Tuesday, June 12, 2012

యోగదర్శనం (1) – ఆస్తిక దర్శనం

కపిల ముని బోధించినది నిరీశ్వర సాంఖ్యం అయితే యోగాచార్యుడైన పతంజలి ఇరువది నాలుగు తత్వాలతోను, ఈశ్వరుడిని కూడా అంగీకరిస్తాడు. సాంఖ్య దర్శనం జ్ఞానాన్ని ముఖ్యంగా బోధిస్తే , ఈ వివేక జ్ఞానం కలగడానికి సాధనాలను యోగ దర్శనం ప్రతిపాదిస్తుంది. చిత్తంలో ఎప్పుడూ ఏవో భావాలు కల్గుతూనే ఉంటాయి. వాటిని చిత్తవృత్తులు అంటారు. ఆ చిత్తవృత్తులను పూర్తిగా అరికట్టడమే యోగం. యోగాన్ని సాధించడానికి అవసరమైన యమ నియమాలనే సాధనాలను యోగ దర్శనం బోధిస్తుంది. వైరాగ్యం మొదలైన వాటి ద్వారా చిత్తాన్ని శుద్ది చేసుకొని , ఏదొక వస్తువు  గాని, రూపం మీద గాని చిత్తాన్ని స్థిరంగా నిలపడం చేత చిత్త వృత్తులు అరికట్టబడతాయి. ఇలా ధ్యానం చెయ్యడానికి పరమేశ్వరునిపై చిత్తం నిలిపి యోగాన్ని సాధిస్తే ముక్తి లభిస్తుందని యోగ దర్శనం చెబుతుంది.

ప్రతీ వస్తువూ లేక విషయమూ సృష్టిలో అణువుల తోనే ఏర్పడింది. తిరిగి ఆ అణువులలోనే లయమవ్వాలి. అలాగే ప్రతీదీకూడా తిరిగి మార్పుచెందేదే. ఈ నియమం బాహ్య ప్రకృతిలోనే గాకుండా అంతర ప్రకృతిలోనూ ఉండేదే. మనస్సుకూడా దేన్లోనుంచి పుట్టిందో తిరిగి దాన్లోనే లయమవుతుంది. అదేవిధంగా మనకు మూలం పరమాత్మ కాబట్టి మనం కొరుకున్నా,కోరుకోకపోయినా ఈశ్వరుడు అనే మన సహజ స్థితిని పొందక తప్పదు.

మనసెపుడూ తన సహజశుద్దావస్తను చేరడానికి ప్రయత్నిస్తుంటుంది. కాని ఇంద్రియాలు దాన్ని బయటకు లాగుతూ ఉంటాయి.  మనస్సును నిగ్రహించి ఆత్మలో లయం చేసి అంతర్ముఖం చెయ్యడం యోగానికి మొదటి మెట్టు. ఇలా ప్రశాంతమైన మనస్సున్నపుడు మనం అత్మస్వరూపులమై ఉంటాం. ఈ యోగావస్థలో; తనస్వరూపంలో పురుషుడు సాక్షిగా ఉంటాడు. ఇతర సమయాలలో మనో వృత్తులతో సమాన స్వరూపాన్ని పొంది ఉంటాడు.

చిత్తానికి - క్షిప్త౦, మూఢ౦   , విక్షిప్త౦, ఏకాగ్ర౦ , నిరుద్ధ౦  అని అయిదు స్థితులున్నాయి. క్షిప్త స్థితిలో మనస్సు బహిర్ముఖమై ఒక దాని పిదప మరొకటి , ఇలా  అనేక విషయాలపై ప్రసరిస్తుంది.మూడావస్థలో  నిర్లిప్తంగా జడమై ఉంటుంది. విక్షిప్త అవస్థలో ఒకోసారి నిలకడగాను, మరోసారి నిలకడలేకను ఉంటూ అది బాహ్యవిషయాలనుంచి ఉపసంహరించుకొనే ప్రయత్నంలో ఉంటుంది.అందుచేత క్షిప్త, మూఢ  , విక్షిప్త అవస్థల్లో రజో, తమో గుణాల్లో చిక్కుకొని ఉండటం వల్ల యోగం సాధ్యం అవ్వదు.అభ్యాసం చేస్తూ ఉండగా సత్వగుణం మిగిలిన వాటికన్నా అధికమైనపుడు మనస్సు  ఒకే  విషయంపై ఏకాగ్రమవుతుంది. నిరుద్ధావస్థలో - మనస్సు ఏ విషయం మీదా గాకుండా తనలోనే లీనమై ఉంటుంది. మనస్సు తన ఆధీనంలోనే ఉంటుంది. ఏకాగ్ర స్థితినుంచి సమాధి స్థితికి కొనిపోయే స్థితే నిరుద్ధావస్థ. అదే ముక్తి లేక కైవల్యం.

