉత్క్షేపణం (పైకి విసరడం )
అవక్షేపణం (క్రిందికి విసరడం)
ఆకుంచనం (ముణవటం )
ప్రసారణం (చాపటం) అనేవి.
కర్మలకు ప్రత్యేకమైన ఉనికి లేదు. ద్రవ్యాన్ని ఆశ్రయించే ఉంటుంటాయి.

4) సామాన్యం - అంటే జాతి. ఉదాహరణకు గోవులు ఉంటే , వాటి అన్నిట్లోనూ' గోత్వం' అనే జాతి ఉంటుంది.
అది గోవు పుడితే పుట్టదు, అది మరణిస్తే నశించదు.
అంచేత సామాన్యం అనేది నిత్యమైనది. అనేక వస్తువులను ఆశ్రయించుకొని ఉంటుంది.

5) విశేషం - ఒక వస్తువును అవయవ విశేషాలను, గుణాలను బట్టీ మరొక వస్తువుకన్న భిన్నమైనదని చెబుతాం.
కాని సమాన గుణాలు ఉండే రెండు పృధ్వీ పరమాణువులలో అవి భిన్నమైనవని చెప్పే కారణం ఏదీ కన్పించదు. అందుచేత ఈ పరమాణువులో ఒక విశేషము, ఆ పరమాణువులోమరో  విశేషము ఉందని; ఆ విశేషాన్ని బట్టి ఆ రెండూ భిన్నమైనవని చెప్పాలి. ఇలాంటి విశేషం నిత్యాలైన పరమాణువులలో ఉంటుంది. 
ఇట్టి విశేషాలను అంగీకరించడం చేత వీరిని వైశేషికులు అని అంటారు.

6) సమవాయం - అంటే స్వాభావికంగా పదార్ధంలో ఉండే విడదీయరాని సంబంధం. అది నిత్యమైనది.
ఉదాహరణకు ఎర్రదనం ఎర్రని వస్తువునుంచి ఎలా విడదీయలేమో అలాంటి సంబంధం.
అలాగే మట్టిని కుండనుంచి విడదీయరాని సంబంధం కూడా సమవాయం.

7) అభావం - మనం రాత్రిపూట ఆకాశంలోకి రాత్రులలో చూస్తే , సూర్యుడు కన్పించడు కాని చంద్రుడిని  నక్షత్రాలనీ చూస్తాం. ఇలాంటి వ్యతిరేక భావాన్ని అభావం అంటాం. ఈ అభావం నాలుగు విధాలు.

అ ) ప్రాగభావం - ఒక వస్తువు పుట్టడానికి పూర్వం లేకపోవడాన్ని ప్రాగభావం అంటారు. ఉదాహరణకు ఘటం తయారు చెయ్యడానికి ముందు ఘటం లేదు కాబట్టి ఈ అభావం ప్రాగభావం.

ఆ ) ప్రధ్వంసాభావం - పుట్టిన వస్తువు కొంతకాలం ఉండి, నశించిన తర్వాత ఏర్పడే అభావం ప్రధ్వంసాభావం. ఉదాహరణకు ఘటం బ్రద్దలైపోడం చేత ఏర్పడిన అభావం ప్రధ్వంసాభావం.

ఇ) అత్యంతాభావం - ఒక వస్తువు ఎన్నాడూలేకపోడం అత్యంతాభావం. ఉదాహరణకు వాయువునందు ఎన్నడూ రూపం ఉండదు. దాన్లో రూపం లేకపోవడం అత్యంతాభావం.

ఈ) అన్యోన్యాభావం - ఘటం పటం కాదు , పటం ఘటం కాదు అనే పరస్పర భేదం  అన్యోన్యాభావం . 

సామాన్య ధర్మములుండే పరమాణువులను బట్టి గంధ,రస,రూప,స్పర్శ  లనేనాల్గు విశేషాలుగా  చెప్పబడ్డాయి.
పదార్ధ విశేషాలను బట్టి పరమాణువులతో ఇవి ఏర్పడటం వల్ల నిత్యమైనవి. గంధ,రస,రూప,స్పర్శ లనేనాల్గు విశేషాలూ క్రమంగా పృథ్వికి - గంధము, జలమునకు - రుచి, అగ్ని యందు - రూపము , వాయువునకు - స్పర్శ అనే గుణాలు ఉన్నాయి. 
ఇదివరలో చెప్పుకున్నట్లు ఆకాశమందు - శబ్దం ఉంది. శబ్ద, గంధ,రస,రూప,స్పర్శ లనే జ్ఞానేంద్రియాలు ఈ పరమాణువుల తోనే  ఏర్పడుతున్నాయి. ఈ ఇంద్రియ జ్ఞానం కలగడానికి  మనస్సు కారణం. ఆత్మ అన్ని అనుభవాలకీ  మూలం. మనస్సు ఈ విషయ జ్ఞానం కలగడానికి సాధనం.

