Monday, August 13, 2012

జ్ఞానము – ప్రమాణాలు

దేహేంద్రియాలను నిగ్రహించడం వల్ల, గురూపదేశము, వేదాంత శ్రవణ మనన నిది ధ్యాసనల చేత ; చూడబడే అన్ని పదార్ధాలలో ఉండేది ఒకే చైతన్యమని తెలుసుకునే వివేకాన్ని  జ్ఞానమని చెబుతారు. దేవతలు, పశు పక్ష్యాదులు, మానవులు , స్త్రీపురుషులు , వివిధ వర్ణాశ్రమ ధర్మాలన్నీ కల్పితమైనవి.  అంచేత ఇవన్నీభేదబుద్ధిని కలిగించేవిగా ఉండటం వల్ల అజ్ఞానంగా చెప్పబడింది. ఈ జ్ఞానం కలిగించే వాటిని సాధనాలని / ప్రమాణాలని  అంటారు. అవి ప్రత్యక్షం ,అనుమానం , శబ్దం లేక శృతి ప్రమాణం.
 
ప్రత్యక్ష ప్రమాణమంటే - కంటికి ఎదురుగా ఉండే వస్తువును ఎలా మనం ప్రత్యక్షంగా తెలుసుకుంటామో అట్టి ఇంద్రియ జ్ఞానాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా భావిస్తారు.

అనుమాన ప్రణామమంటే - రెండు పదార్ధాలకు  నియత సంబంధముండి వాట్లో ఒకటి మనకు ప్రత్యక్షంగా కన్పిస్తూ రెండవది కనబడక పోయినా వాటికి గల సంబంధం వల్ల రెండవది అది ఉందని ఊహించుకుంటాము. ఉదాహరణకు దూరంగా ఎక్కడో ఒక కొండపై పొగ  రావడం కన్పిస్తే , ఆ పొగను బట్టి అక్కడ అగ్ని ఉన్నట్లుగా అనుమానిస్తాం . దీన్ని అనుమాన ప్రమాణం అంటారు. 

శృతిప్రమాణం – పై రెండు ప్రమాణాల వల్ల తెలియని విషయాలు యదార్ధ వాక్య శ్రవణం వల్ల తెలియబడతాయి. దీనికి ఉదాహరణగా ఎక్కడో ఒక మిత్రుడు మరణించగా, ఆవిషయం ఒక యదార్ధ ఆప్తునివలన విని ఆమిత్రుడు మరణించి నట్లు మనకు నిశ్చయ జ్ఞానం కల్గుతుంది. మానవుని జ్ఞానం పరిపూర్ణం కాదు కాబట్టి , శృతి పైననే ఆధారపడ వలసి ఉంటుంది. ప్రత్యక్షంగా పరమాత్మ ఇదీ అని చెప్పలేరు. ఎంచేతనంటే బ్రహ్మము అవాన్జ్మానస గోచరం గనుక. అంటే వాక్కుకుచేత గాని, మనస్సుచేత గాని తెలియబడేది కాదు కాబట్టి. కాని అనుభవంచేత కూడా తెలియబడుతుందని చెబుతారు. అంచేత బ్రహ్మమును తెలుసుకోడానికి శృతి ప్రమాణమే ఎక్కువగా ఆధారం. 

భగవంతుడిని గూర్చిన  మన ఇప్పటి జ్ఞానం, వేదాలనుండే సంక్రమించింది. వేదాలలో ఉండే విషయాలు గాన రూపంలో  క్రింది తరాలకు వాగ్రూపంలో అందజేసేరు. ద్వాపర యుగంలో వేద వ్యాసుడనే మహర్షి (కృష్ణ ద్వైపాయనుడు) ఈ వేద వాంగ్మయాన్ని నాలుగు భాగములుగా విభజించి రచించేరు. వేదాలను"శృతి"అని అంటారు. "శృతి" అంటే వినేవి . ఇవిగాక రామాయణ మహాభారతములనే ఇతిహాసములు, పురాణములు, ధర్మ శాస్త్రములు, ఆగమములు, దర్శనములనే  పవిత్ర గ్రంధాలను" స్మృతి"అని అంటారు." స్మృతి" అంటే గుర్తుంచుకొనేవి అని చెబుతారు. ఉపమానము, అర్ధాపత్తి , అనుపలబ్ది –అనే ప్రమాణాలు  పూర్వమీమాంసా  దర్శనంలో చెప్పబడ్డాయి. మరికొన్ని ప్రమాణాలు చెప్పబడినా పైన చెప్పబడిన మూడిట్లోనే అంతర్గతమై ఉండటం వల్ల ప్రత్యక్షం ,అనుమానం , శబ్ద లేక శృతి ప్రమాణాలనే  పేర్కోవడం జరిగింది. అంచేత బ్రహ్మమును తెలుసుకోవడానికి శృతి ప్రమాణంగా స్వీకరించ బడింది.

ప్రమాణాలచేత తెలుసుకోబడేవి ప్రమేయాలు . అవి ముఖ్యంగా  జీవాత్మ , పరమాత్మ, దృశ్యరూపాత్మకమైన  జగత్తు.


 

Saturday, August 11, 2012

మోక్షతత్వవిచారం -2


కైవల్యం లేక కైవల్యముక్తి  అనే పదాన్ని కొందరు వాడుతారు. కేవలాత్మ స్వరూపమే కైవల్యమని కొందరు చెబుతారు. శరీరం నుంచి విడుదల పొందిన పిదప లభించే విదేహముక్తినే కైవల్య ముక్తి అని అంటారు. ఇది తురీయాతీతమైన స్థితి అని చెప్పబడుతోంది.

