Sunday, September 30, 2012

పంచ కోశములు-3

పంచ కోశములు-3-------------------------------


ఆనందమయ కోశము :

ఇది విజ్ఞానమయ కోశానికి లోపల ఉంటుంది. మలిన సత్వప్రధానమైన  ప్రకృతి నుండి అవిద్యచే ఏర్పడిన కారణ శరీరమే, ఆనందమనే పరిణామంతో కలసి ఆనందమయ కోశమవుతోంది. అంటే పుణ్య కర్మల ఫలాన్ని అనుభవించే టపుడు కలిగే సుఖంచేత,  బుద్ది అంతర్ముఖమై  సచ్చిదానందాన్ని అనుభవిస్తుంది. పుణ్యఫలం క్షయించ గానే;  నిద్రా రూపాన లయిస్తుంది. అంచేత ఒకప్పుడు ఉండి, మరొకపుడు లేకపోడంవల్ల ఇది ఆత్మ కాజాలదు. అజ్ఞానము, ప్రియము, మోదము అనేవి దీని ధర్మములు. ఆనందమయము అంటే ఆనందము విస్తారంగా కలది అని అర్ధం. అంటే ఆనందము కానిది కొంత ఉన్నదని భావము. కనుక ఇదీ ఆత్మ కాదు.

ఆనందమయ కోశమునకు లోపల ఉండి , ఆనందమయ కోశమంతా  వ్యాపించి ఉంటుంది. దీని యొక్క ఆత్మఐన  ఆనందమే బ్రహ్మము. అతడే ఆత్మ. అనగా ఆనంద మయకోశము ఆత్మకాదని నిశ్చయించి, ఇలా నిషేధిస్తూ పోగా మిగిలిన నిరతిశయ, నిరుపాధిక ఆనంద స్వరూపమే ఆత్మ, అదే బ్రహ్మము, భూమ అని నిశ్చయం చెయ్యాలి.  ఆత్మ నుంచే ఆనంద మయాది పంచకోశములూ కలిగాయి. ఆత్మ మరోదాన్లో ప్రతిష్టించ బడలేదు. అదీ గాక ఆత్మ సర్వాన్ని తెలుసుకునే బోధస్వరూపమని నిశ్చయానికి రావాలి. ఎవరీ విధంగా పంచకోశ విచారము చేసి ఆత్మను తెలుసుకుంటారో, వారే బ్రహ్మవిదులని చెప్పబడింది. 
       
ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు మూడూ సూక్ష్మ శరీరం లోనివే. గుణ భేదము, అవస్థా భేదముల చేత వేర్వేరుగా చెప్ప బడుతున్నాయి. 
మన నిత్య జీవితంలో అవస్థా త్రయం అంటే – 
జాగ్రదావస్థ ( పూర్తి మెలకువతో ఉండె స్థితి)
స్వప్నావస్థ – అంటే కలలుగనే స్థితి
నిద్రావస్థ – గాఢ నిద్రలో ఉండే స్థితి. దీన్నే సుషుప్తావస్థ అంటారు కూడ. 
   
ఒక అంతఃకరణమే ఉపకరణము, కర్త , భోక్తలుగా పనిచేస్తుంది. ఇలా పనిచేయించేది ప్రజ్ఞ/ఆత్మ.  ఆత్మ ఈ అయిదు కోశములకంటే భిన్నమైనా  ఈ కోశములతో ఐక్యం చెందటంవల్ల వాటి ధర్మములను తనకు ఆరోపించు కుంటుంది. వాస్తవానికి వీటిని ఎవడు అనుభవిస్తున్నాడో అతడే ప్రజ్న/ఆత్మ. ఆత్మ స్వయం అనుభూతి స్వరూపం. అదే బోధ / సాక్షి.
                 

Friday, September 28, 2012

పంచ కోశములు-2

పంచ కోశములు-2-------------------------------------


మనోమయ కోశము :

సూక్ష్మ భూతముల సాత్విక అంశములతో ఏర్పడిన జ్ఞానేంద్రియములు, విమర్శనాత్మకమైన మనస్సు కలసి మనోమయ కోశం అవుతుంది. ఇది నేను, నాది అనే భావాలను కల్గించి కామ క్రోధములనే వికారములకు లోనవుతూంటుంది. అన్నమయ ప్రాణమయ కోశములతో కూడిన జీవాత్మ, శబ్దాది విషయములను సంకల్పం   చేసేపుడు మనోమయకోశ మనబడుతోంది. ప్రాణమయ కోశానికన్న సూక్ష్మమై, దానికిది ఆత్మయై ఉంది. ఇది ప్రాణమయ కోశమంతట వ్యాపించి ఉంది. మనోమయము చేతనే ప్రాణమయ కోశము క్రియావంత మవుతోంది. అంచేత  మనో మయము ప్రాణమయమునకు ఆత్మగా చెప్పబడింది. తమోగుణముతో కూడిన సత్వగుణము దీనికి కారణమవ్వడం  వల్ల రాగ ద్వేషాలకు స్థానమై, పై రెండు కోశముల కన్న దీన్లో  ఆత్మచైతన్యము అధికముగా వ్యక్తమవుతుంది. జ్ఞానేంద్రియ పంచకముచేత  బాహ్య విషయములను లోనికి తెచ్చి బుధ్ధి ఎదుట ఉంచి, బుధ్ధి యొక్క నిశ్చయాన్ని కర్మేంద్రియాల ద్వారా ఆచరణలో పెడుతుంది. అంటే ఈ కర్మేంద్రియాల ద్వారా క్రియావంత మవుతుంది. బుధ్ధి దీనికి ఆత్మ. శోక మోహములు, లజ్జ భయములు దీని ధర్మములు. దీన్ని బ్రహ్మమని  ఉపాసించు వారికి మనోబలం కల్గుతుంది.

