Wednesday, April 24, 2013

మనస్సు- కొన్ని విశేషాలు-13



మనస్సు ఏకాగ్రమవుతుంటే మామూలుగా నిమిషానికి పదహారు సార్లువరకూ జరిగేశ్వాస క్రమంగా ఎనిమిది లేక పదిసార్లుగా/తడవులుగా చేరుకుంటుంది. శ్వాసను గమనిస్తూఉండాలి. సాధనలో ఆత్మనుండి శక్తినీ, విశ్వాసాన్నీ తెచ్చుకుంటూ ఆనందంగా ముందుకు సాగాలి. ధ్యానంలోవచ్చే అవరోధాలను ఓపికతో అధిగమించాలి. సాధన మధ్యలో నిస్పృహతో వదలకుండా బ్రహ్మసాక్షాత్కారం పొందాలనే పట్టుదలతో ముందుకు సాగేవాని ముందు, మాయ నిలబడలేదు.  అహం బ్రహ్మస్మి”, “ తత్వమసి వాక్యాల విచారణవల్ల విషయాసక్తి/ విషయాలు  నశిస్తాయి. సాధనలో నిద్రలోకి జారుకోకూడదు. సంస్కారాలు పోయేదాకా కలలు కంటూనే ఉంటాం. సవికల్ప సమాధిలో ఉండే సంతోషమూ అవరోధమే. దానిపై రాగం కల్గితే నిర్వికల్ప సమాధిస్థితికి పోనియ్యదు. మనస్సు ఎడతెరిపిలేకుండా తైలధారలా బ్రహ్మభావనలో ఉంటే జగత్తు స్వప్నతుల్యమనిపిస్తుంది. అపుడు జ్ఞానోదయమవుతుంది. మనస్సు ఒకేలక్ష్యంపై ఏకాగ్రమై ఉంటే అది సమాధిస్థితి. అపుడు  త్రిపుటి ఉండదు. మనస్సు బ్రహ్మములో లీనమై ఉంటుంది. చిదాభాస, జీవుడు కూడ మాయమై కేవలం స్వచ్చమైన చైతన్యం ఎరుకగా మిగులుతుంది. ఆ ఎరుకే / ఆ ఉనికే మోక్షం అని చెబుతారు.

జీవాత్మ అనేది అభాస చైతన్యం( reflected consciousness ). మనస్సు, జీవాత్మ కలిసే ఉంటాయి. మనోనాశమంటే అది శుద్ధచైతన్యంగా అవ్వడమే. దేశ,కాలపరిచ్చేదం లేనిది అఖండమని చెబుతారు. చిత్తము వృత్తి రహితమైతే అహంకారం నశించి కేవలం అస్తి/ చిన్మాత్ర/శుద్ధ చైతన్యం/ చిదాకాశమాత్ర మిగులుతుంది. అదే ఆత్మ. అనంతమైన నేను /ఆత్మ/ కూటస్థచైతన్యము / బ్రహ్మమే సమస్తాన్ని ప్రకాశింప జేసేది.  ముక్తి మనస్సుకి, ప్రకృతికి. జీవుడు బ్రహ్మమేగనుక ముక్తి జీవునికికాదు. జ్ఞాని ఎప్పుడూ స్వేచ్చగా సర్వవ్యాపకమైన బ్రహ్మముతోను, అజ్ఞాని శరీరంతోను గుర్తింపు కల్గి ఉంటారు.

మనస్సు క్షయించాలంటే

*ఆలోచన వచ్చేటపుడు దాన్ని పారద్రోలాలి/ గెంటి వెయ్యాలి. నేతి,నేతి ఈ ఆలోచన కాదు , ఈ ఆలోచన కాదు. ఈ ఆలోచన నాకు వద్దు అనుకోవాలి.
* ప్రతిపక్ష భావన వచ్చిన భావనను దానికి వ్యతిరేకమైన భావనతో ప్రతిక్షేపించాలి(substitute చెయ్యాలి).
ఉదాహరణకు అసహ్యం, భయం లాంటి భావనలు వస్తే వాటిని వ్యతిరేకమైన భావనలతో అంటే ప్రేమతో అసహ్యాన్ని, ధైర్యంతో భయాన్ని అధిగమించాలి.
*బ్రహ్మభావన వల్ల సంకల్పాలన్నీ నశిస్తాయి.
*ఉదాసీన భావంతో మనస్సుకు సాక్షిగా ఉండు.
*నేనెవరను అని విచారణ చెయ్యడం వల్ల ఆలోచనలన్నీ నశిస్తాయని, చివరకు మనస్సు మిగలదని చెప్పబడింది.