వివిధ దేవతారాధనలు చేస్తూ తన ఇష్టదేవతా సన్నిధిప్రాప్తిని పొందటం కూడ, పూర్తి మోక్షం కాదని విజ్ఞులు చెబుతారు. సగుణ బ్రహ్మోపాసనచే పొందబడే అత్యున్నత స్థానం మొదటి జీవుడైన హిరణ్యగర్భుని లోకం - సత్యలోకం. ఐనా ఇది మోక్షం కాదనే అంటారు. మోక్షమంటే ఎక్కడికో వెళ్లడం కాదు. సర్వ వ్యాపకమైన బ్రహ్మమును సాక్షాత్కరించు కొన్న ధీరులు, ఆ బ్రహ్మలోనే ప్రవేశిస్తారు. అనగా ఆ బ్రహ్మగానే ఉంటారఅని శృతి మనకు చెబుతోంది.

సాంఖ్య-యోగ - న్యాయ- వైశేషిక - మీమాంసా దర్శనాలైన ఆస్తిక దర్శనాలే గాక నాస్తిక దర్శనాలు కూడ మోక్షమంటే మరేదో లోకానికి చేరి అక్కడ భగవత్సేవ మొదలైనవి చెయ్యడం అనేదాన్ని అంగీకరించరు. జైనులు  జీవుడు ఒంటరిగా నిరంతరం అలోకాకాశంలో హాయిగా పైకి ఎగురుతూ ఉండటమే మోక్షం అంటారు. ఈ దార్శినికుల ప్రకారం ప్రతీ సాధకుడూ ఇక్కడే మోక్షం పొందుతాడు.

మానవుడు మరణానంతరం తన కర్మలను అనుసరించి ఏవిధంగా వివిధ లోకాలకు చేరతాడో ఉపనిషత్తులలో చెప్పబడింది. దేవయానమనీ , పితృయానమనీ రెండు మార్గాలు చెప్పబడ్డాయి. ఉత్తమ సగుణోపాసనలు చేసిన వారిని దేవతలు దేవయానం ద్వారా బ్రహ్మలోకం చేరుస్తారు. అక్కడ వీరు ఉపాసనలను కొనసాగిస్తూ, జ్ఞానం సంపాదించి చివరకు ఆ లోకాధీశునితోపాటు ముక్తిని పొందుతారు. దీన్ని క్రమ ముక్తి అంటారు. 

ఇక పుణ్యకర్మలు చేసే వారిని దేవతలు పితృయానం ద్వారా చంద్రలోకం చేరుస్తారు. వీరు అక్కడ చాల కాలం ఉండి , మళ్ళీ భూలోకంలో జన్మిస్తారు. వారు చేసినది పుణ్యకర్మ ఐతే మంచి జన్మ, పాప కర్మైతే పాపపు జన్మలు  కలుగుతాయి. ఇక ఏ ఉపాసనలు గాని, కర్మలు గాని చెయ్యని వారు ఈ భూలోకంలోనే అనేకమైన యోనులలో జన్మిస్తూ, మరణిస్తూ ఉంటారు.

స్థూలశరీర పతనానంతరం  వివిధ లోకాల లోనికి, శరీరాలలోకి పయనించేది సూక్ష్మ శరీరమే. ఈసూక్ష్మశరీరంతో బాటు ఆత్మ కూడా ఉంటుంది. అక్కడ ఆ శరీరంతో సంబంధపడుతుంది. ఆత్మసాక్షాత్కారాన్ని పొందినవారు ఇక్కడే ముక్తిని పొందుతారు. శరీరం ఉన్నంత వరకు అది జీవన్ముక్తి. మరణం తర్వాత ముక్తుని సూక్ష్మశరీరం ఎక్కడకూ వెళ్ళదు. వీరి సూక్ష్మ శరీరం ఇక్కడే విలీనమై పోతుంది. అది విదేహ ముక్తి. అంటే బ్రహ్మ జ్ఞానం సంపాదించు కున్నవాడు విముక్తుడై ఇక్కడే మోక్షం పొందుతాడు.

కొందరు సగుణోపాసకులు సత్యలోకం చేరి , అచట చాలాకాలం ఉండి , మహాప్రళయాంతంలో ఆ సత్యలోకమూ విలీనమై పోయేటపుడు , ఆసగుణబ్రహ్మతో కలసి మోక్షం పొందుతారని చెబుతారు. ఇక్కడ బ్రహ్మలోకం చేరినవారి స్థితులు ఇలా చెప్ప బడ్డాయి .

సాలోక్యం – అంటే బ్రహ్మలోకంలో ఉండటాన్ని సాలోక్యం అంటారు.
సామీప్యం – బ్రహ్మలోకంలో ఉంటూ , ఆలోకంలో ఉండే హిరణ్యగర్భుని  సన్నిధానంలో ఆయనకు కిన్కరులై ఉండటాన్ని సామీప్యం అంటారు.
సారూప్యం – బ్రహ్మలోకంలో ఉండటమే గాకుండా ఆయనతో సమాన రూపులై ఉండటాన్ని సారూప్యం అంటారు.
సాయుజ్యం – అంటే బ్రహ్మమనే భోగ్య వస్తువును కూడి అనుభవం చెందటం. అంటే బ్రహ్మము, ముక్తపురుషుడూ సమానమైన రసానుభవం కలిగి ఉండటం సాయుజ్యం అనబడుతోంది. అంటే బ్రహ్మ రూపులై ఉంటూ బ్రహ్మదేవునికి ఉండే అపరిమితమైన శక్తి సంపదలు కలిగి ఉండటం సాయుజ్యం . వీరికి లోకపాలత్వము, సృష్టి కార్యక్రమము తప్ప  మిగిలనవన్నీ ఉంటాయని అంటారు.
వీటిలో ఉత్తరోత్రా ఒకదాని కంటే మరొకటి ఉత్తమమని అంటారు.

