Thursday, July 5, 2012

భక్తి మార్గం (1)

వేదాల్లో చెప్పబడిన కర్మకాండ, ఉపనిషత్తులలో జ్ఞానము అందరికీ అందుబాటులో ఉండదు. అంచేత అందరికీ సులభమైనదీ , అందుబాటులో ఉండేదైన భక్తిమార్గాన్నిఅధికంగా ప్రాచుర్యంలోకి తెచ్చినది నారద మహర్షే. భక్తిమార్గాన్ని  అందరూ అవలబించ వచ్చును. భగవదనుగ్రహం పట్ల విశ్వాసము,  భవబంధాలనుంచి విముక్తీ , కల్గుతాయనే నమ్మకము౦టే చాలు . బుద్ధి భగవల్లీనం కావడం ప్రధానం.  ప్రతి వ్యక్తికీ మొదట ఇష్టవస్తువుపట్ల ఒకరకమైన ఇష్టం  ఏర్పడి , క్రమంగా అది  రాగముగా మారుతుంది .  అది క్రమంగా తన్మయత్వంగా రూపు  చెందుతుంది. దీన్నే భక్తి అంటారు .
  
భగవంతుని పట్ల పరమ ప్రేమయే భక్తి. ప్రేమ అంటే అనుభవంలోకి వచ్చేదే కాని , దాన్ని నిర్వచించలేం. కాని అనేకులు భక్తి అంటే ఇలా చెప్పడం జరిగింది. ఎలాంటి ఫలితాన్నీ కోరక భగవంతుని సేవ చెయ్యడమే భక్తి. భగవంతుడు నావాడు అనే మమకారమే భక్తి అని నారద పంచరాత్రంలో చెప్పబడింది. అవిచ్చిన్నంగా తైలధారలా భక్తుని మనస్సు భగవంతుని వేపు నిరంతరమూ పోవడమే భక్తి. స్వస్వరూపానుసంధానమే భక్తి అని శంకరులు  వివేక చూడామణిలో అంటారు. ఎవరు ఎన్ని చెప్పినా భక్తి అనేది మాటలకు, మనస్సుకూ అతీతమైనది.  భక్తి కేవలం అనుభూతిచెందేదే.

ఒకసారి శ్రీ కాళహస్తీశ్వర శతకం గుర్తు తెచ్చుకుంటే దాన్లో సాలెపురుగు, సర్పము , ఏనుగు వాటిస్థాయికి తగినట్లు ఈశ్వరుడిని కొలిచి ధన్యమయ్యాయి. అలాగే తిన్నడు అనే భక్తుడుకూడా తనకు తోచినట్లు శివుడిని సేవించి ధన్యత చెందేడు. అంచేత భక్తి మార్గానికి అన్ని జీవులూ అర్హులే. ఏవిధమైన యోగ్యతలూ అక్కరలేదని , భావమే ప్రధానమని విజ్ఞులు చెబుతారు. ఈ విధంగానే భక్తిని ఆచరించాలనే నిబంధన ఏమీ లేదు. ప్రపంచంలో ఎక్కువ మంది ఈ భక్తి మార్గాన్నే అనుసరిస్తున్నారు. భక్తి దానంత అదే కలుగుతుంది లేదా పూర్వజన్మ సంస్కారం వల్ల, ఈశ్వరానుగ్రహం వల్ల కలుగుతుంది. అంతేగాకుండా భక్తుల సహచర్యము, జపమూ భక్తికి దోహదం చేస్తాయని పెద్దలు అంటారు. భక్తిని విడిచి ముక్తి లేదని , అంచేత ఎంతటి వారైనా భక్తి లేకుండా ఆధ్యాత్మిక సాధనలో పురోగమించ లేరని కూడ చెబుతారు. 

ఉపనిషత్తులు ఏ వస్తువును అంతర్యామి అని చెప్పాయో అదే భక్తికి ధ్యేయం. ఈధ్యేయ సత్పదార్ధన్నిగురించి చేప్పేటపుడు అనేకమైన పేర్లు కల్పి౦చబడ్డాయి.  సగుణాకారమైనపుడు ఆ విభూతులను ఈశ్వరుడనీ, శివుడనీ ,రాముడనీ ,కృష్ణుడనీ, కేశవుడనీ అనేక నామములతో పిలుస్తారు. అలాగే స్త్రీరూపంగా ఉపాసన చేసే శాక్తేయులు  ఉన్నారు.  వాస్తవానికి ఆత్మకు లింగభేదం లేదు. నిరాకారమైనపుడు బ్రహ్మమనీ , పరామత్మ అనీ చెబుతారు. సగుణ  బ్రహ్మమూ నిర్గుణ బ్రహ్మమూ ఒక్కడే . అంతా అద్వితీయమైన బ్రహ్మమే. నిర్గుణ బ్రహ్మం అతి సూక్ష్మమవ్వడం చేత మనస్సు కందదు. కావున అలాంటి బ్రహ్మాన్ని ప్రేమించి ఉపాసి౦చలేము. అందుచేత భక్తుడు సాకారుడైన ఈశ్వరుణ్ణి ఉపాసిస్తాడు . బ్రహ్మాన్ని గురించిన ఎరుకలో మానవ మనస్సు ఊహించగల గొప్ప స్థాయినే ఈశ్వరుడని చెప్పవచ్చు. భక్తియోగము యొక్క ఆశయం బ్రహ్మానుభవమే.  జపవిధానమంతా సగుణమే. సాధకుడి సంకల్పము , మనస్స్తత్వాన్నిబట్టీ ధ్యేయం ఉంటుంది . ధ్యేయాకారాలన్నీ మనోకల్పితాలే కాబట్టి వాటన్నిటి పట్ల సమదృష్టి కల్గి ఉండాలి. ప్రతిమ అంటే విగ్రహం. ప్రతీకోపాసన అంటే బ్రహ్మం కాని దాన్ని బ్రహ్మంగా భావించి భక్తితో దాన్లో మనస్సు లగ్నం చెయ్యడం. బ్రహ్మమే ఉపాసకుని లక్ష్యమై , ప్రతీకం కేవలం ప్రతిగా ఉండి సర్వవ్యాపకమైన  బ్రహ్మం ప్రతీకమూలంగా ఉపాసించబడితే , అది అందరికీ ప్రాధమిక దశలో అవసరమే. ఒకవేళ అవతారాలనుగాని, గురువును గాని ధ్యేయంగా గ్రహిస్తే వారి ప్రారబ్ద దోషాన్ని పట్టించుకోకుండా వారు సాక్షాత్ భగవత్స్వరూపులనే భావంతో సాధన చెయ్యాలని చెబుతారు.