చిత్తంలో ఎప్పుడూ ఏవో భావాలు కల్గుతూనే ఉంటాయి. ఇవి జ్ఞానేంద్రియాలు తెచ్చే విషయాల వల్ల కల్గుతాయి. వీటిని చిత్తవృత్తులు అంటారు. ఈ చిత్త వృత్తులను  ప్రమాణము , విపర్యయము , వికల్పము, నిద్ర, స్మృతి అని అయిదు విధాలుగా విభజించ బడ్డాయి.
ప్రమాణం - ఇంద్రియ విషయాల్లో మనకు కలిగే రెండు ప్రత్యక్ష అనుభవాలు పరస్పరమూ విరుద్ధం కాకపోతే , దాన్ని ప్రత్యక్ష ప్రమాణంగా అంగీకరిస్తాం.  ప్రమాణం మళ్ళీ ప్రతక్షము, అనుమానము, ఆప్తవాక్యము అని మూడు రకాలు. మనకు ఏర్పడే విషయానుభవంలో భ్రమకు తావు లేనపుడు అది ప్రత్యక్ష ప్రమాణం.

దూరంగా మనకు కన్పించే పొగను చూసి, అక్కడ అగ్ని/ నిప్పు ఉందని గ్రహించడం వంటి జ్ఞానాన్ని అనుమాన ప్రమాణం అంటాం.

తత్వ దర్శులైన యోగుల ప్రత్యక్ష అనుభవమే ఆప్త వాక్యం.

విపర్యయం - లేనివస్తువు రూపంలో అది ఉన్నట్లు కల్గే మిధ్యా జ్ఞానమే విపర్యయ వృత్తి.  ఉదాహరణకు ముత్యపు చిప్పను చూచి అది వెండి అని భ్రాంతి  చెందటం వంటి జ్ఞానం.

వికల్పం - ఒక శబ్దం వినిపించింది అని అనుకుందాం. అది వినిపించగానే ఆ శబ్దం ఏమై ఉంటుందా అని ఆలోచించకుండా  ఫలానాది అని వెంటనే ఒక నిశ్చయానికి వచ్చేస్తాం.  ఇది శబ్ద జ్ఞానంతో అనుసరించే వృత్తి వికల్పం. ఇది చిత్త దౌర్బల్యానికి లక్షణం. వికల్పం అంటే ఇది.

నిద్రావృత్తి - ఇది తమోగుణ లక్షణం. నిద్రించినపుడు చిత్త వృత్తులు లేకపోతే ఎలాంటి   అనుకూల/ప్రతికూల  అనుభవాలూ కలుగవు. కాని నిద్రనుండి లేచిన తర్వాత 'నేను నిద్రించాను' అనే జ్ఞానం మనకు ఉంటుంది. ఆ నిద్రానుభవం స్మరణ మాత్రమే .  కలగని అనుభవాలని స్మరించడం కూడా కుదరదు. కాని నిద్రించాను అనే స్మృతి మనకు ఉంటుంది. అంచేత నిద్రావస్థలో  కూడ చిత్తంలో వృత్తులు ఉంటాయి. నిద్రావృత్తి అభావాన్ని ఆశ్రయించి ఉంటుంది. స్మృతి కూడ మరో చిత్త వృత్తే.