మోక్షం గురించి వివిధ సాంప్ర దాయాలవారు ఇలా అంటారు. మోక్షమంటే కైవల్యం. ఆత్మ జ్ఞాతగా ఉండి,
ప్రకృతి విలాసాలతో ఎలాంటి జోక్యమూ లేకుండ కేవలం చూస్తూ ఉంటుందని సాంఖ్య, యోగదర్శనాలు ప్రతిపాదిస్తున్నాయి. అంటే వీరిప్రకారం ముక్తి అనేది వ్యావహారికమే గాని పారమార్ధికం కాదని అర్ధం. పురుషుడు (ఆత్మ) నిత్యముక్తమైనపుడు ఆత్మకు బంధమే లేదు. మరి ముక్తికి అవకాశం ఎక్కడ ఉంటుంది అనేది వాదం.

పూర్వమీమాంసకులు ముక్తినే అంగీకరించరు.

ప్రభాకర మతం ప్రకారం ముక్తి కార్యఫలం. ధర్మాధర్మాలు కార్యాలు కాబట్టి, వాటిని విడిచిపెడితే కర్మఫలాలకు  తావుండదు. ఫలాలు లేకపోతే ఫలాన్ని అనుభవించడానికి జన్మ కలుగదనీ, అదే ముక్తి అని ప్రభాకరుల మతం. వీరి ప్రకారం దుఖం నివృత్తి అవుతుందే కాని, సుఖానుభవానికి తావు లేదు.

ముక్తి అనేది దుఖం లేని స్థితి గాని, సుఖానుభవ రూపం కాదని కుమారిలభట్టు మతం.

బౌద్ధుల జీవిత పరమావధి నిర్వాణం. అంటే శరీరంతో బాటు అన్నీసమూలంగా నశించడం అని వీరిభావం. అంచేత వీరు ఆత్మ అనేదే లేదని అంటారు.

జైన మతం ప్రకారం నిర్వాణం అంటే కర్మశరీరం నశించి, పంచభూతాలలో చేరడం అనేది వీరి భావం.

వేదాంత ప్రకారం, వేదాంతి జ్ఞాని అయినా , భక్తుడైనా అతనికి ఆత్మస్వరూప అనుసంధానమే ముక్తి అవుతుందని చెపుతుంది. ముక్తిని జీవితకాలంలో అంటే శరీరుడై ఉన్నపుడే అనుభవించాలి.

వైష్ణవ సాంప్రదాయంలో జీవుడు పరమాకాశంలో పరమ పురుషుని చేరడమే ముక్తి అని చెబుతారు. జీవన్ముక్తిని వీరు అంగీకరించరు.


Thursday, August 9, 2012

మోక్షతత్వవిచారం -1


అపర విద్య, పర విద్య అని విద్య రెండు విధాలుగా ఉంది. పరమాత్మ ప్రాప్తిని కలిగించేది పర విద్య. పర విద్య కానిదంతా అపర విద్యగా పరిగణించ బడుతుంది. జీవితంపై మమకారం ఉన్నంత వరకూ శాస్త్ర విహిత కర్మలను చెయ్యాలి. కొన్ని కర్మలు ప్రేయస్సును కూర్చేవి, మరికొన్ని కర్మలు శ్రేయస్సును కూర్చేవిగాను ఉన్నాయి. ప్రేయమంటే ప్రపంచ జ్ఞానం. శ్రేయమంటే మోక్ష జ్ఞానం.

ఈలోకంలో యోగక్షేమాలనీ , పరలోకంలో స్వర్గ సుఖాలను కోరి చేసే కర్మలు ప్రేయోమార్గానికి దారితీస్తాయి. అవిద్య వల్ల వీరికి ఈలోకం సత్యమనే భావన ఉంటుంది. మంత్రోపాసన , భక్తి ఉపాసనలచే ప్రకృతి విశేషాలైన అధిష్టాన దేవతారాధనలు ఫలసక్తితో చేస్తూంటారు. ఉత్కృష్టమైన మానవ జన్మను సార్ధకం చేసుకోలేరు. జ్ఞానులైన వారు’ బ్రహ్మ సత్యం, జగన్మిధ్య’ అని తెలిసికొని మోక్షంపైనే దృష్టిని కలిగి ఉంటారు. క్రమంగా దేహాత్మ బుద్ధిని వదలి, పరమాత్మను గూర్చి నిశ్చయమైన అభిప్రాయం గల్గి , గురువులచే సూచించబడిన /బోధించ బడిన మార్గంలో సాధన చేస్తూ క్రమ ముక్తి మార్గంలో పయనిస్తూ మోక్షం పొంద సమర్దులవుతారు. నిత్యమైన మోక్షం బ్రహ్మ జ్ఞానం వల్లనే కలుగుతుంది. జీవులందరూ ఎప్పుడో ఒకపుడు మోక్షం పొందవలసిందే.

బ్రహ్మమును తెలుసుకోవాలనే కోరిక ఎవరికి కలుగుతుందో , అతడే బ్రహ్మ విద్యకు అధికారి. ఈ జిజ్ఞాస అందరికీ కలుగదు. పూర్వకర్మ పరిపాకం వల్ల గాని, ఈశ్వరానుగ్రహం వల్ల గాని కలుగుతుందని పెద్దలు చెబుతారు.  ముముక్షువుకు కామ , క్రోధ, లోభములు ఉండ కూడదు. వీటితో బాటు కుల, విద్యా, ధన గర్వములు ఉండరాదు. కుల, విద్యా, ధన గర్వములలో ఏ ఒక్కటి ఉన్నా బ్రహ్మ సాక్షాత్కారం పొందే అవకాశం ఉండదు. విశిష్టాద్వైతంలో ఈ మూడు గర్వములను విడిచి పెట్టని వానికి తత్వోపదేశం చెయ్యరు.