Tuesday, July 3, 2012

ప్రార్ధన - విధానము


ముక్తి మార్గాలను గురించి చర్చించుకునే ముందు ప్రార్ధన ఎలాచేయ్యాలో చూద్దాం. ప్రతి వారికీ తమ ఇష్టదైవం 
అనేది ఉండే ఉంటుంది. ఈ జగత్తుకు సృష్టి, స్థితి , లయాలు ఎవరి మూలంగా కల్గుతున్నాయో , అతడే ఈశ్వరుడు.  ఉపనిషత్తులు ఏ సత్పదార్ధాన్ని గురించి చెప్పాయో అదే ధ్యేయ వస్తువు. ఆ సత్పదార్ధాన్ని గురించి చెప్పేటపుడు చెప్పేవారి రుచిని బట్టి, వినేవారి మనస్తత్వాన్ని బట్టి నామరూపాలు కల్పించ బడుతున్నాయి. అలాంటి కల్పన సాకార సగుణ పరమైనపుడు ఆ వస్తువు విభూతులను ఈశ్వరుడనీ , రామ , కృష్ణ , శివ , కేశాదులనీ అంటారు. ఇలా ఆస్తికులకు ఇష్ట దైవం అనేది  ఏర్పడుతుంది. 

మనం మొదట్లో దైవచింతన  ఒకఆలోచన అనే  బ్లాగులో  చెప్పుకున్నట్లు అందరికీ సమస్యలుంటాయి. 
ఆ సమస్యలూ , మన బాధ్యతలూ తీరడానికి మనవంతు ఎంత ప్రయత్నం చేసినా మనవల్ల కానపుడు ; 
వాటిని  భగవదనుగ్రహానికి వదిలేస్తాం.  దీనికి ప్రార్ధన తోడ్పడుతుంది. 
 
ప్రార్ధన :-సాధారణంగా మన ప్రయత్నాలన్నీ విఫలమై , ఏమీ దిక్కు తోచనపుడే మనం ఆ పైవాడి అనుగ్రహం
కోసం అర్దిస్తాం. ప్రార్ధన అంటే అడగటం.  ప్రార్ధన  ఎప్పుడైనా చెయ్యవచ్చు . అతిముఖ్యమైన సమస్య అంటే 
ఆ సమస్య తీరితేనే గాని మనుగడ లేదు అనిపించేది.  అలాంటి దానికోసం  ఐతే అర్ధరాత్రికి పావుగంట ముందు,పావుగంట తర్వాత   లేదా ఉదయం ఉజ్జాయింపుగా  సూర్యోదయానికి ఒక గంటముందు  గాని ప్రార్ధన  చేస్తే మంచిదని విజ్ఞులు చెబుతారు.  ఆ సమయంలో ప్రకృతి నిర్మలంగా ప్రశాంతంగా  ఉండి  ఎవరిని ప్రార్దిస్తామో ఆయనకు మన సమస్యచేరి ; కోరిక సఫలమవడానికి దోహదపడుతుంది .

మామూలుగా ఉండే కోరికలైతే , సంధికాలంలో చెయ్యాలి. అంటే పగలు రాత్రిగా మారేటపుడు, రాత్రి పగలుగా మారేటపుడు ( ప్రొద్దు క్రుంగే టపుడు , ప్రొద్దు పొడిచే టపుడు). ఆరాధన - అంటే దీప, ధూప, నైవేద్యాలు సమ ర్పించటం. నువ్వు తప్ప నాకిక వేరే ఈ సమస్యను తీర్చే దిక్కు లేరని చెప్పడాన్ని శరణాగతి అంటారు. అపుడు నిస్సహాయ స్థితి వస్తుంది. ఎవరిని ప్రార్ధించి అర్ధిస్తున్నామో ఆ దైవం మన సమస్యను తీరుస్తాడనే నమ్మకం ఉండాలి. సాధారణంగా భక్తులు ఇష్ట దైవంతో తండ్రిగానో , తల్లిగానో, స్నేహితుడుగానో, ప్రియుడుగానో,బిడ్డగానో  గురువుగానో, సేవకుడుగానో బాంధవ్యం ఏర్పరచుకుంటారు. ఆయనతో అలాంటి  బంధముంటే పని సులువవుతుంది.

సమస్యను విన్నవించుకునేందుకు  మనస్సు నిశ్చలంగా  ఉండాలి . అంటే ప్రార్ధనకు ముందు రెండు నిమిషాలు శ్వాసను గమనిస్తే మనస్సు కుదుట పడుతుంది. మనస్సులో ఒక కోరిక మాత్రమే ఉండాలి.  ఆ సమస్య పట్ల మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. నీ సమస్యపై నీకు అవగాహన లేకపోతే , తీర్చడానికి ఆయన దేన్నని తీరుస్తాడు.

ఆ  సమస్య తీరడం ఎంత ముఖ్యమో, అది తీరకపోతే కలిగే దుఃఖ తీవ్రత ఏమిటో అనుభవించాలి . ఆ బాధలో
ఉంటూ నిస్సహాయ స్థితిలో దీనంగా దోసిలి పట్టి ఆయన మనకు దగ్గరలో (హృదయంలో) ఉన్నట్లు భావించి, సమస్యను విన్నవించుకోవాలి . నా సమస్య నీకు విన్నవించుకున్నాను. ఇపుడు దాన్ని, నీ సంకల్పానికి వదిలేస్తున్నానని సమర్పిచు.  అలా కొద్ది సేపు నిరీక్షిస్తే నీ హృదయం తేలికపడుతుంది.