స్మృతి - ప్రమాణాల వల్ల అనుభవించిన విషయాలు జ్ఞాపకం రావడం స్మృతి వృత్తి.
నిద్ర అనే విచిత్ర వృత్తివల్ల చిత్తంలో స్మృతి వృత్తి కల్గుతుంది. అదే స్వప్నం. జాగ్రదావస్థలో స్మృతి వృత్తే నిద్రలో స్వప్నంగా రూపు దిద్దుకుంటుంది. 



Monday, June 11, 2012

సాంఖ్యదర్శనం (3) - ఆస్తిక దర్శనం

ఆత్మలు అనేకం విడివిడిగా ఉంటాయి. అలాగే ఉపాధి  భేదాన్నిబట్టి జీవులు/పురుషులూ అనేకులు ఉంటారు. సృష్టించబడిన జగత్తూ, పురుషుడూ  త్రిగుణాల చేతనే  ముడివేయబడుతున్నారు . ప్రకృతికి కారణం లేదు. అదే విషయాలకు కారణమవుతోంది. ఈ  ప్రకృతి విషయాలు అనుభవించడానికి ఉండే తెలివిగల  వాడు-పురుషుడు/జీవుడు. కనబడే జగత్తు / విషయాలు - తెలుసుకోవలసినవి . అదే  ప్రకృతి. పురుషుని ప్రేరణ వల్లనే అది క్రమాభి వృద్ది చెందుతూ వికసిస్తుంది.

అహంకారం యొక్క పనులన్నిటినీ మనస్సు  కర్మేంద్రియాలద్వారా జరుపుతుంది. నేను అని అహంకరించే జీవుడికీ, ఇంద్రియాలకూ మధ్య వారధి బుద్ది. ఇంద్రియాలనుంచి తెచ్చిన విషయాలను మనస్సు బుద్ధి ముందు ఉంచితే ; బుద్ధి ఆ ప్రకృతి సంబంధమైన విషయాలను పురుషునిముందు ఉంచుతుంది. బుద్ధికి ఈ విషయాలకూ, పురుషునికీ మధ్య ఉండే తారతమ్యాన్ని విచక్షణ చేయ్యగలదు. ఇలాంటి విచక్షణా జ్ఞానం పురుషుని చైతన్యం వల్లనే కల్గుతుంది . అంచేతనే బుద్ధికి నిజంగా విచక్షణా జ్ఞానం లేకపోయినా పురుషుని చైతన్యం వల్లనే ఆ విచక్షణా జ్ఞానం  ఉన్నట్లు కనబడుతోంది. ఇలా ప్రకృతి, ప్రకృతి విషయమైన బుద్ది పురుషుని చైతన్యం తో ప్రకాశిస్తున్నాయి.  ఇలా ప్రకృతి విషయాలతో తాదాత్మ్యం చెందటం వల్ల జీవుడు  అవిద్యచేత కప్పబడినవాడై ప్రకృతి, పురుషుల వివక్షత కోల్పోవడం జరుగుతుంది.

ప్రకృతియొక్క ఉత్పత్తి విషయాలనూ , వస్తువులనూ అనుభవం పొందడానికి కావలసిన బుద్ధి- చైతన్యం, పురుషునిలోనే ఉంది. ఈ త్రిగుణాల తోనున్న విషయాలు, శరీరము, ఇంద్రియాలు,మనస్సు నేను అనుకునే వాని అనుభవానికే. పురుషుడు త్రిగుణా తీతుడు, అన్ని విషయాలకూ సాక్షి. ప్రకృతి, పురుషుడు విభిన్నమైన వారు. ప్రకృతికి  - చైతన్యం లేదు. జడమైనది , త్రిగుణాత్మక మైనది , మార్పు చెందేది , సృష్టి కార్యంలో చురుకుగా పాల్గొనేది , బాహ్యంగా కనబడేది, తెలియబడేది. పురుషుడు - చైతన్యం గలవాడు, నిర్గుణుడు, మార్పు లేనివాడు , అకర్త , సాక్షి మాత్రుడు , తెలుసుకొనేవాడు.