వైశేషికులు ఎన్ని ఆత్మలు ఉంటాయో  అన్ని మనస్సులూ ఉంటాయంటారు. దుఃఖం లేకపోడమే మోక్షమని అంటారు. ఈశ్వరుడు, జీవాత్మ, మోక్షం అనే విషయాల్లో వీరు నైయాయికుల మతాన్నే అంగీకరిస్తారు. ఈశ్వర ప్రోక్తమైన వేదాలను   ప్రామాణికంగా ఇరువురూ అంగీకరిస్తారు.



Friday, June 15, 2012

వైశేషిక దర్శనం (1) - ఆస్తిక దర్శనం

వైశేషిక దర్శనానికి మూలపురుషుడు కణాద మహర్షి. ఈయనను  ఉలూకుడని కూడ పిలుస్తారు. వీరి సిద్ధాంతం  న్యాయ దర్శనానికి దగ్గరలో ఉంటుంది. ఏడు పదార్ధాల ఉనికిని  జ్ఞానవిషయాలుగా వీరు అంగీకరిస్తారు. ఈ ప్రపంచంలోఉండే వస్తు సముదాయంగాని , విషయాలు గాని ద్రవ్యము, గుణము,  కర్మ, సామాన్యము,  విశేషము, సమవాయము, అభావము అనే  ఈ ఏడు పదార్ధాల కోవకే చెందుతాయి. వీటిని సరిగ్గా పరిశీలించి తెలుసుకుంటే ; తత్వం అవగతమై , రాగ, భయాలకు దూరమవడంచేత జీవుడు  సుఖ దుఃఖాలకు లోనుగాడు.

వైశేషికులు అభ్యుదయాన్ని కల్గించే ధర్మాన్ని చెప్పి , మోక్షానికి దారి చూపిస్తారు.
ఈ ప్రపంచం కొన్ని పరమాణువుల సముదాయంతో నిర్మించ బడింది. భిన్నమైన పరమాణువుల  కలయిక  చేత  పదార్ధం ఏర్పడుతుంది. ఆత్మల కర్మానుసారాన్నిబట్టి పరమాణువులలో చైతన్యం కల్గించి పరమాత్మయే ఈ జగత్తు యొక్క సృష్టి , స్థితి, లయాలకు కారణమవుతాడు. పదార్ధం యొక్క గుణ స్వభావం దాన్లో కలిసే పరమాణువులపై ఆధారపడి ఉంటుంది. ఇపుడు మనం ఒక్కొక పదార్ధం గురించి విచారణ చేద్దాం.

1) ద్రవ్యము

ద్రవ్యాన్ని ఆశ్రయించుకొని గుణములు, కర్మలు ఉంటాయి.
ఇలా తొమ్మిది ద్రవ్యాలు ఉన్నాయి.
పృథ్వి, తేజస్సు,  జలము, వాయువు  అనే నాలుగు భూతములు మరియు  ఆకాశము , కాలము, దిశ ,ఆత్మ, మనస్సు అనేవి అన్నీ కలసి తొమ్మిది.
వీటిలో మొదటి మూడూ బాహ్యంగా  ప్రత్యక్షానుభవంలోకి వస్తాయి.
పృథ్వి, తేజస్సు,  జలము, వాయువు , ఆకాశము , కాలము మన అనుభవంలోకి వస్తాయి.
కాని దిశ,ఆత్మ,మనస్సు అనేవి బుద్దిచేతనే గ్రహించ బడతాయి.
పృథ్వి, తేజస్సు,  జలము, వాయువు  సృష్టికి ముందు పరమాణువులుగా ఉండేవి.
ఆకాశము, కాలము, దిశ/దిక్కు  ,ఆత్మ సర్వవ్యాపకములు. ఇవి అణుసంపర్కం లేనివి.
మనస్సు అణుపరమాణం గలడవడం చేత ఒకక్షణంలో ఒక జ్ఞానాన్ని మాత్రమే కల్గి ఉంటుంది.
ఆత్మ నిత్యము, సర్వ వ్యాపకము , జ్ఞానానికి కారణమూను.
జీవాత్మ మనస్సు చేతనే గ్రహించ బడతాడు. పరమాత్మ అనుమాన ప్రమాణం చేత గ్రహించ బడతాడు.
వైశేషికులు జీవాత్మ  పరమాత్మలను అంగీకరిస్తారు. పరమాత్మఒక్కడేననీ, జీవాత్మలు అనేకం
ఉంటాయని చెబుతారు.
ద్రవ్యంలో ఉండే తొమ్మిది శాశ్వతమైన అంశాలను తెలుసుకుంటే, పరమాత్మ జ్ఞానం కల్గుతుంది అని చెబుతారు.