మనోలయం నిద్రలోతాత్కాలికం. మనోనాశమే మోక్షానికి దారితీస్తుందని చెబుతారు. మనస్సు సత్యాన్ని ప్రతిబింబించే దర్పణం లాంటిదని చెప్పబడింది. బ్రహ్మమే సత్యము గనుక అట్టి అనుభవమే అపరోక్షానుభూతి. అదే మనందరి గమ్యము.                        





Thursday, April 18, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-12

ఉద్వేగాలను, ప్రేరణలను, భావావేశాలను, అభిప్రాయాలను, చిత్తవృత్తులను మన అధీనంలో ఉంచితే మనస్సుయొక్క బానిసత్వం నుండి బయటపడి, తిరిగి మన అసలైన స్వరూపాన్ని పొంది మహారాజులా జీవించ గల్గుతాం. అపుడు మనస్సు మన సేవకుడిగా మన ఇచ్చమేరకు పనిచేస్తుంది. హఠయోగి ప్రాణాయామంతో శ్వాసపై పట్టుతో మనస్సును ఏకాగ్రం చేస్తాడు. రాజయోగి చిత్తవృత్తి నిరోధాన్ని సాధనతో పొందుతాడు. ధ్యానం మనస్సు నుంచే ప్రారంభమవుతుంది. సగుణ, నిర్గుణాల్లో దేన్నైనా ఎంచుకోవచ్చు. నిర్గుణంలో ఆత్మపై కేంద్రీకరించాలి. ప్రపంచం లేదు, శరీరము, మనస్సూ లేవు. స్వచ్చమైన చైతన్యమే ఉంది. ఆ చైతన్యమే నేను అనేది నిర్గుణ ధ్యానం. ఓం ప్రతిమను ముందుంచుకొని దానిపై కళ్ళు తెరచి దాన్ని ఏకాగ్రంగా కంటినుండి నీరు వచ్చేదాకా చూడాలి. ఇది సగుణ, నిర్గుణోపాసనలలోకి వస్తుంది. మనస్సునుంచే ధ్యానం మొదలవుతుంది కాబట్టి దాన్నే బ్రహ్మమని ధ్యానించ వచ్చు. ఓంకార ధ్యానంతో గాని, అహం బ్రహ్మస్మి చింతనతో గాని బ్రహ్మాకార వృత్తిని ఎక్కువ సేపు పొంద ప్రయత్నించాలి.

తప్పొప్పులనేవి తారతమ్యాన్ని బట్టి ఉండేవి. ఎవరి దృష్టికోణం నుండి వారు సబబే. మనస్సే వీటిని రూపకల్పన చేస్తుంది. మన కర్మాచరణ ప్రజాబాహుళ్యం యొక్క మన్ననలను పొందాలి. మన అలవాట్లు చేతనావస్థలో (జాగ్రత్తులో)ఏర్పడి, అచేతనంగా అంటే మనకు తెలియకుండానే నిక్షిప్తమై ఉండి ఆ అలవాట్లవల్ల అది మన రెండో స్వభావంగా మారుతుంది. ఇలాంటి అలవాట్లనుకూడా పురుషప్రయత్నంతో  మార్చుకోవచ్చును. సూక్ష్మము, పరిశుద్ధము ఐన బ్రహ్మమును అట్టి పరిశుద్ధమైన / నిర్మలమైన మనస్సుతోనే ప్రయత్నించాలి.

ఆసనాలు శరీరాన్ని నిశ్చలంగా ఉంచుతాయి. బంధ,ముద్రలు శరీరాన్ని దృఢంగాఉంచుతాయి. ప్రాణాయామం శరీరం తేలికగా ఉండేట్లు చేస్తుంది. నాడీశుద్ది మనస్సును సామ్యావస్థలో ఉంచుతుంది. అప్పుడే మనస్సును బ్రహ్మంపై లగ్నం చెయ్యాలి. శ్వాస రెండు మొక్కురంద్రాల్లోను సమంగా ప్రసరిస్తే సుషున్నూ పనిచేసి ధ్యానం సులభంగాను, ఆనందదాయకంగాను ఉంటుంది. మనస్సు ప్రశాంతమై నిర్మలంగా ఉంటుంది. అనంతమైన ఆత్మమీద చింతన చెయ్యాలి. మార్పుచెందని కాంతిప్రకాశంతో సన్నిహితంగా ఉన్నట్లు, మనఆత్మను మనలో లోపాలను ఆ కాంతిసాగరం శుభ్రపరచి ప్రేమతో మనలో ప్రతీకణాన్నీ తాకుతూన్నట్లుగా భావిస్తూండాలి. క్రమంగా ఒక నూతనమైన నేనుగా రూపుదిద్దుకుంటాం. 