నిజానికి జీవుడికి బంధం లేదు. ప్రకృతికే జీవులతో బంధం. పురుషుడు మంచీ చెడుల విచక్షణ లేక సుఖ దుఖానుభవాలకు లోనవుతూ ; సంసార బంధాన్నుంచి బయట పడటానికి తప్పనిసరిగా  ప్రకృతితో సంబంధ పడతాడు. ప్రకృతి కూడా అనుభవించతగే విషయాలను  జగత్తులో  సృష్టించి , అనుభ వించేవాడి కోసం ఎదురు చూస్తుంది. ఇలా ప్రధానం పురుషుని రూపంలో అనుభవించే వాడికోసం ఎదురు చూస్తుంటే; పురుషుడు బంధ విముక్తికోసం తపిస్తాడు.పరస్పరమూ ప్రధానానికీ, పురుషునికీ ఆశలు ఉండటం వల్ల ఒకరికొకరు ఎదురు చూస్తుంటారు. పురుషుడు ఆకర్త అవడంవల్ల కుంటి వాని గాను, ప్రకృతి అచేతనమవడం వల్ల గుడ్డివానిగాను పరిగణిస్తూ; సాంఖ్యులు  ప్రకృతి పురుషుల సంబంధం ఏర్పడటానికి కారణంగా ఒక చిన్న కధ చెబుతారు.

కొంతమంది కలసి ఒక యాత్రకు బయలుదేరి వెడతారు. వారిలో ఒక కుంటివాడు, ఒక గ్రుడ్డివాడు కూడా యాత్రలో ప్రయాణం సాగిస్తున్నారు. మార్గమధ్యంలో అనుకోకుండా జరిగిన ప్రకృతి వైపరీత్యం  వల్ల, ఎవరికి వారు చెదురుమదురై పోయారు. అలా  కొన్ని రోజుల తర్వాత అదృష్టం కొద్దీ ఆ కుంటివాడూ, గ్రుడ్డివాడూ కలవడం సంభవిస్తుంది. కుంటివాడు నడవలేక, గ్రుడ్డివాడు చూడలేక సహాయంకోసం ఆతురుతగా ఎదురు చూస్తుంటారు. అపుడు వీరు ఒకరికొకరు కలుసుకోడంతో వారిలో ఆశలు చిగురిస్తాయి. అలా గమ్యం చేరడానికి గుడ్డివాడిని తన భుజాలపై కూర్చుండ బెట్టుకొని ; కుంటతను మార్గాన్ని చెబుతుంటే , గ్రుడ్డి వాడు ఆ మార్గ దర్శకాలను గ్రహించి, నెమ్మదిగా గమ్యం చేరుకుంటారు. అదే విధంగా ప్రకృతిని గ్రుడ్డిగాను, ఆకర్త అయిన పురుషుని కుంటి వానిగానూ ఉదాహరిస్తూ ; వారి గమ్యం చేరుకోడానికి ఒకరి అవుసరం మరొకరికి ఉంది. సాంఖ్యులు సృష్టికి కారణాన్ని ఇలా సమర్ధిస్తారు. ఇలాంటి పరస్పర సంబంధం చేత సృష్టి కొనసాగుతుంది- ఉదాహరించబడిన కుంటి గ్రుడ్డి వాళ్ళ లాగున.