అప్పుడు సమస్య తీరినట్లు ఊహించుకొని , సంతోషంతో ఆనందంగా ఉన్నట్లు భావించి ఆ ఆనందాన్ని
అనుభవించు. సమస్యను తీర్చినందుకు భగవంతుడికి హృదయ పూర్వకంగా  కృతజ్ఞతలు చెప్పాలి. అపుడు ప్రార్ధన ముగుస్తుంది.ఏ భగవంతుడి సహాయం అర్దిస్తున్నామో , ఆయనతో ఆ ఘడియలో మన హృదయాన్ని కలపడమే ప్రార్ధన. అది సరిగా చేస్తే కార్యం సఫలమవుతుంది. గుర్తుంచుకోండి; మనకు అపకారం జరగని కోరికలే తీర్చబడతాయి. నీ వ్యక్తిగత సమస్య అయితే నువ్వే ప్రార్ధన చెయ్యి. కుటుంబ సమస్య అయితే కుటుంబ సభ్యులు అంతా కలసి ప్రార్ధన చెయ్యండి.

ఇలా ప్రార్ధన ద్వారా కూడ , మీ బాధ్యతలను కొంతవరకు తీర్చుకొనే అవకాశం ఉంది. అపుడు మీకు పరమార్ధాన్ని గురించి యోచించే  సమయం లభిస్తుంది. 


Monday, July 2, 2012

ముక్తికి మార్గములు


ఈశావాశ్యోపనిషత్తు ఆధ్యాత్మిక సాధకులకు ముఖ్యంగా రెండు మార్గాలను చూపుతుంది. మొదటిది జ్ఞానమార్గాన్ని అనుసరించే వారికి - యజ్ఞాది కర్మలు చేయవలసిన పని లేదు. శాస్త్రాధ్యయనం , అత్మస్వరూపాన్ని గురించి మనన , నిదిధ్యాసనలను చేస్తుండాలి. అంటే జ్ఞాని సన్యాసితో సమానుడు.  
ఇక రెండవ మార్గం –  కోర్కెలను త్యజించి పైన చెప్పిన కఠినమైన  జ్ఞానమార్గాన్ని అనుసరించే  మానసిక యోగ్యత లేనివారికి  ఇది చెప్పబడింది. భగవంతుడిని సాకారుడుగా ఆరాధించి అతని అనుగ్రహంచేత ఇహలోక సౌఖ్యాన్ని , మొక్షానందాన్నీ కోరేవారికి యజ్న యాగాది కర్మలు, శాస్త్ర విహిత కర్తవ్యాలను ఆచరిస్తూ వివిధ దేవతలను, పరబ్రహ్మాన్ని గూర్చిన , విజ్ఞానాన్ని ఆర్జించు కోవాలి. ఇట్టి సాధన ద్వారా వారు మరణానంతరం స్వర్గాలోకాలలో అత్యున్నతమైన బ్రహ్మలోకం చేరుకుంటారు. 

ఇలా జ్ఞాన మార్గము , కర్మమార్గమూ పరస్పరం విరుద్దాలైన రెండు ప్రత్యేక మార్గాలని శ్రీ శంకరుల మౌలిక సిద్ధాంతం. ఎందుకంటే కర్మ, అహంబుద్దీ కామనలపై ఆధారపడి ఉంటుంది.  జ్ఞానం వాటి వినాశనంపై ఆధారపడి ఉంది. కామనాసహితంగా చేసే కర్మలు ఈలోకంలో గాని, స్వర్గలోకంలో గాని భోగాలను పొందటానికి అర్హతను ఇస్తాయి. కామనారహితంగా అంటే ఫలితాన్ని ఆశించక భగవదర్పణంగా చేస్తే అవి చిత్తశుద్ధికి దారి తీస్తాయి. జ్ఞానానికి , ఆత్మ సాక్షాత్కారానికి చిత్త శుద్ది అవసరం. చిత్తశుద్ధి కల్గిన తర్వాత కర్మావస్యకత లేదు. ఇక శాస్త్రోపదేశాలను విని వానిపై ధ్యాననిమగ్నుడు కావడమే అతని పని. దీనికి అవుసరమైన సామర్ధ్యాన్ని నిష్కామకర్మ ద్వారా మనస్సును పరిశుద్ధం చేసి సంపాదిస్తాడు. మనస్సు పరిశుద్ధ స్థాయిని  చేరుకోనంత వరకూ  భగవదార్పణ బుద్ధితో నిష్కామ కర్మ చేస్తూ ఉండవలసినదే. ఇట్టివాడు క్రమంగా జ్ఞానాన్ని సంపాదిస్తాడు కాని ఈ ప్రపంచంలో మాత్రం కాదు.  తన కర్మల , ఉపాసనల ఫలితంగా అత్యున్నతమైన స్వర్గానికి పోయి కల్పాంతం వరకు అక్కడ నివసించి అప్పుడు జ్ఞానాన్ని, మోక్షాన్ని పొందుతాడు. దీనినే క్రమ ముక్తి అంటారు. ఈ శరీరంతో ఉండేటపుడే మోక్షం పొందటాన్ని జీవన్ముక్తి అంటారు.