శ్రీ శంకర భగవత్పాదుల తర్వాత అద్వైతాన్ని బోధించిన వారిలో శ్రీ విద్యారణ్యులు ముఖ్యులుగా చెప్పవచ్చును. వీరు బ్రహ్మజ్ఞానులలో విదేహముక్తులనీ , జీవన్ముక్తులనే భేదం చెప్పారు. (తత్వజ్ఞానమంటే బ్రహ్మజ్ఞానం. నామరూపాలనే నానాత్వమునందు ఏకరూపమై ఉన్న పరమాత్మను దర్శించడం. అపుడు తాను శరీరం కాదని, శరీరమునకన్న విలక్షణమైన ఆత్మనని దృఢ నిశ్చయం కలుగుతుంది). వీరి ప్రకారం తత్వ జ్ఞానం కలిగినంతనే ముక్తుడవుతాడు, కాని వాసనాక్షయ మనోనాశనాలు పూర్తిగా కలుగవు. అంచేత తత్వజ్ఞాని వాసనాక్షయ మనోనాశనాలను సాధించి జీవన్ముక్తిని పొందాలి. తత్వజ్ఞాని జీవన్ముక్తుని కన్న తక్కువ అని మనం అనుకోవచ్చు. తత్వజ్ఞానం వల్ల ఆగామి సంచిత కర్మలు దగ్ధమవడంచేత, పునర్జన్మకు హేతువైన అవిద్య నశించి భవిషత్తులో దేహాన్ని పొందడు. దేహం లేనివాడవడం వల్ల తత్వజ్ఞాని విదేహ ముక్తుడు. పునర్జన్మ లేపోయినా ఇతడికి సుఖదుఖాలు ఉంటాయి.

కాని శంకరులు అనేది – జీవన్ముక్తుడైన వానికి ప్రారబ్దకర్మ నశించగానే, సూక్ష్మశరీరం నశించడం వల్ల అప్పుడే వర్తమాన శరీరం నశిస్తున్నందున, ఈ జీవన్ముక్త స్థితినే విదేహముక్తి అంటారు. అంతే కాని జీవించి ఉండగానే విదేహముక్తి కలుగుతుందని చెప్పలేదు.

జీవన్ముక్తుడు దేహపతనానతరం ముక్తి పొందుతాడని శంకరులూ, తత్వజ్ఞానికి భవిష్యత్తులో దేహముండదు కాబట్టి విదేహముక్తుడని విద్యారణ్యులు అంటారు.  తత్వజ్ఞానం కలిగేకా రాగద్వేషాలు ఉండవని విద్యారణ్యులు, ఒకవేళ అవి ఉంటే పునర్జన్మ హేతువులని శంకరాదులు అంటారు. 
 
జీవన్ముక్తుడు, తత్వజ్ఞానీ కూడ ప్రారబ్ద భోగానంతరం పండిన ఆకు చెట్టునుంచి రాలి పడినట్లుగా దేహపతనానంతరం బ్రహ్మ స్వరూపులే. అంటే బ్రహ్మగానే అవుతున్నారు. అంచేత వీరు ముక్తపురుషులే.
జీవన్ముక్తుని దేహం ఎలా ఉంటుందంటే, పాము తన కుబుసాన్ని పుట్టలో విడిచాకా, దానిపై ఎలా అభిమానం ఉంచుకోదో, అలా జ్ఞాని అభిమానం విడువబడిన దేహాన్ని కలిగి ఉంటాడు.

జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందిన వాడని. అలాంటి వానికి తనకంటే వేరుగా ఏదీ లేదని, సర్వత్రా తనే నిండి ఉన్నట్టి నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటాడు. అంటే ‘అహం బ్రహ్మస్మి’ నేను బ్రహ్మమునే అగుచున్నాను అనే నిశ్చయ జ్ఞానం కలిగి ఉంటాడు.                   


Tuesday, August 7, 2012

బ్రహ్మవిద్య - అధికారత్వము


బ్రహ్మ విద్య గ్రహించడానికి అందరికీ అధికారం (యోగ్యత ) ఉన్నట్లుగా స్వామీ వివేకానంద చెప్పేరు. కులభేదము  కాని ,లింగభేదం భేదం కాని లేకుండ స్త్రీలు పురుషులూ అందరూ అర్హులే. యోగ వాసిష్టంలో చూడాల తన భర్తకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి నట్లు ఉంది. బ్రహ్మవిద్యను పొంది మోక్షానికి అర్హత సంపాదించు కోడానికి అన్నివర్ణాలవారికీ అర్హత ఉన్నట్లుగా స్మృతి చెబుతోంది. ధర్మమనేది దేశ, కాలముల  ననుసరించి మారుతూ ఉంటుంది. కాని మోక్షధర్మం మారదు. మారేది సాంఘిక ధర్మమే. 

జీవన గమనంలో ఏవో కోరికలతో, వాటిని తీర్చు కోడానికి అందరినీ అర్ధిస్తూండే వాడికి దేవుడనే వాడొకడున్నాడని, అతడిని ఆశ్రయించాలని చెప్పాలి. ఈ ప్రపంచం వెనుక ఉండే పరమార్ధతత్వం అయిన ఆ పరమాత్మ, నువ్వు కూడ ఒక్కటే. అదే నువ్వు అనిచేబితే ఏమీ అర్ధం కాదు. ఈ విషయాన్ని అర్ధమయ్యేలా చెప్పడానికి కొన్ని పద్ధతులు, దృష్టాంతాలు, ఉపాయాలు చూపాలి. అన్ని సిద్ధాంతాలు  లేక ఉపాయాలూ అద్వైత బోధ కోసమే. 

