Wednesday, September 5, 2012

అంతఃకరణం


పంచ మహాభూతముల ప్రత్యేక  సత్వా౦శముల మొదటి అర్ధ భాగాల నుంచి  జ్ఞానేంద్రియాలు  ఏర్పడు తుంటే, రెండవ అర్ధభాగాలైన  సత్వాంశాలైదూ కలసి అంతఃకరణం ఏర్పడుతుంది. ఆలోచనా పద్ధతులను చిత్త వృత్తులంటారు. అంతః కరణమనేది మనలో ఒక సూక్ష్మ పరికరం. దీన్ని విశాల దృక్పధంలో మనస్సు  అని వాడుతుంటాం. వేదాంతంలో మనస్సు, బుద్ది, చిత్తం, అహంకారం అనే నాలుగూ కలసి అంతఃకరణమని చెబుతారు. సందర్భాన్ని బట్టి మనస్సే మనస్సు, బుధ్ధి, అహంకారమని చెబుతారు. అంతఃకరణం అన్నపుడు చిత్తం కూడ చెప్పబడుతోంది. పతంజలి యోగ సూత్రాలలో అంతఃకరణమంటే  చిత్తమనే అర్ధం.

జ్ఞానేంద్రియాలు బయట ప్రపంచం నుంచి తెచ్చే విషయాలను, మనస్సు గ్రహిస్తుంది. అపుడనేక సందేహాలు, ప్రశ్నలు కలిగి ఉంటుంది. కాని, ఇదే నిర్ణయాలూ తీసుకోలేదు. అదే విధంగా, తన యజమాని నుండి జారీ చేయబడ్డ ఆజ్ఞలను కర్మేంద్రియాల ద్వారా పనులను చేయిస్తుంది. అంటే ఒక పర్వేక్షణ చేసేదిగా పని చేస్తుంటుంది. అది మాత్రం నిర్ణయాలు తీసుకోదు.

మనస్సు తెచ్చిన విషయాలను బుధ్ధి ముందు ఉంచుతుంది. అప్పుడు బుధ్ధి; మనస్సు తెచ్చిన విషయాలను విశ్లేషించి, ఒక నిర్ణయానికి వస్తుంది. అందుకే నిశ్చయాత్మక మైన పని బుద్ధిదని అంటాం.

ఆలోచనా పరంపరలు చిత్తము  అనే దానిలో పుట్టి, తిరిగి దాన్లోనే లయమవుతూ ఉంటాయి. మన ఆలోచనలు, అభిప్రాయాలు, ఆదర్శాలు, ఉద్రేకాలు, ప్రతిబింబాలూ, భయమూ, సుఖ, దుఖముల వల్ల కలిగే అనుభూతులూ  దీన్లో సూక్ష్మంగా  పొందుపరచబడి ఉంటాయి. అంటే ఒక స్టోర్ హౌస్ లాగన్న మాట.  మనం కావలసినపుడు వీటిని జ్ఞాపకం తెచ్చుకో గలుగుతాం. మనలను ఎవరైనా గాయపరచినపుడు అంటే hurt అయినప్పుడు  దానంతట అదే, మన ప్రమేయంలేకుండా  చిత్తం నుండి ఈ భావాలు చెలరేగుతాయి.

అహంకారమనేది, చిత్తంనుంచి వచ్చే ఆలోచనలకు, భావనలకు ఒక రంగును దిద్ద, నేను/ నాది అనే రూపకల్పన చేసి, ఆయా విషయాలకు ఇష్టాయిష్టాలను కలుగజేసి, సుఖదుఃఖాలను పొందుతుంటుంది.  అహంకారం శరీరంతో గుర్తింపు గల్గి ఉండటం వల్ల, ఆలోచనా మాత్రంగా ఉన్నదానికి; వేర్పాటు వాదం ఏర్పడి సుఖదుఖాలకు లోనవుతుంది. అలవాటు ప్రకారం ఏర్పడే ఆలోచనలకు, చిత్తంనుంచి అహంకారమనే రంగుతో  ఆ ఆలోచనలు మనస్సుకు చేరతాయి. నేను /నాది అనే అసత్యమైన గుర్తింపు వల్ల (ఇదే అజ్ఞానమంటే), బుద్ది ఈపొర/ తెరచే కప్పబడి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటాం. మనం ఈ బుద్ధిని కప్పిన పొరను సాధనతో వేరుచేస్తే, బుద్ది సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. అలా స్వచ్చంగా ఉండే బుద్ది మిగిలిన వాటిని అనగా మనసు, చిత్తము, అహంకారములను సరిగా నియంత్రించ గల్గుతుంది. అంటే అహంకారమే అజ్ఞానాన్ని కలుగ జేసి, వాస్తవానికి దూరంగా ఉంచుతుంది. 