దుఖం : -కోరికలే ఆలోచనలుగా ఒకదాని వెంట మరొకటి వచ్చి, మనస్సుకు ఆరాటం కల్గిస్తాయి. దాంతో అసంతృప్తి వస్తుంది. అసంతృప్తి అనేది ముఖ్యంగా పరమాత్మతో మనం వేరవ్వడంవల్ల కల్గుతుంది. యాంత్రిక జీవనం, ఒంటరితనం, ప్రేమలేనితనం ,ఆత్మీయతకోసం తహతహ లాడటంవల్ల కల్గుతుంది. ఈ అసంతృప్తే ముక్తిమార్గానికి దారితీస్తుంది. దుఖమనేది శారీరకము , మానసికము ,  ఆధ్యాత్మికము అని మూడు విధాలు. శారీరకమైన దుఖమంటే  , ఇది భౌతికమైనది . అనారోగ్య కారణాలవల్ల గాని , ఆర్ధిక సమస్యలవల్ల గాని కలిగే దుఖానుభవం . మానసిక దుఖమనేది భయమో, ప్రేమలేనితనంవల్లనో వస్తుంది. ఒక్కొక సారి కారణ మనేదే  ఉండదు కూడా. ఆధ్యాత్మిక దుఖమనేది అసంతృప్తి వల్ల కల్గుతుంది. ఈ కారణాలను అల్లా ఉంచితే అసలు ఈప్రపంచంలోనే దుఖమనేది ఉంది. అంచేత అందరికీ ఎంతో కొంత దుఖానుభవం ఉండనే ఉంటుంది. కాకపోతే వారి దుఖానుభవాలలో హెచ్చు తగ్గులుంటుంటాయి. గుర్తుంచుకోవలసినది ఒక్కటే. ఎప్పుడూ మనం మోయలేనంతగా మాత్రం దుఖం ఉండదు. కాకపోతే  ఎవరికి వారు అనుకునేది , వాళ్ళే ఎక్కువ దుఖాన్ని అనుభవిస్తున్నట్లు భావిస్తారు. ఇది వారి వారి భావనను బట్టి ఉంటుంది. వాస్తవానికి దుఖం సంఘటనలో ఉండదు. పరిస్థితిలోనూ లేదు. ఆ సంఘటన వల్ల మనస్సులో ఏర్పడ్డ భావంలోనే ఉంది. దీనికి కారణం మనకున్న అభిప్రాయమే. ఈ దుఖం పోవాలంటే మనకు ముక్తి రావాలి. దుఖంనుంచి దూరమవ్వాలంటే మన ఆలోచనా విధానం మారాలి. ముక్తి లభిస్తే దుఖం దూరమై , ఉన్నతమైన మానసిక స్థితిలో ఉండి అంతా సమానమే అనిపిస్తుంది. నా అనేదిగాని , తనకు స్వంతమనేది గాని ఉండదు.

బాహ్యాంతర ప్రకృతినంతా నిరోధించి అంతర్గతంగా ఉండే దివ్యత్వాన్ని వ్యక్తం చెయ్యడమే జీవిత పరమావధి. దీనికోసం    1) భక్తి మార్గం .
               2) జ్ఞాన మార్గం.
               3) కర్మ మార్గం.
               4) యోగ మార్గం  అని ఉన్నాయి.
వీటిలో ఒకటి గాని , కొన్నిటిని గాని అవలంబించి ముక్తిని సాధించాలి.  మోక్షం పొందగోరేవాడికి వాదాలు, సిద్ధాంతాలు, కర్మకలాపాలు, గ్రంధాలు, దేవాలయాలు , విధులు ఇవన్నీ అప్రధానాంశాలు . ఈ మార్గాలలో ఏ ఒక్కదానిలో ప్రావీణ్యత సంపాదించినా అది మిగిలిన వాటితో కలుస్తుంది. అంచేత ఎవరికి అనువైన మార్గాన్ని వారు ఎన్నుకొని సాధన చేస్తూ గమ్యాన్ని చేరవచ్చునని విజ్ఞులు చెబుతారు.
      

Thursday, June 28, 2012

విశిష్టాద్వైతం


దీని ప్రవర్తకుడు శ్రీ రామానుజాచార్యులవారు. వీరు బ్రహ్మసూత్రాలకు భాష్యం శ్రీభాష్యం అనే పేరుతో రచించారు. మరికొన్ని విషయాలను పొందుపరుస్తూ వేదాంత దీపం,వేదాంత సారం అనే మరో రెండు రచనలు చేయడం జరిగింది. వీరిది వైష్ణవసాంప్రదాయంలో శ్రీవైష్ణవం అని చెబుతారు.
వీరు బ్రహ్మము లేక ఈశ్వరుడు అంటే నారాయణుడు లేక విష్ణువు అని చెబుతారు. ఈశ్వరుడు సర్వోత్కృష్ట మైన వాడు. అత్యున్నతమైన గుణములన్నీఉన్నవాడు సర్వస్వతంత్రుడు అంటారు. ఆయనకు సాటి వేరెవ్వరూ లేరు. ఆయనే సర్వేశ్వరుడని అన్నిటినీ నియంత్రిస్తాడనీ చెబుతారు. ఈ నారాయణుడే బ్రహ్మను,శివుడినీ సృష్టించి వారి కార్యాలలో నియంత్రిస్తాడని చెబుతారు. ఈశ్వరుడు ఒక్కడే. వీరు నిర్గుణ బ్రహ్మమును అంగీకరించరు. 

వీరు ఈశ్వరుడు(నారాయణుడు), జీవుడు, జగత్తు అనే మూడు తత్వాలను అంగీకరిస్తారు. ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఈమూడూ సత్యమే అంటారు. ఈశ్వరునిలో చిత్ , అచిత్ అని రెండు భిన్నమైన తత్వాలు ఉన్నాయి. చిత్ అనేది జీవాత్మ .ఇది శాశ్వతము చైతన్యవంతమైనది. అచిత్ అనేది జడమైన ప్రకృతి/ జగత్తు. జీవుడు, జగత్తు పరమాత్మలో ఉండే అంశాలే. వీటికి పరమాత్మ వలె స్వతంత్రమైన ఉనికి లేదు.