మౌలికంగా పృథ్వి,  జలము, అగ్ని, వాయువులలో  భేదం చూద్దాం.
భూమికి - వాసన, రుచి, రూపము , స్పర్శ అనే  పరమాణువుల యొక్క విశేషాలు ఉన్నాయి.
జలమునకు - రుచి, రూపము , స్పర్శ అనే  పరమాణువుల యొక్క విశేషాలు ఉన్నాయి.
అగ్నికి - రూపము , స్పర్శ అనే  పరమాణువుల యొక్క విశేషాలు ఉన్నాయి.
వాయువుకు - స్పర్శ అనే  పరమాణువు యొక్క విశేషం మాత్రమే ఉంది.
ఇలా భూమియందు గంధము/వాసన , జలమునందు రుచి, అగ్నియందు రూపము, వాయువు నందు స్పర్శ ఏర్పడ్డాయి.

ఇక శబ్దం సర్వవ్యాపకము, నిత్యము, పరమాణువులతో కూడిన సూక్ష్మాకాశం వల్ల ఏర్పడింది.
ఈ విధంగా పరిశీలిస్తే ఒకదానికన్న మరొకటి సూక్ష్మతమమవుతూ వచ్చాయి.
మనకు వివిధ  జ్ఞానాన్ని కల్గించే ఇంద్రియాలు ఈ పరమాణువుల వల్లనే ఏర్పడి ; ప్రపంచ విషయాలను తెలుసు కుంటున్నాం .
ద్రవ్యమే దానినుంచి ఉత్పన్నమయ్యే విషయాలకు, గుణాలకు, కర్మలకు ఉపాదాన కారణం.
గుణము - ద్రవ్య, గుణ, కర్మలకు మూడిటికీ నిమిత్త కారణం.
గుణము, కర్మ, సామాన్యము, విశేషము అనేవి పదార్ధధర్మాన్ని బట్టి పదార్ధంలో స్వతస్సిద్ధంగా ఇమిడి ఉంటాయి.
ఇలాంటి వివిధపదార్ధాల చేతనే జగత్తు సృష్టించ బడుతోంది.
ద్రవ్యం నుంచి ఏర్పడ్డ తొమ్మిది విషయాలను తెలుసుకుంటే సత్యం తెలుస్తుంది.


Thursday, June 14, 2012

న్యాయ దర్శనం - ఆస్తిక దర్శనం

దీనికి మూలపురుషుడు గౌతమముని. గౌతమముని రచించిన న్యాయ సూత్రాల ఆధారంగా నిశితంగా పరిశీలించి విషయాలను నిర్ధారిస్తారు. వీరిని నైయాయికులు అంటారు. న్యాయ దర్శనాన్ని తత్వవిద్య అనికూడా అంటారు. ఇది చాల వరకు తర్కం మీద ఆధారపడి ఉంటుంది. వీరు ప్రత్యక్షము , అనుమానము , ఉపమానము , శబ్దము అనే నాల్గు ప్రమాణాలను అంగీకరిస్తారు. ఈ ప్రమాణాల చేత ఆత్మ, శరీరం , జ్ఞానేంద్రియములు , వాటి యొక్క విషయాలు, బుద్ది, మనస్సు, ప్రవృత్తి, దోషాలు, పునర్జన్మ, ఫలం అంటే కష్ట సుఖాల జ్ఞానం , దుఃఖము, అపవర్గము/మోక్షము అనే వాటిని ప్రమేయాలుగా  తెలుసుకుంటారు. ఈ ప్రమాణాల ద్వారా సత్యాన్ని తెలుసుకోవడమే వీరి  లక్ష్యం.  
నైయాయికులు ప్రమాణాలు, ప్రమేయాలు, సంశయం, ప్రయోజనం, దృష్టాంతం, సిద్ధాంతం, అవయవం, తర్కం, నిర్ణయం, వాదం, జల్పం, వితండం, హేత్వాభాసం, ఛలం , జాతి , నిగ్రహస్థానం  అనే పదహారు పదార్ధాలను అంగీకరిస్తారు.