Thursday, April 11, 2013

మనస్సు–కొన్నివిశేషాలు-11

ఉదయం లేవగానే వచ్చే మొదటి ఆలోచన “నేను”. ఇది శక్తివంతమై భయానికి, అనేక కోర్కెలకు, భ్రాంతికీ మూలమై జగత్తు వాస్తవంగా తోస్తుంది. ఈ నేననే అహంకారమే బ్రహ్మమును మరుగుపరుస్తుంది.  ఈ అహంకారాన్ని సమూలంగా నిర్మూలించాలి. ఇది కర్మయోగం, భక్తియోగం లేపోతే ఆత్మవిచారణ వల్ల సాధ్యమవుతుంది. ప్రతీఆలోచనకూ మనం ఒక పేరుపెట్టి ఒక రూపాన్ని ఏర్పరుస్తాం. బలీయమైన ఆలోచనలే కార్యరూపాన్ని దాలుస్తాయి. ప్రతి పనికీ కార్యకారణ సంబంధం ఉంటుంది. ఆలోచనలను అదుపులో ఉంచుకునే నేర్పును సాధించాలి. చెడుఆలోచనలను మంచిఆలోచనలుగా మార్చుకోవడమే సాధనలో ప్రధానాంశం. ఆలోచనలను గమనిస్తే వాటివేగం తగ్గుతుంది. ఒకసారి ఒక్క ఆలోచననే అంకురించ నివ్వాలి. అది ఆలోచనగా రూపుదిద్దుకోవాలి. చిత్తములో లీనమవ్వాలి. పిదప మరోఆలోచనకు తావివ్వాలి. ఆలోచన కార్యరూపం దాల్చి కర్మాచరణకు కారణమవుతుంది. అందుకే నిర్మలమైన ఆలోచనలనే మనస్సులో ఉండేటట్లు చూసుకోవాలి.

ఉదయం మేల్కొగానే నేను అనే ఆలోచన వస్తుంది. పిదప క్రితంరోజు సాయంకాలం జరిగిన బలీయమైన సంఘటనలు ఆలోచనలవుతాయి. వచ్చిన ఆలోచన ప్రకారం పనిచెయ్యాలి. లేకుంటే ఆ ఆలోచన మనల్ని వెంటాడి మనస్సును కలవరపరుస్తుంది. అలా ఒకదాని తర్వాత మరో వాసన, కారణశరీరంనుండి మనస్సులోకి వ్యాపించి, సంకల్పాలను కలుగజేసి కార్యాచరణకు ప్రేరేపిస్తాయి. బ్రహ్మజ్ఞానం వల్ల వాసనలు నిర్వీర్యమవుతాయి. జిహ్వచాపల్యము, ఉపస్థ చాపల్యములను  సాధారణ మనస్సునకు  అదుపు చెయ్యడం కష్టమైనపనే. అహంకారము, కోపము, అభిమానము , రాగము అనేవి జీవుని సృష్టి. సరైన విచారణ లేకపోతే వాసనలు తాత్కాలికంగా అణగి, అనుకూల పరిస్థితులు కల్గినపుడు తిరిగి తలెత్తుతాయి. కాబట్టి వాసనలను కారణశరీరం నుంచి అంకురించేప్పుడే మనం జాగరూకతతో/ఎరుకతో బుధ్ధిసహాయంతో త్రుంచి వెయ్యాలి. దీన్ని వాసనాత్యాగం అంటారు. కోరిక తలెత్తగానే దృఢసంకల్పంతో వివేకాన్ని ఉపయోగించి విషయలోలత్వాన్ని జయించవచ్చు. బ్రహ్మభావన సమస్త కోర్కెలను నాశనం చేస్తుంది. కోర్కెలన్నిటినీ త్యజించినా మనస్సులో సూక్ష్మంగా దాగిఉండి సాధకుడిని అధోగతికి తోసేస్తుంది. అంచేత జాగరూకతతో మెలగాలి. రాగద్వేషాలు మనస్సులోకి రాగానే కర్మాచరణ మొదలైనట్లే.