జగత్తు, జీవుడు , పరమాత్మల స్వరూప స్వభావాలను , వీటి పరస్పర సంబంధాన్ని చెప్పడానికి  అన్ని ఆస్తిక దర్శనాలూ ప్రయత్నం చేశాయి. ఉపనిషత్తులలో విషయాలను నియమ బద్ధమైన జీవితాన్ని గడుపుతూ మనసును పరిశుద్ధం చేసుకొని సాధన చతుష్టయ సంపత్తితో ప్రయత్నిస్తే స్వానుభవంలోకి వస్తాయి. అన్ని స్థితి గతులలో ఉండే వారికీ సరిపడేలా అనేక కర్మలు, ఉపాసనలూ చెప్పబడ్డాయి. అన్నీ ఒక వ్యక్తి చెయ్యగలిగేవి కావు. వారి అభిరుచిని బట్టి ,యోగ్యతను బట్టి ఆచరించాలి. ఉపనిషత్తులలో పారమార్ధిక తత్వం అద్వైతమే, మిగిలిన ద్వైత ప్రక్రియ అంతా దాన్ని తెలుసుకోవడానికి మార్గంగా అందరికీ అర్ధమయ్యే రీతిలో చెప్పిన ప్రక్రియగా తీసుకోవాలి.

మానవజన్మ సార్ధకం చేసుకోడానికి మనం పరమాత్మను సాక్షాత్కారించు కోవాలని చెబుతారు. మనమంతా ఎప్పుడో ఒకపుడు ఆ పరమగమ్యాన్ని చేరక తప్పదు. మానవులలో ఉండే గుణభేదాలవల్ల కొందరు ఉత్తమ అధికారులు కేవలం మోక్షాన్నే కోరే ముముక్షువులు ఉంటారు. ముముక్షువు అంటే మోక్షమునందు ఆసక్తి గలవాడు.

కొందరు మందబుద్ధులు ఇహలోక విషయాలయందే ఆసక్తి కలిగి ఉంటారు. వీరికీ అప్పుడప్పుడు మోక్షం మీద ఆపేక్ష కలుగుతూ ఉంటుంది. వీరు ఈ జన్మలో పుణ్యకర్మలు చేస్తూండగా వారి సంచిత పాపకర్మలు నశించగా క్రమంగా కొన్ని జన్మల తర్వాత ముక్తిని పొందుతారు.

ఉత్తమ అధికారులకూ, మందబుద్దులకూ మధ్య ఉండే, మధ్యమాధికారులు గురు శుశ్రూష, గ్రంధపఠనము చేస్తూంటారు. వీరికి  ఈశ్వరానుగ్రహం వల్ల ఈ జన్మలో గాని , మరో జన్మలో గాని ముక్తి కలుగుతుందని విజ్ఞులు చెబుతారు. ఐహిక విషయాల మీద ఆసక్తి ఉంటే ఈ జన్మలో ముక్తి కలుగక పోవచ్చు.



Sunday, August 5, 2012

జ్ఞానమార్గం-(4)


ఎవరికోసం లోకమంతా వెదికి, వివిధ దేవాలయాల్లో విలపించి ప్రార్ధి౦చామో, ఎవరు మేఘాల చాటున దాగి ఉన్నాడనుకున్నామో; అతడు అన్ని వస్తువులకన్న అత్యంత దగ్గరలో ఉన్నాడు. అది మన ఆత్మయే.
 'తత్వమసి' (అది నీవే)అన్నది, అన్నిఉపనిషత్తుల చివరిమాట. మనం ఆత్మ సహజలక్షణమైన ప్రజ్ఞానాన్ని మళ్లీ ప్రకటించుకోవటమే. అజ్ఞానం తొలగిపోయినపుడు తాను వెదికే దైవం తన ఆత్మయేనని తెలుసుకుంటాడు. అదే 'అహం బ్రహ్మస్మి' అనే ఉపనిషద్వాక్యం. మనం చెయ్య  వలసిన  దల్లా  శాస్త్రవచనం, గురూపదేశాల ద్వారా విన్న విషయాలను బుద్దికుశలతతో మనన౦ చెయ్యాలి. మనస్సు చేతనే మనస్సును జయించి, ఇంద్రియాలను  వశపరచుకొని, అహంకార మమకారములు, కర్తృత్వ భావమూ లేకుండా, సుఖదుఖాలందు సమభావ౦తో ఉండాలి.  జరిగే పనులను  కేవల౦ సాక్షిగాచూస్తూ, అత్మయందే స్థిరమైన బుద్దికల్గి, ఆత్మయే తానని తెలిసి ఆనందానుభూతిని పొందటం. 

మనస్సు సూక్ష్మ పదార్ధమైన ఆకాశ పదార్ధం. బ్రహ్మము జ్ఞానాతీతమైనది. దేన్ని తెలుసుకోవాలనుకున్నా బ్రహ్మమందే, బ్రహ్మం మూలంగానే తెలుసుకోవాలి. అన్ని వస్తువుల్లోనూ ఈశ్వరుడుండగా అతనికై, మనం మరో చోటికి వెళ్లడం ఎందుకు? మహత్తర నదీతీరంలో కూర్చొని దప్పికతో చస్తున్నాం. ఆనందమయ జగత్తు ఇక్కడే ఉంది. కాని అది అజ్ఞానం వల్ల మనకు కన్పించడం లేదు. అహోరాత్రాలూ మనం దాన్లోనే నివసిస్తున్నా అది మనకు ఆనందమయంగా తోచడం లేదు.