 

Tuesday, September 4, 2012

ప్రాణము


పంచ మహాభూతాల యొక్క ప్రత్యేక సత్వాంశలనుండి జ్ఞానేంద్రియాలు, ప్రత్యేక రజో౦శాల నుండి  కర్మేంద్రియాలు  ఏర్పడతాయని చెప్పుకున్నాం. పంచ మహాభూతాల సత్వాంశా లైదూ కలసి అంతఃకరణం, రజో౦శాలన్నీ  కలసి ప్రాణమూ  ఏర్పడుతుంది. దీనికే ముఖ్య ప్రాణమని పేరు.

ప్రాణమంటే జీవులు బ్రతకడానికి కావలసిన చైతన్య శక్తి. ప్రాణమనే  దాన్ని అర్ధం చేసుకోడానికి, ప్రాణ శక్తిని గురించి తెలుసుకుందాం. జ్ఞానేంద్రియాలు బయటనుండి విషయాలని తెస్తే వాటిని గ్రహించాలంటే, అవి మనస్సుతో సంబంధపడి పడి ఉండాలి. గాఢ నిద్రలో ఉన్నపుడు మనస్సు, జ్ఞానేంద్రియాలూ పనిచెయ్యవు. అప్పుడు మనలను జీవింప జేసే శక్తి ఒకటి ఉంటుంది. అది శ్వాస రూపంలో ప్రాణమని చెప్పబడుతుంది. జీవానికి, శరీరానికీ, ప్రాణానికి పరస్పరం సంబంధం ఉంటుంది. ప్రాణం యొక్క చైతన్యశక్తి వల్లనే మనస్సు బాహ్య విషయాలను గ్రహిస్తుంది. శరీరానికి కండర చలనం ద్వారా చైతన్యాన్ని కల్గించేది ఈ ప్రాణమే.  ప్రాణం బ్రహ్మము యొక్క ప్రకాశం చేత ప్రవర్తిస్తుంది. శరీరంలో ఈ ప్రాణశక్తి 5 భాగాలుగా విభజించ బడింది. ముఖ్య ప్రాణం, చేసే పనుల భేదాన్ని బట్టి ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానమని  చెబుతారు. 
    
1) ప్రాణము – ఇది ముక్కు రంధ్రాల నుండి హృదయం వరకు వ్యాపించిఉన్న శ్వాశకోశాన్ని(respiration ) జ్ఞానేంద్రియాలని నియంత్రిస్తుంది. మన వాక్కును, మ్రింగటాన్ని(deglutition ), శరీర ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుదుంది. ఇది శరీరంలో ఊర్ధ్వచలనం కల్గి ఉంటుందని చెప్పబడింది.
2)  అపానము - ఇది నాభి నుండి అరికాళ్ళ వరకు వ్యాప్తిచెంది అధోచలనం కల్గి విసర్జన కార్యకలాపాలకు తోడ్పడుతుంది. ఉదాహరణకు మల మూత్ర విసర్జన, వీర్యము, బహిష్టు మరియు శిశు జననము మొదలైన వాటిని నిర్వర్తిస్తుంది.
3) సమానము - నాభి నుంచి హృదయం వరకు వ్యాప్తిచెంది, మనం తినే ఆహారాన్ని జీర్ణమయ్యేటట్లు చేసి, ఒంటబట్టడానికి సహకరిస్తుంది. దాని ద్వారా అవయవాలకు శక్తి కల్గుతుంది.
4) ఉదానము - ఇది గొంతు భాగం నుంచి శిరస్సు వరకు వ్యాపించి, శరీరాన్ని ఊర్ధ్వ ముఖంగా పయనింప జేయడానికి ఉపకరిస్తుంది. అంటే మనలోనుండి  శబ్దం కలగడానికీ, వాంతులు చేసుకునేటపుడు బహిర్గతమవడానికీ, మన దైనందిత కార్యాల్లో తూలి పడిపోకుండా సమతులనంగా ఉండటానికి దోహదం చేస్తుంది.
5) వ్యానము - ఇది ప్రాణ, అపానాలను కలిపి ఉంచి, శరీరంలో ప్రసరణ కార్యక్రమాన్ని జరిపిస్తుంది. నాడీమండలం మొత్తం పనులను నడిపిస్తుంది. మన ప్రాణమయ కోశంలో సుమారు 72,000  సూక్ష్మ నాడులున్నట్లుగాను, అవిగాక వాటిని నియంత్రించే నాడీ కేంద్రాలూ (చక్రములు) ఉన్నట్లు పెద్దలు చెబుతారు.

