Thursday, February 28, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-5

మామూలుగా ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. కాని బలీయమైన ఆలోచనలు ప్రతిదినమూ ఉదయం లేవగానే ప్రత్యక్షమవుతాయి. రజోగుణోద్రేకం వల్ల మనస్సు బాహ్యవిషయాల వేపుకు స్వభావసిద్ధంగా పరుగులు తీస్తుంటుంది. మనకోరికలు మనస్సును బహిర్ముఖం  గావిస్తుంటాయి. సత్వగుణం శుద్ధమైనది. మోక్షసాధనకిది అవుసరమైనది. మన ఆలోచనలు మాటలు చేతలు అనాలోచితంగా చేస్తూంటాం. అలాంటి చేష్టలు మనల్నే గాక ఎదుటివారిని కూడ బాధిస్తుంటాయి. ధ్యానాభ్యాసం వల్ల ఇట్టి చేష్టలను తగ్గించుకోవచ్చు. మనస్సేవిధంగా సంకల్పిస్తుందో మనకు అన్నీ అలాగే కనిపిస్తాయి. మన విద్య, అనుభవాలు, పరిసరాలు, వంశ పారంపర్యంగా సంక్రమించే జన్యువులు  మనస్సును ప్రభావితం చేస్తాయి. మనస్సునకుండే ఇచ్చా, క్రియా, జ్ఞాన శక్తులు మూడూ ముఖ్యమైనవిగా చెప్పబడ్డాయి. వీటిని మనం మేల్కొలపాలి.
 
చిత్త వృత్తులంటే ప్రశాంతంగా ఉండే అంతఃకరణంలో ఆలోచన రాగానే , నిశ్చలంగా ఉండే చెరువులో చిన్న రాయివేస్తే తరంగాలు ఏర్పడినట్లుగా ఆ ఆలోచన మనస్సును ప్రభావితం చేస్తుంది. ఇలా మనస్సనే సముద్రంలో వృత్తులనే తరంగాలు అవిద్య వల్ల ఏర్పడతాయి. ఆ వృత్తులతో అహంకారం తాదాత్మ్యం చెందటంవల్ల కర్తృత్వభావం, భోక్తృత్వభావం (నేను చేస్తున్నాను అనేది కర్తృత్వభావం, ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను అనేది భోక్తృత్వభావం) కల్గి బంధాన్ని కల్గిస్తున్నాయి. ఉదాహరణకు కోపం వస్తే, నాకు కోపం వచ్చింది అంటాం. అంటే కోపంతో తాదాత్మ్యం చెందటం, అంటే ఆ విషయాకారాన్ని దాల్చుతాం. వాస్తవానికి బంధాన్ని కలిగించేది తాదాత్మ్యం చెందటం వల్లనేగాని ఆ వస్తువుగాని ఆ విషయంగాని బంధం కల్గించడం లేదు.

మనస్సు ఒకవిషయాన్ని ఎలా గ్రహిస్తుందో వేదాంతంలో దృష్టి సృష్టి వాదమని చెప్పబడింది. ఈ వాదం ప్రకారం చూసేవాడు, చూడబడేది ఒక్కటే. సాలీడు తన నోటినుంచి ఏర్పడిన పదార్థంతో గూడును ఎలా ఏర్పరచుకుంటుందో అలా మనం మనస్సు నుంచే జాగ్రదావస్థలో బాహ్యప్రపంచాన్ని ఉత్పన్నంచేసుకొని సుషుప్తిలో దాన్ని తిరిగి మనస్సులోనికి ఉపసంహరించు కుంటుంది మనస్సు. దీన్నిబట్టి గ్రహించేది ఏమంటే ఒక వస్తువనేదంతా మనస్సు యొక్క విషయాకార వృత్తి. దృశ్యమనేది మనస్సు దాల్చిన అవిద్యా స్వరూపం మాత్రమే. బాహ్యంగా ఉండేది ప్రకాశం మాత్రమే. స్పందనయే. కానని దానికి మనస్సే రంగును పులిమి, రూపాన్నిచ్చి వస్తువుగా ఆకారం దాలుస్తుంది.