జ్ఞానయోగి వైరాగ్యం – సమస్త అనుభవానికీ నిలయం ఆత్మయే కాని ప్రకృతి కాదని ముందునుంచీ గ్రహించాలి. మనలో ఉండే అంతఃకరణాన్నిమంచీచెడుల విచక్షణా జ్ఞానాన్ని గ్రహించేటపుడు బుద్ది అంటారు. బుద్ది నిశ్చయించిన దాని పూర్వాపరాలను చింతన చేసి, క్రియారూపంలో పెట్టేటపుడు చిత్తము అంటారు. ఇలాంటి అంతఃకరణ శక్తి, బుద్ది రూప వ్యవహారాలనే  కేవలం చేస్తూండటాన్ని జ్ఞానమార్గం అంటారు. అంటే విషయం ఇదీ అని తెలిసికోడం. ఈ మార్గంలో విచారణ ప్రధానం. విషయం ఇదీ అని తెలుసుకొని , దాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించి అనుభవంలోకి తెచ్చుకోవాలి. 

జీవన్మరణాలు శరీరానికే. నీవు పుట్ట లేదు. మరణించవు. ఒకే ఆత్మ ఉఉంది, ఒకే సత్త. మనలో ఉండే ఎన్నో మూఢనమ్మకాలని వదలిపెట్ట వలసి వస్తుంది. ఐనా దీక్షతో సత్యాన్వేషణ చేసేవారు ఈ లోకంలో కొందరే ఉంటారు. జగత్తును ఇంద్రియాల ద్వారా జీవాత్మల సమూహంగా, పారమార్ధిక జ్ఞానంద్వారా బ్రహ్మంగా తెలుసుకుంటున్నాం. జగత్తులో బ్రహ్మం అనబడే ఒకే సద్వస్తువు ఉందనేది అద్వైత సిద్ధాంతం. మిగిలినదంతా అసత్తు. మాయ మహిమతో అంతా బ్రహ్మం నుంచే కల్పితం అవుతోంది. బ్రహ్మంతో ఐక్యం చెందటమే మన పరమగమ్యం. అజ్ఞాన రూపమైన మాయను తొలగించు కోవడమే మన స్వస్వరూపాన్ని తిరిగి పొందటం. 
  
సుఖం ఆత్మలోనే ఉంది. దేశ,కాల, నిమిత్తాలకు లోబడేదంతా మాయ. సుఖ దుఃఖాలు కలిసే ఉంటాయి. ఇది మంచిది, కేవలం ఇది మంచిది అనిగాని, ఇది చెడ్డది , కేవలం ఇది చెడ్డదని చెప్పగలిగే వస్తువేదీ లేదు. ఈరోజు మంచిదిగా తోచేది రేపు చెడుగా తోచవచ్చు. మంచీ చెడులు ప్రత్యేక వస్తువులు కాదు. రెండూ ఒక వస్తువే. ఆ వస్తువు మనకు కనిపించడంలో ఉండే ఎక్కువ తక్కువలకే ఆపేర్లు. ఒకరికి దుఃఖ కారణమైన వస్తువు మరొకరికి సుఖమైనది కావచ్చును. మార్పు అనేది ప్రకృతి సంబంధమైన వాటికే. నిత్యమైన ఆత్మకు ఏ వికారాలూ ఉండవు. ఆత్మ అనంతం. అఖండం. అదే నీ యదార్ధ మైన రూపం. చేసే మంచి పనులవల్ల ఆత్మకూ మనకూ మధ్య గల ప్రకృతి అనే పొర పలుచబడి, నిత్య శుద్ధమైన బ్రహ్మము క్రమాధికంగా సాక్షాత్కరిస్తుంది. అఖండమైన బ్రహ్మము దేశ, కాల పరిస్థితుల ద్వారా జగత్తుగా మారింది. కాలం మనోవృత్తులపై ఆధారపడి ఉంటుంది కాబట్టి దానికి ఉనికి లేదు. అసలు దేశ, కాల నిమిత్తాలనే వాటికి వస్తు సంబంధం లేని ఉనికే లేదు. 

ప్రతీ కార్యానికీ ఒక కారణం ఉంటుంది. అంటే ఆ కార్యానికి ముందు, దానికి కార్యభూతమైన మరొక కార్యం జరిగి ఉండాలి. ఈ పూర్వపరత్వ సంబంధాన్నే నిమిత్త న్యాయం అంటారు. ప్రపంచంలో ఉండే వస్తువులన్నీ ఒకదాంతో మరొకటి సంబంధాన్ని కలిగే ఉంటాయి. కాని అఖండమైన బ్రహ్మంలో మాత్రం కారణం ఉండదు. ఎందుకంటే అదే సర్వ స్వతంత్ర మైనది గనుక. అనంత వస్తువైన ఆత్మలో మార్పు ఉండదు. మన యదార్ధ తత్వమైన పరిపూర్ణత్వాన్నిచేరుకోవడానికే మన ప్రయత్నమంతా.