శృతి యందు మనస్సు నుండి సమస్త భూతములూ పుట్టి, అవి మనస్సు చేతనే జీవించుచూ, అంతమున మనస్సుయందే లయించి అంతా మనోరూపమే అగునని చెప్పబడుటచే మనస్సే బ్రహ్మమని కొందరు చెప్పుదురు. కాని బ్రహ్మ లక్షణములు దీనియందు సంపూర్ణముగా లేవు. 

నేను సంకల్ప వికల్పములు చేయు వాడను, దుఖితుడను మొదలగు మనోమయకోశ వికారములను ఆత్మ యందు అధ్యాస మొనర్చుకొను చున్నాము. అట్లే ఆత్మ ధర్మములైన నేను ఆనందముగా ఉన్నాను మొదలైనవి మనోమయ కోశమున ఆరోపించు కొనుటచే లోకవ్యవహారము జరుగుచున్నది.
       
విజ్ఞానమయ కోశము :

జ్ఞానే౦ద్రియములే నిశ్చయాత్మకమైన బుద్ధితో కలసి విజ్ఞానమయ కోశం అవుతుంది. ఇది మనోమయ కోశానికన్నా సూక్ష్మంగా ఉండి, దానికి లోపల ఉంటుంది. మనోమయ కోశము విజ్ఞానమయ కోశముచేత పూర్ణమవుతుంది.  నిశ్చయించడం దీని కర్తవ్యం.  అన్ని పనులూ విజ్ఞానంతో కూడి నవగుటచేత , విజ్ఞానమయము మనోమయ కోశమునకు ఆత్మగా చెప్పబడింది . ఇది కర్త అనిపించు కొంటూంది.  ఇది సుషుప్తిలో లయమై , జాగ్రదావస్థలో శరీరమంతటా వ్యాపించి సచ్చిదానందమును తెలిసుకోడానికి ఉపయోగపడుతోంది. ప్రాణమయ , మనోమయ , విజ్ఞానమయ కోశములు మూడూ కలసి లింగశరీరము / సూక్ష్మ శరీరము ఏర్పడుతుంది. విజ్ఞానమే బ్రహ్మ అను శృతివాక్యం వల్ల, సమస్త భూతములూ విజ్ఞానము నుండి పుట్టి, విజ్ఞానము చేతనే జీవించుచూ అంతమున విజ్ఞానముననే ప్రవేశించుట వల్ల విజ్ఞానమే బ్రహ్మమని చెప్పు చున్నారు. దీన్ని బ్రహ్మముగా ఉపాసించు వారు  సర్వ కామములూ పొందుచున్నారు.

నాకు బుధ్ధి ఉంది , ప్రకాశిస్తోంది , ప్రియమైనది అని ఆత్మ లక్షణములను విజ్ఞానమయ కోశము నందు అధ్యాస మొనర్చు కొనుచున్నాము.(విజ్ఞాన మయకోశం కర్త, మనోమయకోశం కార్యం. దానికి కారణం విజ్ఞానమయ కోశం  గనుక ఒక్క అంతఃకరణమే రెండు కోశాలుగా చెప్పబడింది). 

    

Wednesday, September 26, 2012

పంచ కోశములు-1

పంచ కోశములు-1                   

కోశము అంటే ఒర అని అర్ధం. కత్తి ఒరయందున్నట్లు, ఆత్మ కోశములనే గుహల్లో ఉంటుంది. ఈ కోశములన్నీఒకదాన్లో మరొకటి ఉండటం వల్ల,  గుహ అనబడుతోంది. వీటన్నిటికి లోపల ఆత్మ ఉంటుంది.  అంటే ఇవి ఆత్మను ఆవరించి ఉంటాయి. స్థూల దేహమే అన్నమయ కోశం. దీని లోపల ప్రాణమయ కోశము, దీనికంటె లోపల మనోమయ కోశము, దీనిలోపల విజ్ఞానమయ కోశము ఉంటాయి. ఈ విజ్ఞానమయ కోశమే 'కర్త'. విజ్ఞానమయ కోశమునకు లోపల ఆనందమయ కోశము ఉంటుంది. ఇదే 'భోక్త'. అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశమనేవి పంచ కోశాలుగా చెప్పబడ్డాయి.