మనస్సు విషయాలను గ్రహించే మరో విధానం – శరీరంలో ఉండే సూక్ష్మతత్వాలైన తన్మాత్రలకు మనస్సుకూ మధ్య  పరస్పరచర్య (interaction) వల్ల కలిగే స్పందనల వల్ల బాహ్యప్రపంచాన్ని చూస్తున్నాం. ఉదాహరణకు కన్ను అగ్నితత్వంచేత ఏర్పడింది. అలాగే దీన్ని గ్రహించే మనస్సులోని భాగం కూడ అగ్నితత్వంతో ఏర్పడినదే. అలాగ ఒక్కో తత్వంచేత ఏర్పడిన ఇంద్రియజ్ఞానం వాటి వాటితో  సమాంతరంగా ( రేస్పెక్టివే ) మనస్సులో ఉండే తత్వం యొక్క భాగంచేతనే గ్రహించ బడుతోంది. ఇలా గ్రహించిన జ్ఞానం , అంటే పూర్తి ఇంద్రియజ్ఞానాన్ని ఆత్మయే గ్రహిస్తుంది. అంటే ఆత్మ ఆత్మచేతనే తెలియబడుతోంది. అంచేత మనం బాహ్యంగా చూసేది ఆత్మయే.

సాంఖ్య దర్శనంలో అన్ని విషయాలను గ్రహించడానికి పురుషుడే కారణమని చెప్పబడింది. 

ఇలా ప్రాపంచిక విషయాలు తెలియాలంటే  ఇంద్రియాలు, అంతఃకరణము, జీవుడు సరిగ్గా ఉండాలి. ఇంద్రియాలు విషయాన్ని చూస్తాయి. మనస్సు వాటిని కన్పించేలా చేస్తే, అభాసచైతన్యంతో కలసిన బుధ్ధి దాన్ని గ్రహిస్తుంది. శరీరం దృష్ట్యా  శరీరానికి బాహ్యంగా వస్తువు ఉంది. శరీరానికి బాహ్యంగా వస్తువున్నట్లే , నీకన్న బాహ్యంగా శరీరం ఉంది. అంచేత బాహ్యంగా ఉన్న జగత్తు మిధ్య. బాహ్యంగా ఏమీ లేకపోతే అంతర్గతంగాను ఏమీ లేనట్లే. అంచేత బాహ్యము, అంతర్గతము అనేవి మనస్సు కల్పించే భ్రాంతి. ఉన్నదల్లా ఒక్కటే. అదే ఆత్మ.




Thursday, February 21, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-4

మనస్సులో అనేక వాసనలు నిక్షిప్తమై ఉంటాయి. అవి మనం చేసే కర్మలవల్ల ఏర్పడతాయి. అజ్ఞాన స్వరూపమైన కారణశరీరమే వీటికి మూలం. ఒక కర్మ చెయ్యడానికి పూర్వం అది ఆలోచనారూపంగా ఉంటుంది. ఆలోచన కలగడానికి ముందది బీజరూపంగా అంటే కోరికగా/ వాసనగా మనస్సులో దాగి ఉంటుంది. ఇలా బీజరూపంలో ఉండే వాసన/ కోర్కె ఆలోచనగా మారి క్రియారూపాన్ని పొందుతుంది. మనకు అనేకమైన కోర్కెలు కలుగుతుండటం తెలిసిన విషయమే. ఐతే ఆ కోరికలలో కొన్ని తీరవచ్చును, మరికొన్ని తీరక పోవచ్చును. కోరిక తీరితే ఆ విషయం మీద ఆసక్తి నశిస్తుంది. కొన్ని కోర్కెలు తీరవు, లేదా ఉన్నకోర్కె తీరినా ఇంకా ఆశ చావదు. ఉదాహరణకు కామం అనే తృష్ణ. అలా తీరని కోరికలు, ఆలోచనలు మనస్సు మీద ఒక చిహ్నాన్ని ఏర్పరచి వాసనా రూపంలో కారణశరీరంలో ఉంచబడతాయి. వాసనలే ఒకవ్యక్తి మరణానంతరం భౌతికశరీరం పంచభూతాల్లో కలసిపోయినా వాసనలు మాత్రం బీజరూపంలో కారణశరీరపు అవిద్యావరణంలో నిలిచి ఉంటాయి. తగిన అనుకూల పరిస్థితులు కలిగినప్పుడు అవి మనస్సులోనికి వ్యాపించి ఆలోచనా రూపాన్ని పొంది కార్యాచరణకు ప్రేరేపించుతాయి. అపుడు కర్మ చెయ్యబడుతుంది.

