Thursday, October 11, 2012

కుండలిని - 2

మూలాధారము


మూలాధారచక్రం  మధ్య భాగంలో కుండలినీ శక్తి ఉంటుంది. ఇది సర్పాకారంలో ఉంటుందని చెప్పబడింది. మూలాధారంలో ఉంటే అధోకుండలిని అనీ, భ్రూమధ్యమున ఉంటే ఊర్ధ్వ కుండలిని అనీ అంటారు. విషయాసక్తి ఉండే వారియందు కుండలిని యొక్క తల మూలాధారంలోనూ తోక భ్రూమధ్యమానా  ఉంటుందని, అదే జ్ఞానులకు కుండలినీ యొక్క తల భ్రూమధ్యమాన, తోక మూలాధారంలోను ఉంటుందంటారు. కుంభక ప్రాణాయామంచేత కుండలిని మేల్కొంటుంది. కర్రదెబ్బతిన్న, త్రాచుపాములా బుసకొట్టి లేస్తుందని చెప్పబడింది. చిత్తము సుషున్నూ యందు లీనమవుతుంది. అంటే, శక్తి మూడు గ్రంధులనూ భేదించి  శివస్థానమును పొంది, సహస్రారమున  శివునితో కూడి ఆనందించునని చెప్పబడినది. ఇదే పరమోత్కృష్టమైన స్థితి. ఇదే యోగ సిద్ది. ముక్తి అని చెప్పబడింది. 



మూలాధారము

స్థూల శరీరమునందు గుద స్థానమునకు రెండంగుళాల పైనా, లింగ స్థానమునకు రెండంగుళాల క్రింద చతురస్రాకారంలో ఎర్రని రంగును కల్గి నాలుగు దళములతో ఉంటుంది. ఇది పృధివీ భూత సంబంధమై ఉండటం చేత గంధమాత్రలతో సంబంధం ఉండి, సువాసన, దుర్వాసన, సువాసనా మిశ్రమము, దుర్వాసనా మిశ్రమము లని నాలుగు గంధ గుణములు తెలియబడు చుండగా ఇవే నాలుగు దళములుగా చెప్ప బడినవి. ఈ చతురస్రంలో క్రింది ముఖంగా కోణం ఉండే త్రిభుజంలో, కుండలినీ స్థానమైన మూలాధారం ఉంటుంది. ఈ కమలానికి అధిపతి గణపతి. అన్నమయ కోశానికిది స్థానము. ఇచ్చట చిణి అనే నాదం ఉంటుంది. ‘లం' అనే బీజాక్షరాన్ని (శబ్దము) ధ్యానిస్తూ ఈ కేంద్ర రూపాన్ని చింతిస్తూండే వానికి దీన్లో రహస్యం బోధపడి, చక్రము మేల్కొని అందలి కుండలిని ఊర్ధ్వ ముఖమవుతుంది.
 
సౌందర్య కారణంగా స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కల్గించి, దానివల్ల సంతతిని కల్గించటానికి  కారణ మవుతుంది. దీన్లో ఉండే త్రికోణంలో కామరూపమనే  మహాశక్తి, జీవియొక్క రూపురేఖలను నిర్ణయించి, జీవులందు కామము కల్పించి దేహనిర్మాణము చేయబడుతోంది. జీవునిలో అంతర్యామి ప్రజ్న; శిరస్సు నందు మేల్కొని, జీవునియందు ప్రవేశించి, వెన్నెముక చివర మూలాధార చక్రము ద్వారా శరీరమునందలి ధాతువులుగాను, ధాతు కణములుగాను స్థాపించ బడుతున్నాయి. సృష్టిలోని జీవులు కామమునకు వశులై పనిచేయవలసినదే గాని దానిని దాటలేరు. అవతార పురుషులు కూడ సృష్టి ధర్మమును గౌరవించి సంతానమును పొంది, గృహస్థాశ్రమమునకు ఆదర్శమైన వారే.  సంతానము కొరకు కామము అని తెలిసినవారు సంతానము పొందుట ద్వారా కామమును దాటు చున్నారు.