జీవాత్మయొక్క  స్వభావం పరమాత్మ వలె సచ్చిదానంద స్వరూపమైనది. కాని జీవాత్మ పరమాత్మపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచం/జగత్తు ఎపుడూ ఒక స్థితి నుంచి మరో స్థితికి నామరూపాత్మకంగా మారుతూ ఉంటుంది. కాని దాని ఉనికి ఉంటూనే ఉండటం వల్ల అది నిత్యమైనదిగానే పరిగణించ బడుతుంది. ఆత్మ అణుపరిమాణం కలది. అనేక  అత్మలుంటాయి. ఆత్మకు జ్ఞానం ఉంటుంది. అంతర్యామి ప్రేరేపించినట్లుగా గాని, తన అభీష్టం మేరకు గాని కర్మలు చేసి వాటి ఫలితాలను కూడ అనుభవిస్తుంది. కొన్ని ఆత్మలు బద్దమై ఉంటాయి. కొన్ని ముక్తిపొందిన అత్మలుంటాయి. బద్ధమైన ఆత్మలు భక్తిమార్గంలో ఉండి పరమాత్మ అనుగ్రహంతో ముక్తిని పొందుతాయి. సర్వేశ్వరుడైన నారాయణునికి, ఆత్మకు, జగత్తుకు భేదం ఉంది. జగత్తు , జీవులూ ఈశ్వరుని శరీరమైతే ; ఈశ్వరుడు విశ్వానికే ఆత్మ. జీవులు చేసే కర్మలను బట్టి , వర్ణాశ్రమ ధర్మాలను బట్టి , భక్తి ప్రపత్తుల వల్ల ముక్తి/ మోక్షం కలుగుతుందని అంటారు. మోక్షం లభించాక కూడ ఆత్మలు విడిగానే ఉంటూ విష్ణు సేవచేస్తూనో, విష్ణువును ధ్యానిస్తూనో ఉంటాయని చెబుతారు.  

ఉపనిషత్తులలో జీవాత్మ పరమాత్మలకు భేదం తెలియజేసే కొన్ని శ్రుతులున్నాయి. వాటిని భేదశ్రుతులంటారు. కొన్ని శ్రుతులు భేదం లేవని చెప్పేవి ఉన్నాయి . వాటిని అభేదశ్రుతులంటారు. మరికొన్ని శ్రుతులలో పరమాత్మకూ, జీవత్మకూ జగత్తుకూ గల సంబంధాన్నిశరీరము , ఆత్మకు గల సంబంధంగా చెప్పబడటం వల్ల వాటిని ఘటకశ్రుతులని అంటారు. ఈ ఘటకశ్రుతుల ఆధారంగా శరీరము (జగత్పదార్ధం ), ఆత్మకు గల సంబంధాన్ని బట్టి ఈశ్వరుడే శరీరంలో ఉన్న ఆత్మయొక్క ఆత్మగా (అంతర్యామి) వీరు చెబుతారు. అంతర్యామి అంటే లోపల ఉండి  అన్నిటినీ నియంత్రించే వాడని.

మనం ఇలా చెప్పుకోవచ్చు. రామ అని చెప్పినపుడు రాముని శరీరం , రాముని ఆత్మ అని అర్ధం. పైన చెప్పినట్లు ఇంకా కొద్దిగా విపులీకరిస్తే రాముని ఆత్మయొక్క ఆత్మను ఈశ్వరుడు(అంతర్యామి) అని చెప్పాలి. జీవుని ఆత్మకు శరీరం ఎలాగో,అలా జీవాత్మను ఈశ్వరుని శరీరం అని చెప్పాలి. మరోవిధంగా ఈశ్వరుడే జీవాత్మయొక్క ఆత్మ. తేలిందేమంటే రామ అని అన్నపుడు
1) రాముని శరీరం.
2) రాముని ఆత్మ.
3) రాముని ఆత్మ యొక్క ఆత్మ (బ్రహ్మము). 
ఇప్పడు తెలిసేదేమంటే బ్రహ్మమే జీవాత్మ యొక్క ఆత్మ. అదే నేను అని మార్పులూ కూర్పులూ చేసుకొనేది.

విశిష్టాద్వైతం అంటే ప్రత్యేకంగా రెండు కాదు. ప్రత్యేకంగా ఒక్కటే.
జీవాత్మ పరమాత్మలు ఎలా వేరైనవంటే – జీవాత్మ శరీరమైతే దీని ఆత్మ పరమాత్మ.
ఆత్మ శరీరం కన్న భిన్నమైనది. అంచేత జీవాత్మ పరమాత్మ కన్న భిన్నమైనది.
అవి రెండు కాదు, ఒక్కటే . ఎలా అంటే – శరీరానికీ ఆత్మకూ ఉండే సంబంధం వల్ల .
రాముడు ఒక్కడే అయినా రాముని శరీరం, రాముని ఆత్మ అని చెప్పుకున్నట్లుగా ; జీవాత్మ శరీరమైతే పరమాత్మ దానికి ఆత్మగా చెప్పినపుడు ప్రత్యేకంగా ఒక్కటే.
జీవాత్మ పరమాత్మలు రెండూ వేరు. ఇలా రెండు అని చెప్పేది  ద్వైతం. జీవాత్మ పరమాత్మలు వేరుగా రెండు కాదు, ఒక్కటే అని చెప్పేది అద్వైతం.
జీవాత్మ ఎప్పటికీ అన్నివిధాలా పరమాత్మతో సమానం కాలేదు - ఇది ద్వైతం.
కాని జీవాత్మకు పరమాత్మ ఆత్మగా ఉండటం వల్లను, పరమాత్మకు జీవాత్మశరీరం కావడం వల్లనూ ఆత్మకూ  – శరీరానికీ  ఉండే సంబంధం వల్ల ఈ రెండూ ఒక్కటే-  ఇది అద్వైతం.