హృదయమున ప్రాణము, గుద స్థానమున అపానము, నాభి ప్రదేశమున సమానము, కంఠ మధ్యమునందు ఉదానము, సర్వశరీరము నందు వ్యానము ఉన్నట్లు పంచ ప్రాణముల స్థాన నిర్ణయం చెప్పబడింది. ఈ ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానములనే పంచ ప్రాణములు ; నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనుంజయము లనెడి పంచ ఉపప్రాణములు కలసి నాడీ మండల మంతా వ్యాపించి, దేహవ్యాపారములకు కారణమవుతోంది. నాగుడను ఉపవాయువు వల్ల కక్కుకొనుట ; కూర్మమను ఉపవాయువు వల్ల కను రెప్పలు విచ్చుట, మూయుట ; కృకర మను ఉపవాయువు వల్ల తుమ్ముట, దగ్గుట ; దేవదత్తమను ఉపవాయువు వల్ల ఆవులింత చెప్పబడ్డాయి. ధనుంజయ మనే  ఉపవాయువు శరీరమంతా వ్యాప్తించి, మరణానంతరం శరీరం లావెక్కడానికి తోడ్పడుతుంది. ఇలా దశవిధ వాయువులు దశేంద్రియ సంబంధము కల్గి, రాగ ద్వేషాది అనుభవాలకు అధోముఖమవు తున్నాయి.
  
మనస్సును సాధనముగా చేసుకొని, దశ విధ వాయువుల చివర నుండేది, కర్తృత్వ భోక్త్రుత్వ గుణములను కల్గి ఉండేది  బుధ్ధి అనే చిద్బిందువు. ఇదే సర్వ కార్య కారణాలకూ ఆశ్రయమై , వాసనలతో ఇంద్రియములతోను స్థూల సూక్ష్మ కారణ శరీరములనే  ఉపాధుల సంబంధం కల్గి, విషయానుసారముగా సంచరిస్తుంటుంది. ఇలా  పంచ ప్రాణములు పంచ కర్మేంద్రియాలు కలసి క్రియాశక్తి బలము కల్గి ఉన్నాయి. పంచ ఉపప్రాణములు పంచ జ్ఞానేంద్రియాలు కలసి జ్ఞాన శక్తి బలం కల్గి ఉన్నాయి. దశవిధ ప్రాణములు; మనస్సు బుధ్ధి చిత్తము అహంకారములనే అంతః కరణ చతుష్టయంతో కలసి ఇచ్ఛాశక్తి బలం కల్గి  సమస్త ఇంద్రియ వ్యాపారాలకూ కారణంగా ఉన్నాయి.

ప్రాణాయామంలో కుంభకం వల్ల శరీరంలో నాడులన్నీ వాయువుచే పూరించబడి, ఈ దశవిధ వాయువుల యొక్క చలనం వేగవంత మవుతుందని తద్వారా హృదయ కమలం వికసిస్తుందనీ చెప్పబడింది. పంచ ప్రాణాలు, పంచ ఉప వాయువులు కలిపి దశవిధ వాయువులుగా చెప్పబడ్డాయి.            
    

Sunday, September 2, 2012

జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు - పనిచేసే విధానము


పంచ జ్ఞానేంద్రియములు : 
మన దేహంలో  బాహ్యవస్తు జ్ఞానాన్ని గ్రహించడానికి ఐదు జ్ఞానేంద్రియాలున్నాయి.
శబ్దాన్ని గ్రహించడానికి చెవులూ,
శీతోష్ణములను(స్పర్శ) గ్రహించడానికి చర్మము(త్వక్కు),
రుచులను లేక రసమును గ్రహించడానికి జిహ్వ(నాలుక),
రూపమును గ్రహించడానికి కనులు(చక్షువు),
వాసనలను(గంధము) గ్రహించడానికి ముక్కు(ఘ్రాణము) ఉన్నాయి.
ఇవన్నీ సూక్ష్మాంశాలు. జ్ఞానేంద్రియమొక్కొక్కదాన్లో, ఒక మహాభూతపు అంశ మాత్రమే ఉండటం వల్ల, చెవి చూడలేదు, కన్ను వినలేదు. ఈ అయిదు జ్ఞానే౦ద్రియాలు తెచ్చే విషయాలను గ్రహించటానికి అంతః కరణంలో వీటన్నిటి  సత్వా౦శాలూ ఉంటాయి. సత్వాంశాలైదూ కలసి అంతఃకరణం ఏర్పడుతుంది. అంతఃకరణం మనస్సు, బుద్ది అని రెండు విధాలుగా వృత్తి భేదంచేత చెప్పబడుతోంది.