కుండలిని యందలి షడ్చక్రములూ జీవుని దేహకోశములకు కేంద్రములు.  ప్రజ్ఞ సృష్టియందు నిద్ర, స్వప్నము,  మెలకువ , పూర్తి మెలకువ అనే  నాలుగు స్థితులుగా వ్యక్తమవుతోంది. అచేతనమైన భౌతిక పదార్ధములలో ప్రజ్ఞ పూర్తిగా  నిద్రావస్థలో  ఉంటుంది. భౌతిక వ్యాపారములు (senses)ఉండవు . ఇది  గాఢనిద్రలో ఉండే వాని స్థితి. స్వప్నావస్థలో  ప్రాణ ప్రవృత్తులు మేల్కొని ఉంటాయి. ఉదాహరణకు వృక్షములు , మొక్కల లాగున . అనగా చైతన్యముంటుంది కాని ఇంద్రియ స్పర్శ ఉండదు. ఇక నిద్రిస్తున్నా బాహ్య ప్రపంచముతో సూక్ష్మ సంబంధముంటుంది. అంటే  కలగా ఉన్న స్థితి.  మెలకువ స్థితిలో ఇంద్రియ ప్రవృత్తులు కూడ మేల్కొనే ఉంటాయి. ఇంద్రియాలు ఉంటాయి కాని , మనస్సుండదు. ఇదే జంతు స్థితి. అనగా ఇంద్రియ ప్రవృత్తులను, ప్రాణ ప్రవృత్తుల ననుసరించి జంతువులు జీవిస్తాయి. పూర్తి మెలకువ స్థితిలో ఇంద్రియ ప్రవృత్తులతో బాటు మనస్సు కూడ పనిచేస్తుంటుంది. ఇది మానవుడున్న స్థితి.

ఈ స్థితులనే  సర్పాకారములో మూలాధార చక్రమున  సూచింప బడుతున్నాయి. మూడున్నర చుట్లు గల మూలాధారమందలి  సర్పముయొక్క మొదటి చుట్టు సుషుప్తావస్థ (నిద్ర). సర్పముయొక్క  రెండవ చుట్టు  స్వప్నావస్థ- వృక్ష స్థితిని, మూడవ చుట్టు- జంతు స్థితిని, అర్ధ చంద్రాకారముగా సగము చుట్టి పడగెత్తినది పూర్తి జాగ్రదావస్థను అనగా మనస్సు మేల్కొన్న మానవ స్థితిని సూచిస్తుంది. ఈ మూలాధార చక్రము వల్ల నిరంతర సంతృప్తి ,అకారణమైన ఆనందము కలుగుతాయి. ఇలాంటి స్థితిని, ఆమెయే జీవులయందు మేల్కొల్పి; సంఘటనలననుసరించి ఇతరులను ప్రేమింప జేసి జన్మల పరంపరలో అంచెలంచెలుగా ఎదిగించి, నిత్యానందమయ స్థితికి తీసుకొని పోయి  జన్మ మృత్యువు లనెడి ద్వంద్వాతీతమైన అమృతత్వమును పొందించేది.

మూలాధారం  బీజాక్షరం –‘లం’ . నాలుగు ఎర్రని రంగు గల పెటల్స్ కలిగి, దాని మధ్య పసుపు పచ్చని చతురస్రం ,  చతురస్రం మధ్యలో ఎర్రని inverted triangle ఈ త్రిభుజంలో బూడిద రంగు గల శివలింగం. శివలింగం చుట్టూ మూడున్నర చుట్లు కల్గి పడగ విప్పిన సర్పం ఉంటుంది. ఇదే కుండలినీ శక్తి.

                           

Monday, October 8, 2012

కుండలిని - 1



కుండలిని  
ఉమ్మెత్త పూలను ఒకదానిపై మరొకటి పైముఖముగా పేర్చి, దారం గుచ్చితే  ఎలా ఉంటుందో; అలా వికసిస్తున్న  పద్మాలలా కుండలిని కన్పిస్తుంది.  ఇది శిరస్సు నుండి మేరుదండము మధ్యగా క్రిందిలోకాలకు  ప్రవహిస్తుంది. దీన్నే  వజ్రము లేక సుషున్ను అంటారు.  దీన్లోనే  సహస్రారమునుండి మూలాధార చక్రము వరకు పనిచేసే  కేంద్రాలుంటాయి.