నైయాయికుల లక్ష్యం కూడ మోక్షమే. వీరు ఆత్మ, పరమాత్మలను అంగీకరిస్తూ తత్వజ్ఞానం చేత మోక్షం లభిస్తుందని చెబుతారు. మనస్సు అణుపరిమాణం కల్గి ఉంటుందనీ, అత్మకిది సుఖ దుఃఖానుభవాన్ని కల్గిస్తుందనీ అంటారు.  ఇంద్రియాల ద్వారా విషయాలతో ఆత్మకు సంపర్కం కలిగినపుడు జ్ఞానం  పుడుతుంది. మిధ్యాజ్ఞానం వల్ల రాగము, ద్వేషము, మోహము ఏర్పడి వాటివల్ల కర్మలు చేస్తూ జీవుడు సంసార బంధంలో చిక్కుకుంటాడు.  నిజానికి  ఆత్మ; మనస్సు, బుద్ది, ఇంద్రియాదుల కన్నభిన్నమైనా అజ్ఞానం వల్ల ఒకటిగానే తోస్తుంది. తత్వజ్ఞానం కలగగానే యదార్ధ స్వరూపం తెలిసి బంధం తొలగి మోక్షం లభిస్తుంది. దుఃఖం లేకపోవడమే మోక్షం అంటారు.

వీరు అంగీకరించే  16 పదార్ధాలతో సత్యాన్ని  తెలిసుకుని దుఃఖవిముక్తి చెంద వచ్చని చెబుతారు. వీరు కూడాప్రపంచం పరమాణువులతో ఏర్పడిందని వైశేషికుల లానే నమ్ముతారు. ఈ భౌతిక ప్రపంచం పృథ్వి, నీరు, వాయువు, అగ్ని అనే భూత చతుష్టయం  వీటి  పరమాణువుల నుంఛి ఏర్పడిందని , వీటితోబాటు  దిక్కు , కాలము, ఆకాశము, మనస్సులు, ఆత్మలతో ఈశ్వరుడే  స్థూల , సూక్ష్మ పదార్ధాలతో ఆత్మల కర్మలననుసరించి ఈ సృష్టిని జరుపుతాడని విశ్వసిస్తారు. ఈవిధంగా పరమాత్మ నిమిత్త కారణమైన వాడే గాని ఉపాదాన కారణం గాడు. ఇలా పరమాత్మసృష్టి , స్థితి, లయములకు కారణమవడం చేత సర్వజ్ఞుడుగా చెబుతారు . జీవాత్మలు అనేకం ఉంటాయి . అవి నిత్యమైనవి. సర్వ వ్యాపకము కూడా. మనస్సు అణుపరిమాణం గలది. జీవులకు చైతన్యం మనస్సు చేతనే  కల్గుతుంది గాని మౌలికంగా జీవాత్మలకు చైతన్యం లేదని అంటారు.  తత్వజ్ఞానం - శ్రవణ, మనన, నిదిధ్యాసలను  సాధనగా చేసుకోడం వల్ల కల్గుతుంది. తత్వజ్ఞానం కల్గినపుడు మిధ్యాజ్ఞానం తొలగి మోక్షం లభిస్తుంది. మోక్షమంటే సంసారబంధం నుంచి విడివడటమే.

ఈ ప్రపంచం అనేక అవయవాలు గల కార్యం. దీన్ని నిర్మించడానికి ఒక సమర్ధుడైన వాడు లేకపోతే ఈ నిర్మాణం కుదరదనీ , ఆ సమర్ధమైన వాడే ఈశ్వరుడని యుక్తిచేత సాధిస్తారు. ఇలా భూత పరమాణువుల  సహాయంతో వారి వారి పాప పుణ్యాలను బట్టి ఫలాలను అనుభవించడానికి జగత్తును, జీవ రాసులనూ సృష్టిస్తాడు. ఎప్పటికైనా ప్రతీ జీవుడు తత్వజ్ఞానం సంపాదించుకొని మోక్షం పొంద వచ్చునని చెబుతారు.
 


యోగదర్శనం (3) – ఆస్తిక దర్శనం

పురుష/ జీవాత్మ అవిద్య చేత తాను నిర్మలుడననేది మరచిపోయి, ప్రకృతి విషయాలతో సంబంధమేర్పడి, సుఖ దుఖాది అనుభవాలకు లోనవుతూ ఉంటాడు. సాధనలతో ప్రయత్నం చేస్తే ఈ సంసారమనే జనన మరణ రూపకమై ఉన్న బంధంనుంచి విడివడి మోక్షాన్ని/ కైవల్యాన్ని పొందవచ్చునని చెబుతారు.