కర్మేంద్రియాలు :
వాక్కు, చేయి, పాదము, గుదము, గుహ్యము అనేవి కర్మే౦ద్రియాలని  చెప్పబడతాయి. ఇవి కూడా సూక్ష్మంశాలే. మాంస వికారాలు కావు.
వాక్కు మాట్లాడతాం.
పాణి (చేతులు) తీసుకుంటాం.
పాదము   ఇటూ అటూ పోవడం.
గుదము(పాయువు) త్యజించడం.
గుహ్యము ( జననేంద్రియం/ ఉపస్థ) ఆనందించడం.
ఇలా వీటి చేత కర్మలు చెయ్యబడటం చేత, వీటిని కర్మేంద్రియాలని చెబుతాం. పంచ మహాభూతాల యొక్క ప్రత్యేక రజో౦శముల నుండి - వరుసగా ఆకాశం నుండి వాక్కు, వాయువు నుండి పాణి, అగ్ని నుండి పాదము, జలము నుండి పాయువు, పృథ్వి నుండి ఉపస్థ ; ఇలా కర్మేంద్రియాలు  ఏర్పడ్డాయి.
                 
పంచ మహాభూతాల యొక్క ప్రత్యేక సత్వాంశాలనుంచి  జ్ఞానేంద్రియాలేర్పడుతుంటే, వీటి  ప్రత్యేక రజో౦శాల నుంచి   కర్మేంద్రియాలేర్పడుతున్నాయి. పంచభూతాల రజో౦శాలన్నీ కలసి ప్రాణమేర్పడుతుంది. దీనికే ముఖ్య ప్రాణమని పేరు. ఈ ముఖ్య ప్రాణం చేసే పనుల భేదాన్నిబట్టి; ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అని పంచ ప్రాణాలుగా చెబుతారు.

ఇంద్రియాలెలా పని చేస్తాయంటే :
ఉదాహరణకు శ్రవణే౦ద్రియాన్ని తీసుకుంటే చెవి శబ్ద తరంగాన్ని, దాని కేంద్రంలో చేర్చే బాహ్య అవయవం లేక ఉపకరణం. దీనికి లోపల అంతరింద్రియంగా శబ్దకేంద్రం మెదడులో ఉంటుంది. ఈ అంతరింద్రియం మనస్సుతో సంబంధం కల్గి ఉండాలి. మనస్సు  కర్ణే౦ద్రియంతో సంబంధ పడకపోతే, అంతరింద్రియమూ దాని వెలుపల గల చెవీ శబ్ద  తరంగాన్ని స్వీకరించినా, ఆ శబ్దం లేక ధ్వని అనుభవంలోకి రాదు.

మనస్సు ఈ అనుభవాన్ని ఇంకా కొంత  దూరం తీసుకుపోయి బుద్ధికి నివేదిస్తుంది. అపుడు బుద్ది తనకు చేరిన విషయం ఇట్టిది అని నిర్ణయం చేస్తుంది. కాని అప్పటికీ కార్యం పూర్తి కాదు. బుద్ది ఈ అంశాన్ని జీవాత్మకు నివేదిస్తే, జీవాత్మ తన నిర్ణయాన్ని ఏంచెయ్యొచ్చో, ఏంచెయ్యకూడదో తెలుపుతుంది. అపుడా ఆజ్ఞను తిరిగి అదే క్రమంలో మొదట బుద్ధికి, ఆక్కడ నుండి మనస్సుకు, అటునుండి కేంద్రానికీ  తీసుకుపోబడుతుంది. ఆ తర్వాత, ఆ కర్మే౦ద్రియం దాని వెలుపలి ఉపకరణానికి చేరుస్తుంది. అపుడు గాని ఆ అనుభవం పూర్తి కాదు. అలాగే మిగిలిన విషయాల జ్ఞానమూ మనకు తెలిసేది అని గ్రహించాలి.