Thursday, June 27, 2013

TO SUM UP -2


వేదంలో పూర్వభాగమందు కర్మకాండ ప్రతిపాదితమైన అపరావిద్య ప్రవృత్తి మార్గంగానూ, చివరి భాగంలో పరావిద్య అనబడి నివృత్తి మార్గాన్ని సూచించే ఆత్మజ్ఞానమూ చెప్పబడ్డాయి.  ఈ చివరిభాగాలను ఉపనిషత్తులని అంటారు. ఇవి వేదవిజ్ఞతకంతకూ సారం. ఉపనిషత్తులు 108 చదువ దగ్గవని చెప్పబడ్డా వాటిలో ముఖ్యమైనవి  10-12 మాత్రమేనని చెబుతారు. ఇలా తత్వచింతనలో  వేదప్రమాణాన్ని అంగీకరించే వారిని ఆస్తికులని, వేదప్రమాణాన్నిఅంగీకరించని వారిని నాస్తికులనీ చెప్పబడుతున్నారు. భారతీయ తత్వచింతనలో ఎందఱో ఋషులు / మహాపురుషులు వారి సాధనలలో వారు దర్శించిన సత్యాలను “దర్శనముల” రూపంలో పొందుపరిచారు.  వీటిలో లోకాయతిక, జైన, బౌద్ధదర్శనాలు మూడూ నాస్తికదర్శనములని చెప్పబడ్డాయి.
 
ఇక సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనే ఆరూ ఆస్తిక దర్శనములని  ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవే షడ్దర్శనాలుగా చెప్పబడే భారతీయ ఆస్తిక తత్వచింతనకు మూలస్థంభాలు. ఈ దర్శనాలలో వాటి మూల పురుషులు దర్శించిన సత్యాలనే గాకుండా ఆ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోడానికి తగిన సాధనామార్గాన్ని కూడ నిర్దేశించారు. వీటన్నిట్లోనూ ప్రపంచం ఎలా ఏర్పడింది, దీనికి సృష్టికర్త ఎవరు, జీవుల బంధమోక్షాలనేవి ఎలా ఏర్పడుతాయనే దానిగురించి ముఖ్యంగా చెప్పబడింది.

సృష్టిలో 84 లక్షల జీవరాసులున్నాయి. వాటిలో కొన్ని చలనాన్నికలిగి, కొన్ని చలనం లేనివిగాను ఉన్నాయి. జ్ఞానేంద్రియాలలో ఎకేంద్రియ జీవులనుండి జ్ఞానేంద్రియాలు ఐదూ గల జీవులున్నాయి. పశుపక్ష్యాదులనుండి అన్ని జంతువులలోను మనస్సనేది ఉన్నా, మనిషిలోనే అది బుధ్ధిరూపాన్ని పొందింది. అలాంటి బుద్దిరూపాన్ని పొందిన మనస్సుతోనే నివృత్తిమార్గాన్ని ఎన్నుకొని జననమరణ సంసారబంధం నుండి విడుదలయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతారు. మనం ఉన్నతజన్మలనుకొనే దేవ, గంధర్వాదులు  గడచిన జన్మల్లోచేసుకున్న పుణ్యకార్యాలవల్ల ఈ జన్మలు లభించాయని విజ్ఞులు చెబుతారు. ఐతే వారి కర్మానుభావాలు పూర్తయ్యేకా మళ్ళీ జన్మలను పొందాల్సి ఉంటుంది. అంటే వీరు కూడ వారి శరీరాలతో మోక్షం పొందలేరు. తిరిగి మానవజన్మ లభిస్తేనే మోక్షసాధనకు ప్రయత్నించి సఫలతపొందే అవకాశం ఉంటుంది. అనేక జన్మల ఫలితంగా మానవజన్మ అనేది  లభ్యమవుతుంది. అందుకే మానవ జన్మ లభించడం కడు దుర్లభమని, అన్ని జన్మల్లో మానవజన్మే ఉత్తమమైనదనీ చెబుతారు. 