అన్నమయ కోశము:

ఇది తల్లితండ్రులు భుజించిన అన్నపు రసము; శుక్ల శోణితములై, అట్టి శుక్ల శోణితముల వల్ల   పుట్టి, అన్నరసముచే వర్ధిల్లు స్థూల శరీరమే అన్నమయ కోశమని చెప్పబడింది. పంచీకృతం చెయ్యబడ్డ మహా భూతములతో, స్థూల దేహం ఏర్పడుతుంది. అందుకే శరీరము పంచ భూతాత్మకం అనబడింది. చర్మము, మాంసము, రక్తము , ఎముకలు, మెదడు, మజ్జ, శుక్లము అనే సప్త ధాతువులతో ఉండేదే స్థూల శరీరం అనబడుతోంది. అన్నమే అన్ని భూతముల యొక్క జన్మ స్థితి లయములకు కారణమవడం  వల్ల సమస్త భూత సృష్టికీ హేతువని చెప్పబడింది. 
  
తైత్తిరీయోపనిషత్తులో; అన్నమువలననే భూతజాతములు జనించు చున్నవి. అన్నము వలననే  జీవించు చున్నవి. తుదకు అన్నము నందే (భూమి) నశించు చున్నవి లేక లయించు చున్నవని చెప్పబడుటచే- కొందరు దేహాత్మ వాదులు ఈ అన్నమయ  కోశముగా కనబడు స్థూలశరీరమునే పరమాత్మ అనుకొనుచున్నారు. దీనికి ప్రాణమయ కోశము వల్ల చలనము కలుగు చున్నది. ప్రాణము లేకపోతే , ఈ కోశము నశించి పోతుంది కాబట్టి ఈ అన్నమయ కోశము ఆత్మ కాదు. దీనియందున్న ప్రాణము అన్నమయమునకు ఆత్మ.  అన్నమయ కోశము తమః ప్రధానమైనది. క్రియాశక్తి కనబడదు, జనన మరణాది వికారములు గలది. ప్రాణశక్తి చేత ప్రేరేపించబడి కార్యములు చేయబడు తున్నాయి. ఇది శరీరమని తెలియుచున్నది గనుక తెలుసుకొనేది  దేహమునకన్న వేరుగా నుండవలెను. అందువలన ఈ అన్నమయ కోశము ఆత్మ కాదు. దీనిని బ్రహ్మమని ఉపాశించు వారికి పుష్కలముగా అన్నము లభించును. 
   
నేను మనుష్యుడను , నేను బ్రాహ్మణుడను , నేను గృహస్థుడను మొదలైన కుల గోత్ర నామాది వికార ధర్మములచే అన్నమయ కోశమును; ఆత్మయందు వ్యవహారికముగా  అధ్యాసమొనర్చు చున్నాము.

ప్రాణమయ కోశము :

సూక్ష్మ భూతముల రాజసాంశములతో ఏర్పడిన పంచ ప్రాణాలు, పంచ కర్మే౦ద్రియములూ ఈ పదీ కలసి ప్రాణమయ కోశం ఏర్పడుతుంది. ఇది సూక్ష్మ శరీరంలో(లింగ శరీరం) భాగం. శరీరమంతా నిండి, ఇంద్రియములకు శక్తినిచ్చి వాటిని నడిపించే ప్రాణ వాయువే ప్రాణమయ కోశము. ఇది అన్నమయ కోశమునకు ఆత్మ. ఈ కోశము ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము లనే ఐదు రూపాలుగా ఉంది. ఇది రజోగుణ రూపమగుటచే క్రియాత్మకమైనది. ఇంద్రియవ్యాపారము లన్నీ దీని వల్లనే కలుగుతున్నాయి. అన్నమయ కోశానికన్న సూక్ష్మమైనది. ఆకలిదప్పులను కలిగిస్తూ, శరీరంచేత సకల కర్మలూ దీనిచేత  నిర్వర్తించబడు తున్నాయి. తెలివి లేదు  గనుక, ఇది ఆత్మకాదు. దీన్ని బ్రహ్మమని ఉపాసించే  వారికి దీర్ఘాయువు కలుగునని చెప్పబడింది. 
  
ప్రాణం నుంచే అన్ని భూతములూ పుట్టి, ప్రాణము చేతనే జీవిస్తూ, చివరకు ఆ ప్రాణమునందే మరణమున ప్రవేశిస్తున్నాయి. దేహమందు ప్రాణమున్నంత వరకే జీవమున్నదని చెప్పిననూ, ఈ ప్రాణమయ కోశము మనోమయ కోశము వల్ల స్థితమైనదని తెలియు చున్నది.

నేను ఆకలిగా ఉన్నాను, నేను భుజించితిని, నేను క్రియావంతుడను, నేను వెళ్ళు చున్నాను మొదలగు వికార ధర్మములచే ప్రాణమయ కోశమును ఆత్మ యందు వ్యవహారమున అధ్యాస మొనర్చు చున్నాము.