ఇక్కడ  ద్వైతానికీ , అద్వైతానికీ మధ్యలో ఉంటూ  రెండూ భిన్నమైన వైన ఆత్మకూ శరీరానికీ ఉండే ప్రత్యేకమైన సంబంధం వల్ల; జీవాత్మ పరమాత్మలు ఒక్కటే అని చెప్పడం వల్ల ఈ విధంగా  - విశిష్టాద్వైతం అని పిలువబడుతోంది. ఒక ఉదాహరణను తీసుకుందాం. 
సముద్రం అంటే దాన్లో తరంగాలు ఉంటాయి.
సముద్రంలో ఉండే తరంగాలు ఎప్పుడూ సముద్రానికన్న వేరైనవే అని చెప్పేది – ద్వైతం.
తరంగాలు , సముద్రం అంతా దాన్లో ఉండే నీరే. తరంగం , సముద్రం అనేవి మనస్సులో ప్రతిఫలిస్తున్నాయి. వాస్తవానికి అక్కడ ఉన్నది నీరు మాత్రమే అని చెప్పేది – అద్వైతం.
తరంగాలు సముద్రానికన్న భిన్నమైనవైనా అవి సముద్రానికన్న వేరు కాదు. ఇదే భిన్నత్వంలో ఏకత్వం. ఇదే విశిష్టాద్వైతం
        
     


Tuesday, June 26, 2012

ద్వైతం


ద్వైత సాంప్రదాయానికి మూల పురుషుడు మధ్వాచార్యుల వారు. వైష్ణవ సాంప్రదాయంలో వీరిది సద్వైష్ణవం అంటారు. వీరి విచారణను తత్వవాదం అని చెబుతారు . మధ్వాచార్యులవారికి  తల్లితండ్రులు వాసుదేవ అని నామకరణం చేసేరు. క్రమంగా ఆనంద తీర్ధుడని, పూర్ణ ప్రజ్ఞ అనీ మద్వాచార్యులని  నామాంతరాలు పొందేరు.
ముఖ్య ప్రాణమైన  వాయువు యొక్క మొదటి అవతారం హనుమంతుడు. రెండవ అవతారం భీముడు .
శ్రీ మధ్వాచార్యుల వారు ముఖ్య ప్రాణం యొక్క మూడవ అవతారంగా చెప్పబడినది.

బ్రహ్మసూత్ర భాష్యం , అనుభాష్యం , న్యాయ వివరణం , అనువ్యాఖ్యానం అని సూత్ర ప్రస్థానంపై భాష్యం రచించేరు. వీటితో బాటు మొత్తం ముప్పై ఏడు రచనలను చేసేరు. వీటన్నిటినీ కలిపి సర్వమూలం అని పిలుస్తారు.
  
వీరి ద్వైతం ప్రకారం జీవాత్మ , పరమాత్మలు వేర్వేరుగా ఉంటాయి. అవి ఎప్పటికీ ఒక్కటి కాలేవు. జీవుడు ఎప్పటికీ నారాయణుడు కాలేడు. ఈ భేదం శాశ్వతంగా ఉంటుంది. 

శ్రుతిలో చెప్పబడిన బ్రహ్మము - హరి లేక  విష్ణువే . నారాయణుడని కూడ పిలుస్తారు. విష్ణువు సర్వ శ్రేష్ఠుడనీ , వైకుంఠం లేక స్వర్గం ఆయన నివాస స్థానం అనీ అక్కడ ఆయన సతి లక్ష్మీ దేవితో ఉంటాడనీ బోధిస్తారు. హరి సర్వ స్వతంత్రుడనీ, ఏ పేరుతో పిలచినా అది విష్ణువునే సూచిస్తుందని అంటారు.

జీవాత్మలూ , జగత్తు కూడ సత్యమైనవే కాని  స్వతంత్రమైనవి కావు. హరి కన్న భిన్నమైనవి. జీవులందరూ హరిపై ఆధారపడి ఉంటారు. జీవులు హరికి సేవ చెయ్యడానికే. పరిపూర్ణమైన భక్తి , సరైన జ్ఞానం వల్ల ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే బ్రహ్మముతో ఐక్యమవ్వడం కాదు. దుఖం పోయి ఆనందమయ స్థితిని పొందటమే.  
ముఖ్యంగా అయిదు విషయాలను ఎప్పటికీ భిన్నమైనవి అని  చెబుతారు. అవి    
1) జీవుడు ఈశ్వరుడు ఎప్పుడూ భిన్నమైన వారే. ఇక్కడ ఈశ్వరుడు అంటే   బ్రహ్మము లేక  విష్ణువు.
2) జడమైన వాటికి, ఈశ్వరునకు భేదం ఉంది.
3) రెండు జీవులు ఎపుడూ ఒకే లక్షణాలను కలిగి ఉండరు. రెండుజీవులకు మధ్య ఉండే భేదం.
4) జడమైన వాటికీ జీవునకూ  భేదం ఉంది .
5) రెండు జడమైన పదార్దాలకూ భేదం ఉంటుంది.

జగత్తు ఎలా సత్యమో , అలా ఈ భిన్నత్వమూ సత్యమే.
ఇలా ఈశ్వరునికీ జీవుడికీ , జీవుడికీ జగత్తుకీ , ఈశ్వరునికీ జగత్తుకీ ,జీవుడికీ జీవుడికీ , జగత్తులోని విషయాలలోనూ భిన్నత్వం చెప్పటం వల్ల ద్వైతంగా చెప్పబడుతోంది.



Monday, June 25, 2012

అద్వైతం

ఆస్తిక దర్శనాలన్నీ జీవాత్మ, పరమాత్మ, జగత్తు లను గురించి  చర్చించి ఈ మూడిటికీ పరస్పరం ఉండే సంబంధాన్నే తెలిపాయి.  ఇవన్నీ మానవుడి  దుఖాన్ని తొలగించుకొని మోక్షం పొందటాన్ని  ధ్యేయంగా చెబుతున్నాయి. నాస్తిక దర్శనాలు కూడ దుఖం పోగొట్టుకొనేందుకే ఉద్దేశించబడ్డాయి . జీవుడు /పురుషుడు/ జీవాత్మను గురించి దాదాపు  అందరూ ఒప్పుకుంటారు. పరమాత్మ ఉన్నాడని కొందరు, లేదని కొందరు చెప్పడం జరిగింది. కనిపించే దృశ్య ప్రపంచంలోనే భిన్నాభిప్రాయాలు . కొందరు బ్రహ్మము కారణమంటే , మరికొందరు ప్రధానం కారణమని అలా వేర్వేరు ఆభిప్రాయాలను ఇదివరలో దర్శనాలు  శీర్షికలో చెప్పుకున్నట్లుగా వెల్లడించారు. 