Thursday, June 20, 2013

TO SUM UP -1


మనం జీవితాన్ని తరచి చూసినప్పుడుగాని, ప్రకృతిలో విషయాలను అర్ధంచేసుకునే ప్రయత్నం చేసినప్పుడుగాని అనంతమైన సృష్టిలో ఎన్నోక్లిష్టమైనవిషయాలు  మనప్రమేయం లేకుండానే ఒక పద్ధతిప్రకారం జరిగిపోతున్నాయని ఆలోచనాపరులకు తెలుస్తుంది. ఇలా నిర్ణీతమైన పద్ధతిలో జరగడానికి అనంతమైన శక్తి, జ్ఞానము గల్గిన సర్వేశ్వరుడు ఒకరు సృష్టికర్తగా ఉండి ఉండాలనేది గ్రహిస్తాం. ఆ సృష్టికర్తనే భగవంతుడని  విజ్ఞులు అంటారు.
    
దాదాపుగా అన్ని మతాలూ భగవంతుడనేవాడు ఒకడున్నాడని, ఆయన ప్రేమమయుడనీ, మనమంతా ఆయన బిడ్డలమని మనం ఆయనను ఆరాధించాలని, చివరకు మనమంతా ఆయన గృహానికే పోవాలనే విషయంలో అన్నిమతాలకూ  ఏకాభిప్రాయమే ఉంది. భగవంతుడు ఒకడే అయినా వారి వారి మత ధర్మాలను బట్టి, అభిరుచులను బట్టీ వివిధ నామాలతో పిలుస్తారు.  అన్ని మత ధర్మాలకూ ఒక ప్రవక్త, మతగ్రంధమనేవి ఉన్నాయి. కాని హిందూధర్మంలో చెప్పడానికి ఒక ప్రవక్త అని గాని, వారి మతగ్రంధం ఇదీ అనిగాని నిర్దిష్టంగా చెప్పలేం. అంచేత పండితులు వేదాన్ని ప్రామాణికంగా అంగీకరించారు.

ధర్మము, అర్ధము , కామము , మోక్షము అనే నాల్గూ పురుషార్దాలు.  ఇవి మన దైనందిన జీవనంలో ఆచరించాల్సిన నైతిక విలువలని చెప్పబడ్డాయి.  శాస్త్రవిహితమైన ధర్మార్ధకామాలను అనుభవిస్తూ పవిత్రమైన జీవనాన్ని గడిపిన వానికి మోక్షమని చెప్పే నాల్గో పురుషార్ధం అప్రయత్నంగా లభిస్తుందని విజ్ఞులు చెబుతారు. మోక్షము అంటే సంసారంలో జననమరణాలనే బంధం నుంచి విడుదలవ్వడం. అందుకే మోక్షం  పరమ పురుషార్ధంగా చెప్పబడింది. దీన్ని చెప్పడానికే వేదం అనేక శాఖలుగా విస్తరించింది.




Thursday, June 13, 2013

TO THE BLOG READERS



గత సంవత్సర కాలం నుండి ఈ బ్లాగును ప్రోత్సహిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు.

ఇప్పటివరకూ బేసిగ్గా/ మౌలికంగా ఉండే ఆధ్యాత్మిక విషయాలను మాత్రమే తెలుసుకున్నాం. ఇలాంటి విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి ప్రారంభదశలో ఎక్కువ వ్యయప్రయాసలకు లోనవ్వలసిన అవుసరం లేకుండా ముఖ్యమైన విషయాలను ఒకచోట ఈ బ్లాగులో పొందుపరచడం జరిగింది. ఎందఱో మహానుభావులు. ఎన్నో పుస్తకాలు, గ్రంధాలు  ఔత్సాహికులకు అందుబాటులో ఉంచారు. అవి చాలామట్టుకు ప్రారంభదశలోవారికి  అర్ధమయ్యే భాషలో లేవు. సామాన్యులకు సైతం అర్ధమవ్వాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. సాధ్యమైనంత సులభతరమైన భాషను ఉపయోగించి ఈ బ్లాగులో వివిధమైన విషయాలను ఉంచడం జరిగింది.