మనస్సులో  మనకు మనమే ఊహలు పుట్టించుకోడం లేదు.  ఊహలు తట్టడమనేది  పరమాత్మ వశాన ఉంటుంది. మనకు అనువైన సంకల్పాలను  కల్పించి, క్రమేణా పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగించేది యోగ మాయ.  జీవులు సుఖానుభవాలను  సాధించే  ఆశతో, సంఘర్షణ వల్ల దుఖపడుతూంటారు.  ఆహారము, నిద్ర, వస్త్రము, గృహమనేవి  తప్ప మిగిలినవి  సుఖములు కాదనే విషయాన్ని  జీవితంలో సంఘటనల ద్వారా నేర్పించేది మాయ.  కాబట్టి మాయను గుర్తించి,  దాని నారాధించే వారికి అది యోగ మాయ అవుతుంది. కుండలినీ శక్తిని ఉపాసించే వారిని,  ఆమె ప్రేమ అనే  అమృత ధారలతో తడుపుతూ, జన్మ రాహిత్యాన్నికలుగ జేస్తుందని యోగులు చెబుతారు.

కుండలినీ యొక్క ఆధార పద్మము సుషున్నూ నాడికి ప్రవేశద్వారము. ఇది వెన్నెముక క్రింది భాగమున గుదస్థానము నకు పైన ; నోరు/వక్త్రము  అధోముఖమై ఉంటుంది. మూలప్రకృతి సూక్ష్మ లోకాలనుంచి  స్థూల లోకాలలోకి దిగి రావడానికి, ఈ మూలాధార చక్రమే ద్వారము. చిక్కుడు చెట్టు చిక్కుడు గింజయందున్నట్లు; జీవుని శరీరము యొక్క అంశ, దీన్లో ఉంటుంది.

మనశరీరంలో మూలాధారం మొదలుకొని బ్రహ్మరంధ్రము వరకు వెన్నెముక నందు వెదురు బొంగువలె బ్రహ్మదండము ఉంది .  దీన్లో  కాలువలా ఉండు సన్నని రంధ్రముగా గల మార్గము నందుండే  సుషున్నూ నాడిలో, ఆరు చక్రములు కలవని యోగులు వారి అనుభవంతో చెబుతారు. చక్రములు అంటే నాడీ సముదాయంగా చెప్పుకోవచ్చు. సుషున్నూ లోపల కుండలినీ శక్తి తామర కాడలో దారం వంటిదని చెప్పబడింది.

గుదము(పాయువు) నకు పైన, శిశ్నము(లింగము)నకు రెండంగుళాల క్రింద అధోముఖముగా(క్రింది ముఖముగా) కోణము గల త్రిభుజం నందు మూలాధార చక్రం ఉన్నట్లు చెబుతారు. ఆ మూలాధారం మొదలు శిరస్సు మధ్యభాగము నందుండు  సహస్రార కమలమున గల బ్రహ్మరంధ్రము వరకు సుషున్నూ నాడి వ్యాపించి ఉంది. ఇది అన్ని నాడులకన్న శ్రేష్టమైనది. ఈ సుషున్నూ నాడికి ఇరువైపులా ఇడ, పింగళ అనే నాడులున్నాయి. ఎడమవేపున ఇడా నాడి, కుడి వేపున పింగళ నాడి ఉన్నాయి. కుడి ముక్కున సంచరించే శ్వాసకు 'పింగళ' అని, ఇదే బ్రహ్మము లభించు దేవయాన మార్గమని అంటారు.  సుషున్నుకు ఎడమవేపున పయనించే శ్వాసను 'ఇడా' అనియు, దీన్ని ఇడానాడి అనీ అంటారు. ఇది ప్రకృతిని ఆశ్రయించి ఉంటుందనీ, దీని గమనమును చంద్రమండల యానముగా చెబుతారు. దీన్ని పితృయాన మార్గంగా చెబుతారు.