బ్రహ్మము ఉందని చెప్పేవారిలో భేదాప్రాయాలు ఉండటం వల్ల వీరిలో అద్వైతులూ , ద్వైతులూ , విశిష్టా ద్వైతులని ముఖ్యంగా ప్రచారంలోకి రావడం జరిగింది. శంకరులు భగవద్గీత, ముఖ్యమైన పది ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలకూ భాష్యం వ్రాసి అద్వైత వేదంత సాంప్రదాయాన్ని స్థాపించారు. వేదాంతం అంటే అద్వైత వేదాంతమే అన్నంతగా బహుజన ప్రాచుర్యంలోకి వచ్చింది. వీరు చెప్పేది బ్రహ్మ ఒక్కటే సత్యం. జగత్తు మిధ్య. జీవుడు బ్రహ్మము కన్న వేరైనవాడు కాదు. అంటే విశ్వంలో ఉన్నది ఒక్క ఆత్మ మాత్రమే. జీవాత్మలన్నీ బ్రహ్మము యొక్క అంశాలే గాని వేరుకాదు.

వీరు బ్రహ్మమును రెండు విధాలుగా చెప్పేరు. నామరూపాలతో అనేక ఉపాధులతోను కూడిన బ్రహ్మము - సగుణ బ్రహ్మము   లేక అపర బ్రహ్మము .  ఈ అపర బ్రహ్మమే  జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయాలకు కారణం. నామరూపాత్మకంగా కన్పించే జగత్తు అవిద్య వల్ల ఏర్పడిన అధ్యాస . ఇది చీకటిలో వంకర టింకరగా పడిఉన్న త్రాడును చూసి పాము అనుకున్నట్లు అన్నమాట. దీన్ని అధ్యాస / అధ్యాసారోపణ అంటారు. ఇది అవిద్యవల్ల ఏర్పడుతోంది. వివేకంతో చూస్తే అపవాదు తొలగిపోయి సత్యం తెలుస్తుంది.
రెండవది -ఏ ఉపాధులూ లేని బ్రహ్మము - నిర్గుణ బ్రహ్మము  లేక పర బ్రహ్మము  .

జీవులు చైతన్య స్వరూపులు. స్వచ్చమైన ఎరుకతో ఉంటారు . నిత్య, శుద్ధ, బుద్ధ , ముక్తులైనప్పటికీ అంతఃకరణంతో తాదాత్మ్యం చెందటం వల్ల తామే కర్త, భోక్త అనుకుంటారు. శంకరులు  మరణానంతరం కలిగే క్రమ ముక్తిని ( అంటే మరణించిన పిదప కలిగే దేవయానం , బ్రహ్మలోక ప్రాప్తి తర్వాత కలిగే ముక్తి ) అంగీకరిస్తారు. అయినా సద్యో ముక్తి / జీవన్ముక్తి  జ్ఞానంవల్ల లభిస్తుందని చెబు తారు. బ్రహ్మము తనలో ఉండే మాయా శక్తివల్ల జగత్తును సృష్టించినట్లుగా శంకరులు చెబుతారు. ఏదైనా ఒకరి శక్తి అనేది తన కంటే భిన్నం కాదు. అలాగే బ్రహ్మం తన మాయా శక్తి చేత జగత్తు యొక్క సృష్టిని జరిపారని చెబుతారు.

తర్వాత కాలం వారిలో వల్లభాచార్యుల వారు శుద్ధ అద్వైత తత్వాన్ని ప్రతిపాదించారు. వీరు అనేదేమంటే శంకరులు బ్రహ్మం కంటే మాయ ఉందని అంగీకరించడంవల్ల అది ‘కేవల అద్వైతం’ అనబడుతోంది అని.

    








Friday, June 22, 2012

ఉత్తర మీమాంస దర్శనం (2) – ఆస్తిక దర్శనం

ఈ అద్వైత సిద్ధాంతానికి అధ్యాస అనేది ఆయువుపట్టు. ఉన్నది ఒక వస్తువైతే దాన్ని మరో వస్తువుగా గ్రహించడం భ్రమ/ అధ్యాస. అంటే లేనిచోట ఉన్నట్లుగా భావించబడే వస్తువు. ఎండలో తళతళ లాడుతూ తెల్లగా  మెరిసే ముత్యపు చిప్పను వెండి అనుకుంటాం. దూరంగా పడిఉన్న వంకర టింకరగా పడిఉన్న త్రాడును చూచి పాము అనుకుంటాం. అక్కడ పామూ లేదు, వెండీ లేదు. అవి లేని స్థలంలో ఉన్నట్లుగా భాసించే వెండికీ, పాముకీ అధ్యాస అని పేరు. పూర్వం వెండినీ పామునూ చూసిన సంస్కారం మనసులో ఉండటం వల్ల నేత్రాది దోషం వల్ల ఆ రెండూ భాసిస్తున్నాయి. అద్వైతుల ప్రకారం వెండి, త్రాడులమీద కనపడుతున్న రజిత సర్పాదులు ఉన్నవని చెప్పడానికి వీలు లేదు; లేవని చెప్పడానికీ వీలు లేదు. అవి నిజంగా ఉంటె క్షణా౦తరంలో  కల్గే జ్ఞానం వల్ల లేవని చెప్పకూడదు. పోనీ లేవని చెబుదామంటే ఆ క్షణం లోఅవి ఉన్నట్లు కనబడుతున్నాయి కదా! అందు చేత అక్కడ కన్పించిన రజతాదికం ఉంది అని కాని, లేదు అనికాని నిర్వచించడానికి శక్యం కాదు. ఇలా భ్రమ స్థలంలో అద్వైతులు అనిర్వచనీయ౦ అని అంగీకరించారు .ఈ అధ్యాసనే పండితులు అవిద్య అంటారు.