కారణశరీరమంటే ఆత్మ చుట్టూ ఆవరించి ఉండే త్రిగుణాత్మకమైన అవిద్యాకవచం. ఆవరణమంటే ఉన్నవస్తువును లేదనుకునేటట్లు చెయ్యడం. విక్షేపశక్తి అంటే లేనివస్తువును ఉన్నట్లుగా కల్పించడం. మనస్సు సత్వాంశములతో ఏర్పడినదని యిదివరలో చెప్పుకున్నాం. అంటే స్వతఃగా పరిశుద్ధమైనది. మనస్సులోనికి  ఒక ఆలోచన రాగానే కారణశరీరం యొక్క విక్షేపశక్తివల్ల మంచి గుణములైన దయ ప్రేమ అనురాగము భక్తి అనేవాటితో గాని, చెడ్డ గుణములైన స్వార్ధము అసూయ ద్వేషము కోపము కామము అనేవాటితో గాని కూడి ఆ ఆలోచన మలినమై క్రియారూపాన్ని దాల్చేప్పుడు మంచి భావనతోగాని చెడ్డ భావనతోగాని కర్మ ఆచరించబడుతుంది. 

మనంచేసే ప్రతీ పనికీ ఫలితం ఉండితీరుతుందని కర్మ- బంధము అనే భాగంలో చెప్పుకున్నాం. అంచేత మనం చేసే కర్మకు ఆయాభావాలను అనుసరించి ఫలితాలు ఉంటాయి. చేసే కర్మలకు అహంకారం జోడించబడి నేను చేస్తున్నాననే భావంతో చెయ్యడం వల్ల ఆ కర్మల ఫలితాన్ని చేసినవాడే అనుభవించాలి. ఇలా మనం ఎన్నో కర్మలను చేస్తున్నాం కాబట్టి వాటి ఫలితాలను అనుభవించడానికి ఈ జన్మ చాలదు. అందుకే ఈ స్థూలశరీరం నశించాక జీవుడు మరొక శరీరం పొంది/ మరొక జన్మనెత్తి వాటిని అనుభవించవలసి వస్తోంది. ఇలా కర్మలుచేస్తూ, జన్మలెత్తుతూ సంసారంలో సుఖదుఃఖాలను జీవుడు పొందుతుంటాడు. అనేక జన్మల నుండి వచ్చే కర్మలను సంచితములని, ఈ జన్మలో మనకు అనుభవానికి వచ్చేవి ప్రారబ్దకర్మలని, ఇప్పుడీజన్మలో క్రొత్తగా చేసే కర్మలు ఆగామి కర్మలని చెబుతారు.