తపస్సు , స్వాధ్యాయం , ఈశ్వర ప్రణిదానం అనే ఈ మూడూ కలసి క్రియాయోగం అంటారు.
మనస్సు, శరీరాన్ని వశం చేసుకొని తగిన రీతిలో నిరోధించటం- తపస్సు.
ముక్తి మార్గాన్ని అందించే సద్గ్రంద పఠనం స్వాధ్యాయం. ఇది తన సిద్ధాంతాలని దృఢ పరచుకోడానికే. కర్మలను ఈశ్వరార్పణ చెయ్యడమే ఈశ్వర ప్రణిదానమంటే. చేసే కార్యం ఫలించినా భగ్నమైనా ఫలితాన్ని ఈశ్వరునికే అర్పించి స్వస్థ చిత్తంతో ఉండాలి.

అవిద్య, అస్మిత(అహంకారం), రాగం, ద్వేషం,అభినివేశం (ప్రాణం మీద తీపి) అనే అయిదూ క్లేశాలు. ఇవి సంసార బంధాలు. ఈ క్లేశాలను నివారించి సమాధి స్థితిని కల్గచెయ్యడానికే క్రియా యోగం ఏర్పడింది.

మొదట స్థూల మనోవికారాలను పిదప సూక్ష్మ వికారాలను వాటి వ్యతిరేక భావాలతో నిరోధించాలి.
అవిద్యాది క్లేశాలు కర్మలకు మూల కారణం. మనోవృత్తులు మంచివైనా, చెడువైనా క్లేశాలే. ఆత్మ స్వాతంత్ర్యానికి ప్రతి బంధకాలు. కర్మ పరిపాకం వల్ల జాతి, ఆయువు, సుఖ దుఃఖాలు కల్గు తాయి. పుణ్య పాప కర్మలు ఈ సుఖ దుఃఖాలకు హేతువు. ప్రకృతి దృశ్యాల సంయోగం వల్ల దుఃఖాలు కల్గుతుంటాయి. అంచేత వాటిని వదలాలి. పురుషుడు- మనస్సు మొదలుకొని స్థూల భూతాల వరకు ఉన్న ప్రకృతిని దృశ్యాలుగా చూస్తాడు. స్వతఃగా శుద్ధుడైన పురుషుడు ఈదృశ్యాల సంయోగంతో సుఖ దుఃఖాలు తనమీద ప్రతిబింబించే సమయంలో వాటిని తనే అనుభవిస్తున్నట్లు భావిస్తాడు. పురుషుడు ప్రకృతితో సంయోగం వల్ల తన దివ్యత్వాన్ని మరచి ఉన్నాడు. పురుషునికి అనుభవాన్ని కూర్చడమే ప్రకృతి ప్రయోజనం.

ఈ దుఃఖమయమైన ప్రపంచంలో కొన్ని బంగారు బంతులు దొర్లుతుంటే , లోకం వాటి వెంట పడుతుంది. ఐహిక జీవితం క్షణభంగురం. ఇది తాత్కాలిక అనుభవం మాత్రమే.  సంసారాన్నుండి తరించాలన్నది గుర్తించండి. మన స్వస్వరూపాన్ని మరువకుంటే సమస్త బంధాలూ తొలగి పోతాయి. మనంత మనమే ఈ ప్రకృతితో సంయోగమనే వలలో చిక్కుకొని దీనులమను కొంటున్నాం.
పురుషుడు ప్రకృతికన్న అతీతుడు,వాటి తత్వాలకన్నభిన్నుడు. బుద్దికన్న, మనస్సుకన్న,తన్మాత్రల కన్నస్థూల భూతాలకన్నను వేరైనవాడు. కేవలుడై ఉండటం వల్ల శాశ్వతుడని సాంఖ్యులు చెబుతారు. సంయోగ జనితం కాని వస్తువుకు ఎట్టి వికారాలూ కలుగవు. ఇలాంటి పురుషులు /లేక ఆత్మలు అనేకం ఉన్నాయంటారు.