వేదాంత వాక్యాల సహాయంతో అద్వైతాత్మ విచారణ చెయ్యాలి. ఈ శాస్త్ర విచారణ వల్ల నేను కర్తను, నేను సుఖ దుఃఖాది భోక్తను మొదలైన భ్రాంతి కల్పితాలైన అనర్ధం తొలగి మోక్షం కల్గుతుంది. వాస్తవానికి ఆత్మచైతన్యరూపమైనది. దేహము, ఇంద్రియములు జడములు. దేహమే ఆత్మ ,ఇంద్రియాలు ఆత్మకు సబంధించినవి , దేహానికి చైతన్యం ఉంది అనే ఆత్మా అనాత్మల పరస్పర అధ్యాస అనాదిసిద్ధంగా వస్తుంది.
ఈ యాగాది కర్మలు చెయ్యాలి,ఇవి చెయ్యకూడదు , ఇలా సాధన చేస్తే మోక్షం కల్గుతుంది అనేటి లోకవ్యవహారమంతా నడుస్తోంది. ఈ అధ్యాస ఉన్నంత వరకే ఇవన్నీ. అధ్యాస తొలగిపోతే ఇక లోకవ్యవహారం ఏమీ ఉండదు. వేదాంత శాస్త్రమంతా ఆత్మతత్వ జ్ఞానాన్ని కలిగించి అధ్యాస తొలగడానికి ఉపకరిస్తుంది.

అందుచేత చిత్తశుద్ధి లేనివాడు బ్రహ్మచర్యం పూర్తిచేసుకొని గార్హస్థ, వానప్రస్థాలు స్వీకరించి కర్మాలనాచరించి చిత్తశుద్ధిని సంపాదించుకొని సన్యాసియై బ్రహ్మజిజ్ఞాసకు పూనుకోవాలి. మొదటినుంచీ చిత్తశుద్ధి ఉంటే కర్మలజోలికి పోనవసరం లేదు. ధర్మాన్ని తెలిసికొని ఆచరించడం వల్ల కలగే ఫలితం విషయాది సుఖం. బ్రహ్మజిజ్ఞాసకు ఫలం మోక్షం. బ్రహ్మ జ్ఞానం తర్వాత ఇక అనుష్టించాల్సిందేమీ లేదు.

ఈ లోకంలో కృషిచేసి సంపాదించేదంతా వస్తువుగాని, కర్మ సంపాదితమైన పరలోక భోగాలుకాని  నశించేవే. నిత్యము, అనంతము, శుద్ధము, సర్వజ్ఞము అయిన బ్రహ్మముందనేది అందరికీ తెలిసనదే.  ఆత్మయే బ్రహ్మము. అట్టి ఆత్మయొక్క విశిష్ట స్వరూపాన్ని గురించి అభిప్రాయభేదాలున్నాయి. అలాంటి పరిస్థితులలో జాగ్రత్తగా విచారించకుండా ఏదొక మతాన్ని అనుసరిస్తే మోక్షానికి దూరమవ్వుతాం. 

బ్రహ్మను సూచించడానికి జగత్తుయొక్క  సృష్టి  స్థితి లయాలనే సాధనంగా చెప్పాలి. బ్రహ్మ ఇంద్రియగోచరమైనది  కాదు కాబట్టి జగత్తుకూ బ్రహ్మకూ ఉన్న సంబంధం జగత్తు రూపమైన కార్యం మాత్రమే, ఇంద్రియాలచేత గ్రహించబడుతుంది. జన్మ స్థితి లయాలను బట్టి ఈశ్వరుడిని ఊహించాలి. శాస్త్రం ఆధారంగా తెలిసికోవాలి. అన్ని ఉపనిషద్వాక్యాలూ ఆ బ్రహ్మను ప్రతిపాదించడానికే.

అవిద్య, అస్మిత(అహంకారం), కామం , క్రోధం, భయం అనే దోషాలు ఉండటంవల్ల తదనుగుణంగా శరీరాలు పొంది మానవులు సుఖదుఃఖాలను అనుభవిస్తున్నారు. ఈ సుఖదుఃఖాల భేదానికి కారణం ధర్మాధర్మాల ఆచరణే. శరీరం ధరిస్తే సుఖదుఃఖాలతో (ప్రియాప్రియాలతో) సంబంధం లేకుండా ఉండదు. ఈ శరీర సంబంధం లేకుండా ఉండాలంటే ధర్మాధర్మాలు చెయ్యకూడదు. శరీరం లేకపోవడం అంటే మోక్షం. అది జీవునికి  స్వభావసిద్ధమైనది.

 నేను శోకంతో ఉన్నాను. శోకానికి అవతలి ఒడ్డుకు చేర్చమని నారదుడు ప్రార్ధించగా , పూజ్యుడైన సనత్కుమారుడు ; తపస్సుచే పాపాలన్నీ దగ్ధమైన నారదునికి అజ్ఞానం యొక్క అవతలి  ఒడ్డైన బ్రహ్మమును చూపినట్లు శృతి చెబుతోంది. మిధ్యాజ్ఞానం నశిస్తే రాగ, ద్వేష ,మొహాలు తొలగిపోయి ధర్మాధర్మరూప ప్రవృత్తి నశిస్తుంది. అపుడిక జన్మ ఉండదు. జన్మలేకపోతే దుఖముండదు. అదే మోక్షం. బ్రహ్మాత్మైకత్వ జ్ఞానమే తత్వ జ్ఞానం. ఇదే వేదాంతం. ఇదే ఈ దర్శనంలో  బోధించబడే విషయం.