అజ్ఞానుల యందు సుషున్నూ రంధ్రము మూసుకొనియు, జ్ఞానులందు విచ్చుకొనియు ఉంటుంది. ఇడా, పింగళ , సుషున్నూ నాడులు మూడూ భ్రూమధ్యమున కలుస్తాయి. ఆ ప్రదేశాన్ని త్రివేణీ సంగమముగా చెబుతారు. ఇడా పింగళ నాడులు నాసికాగ్రంతో ఆగి పోతాయి. కుండలినీ శక్తిని క్రియాయోగమున ప్రాణాయామంతో పూరక, కుంభక , రేచకములను అనుసంధానం చేసి సుషున్నూలో ఉండే కుండలినీ శక్తిని ఊర్ధ్వగతిని పొందింప చెయ్యడం వల్ల బ్రహ్మ గ్రంధి, విష్ణు గ్రంధి, రుద్ర గ్రంధి అనే గ్రంధి త్రయం భేదించ బడుతోంది. ఈ మూడు గ్రంధులూ కలసి హృదయ గ్రంధి అంటారు. దీని భేదనమే ముక్తిగా చెప్పబడుతోంది. ఈ సుషున్నూలో ఉండే చక్రములను 1) మూలాధారము 2) స్వాధిష్టానము 3) మణి పూరకము 4) అనాహతము 5) విశుద్ధి 6) ఆజ్ఞా చక్రము అని అంటారు.

చక్రము అంటే నాడీ కూటమి అని గ్రహించాలి. మూలాధారము నుండి ఆజ్ఞేయము వరకు ఉండే  ఆరు చక్రాలను  కమలములని అంటారు. ఇవి గాక సహస్రారమనేదీ ఉంది. సుషున్ను మూలాధారం నుంచి అజ్ఞేయ చక్రం వరకూ ఉండే ఆరు కమలాలనుండీ సంచరిస్తూ, సహస్రారమనే  సహస్ర దళ పద్మమందు ఓంకార పీఠమున ప్రకాశిస్తుంది.

మూలాధార స్వాధిష్టానములు కలసి బ్రహ్మ గ్రంధి అనబడుతోంది. ఇది  'అ' కార మాత్రా స్వరూపము. సరస్వతీదేవి శక్తి. దీనికి 'లం'-అనేది  బీజ స్వరూపము. రజోగుణ ప్రధానము, క్రియా శక్తి స్వరూపము. మనోరూపము. మణి పూరక అనాహతములు కలసి విష్ణు గ్రంధి అంటారు. ఇది 'ఉ' కార మాత్రాస్వరూపముగా ఉంది. మహాలక్ష్మి శక్తి స్వరూపము. స్థితి కారిణి. ఇచ్చాశక్తి రూపిణి. దీనిది 'వం' బీజ స్వరూపము.  సత్వగుణ ప్రధానము. ప్రాణ స్వరూపము.

విశుద్ధి ఆజ్ఞా చక్రములు కలసి రుద్ర గ్రంధి అంటారు. ఇది 'మ' కార మాత్రాస్వరూపము. మహా కాళీ శక్తి స్వరూపము. లయ కారిణి. జ్ఞానశక్తి స్వరూపము. దీనిది  'రం' - బీజ స్వరూపము. తమోగుణ ప్రధానము.
బ్రహ్మ విష్ణు రుద్ర గ్రంధులు మూడూ కలసి హృదయ గ్రంధి అని చెప్పబడుతోంది. ఇదే లింగదేహము. ఆత్మకు ఉపాధి. హృదయ గ్రంధి యందు ప్రతిఫలించి ప్రకాశించు చైతన్యమే క్షేత్రజ్ఞుడుగా చెప్పబడింది.