పురుష సంబంధం చేత ప్రధానం ఉద్ధరించ బడుతుండగా , ప్రధానం యొక్క సంబంధం వల్ల జ్ఞ్ఞానం ద్వారా పురుషుడూ మోక్షం పొంద గల్గు తున్నాడు . నాట్యకత్తె రంగస్థలం పై నాట్యం చేసి అందరినీ అలరించి తెర వెనుకకుపోయి ఎలా  మరుగై పోతుందో ; అలా ప్రకృతి కూడా పురుషునికి తనను ప్రదర్శించు కొంటుంది . తన సోయగాలన్నీ పురుషుడు చూశాడనే ఎరుక ఎపుడు కల్గుతుందో , ఆపుడిక పురుషుడి ముందు ఏ ప్రదర్శనా తిరిగి చెయ్యదు. సత్యం తెలిసిన పురుషుని  ప్రకృతి ఏవిధంగాను మోహింప చేయలేదు.
లింగ శరీరం /సూక్ష్మ శరీరం అనేది ఒక భౌతిక దేహాన్నుంచి మరొక దేహానికి జన్మ పరంపరలలో కొనసాగేది. గడచిన జన్మలలో చేసుకున్న కర్మల ముద్రలు  సూక్ష్మ శరీరంలో గుర్తుగా  నిబిడీకృతం అయివుంటాయి. లింగ శరీరం భౌతిక దేహంతో ఉంటె జన్మ. విడిపోతే మరణం. పురుషుడిని  తెలుసుకుంటే లింగ శరీరం పతనమవుతుంది. జీవుడు ప్రకృతిని తెలుసుకొని కైవల్యం పొందుతాడు. సృష్టి లయమవడంలో  అన్నీ ప్రకృతిలోనే లయమై పోతాయి. ప్రతీది కారణంలో కలిసిపోతుంది. నీరు అగ్నిలోను, అగ్ని వాయువందూ, వాయువు ఆకాశమందూ, ఆకాశం అహంకారంలోను, అహంకారం మహత్తు లోనూ , మహత్తు ప్రధానం లోనూ లీనం అవుతాయి. ఇలా సృష్టి, స్థితి, లయాలకు ఆది అంతమూ అనేవి లేవు.

పురుషుడిని ప్రకృతి బంధాలనుంచి విడిపించడమే సాంఖ్యసిద్ధాంతం. ఇరవైనాలుగు సత్యాలనూ పూర్తిగా తెలుసుకొని; పురుషుడు వాటితో బద్ధుడు కాడు అనే జ్ఞానం వల్ల  అది మోక్షం కల్గిస్తుంది . ఆత్మ బద్ధుడు కాదు. స్వతంత్రుడూ కాదు. జనన మరణ చక్రంలో బంధింప బడనూ లేదు. ప్రకృతియే జనన మరణాలను పొందేది. ప్రకృతి యొక్క చేష్టలన్నీ ఆత్మను లేక పురుషుని బంధవిముక్తుడిని చెయ్యడంకోసమే. ప్రకృతి క్రియలన్నీ అత్మానుభావానికే.  ప్రకృతి జీవుని చెయ్యి పట్టుకొని ప్రపంచాన్ని చూపిస్తుంది. అందలి విషయాలన్నిటినీ అనుభవింప జేస్తుంది. చివరకు జీవుడిని బంధం నుంచి, విడివడటానికి దోహదం చేస్తుంది.

సాంఖ్యులు ప్రత్యక్ష, అనుమానాది ప్రమాణాల వల్ల ఉన్న వస్తువును తెలుసుకోవచ్చు అంటారు. అనుమానా ప్రమాణం చేత కార్యాన్ని బట్టి కారణం ఊహిస్తారు. సాంఖ్యులు పుట్టడానికీ, మోక్షానికీ భగవంతుడు అవసరం లేదనీ ,పురుషుడు తన కర్మ ఫలాలచేతనే పరిపక్వమైనపుడు మోక్షం పొందుతాడని అంటారు. న్యాయ, వైషేశికుల లాగానే , సాంఖ్యులు పదార్ధం యొక్క శాశ్వత ఉనికిని అంగీకరిస్తారు . కాని వీరిది సత్కార్య వాదం. సత్యమైనది అసత్యమైన దాని నుంచి ఆవిర్భ వించదు. అంచేత అసత్యమైనది సత్యమైన దానికి  కారణం కాజాలదు.  కారణం  నిజమవడంవల్ల , కార్యమూ సత్యమే. ఇక్కడ  కారణం అంటే ఉపాదాన కారణం . సత్యం నుంచి సత్యమే పుడుతుంది.