ప్రాణాయామం మన ఆలోచనలను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల రజో,తమోగుణాలను నిర్మూలించి మనో నైర్మల్యాన్ని కల్గిస్తుంది. ముందుగా శరీరాన్ని, మన మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఎవరి గురించీ చెడు మాట్లాడకుంటే క్రమంగా మనస్సు ఇతరుల చెడును ఆలోచించదు. వ్యర్ధప్రసంగాలను ఆపి, మనస్సును గమనించాలి. మనం ఏమి ఆలోచిస్తే మనస్సు ఆ ఆకృతిని పొందుతుంది. నిర్గుణోపాసకుడు “ఓం”కారంపైన, దాని అర్ధంపైన ధ్యాసను ఉంచాలి. మౌనం పాటిస్తే వాగింద్రియం నియంత్రించబడుతుంది. అపుడు అంతర్ముఖమై మనస్సును సాక్షిగా గమనిస్తే మనలో లోపాలు తెలుస్తాయి. మనస్సును గమనించడమే రాజయోగమంటే.  వైఫల్యాలకు నిరాశచెందక ఎందుకు విఫలమవుతున్నామో తెలుసుకునే ప్రయత్నంతో సరిదిద్దుకొని మళ్ళీ ప్రయత్నించాలి. సాధననొకదాన్ని ఎన్నుకుని దాన్నే కొనసాగనివ్వాలి. ఒకగురువును ఆశ్రయించాలి. 





Thursday, April 4, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-10

మనం తీసుకునే ఆహారంతోనే మనస్సు పనిచేస్తుంది. కొద్దిరోజులు ఆహారం తీసుకోకపోతే మనస్సు పనిచేసే విధంగా పనిచెయ్యలేదు. సత్వగుణం నిర్మలమైనది. మోక్షసాధనకు అనువైనది. సాత్వికాహారంవల్ల మనస్సు సత్వగుణోపేతమై ఏకాగ్రమవుతుంది. సర్వాత్మభావం అనుభవానికి వస్తుంది. నిష్కామకర్మయోగం వల్ల మనశ్శుద్దికల్గి బ్రహ్మవిచారణకు దోహదం చేస్తుంది. సాత్విక బుద్దినుంచే సాత్విక ఆలోచనలుకల్గి అవిద్య నివృత్తి అవుతుంది. జంతువులకు తమ సహజప్రేరణవల్ల విచక్షణాజ్ఞానము ఉండదు. ప్రతిచర్యలు ఎట్టి విచక్షణా లేకుండానే స్వాభావికంగా స్పందిస్తాయి. కోపము , లైంగిక వాంఛ మొదలైనవి  విచక్షణాజ్ఞానాన్ని హరించి జంతువుల్లా ప్రవర్తించేటట్లు మనలను ప్రేరేపిస్తాయి. అప్పుడు అవివేకంవల్ల చెయ్యకూడని పనులను చేస్తూంటాం. ఇలాంటి వాటిని నియంత్రించాలంటే రాగద్వేషాలు ఉండకుండా ఉదాసీనంగా ఉండటాన్ని అలవరచుకోవాలి. నేను మనస్సును గాను, సర్వవ్యాపకమైన ఆత్మను అనే జ్ఞానాన్ని మాటి మాటికీ గుర్తుతెచ్చుకుంటూ, నన్ను ఏవీ కదలించలేవనే భావనవల్ల వీటిని నియంత్రించ వచ్చని పెద్దలు చెబుతారు.

రజోగుణోద్రేకంవల్ల మనస్సు బాహ్యంగా పరుగులు తీస్తుంది. కోర్కెలూ, బాహ్యవిషయాలు వస్తువులూ, మనస్సును బహిర్ముఖం గావిస్తాయి. ఇలా బహిర్ముఖంగావించే శక్తులను నిర్మూలించేవరకూ మనస్సు అంతర్ముఖం కాలేదు. వైరాగ్య,త్యాగాలతో మనస్సును నిశ్చలంగా హృదయంలో నిలపాలి. మనస్సు ఒక సమయంలో ఒక్క ఆలోచననే చేస్తుంది. అంచేత విషయాకారవృత్తిని, బ్రహ్మాకారవృత్తిని ఒకేసారి పొందలేదు. మనస్సు ఒక విషయం మీద నుండి మరొక విషయం మీదికి పోవడానికి మధ్యఉండే సమయమే స్వరూప స్థితి. అదే బ్రహ్మము. ఆ అనుభూతిని నిరంతరము పొందడానికి ప్రయత్నించాలి. మనస్సు వృత్తిరహితమైనపుడు మౌనంతో హృదయకుహరంలో స్థితమై ఉన్నట్లన్న మాట. ఆ అనుభవమే ఆత్మ లేక బ్రహ్మము. అదే సస్వరూప స్థితి. అదే సంతోషానికీ ఆనందానికీ మూలం. వైరాగ్యం లేని సాధన నిష్ప్రయోజనం. మనస్సును ఆరవ ఇంద్రియముగా కొన్నిచోట్ల చెప్పబడింది.