వాసనలే ఒకవ్యక్తి మరణానంతరం అతడికి కలిగే గతిని నిర్ణయించే అద్భుతశక్తి. మరణానంతరం భౌతికశరీరం పంచభూతాల్లో కలసిపోయినా వాసనలు మాత్రం బీజరూపంలో కారణశరీరపు అవిద్యావరణంలో నిలిచి ఉంటాయి. మనస్సు సూక్ష్మద్రవ్యం కాబట్టి త్వరగా నశించదు. దీన్ని ప్రాణం వేరొక చోటుకు తీసుకొనిపోయి క్రొత్త శరీరాన్ని అచ్చటి ద్రవ్యాలతో రూపొందిస్తుందని చెప్పబడింది. మరణ సమయాన  ఆఖరిక్షణంలో మనసున మెదిలే ఆలోచనతో మనిషి ప్రాణాన్ని పొందుతాడు. ప్రాణం ఉదానం తోడ్పాటుతో అతడిని తాను కోరిన చోటుకు తీసుకుపోతుంది. ఇలా వివిధ లోకాల్లోకి , శరీరాల్లోకి సూక్ష్మశరీరమే ప్రయాణం సాగిస్తుంది. ఇలా సూక్ష్మశరీరంలో ఉండే మనస్సే కోరికలకు మూలమై బంధానికి కారణమవుతుంది.





Thursday, February 14, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-3



ఆలోచనలు మనలనెలా ప్రభావితం చేస్తాయి?
 
జంతువులకు భౌతికపరమైన అనుభవాలేగాని మానవులలా మానసిక స్థితులు తెలియవు. మనకొక విషయం తెలియడమే గాక ఆ విషయం తెలిసిందనికూడ తెలుస్తుంది. ఒక అనుభవం అనుభవమయ్యేకా మాటల్లోనూ వ్యక్తపరచ గలం. అంతేగాక అట్టి అనుభవం నుంచి తనను భిన్నంగా చూడగల్గుతాడు కూడ.  మనస్సు ఇంద్రియజ్ఞానాన్ని ఆలోచనలను కలిగించే అంతరింద్రియంగా చెప్పవచ్చు. మనోమూలం ఇదం జగత్ “ – అంటే ఈ జగత్తునకు మనస్సే మూలమని పెద్దలు చెప్తారు. మనమే మనప్రపంచాన్ని సృష్టించుకొంటున్నాం. మన ఆలోచనావిధానం వల్ల మనం అనుకున్నట్లుగానే ప్రపంచం మనకు కన్పిస్తుంది.

మనస్సు ఇంద్రియాలచేత తెలియబడదు. మాయలాగే నిగూఢమైనది. ఎల్లప్పుడూ మార్పుచెందుతూ ఉంటుంది. అనుభవాలు అభిప్రాయాలు కోరికలు వాసనలు మొదలైనవాటితో సాధారణమైన మనస్సు మలినమై ఉంటుంది. కోపము భయము విస్మయము మొదలైన ఉద్వేగాలతో మార్పుచెందుతూ ఉంటుంది. ఒకవిషయం మీదనుండి మరోవిషయం మీదికి దుముకుతూనే ఉంటుంది. అందుకే ఇలాంటి చంచలమైన మనస్సును కోతితో పోల్చడం జరిగింది. గతంలోకి వర్తమానంలోకి భవిష్యత్తులోనికీ తిరుగుతూండే స్వభావం దీనిది. అహంకారం గుర్తించిన విషయాలనే చిత్తం ఆలోచన చేస్తుంది.  మనస్సే ఒకవిషయాన్ని ఎన్నుకోవడము, దాన్ని గమనించడము తిరస్కరించడం కూడ చేస్తుంది. ఎప్పుడూ క్రొత్తదనాన్నికోరుకుంటుంది. పాతవిషయాలపై ఒకవిధమైన రోతను కల్గించి క్రొత్తవిషయాలను అనుభవించడానికి నిరంతరాన్వేషణ సాగిస్తుంటుంది.