బుద్దితత్వం స్వయం ప్రకాశం కాదు. అత్మవల్ల ఇది ప్రకాశవంతమవుతుంది. సాక్షి పురుషుడు చైతన్య మాతృడై , శుద్దుడై ఉన్నప్పటికీ బుద్ధిలో భాసించే వృత్తులననుసరించి చూస్తుంటాడు. స్పటికం ఎదుట ఎర్రని పూవును ఉంచితే ఎలా ఎర్రగా స్ఫటికం కన్పిస్తుందో, అలాగే సుఖదుఃఖాలు కూడ పురుషునిలో కేవలం ప్రతిబింబాలు మాత్రమే. స్వయంగా పురుషుడు నిర్వికారుడు.బుద్దితత్వం వృద్ది క్షయాలను చెందుతూ వికారాలను కలిగి ఉండటం వల్ల అది శాశ్వతమైనది కాదు. బుద్ది స్వతంత్రమైనది కాదు.ప్రకృతితో సంబంధపడి  ఉండేవన్నీ ప్రకృతి యందే ఉండటంవల్ల బద్దమై ఉంటాయి. వివిధ ఇంద్రియానుభవాలు, సుఖదుఃఖాలు దేన్లో ఏకత్వం పొందు తున్నాయో ఆ పురుష తత్వం బుద్ధికి అతీతమై ఉంది.

ఇంద్రియాలన్నిటికీ పురుషుడే కేంద్ర స్థానం. బుద్దితత్వం నుండి భాసించే సమయంలో జ్ఞాన రూపం పొంది దేశ
, కాల, నిమిత్తాల వల్ల బధ్ధమవుతుందని యోగులు  గ్రహిస్తారు.
పురుషునికోసం ఏర్పడిన ప్రకృతి స్వయం ప్రకాశం కాదు. పురుషుని సంపర్కం ఉన్నంత కాలం మాత్రమే ప్రకాశవంతంగా కనిపిస్తుంది. తాను ప్రకృతి కన్న అతీతుడననే నిజాన్ని గ్రహించిన ముక్తుడుని, ప్రకృతి మోహింప చెయ్యదు. కాని మిగిలిన బధ్ధజీవులకు యధాతధంగానే ఉంటుంది. అంచేత సాంఖ్యులు ప్రకృతి నిత్యమైనది అంటారు. నాకో శరీరము, నీకో శరీరమూ ఉందనుకోవడం మిధ్య. జగత్తంతా ఏక పదార్ధ రాశి. దాన్లో నువ్వొక కణం, నేనొక కణమూను.

జగత్తు ఎపుడూ మార్పు చెందుతూనే ఉంటుంది. అవిద్యయే ఈ శరీర భ్రాంతికి కారణం. సత్యాన్ని తెలుసుకొని ప్రకృతి అధీనం నుంచి తొలగటమే యోగానికి ప్రధాన ఆశయం. బాహ్య, అంతర ప్రకృతిల నంతా నిరోధించి, దివ్యత్వాన్ని వ్యక్తం చెయ్యడమే జీవిత ఆశయం. అంతర ప్రకృతిని నిరోధిస్తే బాహ్య ప్రకృతిని నిరోధించడం సులభం. దృశ్య ప్రపంచమంతా సూక్ష్మప్రపంచం యొక్క వ్యక్తీకరణ. అలాగే భౌతిక శక్తులు సూక్ష్మ శక్తుల వ్యక్తీకరణ.

పురుషుడు ఎట్టి వికారాలు పొందడని గ్రహించటమే మన పరమావధి. ఉత్పత్తి ప్రళయాలను పొందుతూ నిరంతరం మార్పు చెందేది ప్రకృతే. నిశ్చలమైన దీక్షతో నితానిత్య వివేకం చెయ్యడం మొదలు పెట్టగానే అజ్ఞానం తొలగి, పురుషుడు స్వయం జ్యోతిగా ప్రకాశిస్తాడు. ఈ స్థితిలో జ్ఞానం నిరాశ్రయమై ఉండటం వల్ల అన్ని విషయాలూ జ్ఞానతేజం వల్లనే భాసిస్తుంటాయి. ఇదే చరమావస్థ.

యోగాచార్యుడైన పతంజలి ; యమము, నియమము, ఆసనము, ప్రాణయామము, ప్రత్యాహారము అనే అయిదు బహిరంగ యోగమార్గాలనీ ; ధారణ , ధ్యాన, సమాధి అనే మూడు అంతరంగిక యోగమార్గాలనీ బోధించాడు. వీటిలో మొదటి అయిదూ మనసులో నాటుకుంటే సమాధి స్థితికి చేరుకోడం సులభమవుతుందని అంటారు.యమము లో అయిదు దీక్షలు చెప్పబడ్డాయి.
అవి అహింస , సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము. ఇక శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము , ఈశ్వర ప్రణిధానము అనేవి నియమాల్లోకి వస్తాయి. ఇలా యోగ దర్శనానికి ఎనిమిది సాధనా౦గాలు చెప్పబడటం వల్ల దీన్ని అష్టాంగ మార్గంగా చెబుతారు.