నిజానికి ఏదీ సృష్టించబడలేదు . ఇదివరలో మన అనుభవంలో లేనిది ఇపుడు అనుభవంలోకి వచ్చింది . ఎలాగంటే ఇపుడు తెర తొలగించ బడినదంతే. తెర తొలగగానే ఆవస్తువు/పదార్ధం కనిపించిందంతే. అలాగే కార్యం కారణంలో ఇమిడియే ఉంటుంది.  తెర తొలగించ బడిందంతే. కొత్తగా సృష్టించ బడినదేదీ లేదు. అంచేత  కారణం లాగానే కార్యమూ సత్యమే. ఈశ్వరుడు ఎపుడూ బంధం లేనివాడే. సాంఖ్యులు దైవాన్ని నమ్మక పోయినా వేదం యొక్క ప్రమాణాన్ని అంగీకరిస్తారు. అంచేత వీరిని ఆస్తికులలో చేర్చడం జరిగింది. క్రమంగా ఆస్తిక వాదులూ సాంఖ్యులలోకి  వచ్చారు. వీరిలో ఆస్తికవాదులు క్రమంగా వచ్చారు. ఈశ్వరత్వాన్ని అంగీకరించే సాంఖ్య దర్శనానికి మూల పురుషుడు పతంజలి.


Friday, June 8, 2012

సాంఖ్యదర్శనం (2) - ఆస్తిక దర్శనం

సత్వగుణ ప్రధానమైన అహంకారం నుంచి స్పర్శ, శబ్ద,రస ,రూప,గంధాలనే వాటిని గ్రహించే అయిదు జ్ఞానేంద్రియాలు , వాక్, పాణి, పాద,పాయు, ఉపస్థ లనే అయిదు కర్మేంద్రియాలూ, ఉభాయాత్మకమైన మనస్సు ఏర్పడతాయి. తమః ప్రధానమైన అహంకారం నుంచి పంచ స్థూలభూతాలకూ కారణమైన సూక్ష్మ భూతాలు పుడతాయి. వీటినే భూతతన్మాత్రలు అంటారు. వీటినుంచే స్థూలమహాభూతాలైన అగ్ని, నీరు, ఆకాశం, వాయువు, పృథ్వి  అనే అయిదూ  ఏర్పడతాయి. ఇలా పంచ  జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ భూతతన్మాత్రలు, పంచ మహాభూతములూ మనస్సు, బుద్ది, మహత్తూ ప్రధానంతో కలసి మొత్తం ఇరవైనాలుగు తత్త్వాలను అంగీకరిస్తారు.

భూతజాలమంతా పంచ భూతాలనుంచి పుడుతుంది. ఇలా బ్రహ్మాండము, అందలి లోకాలు , వాటికి తగినట్లు అందలి విషయములు, ఆ విషయాలను అనుభవించడానికి తగిన శరీరాలనూ, పంచీకరణం అనే ప్రక్రియ చేత సృష్టించ బడుచున్నాయి . ఇలా ప్రధానమే తనలో ఉన్న సత్వరజస్తమో గుణాలను ఆలంబనంగా చేసుకొని సృష్టి జరుపుతోంది.

బుద్ధికి పురుషుని చైతన్యం వల్లనే  విచక్షణా జ్ఞానం కలుగు తోంది. ఇలా చైతన్యవంతమైన బుద్ధి, అహంకార రూపంగా రూపు దిద్దుకొని నేను, నాది అనేది ఏర్పడి అవిద్యకు కారణం అవుతుంది. అవిద్యచేత  జీవుడు రాగ ద్వేషాలకు, సుఖ దుఖాలకూ లోనవుతుంటాడు. ఇలా అవిద్యకు లోనైన  జీవుడు కర్మలచేత , జనన మరణాల సంసారమనే చక్రంలో బంధింపబడి  తిరుగుతూ ఉంటాడు. ఇలా, ప్రకృతివిషయాలతో తాదాత్మ్యం చెందటం వల్ల అవిద్యచేత కప్పబడినవాడై  ప్రకృతి, పురుషుల వివక్షత కోల్పోవడం జరుగుతుంది. 