Wednesday, October 3, 2012

వైరాగ్యబోధోపరతులు



వైరాగ్యబోధోపరతులు
తత్వజ్ఞానం (బోధ) ఉన్నపుడే ముక్తి కలుగుతుంది. వైరాగ్యము, బోధ, ఉపరతి అనే మూడూ తత్వజ్ఞానానికి సహాయకారులు.
వైరాగ్యము;
శరీరము, ప్రపంచమందు విషయాలు అనిత్యమైనవని గ్రహించి , ఈ లోకంలోగాని పరలోకంలోగాని ఏవిధమైన కోరికలు లేకుండా ఉండటం వైరాగ్యం. 
బోధ;
బోధ అంటే తత్వజ్ఞానం. ఇది శ్రవణ మనన నిదిధ్యాసల వల్ల కలుగుతుంది. కూటస్థుడు , అహంకారము వేరని తెలుసుకొని , కూటస్థుడు నిత్యుడని అహంకారం మిధ్య అనీ నిశ్చయాన్ని కలిగి ఉంటాడు. అపుడు  హృదయ గ్రంధి భేదించబడి , అన్యోన్యాధ్యాస తిరిగి కలుగదు.
ఉపరతి; 
యమ నియమాదుల వల్ల చిత్తము ఏకాగ్రమై, ఇక లోకవ్యవహారం ఉండక పోవడం. వీటిలో వైరాగ్యం ముఖ్యమైనది. మిగిలిన రెండూ బోధకు సహాయకారులని చెబుతారు.ఇదే విషయాన్ని వివేకచూడామణిలో (375) శంకరులు ఈవిధంగా చెప్తారు. వైరాగ్యము, బోధ(జ్ఞానము) అనేవి పక్షికి రెండు రెక్కల వలె మోక్షాన్ని కోరేవాడికివి రెండు రెక్కలవంటివి . ఈ రెండిటిలోనూ ఏఒక్కటి లేకపోయినా మిగిలిన ఒక రెక్కతో మోక్షపు సౌధాన్ని అధిరోహించడం సంభవం కాదు.

తత్వజ్ఞాని వాసనాక్షయ తత్వజ్ఞాన మనోనాశములను ఏక కాలంలో సాధిస్తేనే ముక్తి కలుగుతుందని చెప్పబడింది. ఇవి కార్య కారణాలు గనుక ఒకటి ఇప్పుడు, మరొకటి వేరే సమయంలో మరొకప్పుడూ అభ్యసించటం కుదరదు. 
ఈ మూడూ, మూడు ద్వంద్వాలుగా ఏర్పడతాయి. అవి 1) వాసనాక్షయ మనోనాశములు 2) వాసనాక్షయ తత్వజ్ఞానములు 3) మనోనాశ తత్వజ్ఞానములు.


1) వాసనాక్షయ మనోనాశములు;
బీజరూపంలో అంతఃకరణంలో ఉండే పూర్వ సంస్కారాలే వాసనలు. అవి మనస్సును ప్రేరేపిస్తుంటాయి. అంచేత మనస్సు ఏకాగ్రతను పొందలేదు. శుభ వాసనలు పెంపు చేసుకోడం వల్ల మలిన వాసనలు నశిస్తాయని చెబుతారు. వాసనా క్షయానికి ముందు ముఖ్యంగా జిహ్వ, ఉపస్థ( జననేన్ద్రియం) లను జయిస్తే, మిగిలిన ఇంద్రియాలన్నీ జయించ బడుతాయని విజ్ఞులంటారు. ఇంద్రియాలను జయిస్తే మనస్సు వశమవుతుంది. తీవ్ర వైరాగ్యం వల్ల వాసనలు నశిస్తాయి. వాసనాక్షయమైన మనస్సు శుద్ధసత్వమై వృత్తి రూపాన్ని పొందదు. అదే మనోనాశనమంటే. శుభవాసనలను పోషించాలంటే సజ్జన సాంగత్యము , బ్రహ్మచర్యము, మౌనం పాటించడం, మనస్సును ఇంద్రియ విషయాలపైకి పోనీయకుండా ఉంచడం మొదలైనవి ఉపకరిస్తాయి. వాసనలే మనస్సును ఇంద్రియ విషయాల పైకి ప్రేరేపిస్తుంటాయి. వాసనాక్షయం వల్ల చిత్తవృత్తులు నిరోధించ బడతాయి. అంచేత మలిన వాసనలు ఉదయించేటపుడే వాటిని త్రుంచేసి, శుభ వాసనలతో మార్చగల్గే నేర్పును సంపాదించాలి. ఈ నేర్పు ఎరుకను అభ్యాసం చెయ్యడం వల్ల పొందవచ్చును. ఈ అభ్యాసం సూక్ష్మమైనది. దీనికి ధ్యానం మరింత దోహద పడుతుంది.   వాసనాక్షయ మనోనాశములు ద్వంద్వంగా ఏర్పడి ఒకదాన్ని మరొకటి పోషించుకుంటాయి. అంచేత వీటిని చిరకాలం అభ్య సించాలని, రెండిటినీ ఒకే సారి అభ్యాసం చేస్తేనే ఇవి పూర్తిగా దగ్ధమవుతాయని అంటారు.

