అలా గతజన్మ వాసనలు, కర్మలూ శోధించబడగా సంశయాలు తీరి, అంతఃకరణం హృదయంలో చేర్చబడుతుంది. సాధన తీవ్రంగా సాగుతుంటే, నాడీమంధనం జరిగి అంటే అంతఃకరణం అప్రయత్నంగా హృదయంలో చేరుతుంది. గతజన్మల
సంస్కారాలను బట్టీ, ఈశ్వరానుగ్రహంవల్లా, గమ్యాన్ని చేరే
మార్గాలు భిన్నంగా ఉంటాయి. అంటే అందరికీ పయనించే మార్గంయొక్క అనుభవం ఒకేలా ఉండదు.
కొందరు ఆత్మ స్థానంలో ఏకాగ్రతతో దృష్టి పెట్టగలరు. కొందరు ఆత్మను, మంధనాదులతో
నిమిత్తం లేకుండా సర్వవ్యాపకంగా భావించ గలరు.
ఇలా సాధన జరిగేటపుడు ఒకదశలో, సాక్షాత్కారం యొక్క రుచి కల్గుతుంది. ఆ రుచి, రుచి చూసేవాడు, రుచిని ప్రసాదించేవాడు ఒక్కరే అనే
జ్ఞానం క్రమేపీ సాధనకొనసాగిస్తూండగా కలిగి, ఉన్నది అద్వైతమే
అనే అనుభవం కల్గుతుంది. ఒక స్థితిలో ఇక విశ్లేషణ , మధించడం
అనేవి ఉండక ధ్యానమే ఉంటుంది. ఇదే చివరి
దశ. దీన్లో ఎకాగ్రతే ఉంటుంది. ఈ స్థితిలో ధ్యానం ఒక తీవ్ర ప్రవాహం ఎలా సాగుతుందో,
అలా ఉంటుంది. ఇట్టి అనుభవం ముందు జీవభావంతో తొణికిసలాడే, జ్ఞానం కూడా
వెలవెలబోతుంది. ఒక దశలో మెరుపులా సాక్షాత్కారం అవుతుంది. అంటే ఒకసారి కనిపించి,
మరోసారి కనబడనట్లు బ్రహ్మానుభవం తాత్కాలికంగా కలుగుతుండటం వల్ల ఇంకా
ద్వైతభావనే ఉంటుంది.
బ్రహ్మానుభవం విద్యుత్ఘాతంలా జీవభావాన్ని
అంతం చెయ్యగలగాలి. బ్రహ్మముగా మార్చగల్గినప్పుడే లక్ష్యం నెరవేరినట్లు. అదే
సిద్ది. ఇక సాధన ఉండదు. ఆగిపోతుంది. భ్రమరం తన గూట్లో కీటకాన్ని ఉంచుతుంది. ఈ
కీటకం నిత్యమూ భ్రమరాన్ని స్మరిస్తూ ఉండటం వల్ల, ఇది భ్రమరంగా అయ్యి రెక్కలు వచ్చి
ఎగిరిపోతుంది. ఇలా చెప్పేది- భ్రమరకీటక న్యాయమని చెబుతారు. ఈ న్యాయాన్ని
అనుసరించి నిదిధ్యాసనంలో నిరంతరభావన వల్ల జీవుడు బ్రహ్మముగా అవుతాడు. సమాధిలో
లీనమయ్యేంత వరకూ నిదిధ్యాసనంలో
ఉండాల్సిందే. దీన్లో కృతార్థుడైతే అద్వైత సిద్దే. సగుణ బ్రహ్మమే ఇలా నిదిధ్యాసనం
చేసేవాడిని నిర్గుణ బ్రహ్మంగా తీర్చి దిద్దుతున్నాడని గుర్తుంచుకోవాలి.
ఇలా సన్యాసము వెంటనే ఉపదేశము ఉంటుంది.
అదే శ్రవణం. దాన్ని మధించి విశ్లేషించడం మననం. ప్రత్యక్షానుభవం కోసం ధ్యానం.
దీన్ని నిదిధ్యాసనం అంటారు. వీటితో సాధన పూర్తి అవుతుంది. ఆత్మయే వినదగినది, మననం చెయ్యదగినది, ధ్యానం చెయ్య
దగినదని బృహదారణ్యకం చెబుతోంది.
- అయిపోయింది -
- అయిపోయింది -