Friday, August 3, 2012

జ్ఞానమార్గం-(3)


ఈ ప్రపంచంలో గల వస్తు సముదాయమంతా బ్రహ్మంచేతనే వ్యాపించబడి ఉ౦ది. అభాస అంటే లేనిది ఉన్నట్లుగా కన్పించటం. మీరు , నేను , మనకు కన్పించే వస్తు సమూహమూ కేవలం భ్రాంతి రూపాలు. అఖండమై ఆనంద స్వరూపమై వెలిగే ఒకేవస్తువు తప్ప , వేరే ఏదీ లేదు. అదే ఏకైక సత్పదార్ధమైన ఆత్మ. ప్రకృతి , జగత్తు , భగవంతుడు  విడిగా లేరు.  ఉన్న ఏకైక సత్పదార్ధ౦ ను౦చే నామరూపాల మూలంగా ఇవన్నీ కల్పించబడు తున్నాయి. ఈ భ్రాంతినే మాయఅంటారు. ఇక్కడ స్వామి వివేకానంద మాయను గురించి  చెప్పే ఉదాహరాణతో మరింత బోధపడుతుంది.  సముద్రంపై ఒక కెరటం  ఉంది. అది సముద్రానికన్న భిన్నంగాలేదు కదా. కాని దానిలో కెరటమనే భిన్నత ఉంది . ఈ బేధానికి కారణం నామ రూపాలే . అంటే మనసున గల భావమూ , ఆకారమూ.  కాని తరంగ రూపాన్ని సముద్రం నుంచి వేరుచేసి భావించలేం. కెరటం / తరంగం అణిగిన క్షణం లోనే రూపం నశిస్తుంది. కాని ఆ రూపం భ్రాంతి కాదు. తరంగమున్నంత కాలమూ రూపం ఉంది. కావున దాన్ని చూడక తప్పలేదు. ఇదే మాయ. ఈ విధంగా ప్రపంచమంతా దేశ , కాల , నిమిత్తాలతో కల్పించబడిన ఒక విశేష రూపమనవచ్చు. వీటన్నిటికీ ఆ తరంగమే ఆధారం.  తరంగం అణగగానే అవి అదృశ్య మవుతాయి. ఈ మాయను ఏ మానవుడు దాటుతాడో , వానికది అదృశ్యం అవుతుంది. అపుడు  ముక్తుడవుతాడు.

భగవంతుడు జ్ఞానాతీతుడు. ఏది తెలుసుకోవాలన్నా, ఏది తెలుసుకున్నా, బ్రహ్మం మూలంగానే  బ్రహ్మంనందే  తెలుసుకోవాలి. నీ ఆత్మకు మూలమతడే. అతడేసత్యం. అదే ఆత్మ. నీవే అది. ఉన్నదల్లా ఒకేవస్తువు. రెండవదేదీ లేదు.  ప్రపంచమే దైవం అనేది వేదాంత బోధ . అన్నిటా దైవాన్ని చూడాలి. ఇదే ప్రపంచాన్ని విడనాడటమంటే. జీవన్మరణములు , సుఖ దుఖ్ఖములు వంటి   ప్రతి విషయంలోనూ  దైవం సమానంగా నిలిచి ఉంటాడు. కష్టాలకు మూలం కోరికలే. వాటిని త్యజించండి. త్యజించడం అంటే సత్యం తెలిసికొని ఏ ఒక వస్తువూ మీ స్వంతం అని కాని , దాన్లో మీకూ కొంత భాగం ఉందని కాని, భావించ వద్దు. మీరు ఊహించుకునే రూపంలో జగత్తు ఎప్పుడూ లేదని గ్రహించండి. జగత్తు ఒక స్వప్నదృశ్యం. నిజంగా ఉన్నది దైవమే. సర్వమూ దైవమే ఐనపుడు నేనెవరు , మీరెవరు ? ఇలాంటి భావనతో నిస్స్వార్ధంగా కర్మలు చేయమని వేదాంతం చెబుతోంది .

ఈ విశ్వమంతా బ్రహ్మం వ్యాపించి ఉంది. అభాస అంటే లేనిది ఉన్నట్లుగా కన్పించడం. మీరు, నేను , మనకు కన్పించే అన్ని వస్తువులూ కేవలం భ్రాంతి రూపాలు. అఖండము, ఆనంద స్వరూపమై వెలిగే సత్పదార్ధం తప్ప వేరే ఏమీ లేదు. నామరూపాలనే భేదాలను తొలగిస్తే , విశ్వమంతా ఏకరూపమై ప్రకాశిస్తుంది. ప్రకృతి, జగత్తు , భగవంతుడు విడిగా లేరు. ఉన్న ఏకైక సత్పదార్ధం నుంచే నామ రూపాల మూలంగా ఇవన్నీ కల్పించ బడు తున్నాయి. తాను వెదికే దేవుడు తన అత్మేనని చివరికి తెలుసుకుంటాడు. శాశ్వతానందాన్ని పొందుతాడు.  ఇదంతా ద్వైతంతో ప్రారంభమై, విశిష్టాద్వైతం ద్వారా పరిపూర్ణ అద్వైతంలో ముగుస్తుంది . బ్రహ్మంతో ఐక్య భావాన్ని పొందటమే మన పరమ గమ్యం.

ఈయోగం ఇంద్రియ నిగ్రహ సంబంధ మైనది. ఇంద్రియాలు ఆత్మకు పూర్తిగా  లొంగి మనసుకు వశమైనపుడు యోగం సిద్దించినట్లే.  ఇంద్రియాలు తమవశమై  కోరికలు నశించినపుడు, అమృతత్వాన్ని పొందుతాడు. జనన మరణాలు శరీరానికే. అసలు నీవు పుట్ట లేదు. మరణించవు కూడ. భోగాసక్తి, అహంకార మమకారాలూ ఉన్నంత వరకు పునరావృత్తి పొందుతుంటాం. నిత్యమూ,  త్రిగుణాతీతము, అనాది ఐన సత్పదార్ధాన్ని 
సాక్షాత్కరించుకున్నవాడు జనన మరణాల నుంచి విమోచన పొందుతాడు.  నేను, నాదీ అనే భావనే అన్ని అనర్ధాలకూ మూలం. నేను నాది అనే భావం తొలగినపుడు సర్వం భగవంతునికే అర్పించబడి,  హృదయం పవిత్రమై భక్తి పుడుతుంది. ఇలా జీవాత్మ పరిశుద్ధి చెందిన తక్షణం, అది భగవంతుని వైపు ఆకర్షించ బడి ఆ సాన్నిధ్యంలో నిలిచి ఉంటుంది.