Wednesday, June 13, 2012

యోగదర్శనం (2) – ఆస్తిక దర్శనం


ఈ చిత్త వృత్తులే - నేను, నాది అనే అహంకారంగా  అవిద్యవల్ల ఏర్పడి ; పురుషునికి క్లేశాలను కల్గించి దుఖానికి కారణం అవుతాయి.  చిత్తవృత్తులను పూర్తిగా అరికట్టడమే యోగం. ఈ వృత్తులన్నిటినీ  అభ్యాస , వైరాగ్యాల ద్వారా నిరోధించ వచ్చును.

ప్రకృతిలో మనకు కన్పించే జ్ఞాన శక్తి అంతా ప్రకృతి యందు పురుషుని ప్రతిబింబమే. ప్రకృతి జడము, అచేతనము.  మనస్సు కూడా అలాంటి ప్రకృతిలోదే. సంకల్పం మొదలుకొని అత్యంత స్థూల భూతాల వరకు అంతా ప్రకృతి లోనివే . అంటే ప్రకృతి వ్యక్తీకరణాలే.  సాంఖ్యులు చెప్పే ఇరవైనాల్గు తత్వాలూ జడప్రకృతి తత్వాలే. ప్రకృతి పురుషుని ఆవరించి ఉంది. పురుషుడు నిత్యుడు. జ్ఞానమే శక్తి. మనం ఒక విషయాన్ని గ్రహించడం మొదలు పెడితే , అది మనకు వశమవుతూ ఉంటుంది. అలా ప్రకృతి తత్వాలను చిత్తంలో గ్రహిస్తుంటే అవి చిత్తానికి వశం అవుతుంటాయి. ప్రకృతి తత్వాలనుధ్యానించటం అంటే ప్రకృతి శక్తులను / రహస్యాలను వశం చేసుకోడానికి విచారణ చెయ్యడం అని చెప్పవచ్చు. 
 సమాధిని పొందిన వ్యక్తికి , ఇంకా సూక్ష్మ శరీర భావన ఉంటుంది. ముక్తిని పొందకుండా లయమయ్యే విదేహులను , ప్రకృతి లయులు అంటారు.
గమ్యంవేపు సాధన సాగించే యోగులు , ముక్తులవుతారు. 

సంప్రజ్ఞాత సమాధిలో నేనుఅనే జ్ఞానం భాసిస్తూ ఉంటుంది. చిత్త వృత్తులు ఇంకా సంస్కార రూపంలో నిలిచి ఉంటాయి. వీటి బీజాలు సరైన సమయం రాగానే వృత్తి  రూపంలో అంకురిస్తాయి. వీటిని కూడ నాశనం చేస్తేనే నిర్బీజ సమాధి సిద్ధిస్తుంది. దాంతో జనన మరణ రూపమైన సంసారం నశిస్తుంది.
ఇదే అతీంద్రియ జ్ఞానావస్థ- అసంప్రజ్ఞాత సమాధి. అపుడు సర్వ వ్యాప్తము, ద్వందాతీతము , స్వయంప్రకాశము అయిన ప్రత్యగాత్మ శేషిస్తుంది .దానితో యోగి తను జన్మ మరణ రహితుడననీ, కేవలం ప్రకృతే వికారం చెందుతోందనీ ఆ వికారమే పురుషునిలో ప్రతిబింబం చెందుతోందని తెలుసు కుంటాడు. వివిధ రూపాలు పొందుతూ చిత్తం చలిస్తుంటే , ఆ రూపాలన్నీ మనమే ఆనుకొని భ్రమ చెందుతాం. అతీంద్రియ జ్ఞానం కలగగానే , ఈ భ్రమలన్నీ తొలగిపోతాయి.