అసలు ఈ భౌతికశరీరం మనస్సు సుఖించడానికి దాని అభీష్టం మేరకేర్పడి, జ్ఞానేంద్రియాల ద్వారా ప్రపంచంలో ఉండే వివిధ విషయాల అనుభవాన్ని పొందుతుంటుంది. మన ఆలోచనను అనుసరించి విషయాలు ఏర్పడుతాయి. ఒకేరకమైన ఆలోచన మాటిమాటికీ వస్తే, దాని స్పందనవల్ల అదొక అలవాటుగా మారుతుంది. ఆతర్వాత ప్రయాస లేకుండ యాంత్రికంగా ఆ అలవాటు వాడుకలోకి వస్తుంది. మనస్సు శరీరంతో సన్నిహితమైన సంబంధం కల్గి ఉంటుంది. అంచేత అవి శరీరంపై వాటి ప్రభావాన్ని కలుగజేస్తాయి. మనలో అలజడిని కలుగచేసే ఈర్ష్య, ద్వేషము, కోపము మొదలైన ఆలోచనా స్థితులు శరీరంలో రుగ్మతలను కలుగజేస్తాయని విజ్ఞులు చెబుతారు. ఆలోచన అంటే వచ్చి పోయేది. ఒక ఆలోచన మాటి మాటికీ వస్తుంటే దాన్ని మనం పట్టుకున్నట్లే. అలాంటివే రాగము, ద్వేషము, ఈర్ష్య, అసూయ మొదలైనవి. ఈ స్థితులే సందర్భాన్ని అనుసరించి మనలను వాడుకుంటాయి. అందుకే మనలను దుఃఖానికి గురిచేసిన వ్యక్తి ఎదురైతే పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ద్వేషం కల్గుతుంటుంది. ద్వేషమనే స్థితి మనలను వాడుకోడమంటే ఇదే. అందుకే కొన్ని సందర్భాల్లో మన స్పందన ఒకేరీతిగా ఉండటం అనుభవంలోకి వస్తుంది.

ఆలోచన అనేది మనస్సులో కల్గే ఒక సూక్ష్మస్పందన. మనస్సు ఏ వస్తువు/విషయం గురించి విచారిస్తే ఆ ఆకృతిని దాల్చుతుంది. ఆలోచించే విషయం మారితే మనస్సు కూడ మార్పు చెందుతుంటుంది. ప్రతీ ఆలోచనా మనోఫలకంమీద ఒకవిధమైన ముద్రను మిగుల్చుతుంది. దాన్నే సంస్కారము అంటాం. అంటే ప్రతీ అనుభవము, మనోవృత్తీ  సంస్కార రూపంలో చిత్తము అనే గిడ్డంగి (storehouse) లో  నిక్షిప్తమై ఉంటుంది. మనోవృత్తి నుంచి సంస్కారము, సంస్కారము నుండి మనోవృత్తి ఇలా కలుగుతూనే ఉంటాయి. ఈ మనోవృత్తి -  సంస్కారమనే చక్రం అనాదిగా సాగుతోంది. బ్రహ్మసాక్షాత్కారం కల్గితే ఈ వృత్తులు సంస్కారాలూ వాటి ప్రభావాన్ని కోల్పోతాయి. అపుడు జనన మరణాల బంధం నుండి విముక్తి కల్గుతుంది.

సంస్కారాల నుంచి వాసనలు ఏర్పడి కోరికలు కలుగుతాయి. కోరిక బలీయమై తృష్ణగా మారుతుంది. ఆ విషయానందానికి మనస్సు ఉవ్విళ్ళూరుతుంది. దాన్ని పొందే ప్రయత్నంలో రాగ ద్వేషాలు కల్గుతాయి. ఇలా మన ఆలోచనలూ కోరికలూ సంస్కారాల నుండే కల్గుతాయి. అంచేత దుష్ట సంస్కారాలను తొలగించుకొని మంచి సంస్కారాలను ఏర్పరచు కోవాలి. పిదప సాధనలో అన్ని సంస్కారాలనూ నశింప జేసుకోవాలి. అపుడిక కారణశరీరం కూడ నశించడంచేత తిరిగి జన్మనెత్త వలసిన పని ఉండదు. అదే మోక్షం.