Wednesday, August 1, 2012

జ్ఞానమార్గం-(2)


దేహము పంచభూత సంబంధమైనది. ఇంద్రియాలతో సంబంధపడి లోకవ్యవహారాన్ని సాగిస్తుంటుంది. మనస్సే అన్ని కర్మలకూ మూలం.  మనస్సు , ప్రాణముల ఏకరూపమే జీవుడు. అంచేత అన్ని కర్మలకూ దేహమే కారణమని చెప్పబడుతోంది. తనకు ఇష్టమని అనుకోవడం సుఖబుద్ది. అయిష్టం అనుకోవడం దుఃఖబుద్ది.  జ్ఞానేంద్రియాలు గ్రహించే శబ్ద స్పర్శ రస రూప గంధాలనే ఇంద్రియ వ్యవహారమంతా సుఖదుఃఖాలకు కారణం. దేహం మరణించే స్వభావం కలది. ఆత్మకు ఉపాధి(ఆశ్రయం). ఈ ఆత్మ దేహంతో కలసి ఉన్నపుడు , అహంకార రూపమైన ఇష్టా , అయిష్టాల సంబంధంతో వ్యవహరిస్తూంటుంది. వాస్తవానికి ఆత్మకు రాగ ద్వేషాదులు ఉండవు. ఐనా దేహాత్మ బుద్ది వల్ల రాగద్వేషాలు కలుగుతున్నాయి. దేహాత్మ బుద్ది నశిస్తే రాగద్వేషాలు ఉండవు. దేహాత్మ బుద్ది అంటే - దేహమే ఆత్మ అనుకొనే భావన.

మానవుడు తన ఇచ్చానుసారంగా కర్మలు చేస్తూ, ఆకర్మలఫలాలను పొందుతూ ఉంటాడు. మనస్సుకు దేనిమీద ఆసక్తి ఉంటుందో, అదే కర్మకు బీజమవుతుంది. సంసారంలో చిక్కుకొన్న జీవుడు; ఇష్టప్రకారం చేసిన కర్మ ఫలాలను ఈలోకంలోనే అనుభవించి, మరణ సమయంలో కర్మరూప వాసనలనే బీజములతో కూడినవాడై తిరిగి ఈలోకంలో కర్మ చెయ్యడానికి జన్మిస్తున్నాడు. ఇలా జీవుడు కర్మవశుడై తనకు తానుగా సంసారంలో పడుతూంటాడు. కాని జ్ఞానం కలిగినవాడు నిషిద్ధమైన కర్మలజోలికి పోకుండా, కర్మఫలాలందు ఆసక్తిలేకుండా నిష్కామకర్మలను చెయ్యడంచేత ఈలోకంలోనే పరమాత్మను పొందుచున్నాడు. కాబట్టి బ్రహ్మమును తెలుసుకునే  ఆత్మజ్ఞానం(బ్రహ్మ విద్య) మోక్ష ప్రాప్తికి సాధనంగా ప్రతిపాదించ బడడింది. సృష్టికర్తకు కూడ కారణమైన ఆ పరబ్రహ్మను దర్శించినవాడు పుణ్యపాపముల నుండి విముక్తుడై బ్రహ్మానందమును పొంది సర్వోత్తమమైన పదవిని పొందుచున్నాడు. అలా గాక కొంత సందేహము, కొంత అనుభవము ఉండి మనస్సును జయించని వారికి సమాధానము దొరకక, కర్మ మరియు  జన్మలనుండి విముక్తి లభించదు. అట్టి వారు మతము,ధర్మము, ఆచారముల పేరుతో  సగుణ సాకారరూపమైన ప్రకృతి విషయాలందు సత్యత్వ భ్రమ కలిగి ఉంటారు. అందువల్ల సత్యం తెలియక ఆత్మానాత్మ వివేకము ఉండదు.

వాస్తవానికి అజ్ఞానమే దుఖ్ఖానికి కారణం. ఇంద్రియములవల్ల కాని, ఇంద్రియలోలత్వం వల్ల కాని సుఖించిన వాడెవడూ లేడు. ఈప్రపంచంలో వస్తువులన్నీ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడి, కొంత కాలం తర్వాత మార్పుచెందేవే. అదేవిధంగా మన భోగములూ, సంపద, జ్ఞానం, అహంకారం అన్నీ మరణించేవే. అనిత్యమైన  వస్తువుల విషయాలలోనే మార్పు ఉండగలదు. అదేవిధంగా మనశరీరమూ, మనస్సూ కూడా నిత్యములు కావు . కాబట్టి మార్పు చెందుతూంటాయి.  ఉదాహరణకు మనం ఒకక్షణంలో సంతోషంగా ఉంటె, మరొక క్షణంలో ఉద్వేగానికి లోనై మనస్సు వికారాలకు లోనౌతుంది. మనశరీరం కూడ  వయస్సు  పెరిగేకొద్దీ  మార్పులు చెందుతూనే ఉంటుంది. మన చుట్టూఉండే ప్రపంచమూ మార్పు చెందేదే. అసలు దేశ , కాల , మాన , పరిస్థితులన్నీ మనస్సు నుండే కల్పించబడుతాయి.  అదే విధంగా భగవంతుడినీ మనమే ఊహించి ఇలా ఉంటాడని సృష్టించు కుంటున్నాం.  అంటే మనసు లేకపోతే ఈవ్యక్త ప్రపంచమూ లేనట్లే గదా.