కొంతమంది పరిపూర్ణులైనపురుషులు ఉన్నారు. కాని సిద్ధులను పూర్తిగా వదలక పోవడంవల్ల పరమావధిని పొందక, ప్రకృతితో లయించి కొంత కాలం ఉంటారు. వీరే ప్రకృతికి అధిపతులై దేవతలుగా ఉంటారు. వేదాలలో చెప్పే పరమాత్మ ఇలాంటి వారిలో ఒకడు.  అంతేకాని స్వతంత్రుడు, శాశ్వతుడు అయిన సృష్టికర్త మరొకడు లేడని వాదిస్తారు సాంఖ్యులు. పంచభూతాలను,ఇంద్రియాలు అనే వికృతి తత్వాలను; అవ్యక్తము, మహత్తు, అహంకారము, పంచతన్మాత్రలు అనే ప్రకృతి తత్వాలను ఆత్మ భావంతో ధ్యానించడం వల్ల జీవులు దేవతా పదవులను ఆక్రమించే వారవుతారు. వీరిలో ఎవరూ పరిపూర్ణులు గాని , ముక్తులు గాని కాదు.  సరైన తత్వ విచారణ వల్ల సమాధి స్థితి కల్గుతుంది.

పురుషులు అంటే వ్యక్తిగతమైన ఆత్మలు. ఆత్మలు అనేకం ఉంటాయి. ఈశ్వరుడు పురుష విశేషుడు . సర్వజ్ఞుడు, సర్వవ్యాపి. ప్రకృతి వికారాలచేత అంటబడని వాడు. సర్వ స్వతంత్రుడు.  'ఓం'- అనే 
ప్రణవం చేత తెలియబడేవాడు. పతంజల యోగం సాంఖ్యంపై ఆధారపడి ఉంది. భగవంతుని సృష్ట్యాది ధర్మాలను అంతగా చెప్పరు. కాని శృతి ప్రమాణ రీత్యా ఈశ్వరుడే జగద్కర్త. విశ్వంలో ఏకత్వం ఉండటంవల్ల ఒకే సంకల్ప శక్తి జగత్తును సృష్టించిందని అంటారు. యోగులు పురుషులందరి కన్నావిలక్షణమైన పురుషుడు ఉన్నాడని, అతడే సృష్టికర్త  , సదా ముక్తుడు, గురువులందరికీ గురువు అని చెబుతారు. వీరు సాంఖ్యులు చెప్పే ప్రకృతి లయులను కూడా అంగీకరిస్తారు. శృతి ప్రమాణం చేత ఈశ్వరుడే సృష్టికర్తగా భావిస్తారు. ఇతరులలో బీజమాత్రంగా ఉండే సర్వజ్ఞత్వం , ఈశ్వరునిలో అనంతంగా ఉంటుందని చెబుతారు.ఈ అనంత జ్ఞానాన్నే యోగులు ఈశ్వరుడంటారు. అతడే త్రికాలాతీతుడవటం చేత పరమ గురువుగా చెబుతారు.

చిత్త చాంచల్యం అరికట్టడానికి మనసును ఒకే విషయం మీద నిలిపి ఏకాగ్రత పొందేలా చెయ్యాలి. 
ఇలా ఏకాగ్రమైన మనస్సు ఇతర సంస్కారాల నన్నిటినీ నిరోధించడంచేత అవాక్మానస గోచరమైన అఖండ సచ్చిదానంద స్థితి కల్గుతుంది. ఇతర సంస్కారాల నన్నిటినీ నిరోధించే ఈ సంస్కారాన్ని కూడ నిరోధిస్తే , అన్నీ నిరోధించబడి నిర్బీజ సమాధి ఏర్పడుతుంది. అపుడు మరణరహితము, నిర్వికారము, అద్వితీయము , స్వయంజ్యోతి అయిన పురుషుడు ప్రకాశించటాన్ని దర్శిస్తాం. ఇదే మన పరమావధి.

మనం ప్రకృతి, మనస్సు, శరీరాలతో ఏకత్వం చెందటం వల్ల పురుషుడిని చూడలేకున్నాం. ఈ ఏకత్వాన్ని కల్గించేవి వివిధ చిత్త వృత్తులే. చిత్త వృత్తుల ఆవరణం చేత పురుషుని ప్రతిబింబం చాయా మాత్రంగా కనబడుతుంది. ఈ వృత్తులు ఆవరించి ఉన్నంత కాలము పురుషుడిని దర్శించ లేము. 
ప్రకృతి తత్వాలను సరిగ్గా అవగాహన చేసుకొని , అవిద్య తొలగించుకొంటే మనకు ప్రకృతికి ఏర్పడిన బంధం తొలగి జీవుడు కైవల్యాన్ని పొందుతాడు.  మనసును ఏకాగ్రం చేయడం వల్ల ఒక విషయం మీద మాత్రమే చిత్తం నిలుస్తుంది. అపుడు ఆఒక వృత్తిని నిరోధించటం సులభమై నిర్బీజ సమాధి కల్గుతుంది.