2) వాసనాక్షయ తత్వజ్ఞానములు;
వాసనాబీజాలు నశిస్తే తత్వ జ్ఞానం కలుగుతుందని శృతి చెబుతోంది. చిత్తము అనేక జన్మల నుండి ఆర్జించుకున్న వాసనలచేత నిండి ఉంది. అంచేత సర్వ వ్యాపకమైన బ్రహ్మము చిత్తములో ప్రకాశించడం లేదు. వాసనలను క్షీణింపజేస్తే, మనస్సు యొక్క చంచలత్వం పోయి, నిర్మలమై అత్మాకారాన్ని పొంది ఉంటుంది. మనస్సెంత  ఎంతగా అంతర్ముఖ మవువుతుందో, అంతంతగా బాహ్య వాసనలను వదలటం జరుగుతుంది. వాసనలు పూర్తిగా నశించినపుడు, ప్రతి బంధకాలు తొలగి ఆత్మానుభవం కలుగుతుందని శాస్త్రం చెబుతోంది.  వాసనాక్షయం వల్ల మనస్సు శుద్ధమై, తత్వజ్ఞానం కలుగుతుందని చెప్పబడింది. తత్వజ్ఞానం వల్ల మనస్సు విషయాల వేపు పోకుండా నిగ్రహించబడి, సర్వమూ బ్రహ్మముగానే చూడబడుతుంది. హృదయ గ్రంధి భేదించ బడి , అంతఃకరణంలో వాసనలు నశిస్తాయి.
  
3) మనోనాశ తత్వజ్ఞానములు;
ముందు తాత్కాలికంగా మనోనాశం కల్గి తత్వజ్ఞానం పొందిన తత్వజ్ఞానికి మనోనిగ్రహం  సులభమవుతుంది. అదే తత్వజ్ఞానం లేని వానికి తాత్కాలికంగా మనోనిగ్రహం కల్గినా అది స్థిరంగా ఉండదు. అంచేత మనోనాశమును, తత్వ జ్ఞానమును ఒకే కాలంలో అభ్యసించాలని చెప్పబడింది. మనోనిగ్రహమంటే, మనస్సు ఏ సంకల్పమూ చెయ్యకుండా ఉండటం. మనస్సు శుద్ధమై వృత్తి రూపం చెందక ఏకాగ్రమై, సంకల్ప వికల్పములు లేనపుడది నశించినదని చెప్తారు. మనస్సే ద్వైత ప్రపంచానికి కారణం. మనస్సు నశించడం చేత ద్వైతం కూడ ఉండదు. అపుడిక అద్వైత బ్రహ్మమే మిగిలి ఉంటుంది. అంచేతనే మనోనాశం వల్ల తత్వజ్ఞానము, తత్వజ్ఞానం వల్ల మనోనాశము కలుగుతాయని చెబుతారు.
  
తత్వజ్ఞానం కల్గినపుడే విదేహముక్తునకు, తాత్కాలికంగా వాసనాక్షయ మనోనాశాలు కలుగుతాయి. కాని అవి తాత్కాలికమే కాబట్టి తిరిగి ఎపుడైనా తలెత్త వచ్చు. మొదట కల్గిన తత్వజ్ఞానాన్నికాపాడుకోడానికి  వాసనాక్షయ మనోనాశనాలను పూర్తిగా సాధించాలి. దానికోసం జ్ఞానభూమికలలో నాల్గవ భూమిక సాధించిన జ్ఞాని మిగిలిన భూమికలనూ సాధించడానికి కృషి చేస్తాడు. కోర్కెలు లేని మనస్సు శుద్ధం అనీ , కోర్కెలతో  ఉండే మనస్సు మలినమని అంటారు. సంసార బంధానికి గాని , విముక్తిని కలిగించడానికి గాని మనస్సే కారణం అని చెబుతారు.