Thursday, February 7, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-2



మనస్సు  పనిచేసే విధానము.

మనస్సంటే ఆలోచనల సమూహము. అపంచీకృత పంచమహాభూతముల సత్వాంశములైదూ కలసి మనస్సు / అంతఃకరణం ఏర్పడింది. అంటే ఇది సత్వగుణం ఉండే తత్వం. ఇది జడమైనది. తెలివిలేనిదైనా అధిష్టానమైన బ్రహ్మమునుండి ప్రకాశాన్ని పొంది తెలివిగలదానిలా ప్రవర్తిస్తుంటుంది. మనస్సు ఆత్మ కాదు. పరిచ్చిన్నమయ్యేది. నాశనం చెందే స్వభావం గలది. అంటే బ్రహ్మముయొక్క క్రియాశక్తిచే ఏర్పడిన సూక్ష్మమైన పదార్ధంగా చెప్పవచ్చు. బ్రహ్మమే దీనికి ఆధారం. సూక్ష్మశరీరంలో మనస్సు ఒక భాగము. ప్రాణము సూక్ష్మశరీరాన్ని స్థూలశరీరంతో కలుపుతుంది. అంటే మనస్సు,ప్రాణము ఒకదాంతో మరొకటి సంబంధపడి ఉంటాయి. మనస్సును విడిచి ప్రాణానికీ, ప్రాణాన్ని విడిచి మనస్సుకూ మనుగడ లేదని చెప్పబడింది. మనస్సు ప్రాణానికన్న సూక్ష్మమైనది. మరణంలో భౌతికశరీరాన్ని వదలి పోయేది సూక్ష్మశరీరమే. ఈ సూక్ష్మశరీరమే జననమరణాలనే సంసార చక్రంలో తిరుగుతూ ఉండేది. సూక్ష్మశరీరం/ లింగశరీరం జ్ఞానేంద్రియాలైదు, కర్మెంద్రియాలైదు, పంచప్రాణాలైదు, మనస్సు, బుధ్ధి అనే రెండిటినే తీసుకున్నపుడు మొత్తం పదిహేడు తత్వాలతో ఏర్పడుతుంది. అదే మనస్సు బుధ్ధి ఆనే రెండిటికి బదులుగా  అంతఃకరణ చతుష్టయాన్ని తీసుకున్నపుడు మనస్సు, బుధ్ధి, చిత్తము, అహంకారము అనే నాల్గిటినీ కలిపితే పందొమ్మిది తత్వాలతో సూక్ష్మశరీరం ఏర్పడుతుంది.

ఆత్మయొక్క చైతన్యం వల్లే మనస్సు పనిచేస్తోంది. ఛాందోగ్యోపనిషత్తులో మనస్సు ఆహారంయొక్క సూక్ష్మభాగంచేత ఏర్పడుతుందని చెప్పబడింది. కొన్నిరోజులు ఆహారం తీసుకోకపోతే మనస్సు సరిగా పనిచెయ్యదు, ఆలోచించలేదు కూడ. మనం భుజించే ఆహారం మనస్సును ప్రభావితం చేస్తుంది. దీన్నిబట్టి మనస్సు సాత్వికమని, రాజసికమని, తామసికమని ఆయాగుణ వివేకాన్ని కలిగి ఉంటుంది. మాయలాగే మనస్సూ నిగూఢమైనది. న్యాయదర్శనంలో మనస్సు అణుపరిమాణం గలదని చెప్పబడింది. పతంజలి యోగదర్శనంలో శరీరమంత పరిమాణం కలిగి ఉంటుందని చెప్పబడింది. శరీరమంతా వ్యాపించియున్నా మనస్సు గాఢనిద్ర(సుషుప్త్యావస్థ)లో హృదయకమలమునందును,స్వప్నావస్థలోకంఠమునందు, జాగ్రదావస్థలో భ్రూమధ్యమందు(ఆజ్ఞా చక్రము)/ లేక కుడి కంటియందు ఉంటుందని చెబుతారు.