తిరిగి సమీక్ష చేసేపుడు క్లిష్టమైన విషయాలను సులభతరం చెయ్యడానికి ప్రయత్నిస్తాను. ఇంతదాకా ప్రాధమిక విషయాలే తెలుసుకున్నాం. మరింత లోతుగా/ ఉన్నతమైన  విషయాలను తెలుసుకునేముందు, చెప్పుకున్న విషయాలను ఒకసారి క్లుప్తంగా సమీక్షచేసుకోడంవల్ల విషయం బాగా తెలిసి చెప్పబోయే విషయాలను గ్రహించడానికి మరింత ఉపకరిస్తుంది. దీన్ని సింహావలోకనం/ లేదా To sum up అని అందాం.
అందరికీ ధన్యవాదములు.
ఇట్లు,
సూర్యచంద్రరావు గోళ్ల.   

Thursday, June 6, 2013

"ఓం" కారము -4



పాదమనగా జీవునిచే పొందబడేది. అవి విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయులు. అవే అకార  ఉకార మకార నాదములు. ఈ పాదములనే "ఓం"అనే ప్రణవంలో మాత్రలని అంటారు. మాత్రలన్నా పాదములన్నా ఒక్కటే. అకార ఉకార మకారములచే ప్రతిపాదించబడని వాడు అమాత్రుడు. విశ్వ తైజసులు ప్రతిదినం ప్రాజ్ఞునిలో ఐక్యం చెందుతుంటారు. అందుకే వారు మాత్రల శబ్దమున వ్యవహరించబడు చున్నారు. తురీయుడు అలా ఐక్యం చెందడు గనుక అమాత్రుడని అనబడుచున్నాడు. జాగ్రత్ స్వప్న సుషుప్తులందు నిర్వికారుడై  ఏకభూతుడై పరిశుద్దాత్ముడై అంతర్యామిగా ఉండి నిర్వహించు తురీయుడు నాదముగా ఉపాసించ బడుచున్నాడు.

"అ"కారమును వైశ్వానరునిగా ఉపాసించు వారికి కాంక్షించిన సమస్త పదార్ధములను పొంది అందరిలో ప్రధానుడగును. ఇట్లు ఉపాసించు వైశ్వానరుని ఆత్మయొక్క భాగము విశ్వుడుగా అంతటా వ్యాపించినవాడుగా అకారమునకు అర్ధమని ఎరిగి ధ్యానించిన వాడు సర్వ కామములను పొంది విశ్వునితో సామ్యమును పొందును.

"ఉ"కారమును తైజసునిగా ఉపాసించినవారు జ్ఞానముతో ఉత్కృష్టులై ఉందురు. వీరి వంశమున బ్రహ్మజ్ఞానము లేనివారు ఉండరు. తైజసుని ఉ కార శబ్దవాచ్యునిగా ఉపాసించినవారి జ్ఞానధార అవిచ్చిన్నముగా సాగి సమానత్వము కల్గి శరీర బంధమునుండి విడివడుట స్పష్టముగా గోచరించును.  

"మ"కారమును ప్రాజ్ఞునిగా ఉపాసించినపుడు ఇందు సర్వ జగత్తు లయమొందునని ఎరిగినవాడు సమస్త జగత్తూ ఇట్టిది అని ఎరుగును. ఇట్టివాడు పరమాత్మతో వేరుగా చూచుటకు వీలుండక చేరియుండును. అనగ మోక్షమును పొందును. అట్టి వాని దుఃఖములన్నీ పోయి సమానుడగుట వల్ల ప్రాజ్ఞునితో సమానుడగును. అన్నీ తనలో లయమగుటను చూచును. ఇట్లు ఉపాసించిన వారు వారి వారి అధిష్టానములైన విశ్వ తైజస ప్రాజ్ఞుల వాసుదేవునితో ఐక్యమగుదురని మాండూక్యోపనిషత్తు నందు చెప్పబడినది.