నేను,నాది అని గుర్తింపు కల్గించే భావనే దుఃఖం. ఉదాహరణకు వీధిలో ఎవరో మరణించారు అనుకుందాం. పలానా వ్యక్తికి కాలం చెల్లిపోయింది అనుకుంటాం. అదే తన కుటుంబంలో వ్యక్తి ఐతే నావాడు చనిపోయాడని మిక్కిలి దుఃఖానికి లోనవుతాం. ఇలా మానవునికి కల్గే అనర్దాలన్నిటికీ, ఈ శరీరమే నేననే దేహాధ్యాసవల్ల – నా భార్య, నాపుత్రులు, నాయిల్లు అనే బంధమే దుఃఖానికి కారణం అవుతోంది. బాధగాని, దుఖంగాని మనస్సుతో సంబంధ పడినప్పుడే కల్గుతుంది. గమనిస్తే గాఢనిద్ర ( సుషుప్తి ) లో మనస్సు పనిచెయ్యదు గనుక అపుడు బాధ అనేది ఉండదు. అంటే మనోజయంతోనే శరీరాన్ని అదుపులో ఉంచగల్గుతాం అనేది అర్ధమవుతుంది.

ప్రాపంచిక అనుభవం పూర్తిగా పొందేవరకూ అనువైన అనేక శరీరాలు ధరించవలసి ఉంటుంది. ఇలా జన్మించినపుడు గతజన్మలో మనసాధనలచే ఎంతవరకూ పురోగతి సాధించామో అక్కడనుండే, వాసనలనుబట్టి మన పనులు ప్రారంభమవుతాయి. మనభావాలూ, మూఢనమ్మకాలూ మనలో గాఢంగానాటుకొని ఉన్నాయి. సరైన విచారణతో వాటిని నిర్మూలించాలి. దేహభావన వదలి నేను బ్రహ్మమును అనే భావంతో ఉండటం అనే అభ్యాసంవల్ల క్రమంగా దేహవాసన నశిస్తుంది. దురాకర్షణలకు దూరంగా ఉంటూ ధ్యానము, జపము, సజ్జన సాంగత్యము మొదలైన వాటితో సంస్కారాలవల్ల కలిగిన పాత అలవాట్లను మార్చుకోవచ్చు. సంకల్పాలన్నిటినీ వదలి అద్వైతనిష్ఠ కల్గి  బ్రహ్మభావంతో ఉంటూ బ్రహ్మమే సత్యము, జగత్తు మిధ్య, జీవుడే బ్రహ్మము అనే వాక్యాలను మననం చేసుకోడంవల్ల మనస్సు వృత్తి రహితమై అసంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది.

స్వప్నం మరొక స్వప్నాన్ని సృష్టిస్తున్నట్లు చూడ్డానికి కూడ వీలులేనంత సూక్ష్మంగా ఉండే మనస్సు , వాస్తవంగా ఉనికికూడా లేని మనస్సు- వాస్తవంగా లేని దృశ్యాలను కల్పిస్తోంది. అంటే మనం చూసే జగత్తంతా సంకల్పమాత్రమేనని గ్రహించాలి. అది ఆకాశమాత్ర. భ్రాంతిమాత్రమే. విశ్లేషించి చూస్తే జగత్తు పంచభూతాలతోనే ఏర్పడినది. దాన్లో ఉండే వస్తువులూ మిధ్యారూపాలే. ఇలా విశ్లేషించి చూడగా ప్రపంచం ఉనికిని కోల్పోతుంది. అంతరిక్షము, కాలము, కారణము ఇలా అన్నీ మనోవృత్తులే. మనోలయం వల్ల సమస్తలోకాలు, త్రికాలములూ ఏవీ ఉండవు. అద్దంలో ఒకవస్తువు ప్రతిబింబం చెందుతున్నట్లు మనస్సులో ఈ ప్రపంచం ప్రతిబింబం చెందుతోంది. ఇదే మాయాకార్యం. సరైన అవగాహన లేకపోవడమే అవిద్య. మనస్సును మించిన అవిద్యలేదు. మనోనాశనంతో సర్వమూ ఉనికిని కోల్పోయి, ఆత్మానందంలో/ నిర్మలమైన శుద్ధచైతన్యంలో స్థితమై బ్రహ్మానుభవం పొందుతాం.