శరీరంలో ఉంటూనే త్రుటికాలంలో బయటకుపోయి మనస్సు విషయాకృతిని దాల్చుతుంది. మనస్సుకు ఆసక్తి ఉంటేనే అలా విషయాలవేపుకు వెళుతుంది. ఆసక్తి లేకపోతే ఎన్నో విషయాలు మనకు చేరువలోనే ఉన్నా మన మనస్సు ఎటో పోవడాన్ని అనేక పర్యాయాలు గమనించే ఉంటాం. అలా బయటకుపోయి విషయాకృతిని దాల్చి మనలోపలికి తెచ్చే విషయం తెలియాలంటే అంతరింద్రియాలు కూడ సవ్యంగా పనిచేస్తుండాలి. ప్రాణం యొక్క చైతన్యశక్తి వల్లనే మనస్సు బయటకు, లోపలికి తిరుగాడుతూ ఉంటుంది. ఇలా మనస్సుకు ఇంద్రియాలతో కలసి వ్యవహరించడమే ముఖ్యమైన పని. జ్ఞానేంద్రియాలతో సేకరించిన విషయాలను బుద్ధికి నివేదిస్తుంది. ఆ విషయాన్ని బుధ్ధి నిశ్చయించి ఇదీవిషయం అనే నిశ్చయాన్ని కలిగిస్తుంది. ప్రకృతితత్వాలతో ఏర్పడిన బుధ్ధికూడ జడమే. ఇదికూడా మనస్సులాగే చైతన్యాన్ని ఆత్మనుంచే పొందుతుంటుంది. అంచేత అన్నిటికీ అధిష్టానమైన ఆత్మయే వీటిని చూసే/గ్రహించే సాక్షిచైతన్యం. విషయాన్ని గ్రహించి, దానికి తగిన ఎలాంటి చర్యచెయ్యాలో బుధ్ధినిర్ణయించిన దాన్ని మనస్సు కర్మేంద్రియాలద్వారా నిర్వహించేటట్లుగా చేయిస్తుంది. అంటే మనస్సు విషయాలను గ్రహించడానికి జ్ఞానేంద్రియాలతోను, విషయాలను నిశ్చయింప జేయడానికి బుద్దితోను, బుధ్ధి నిశ్చయించిన విషయాన్ని అమలుపరచడానికి కర్మేంద్రియాలతోను సంబంధపడి ఉంటుంది. 

ఇలా బ్రహ్మము/ ఆత్మయొక్క చైతన్యశక్తి వ్యాప్తిచేత మనస్సు చైతన్యవంతమై, స్థూలదేహమందలి ఇంద్రియములతో కలసి ఈ జగత్తులోని సమస్త వ్యాపారములూ కొనసాగుతున్నాయి. ఆత్మను సంస్థకు అధిపతిగా పోలిస్తే, బుధ్ధి ఆ సంస్థకు కార్యనిర్వాహకుడు/ మేనేజరుగాను,మనస్సును ముఖ్య గుమస్తాగాను/ హెడ్ క్లార్క్ గాను చెప్పుకోవచ్చు. ఈ ముఖ్యగుమస్తా అనే మనస్సు మేనేజరుజారీచేసే ఆజ్ఞలను పాటించడం, పనివారిచేత పనిచేయించడం అనే రెండు విధాలైన పనులుంటాయి. కర్మేంద్రియాలే పనివాళ్ళు. మాటకన్న మనస్సు అంతర్గతమైతే మనస్సుకన్న బుధ్ధి, బుధ్ధి కన్న అహంకారము, అహంకారమున కన్నఅభాస /జీవచైతన్యము (reflected intelligence) అంతర్గతంగా ఉంటాయి. జీవచైతన్యానికన్న ఆత్మ/కూటస్థము అంతర్గతం. ఆత్మను దాటి ఇంకేమీ లేదు.