సాంఖ్యులు అంగీకరించే ఇరవైనాలుగు తత్వాలనూ అవగాహన చేసుకుని , తనను ప్రకృతి తత్వాల నుండి వేరుచేసు కోగల్గితే , విచక్షణా జ్ఞానం కల్గి ప్రకృతికంటే  తాను భిన్నుడని తెలుస్తుంది. ప్రకృతి యొక్క సంబంధం తొలగడమే విముక్తి చెందటం. ప్రకృతి సంయోగం బంధమైతే, దాని నుంచి విముక్తి పొందటమే  మోక్షం లేక కైవల్యం.  ప్రతి జీవునిలోను పురుషుడు  నిక్షిప్తమై  ఉన్నాడు. ఆ ఉన్నత పురుషుని స్వభావం; జాగరూకత /ఎరుకతో చూడగలిగితే బంధం తొలగి సత్యం అవగతం అవుతుంది.
సాంఖ్యులు ద్వైతులు. దైవాన్ని అంగీకరించరు. పునర్జన్మలుంటాయి. వీరి కార్య కారణ సిద్ధాంతాన్ని - సత్కార్య వాదం అంటారు. వీరు ప్రాణం  ఇంద్రియాల రూపాంతరం వల్ల కలుగుతుందంటారు. కాని వేదాంతంలో వేరే ప్రాణ తత్వం ఉన్నట్లు చెబుతారు. వీరు దాన్ని అంగీకరించరు.

సాంఖ్యులు చెప్పేదేమంటే - బాధలుంటే మోక్షానికి కావలసిన సాధనలు చెయ్యలేం. వీరి ప్రకారం ఆధ్యాత్మిక, అధిదైవిక, ఆదిభౌతికములని మూడు రకాలైన బాధలను నివారిస్తే , దుఃఖం తొలగిపోతుందని  చెబుతారు. అంచేత వీరు చెప్పే ఇరవై నాలుగు ప్రకృతి తత్వాలనూ తెలిసికోడం వల్ల ఈ మూడు రకాలైన బాధలూ తొలగి మోక్షం పొందవచ్చు. వీరు జీవన్ముక్తినీ, విదేహముక్తినీకూడా అంగీకరిస్తారు. జీవుడు శరీరం ఉండగానే జీవన్ముక్తి వచ్చి, ఇంకా కొన్ని దినాలు ప్రారబ్ద కర్మ పూర్తియ్యేదాక శరీరంతో ఉంటాడు. శరీర పతనానంతరం విదేహముక్తిని  పొందుతాడని  నమ్ముతారు.





Thursday, June 7, 2012

సాంఖ్య దర్శనం (1) ఆస్తిక దర్శనం

సాంఖ్యదర్శనానికి మూలపురుషుడు కపిల ముని. సంఖ్యఅనే పదంనుంచే సాంఖ్యఅనేపేరు వచ్చిందంటారు.
కపిల ముని  సాంఖ్యతత్వానికి  మూలపురుషుడైనా , నాల్గవ శతాబ్దంలో ఈశ్వరకృష్ణ చే  వ్రాయబడిన సాంఖ్య కారిక - ఈ దర్శనానికి ఆధారమయ్యింది. కపిలుడు మనువు సంతతి వాడు. బ్రహ్మకు మనుమడు , సాక్షాత్ విష్ణువు అవతారమని భగవద్ గీతలో చెప్పబడినది.

సాంఖ్యులు ప్రత్యక్షం, అనుమానం, శబ్దం అనే మూడు ప్రమాణాలని అంగీకరిస్తారు. ఈ ప్రమాణాల చేత, వీరు ప్రకృతినీ  పురుషులను(జీవుడు) మాత్రమే నిత్యాలుగా గ్రహిస్తారు. 
ప్రకృతికి సృష్టికి ముందు నుంచీ  ఉనికి ఉంది.  ప్రకృతి జడమైనదైతే పురుషుడు చైతన్య స్వరూపుడు. 
మనస్సు , దేహము, ఇంద్రియాలకన్న భిన్నమైన వాడు. సాక్షిగా లోక వ్యవహారాలన్నిటినీ చూస్తూంటాడు.  ఆది, అంతమూ లేనివాడు.  ప్రకృతికన్నభిన్నమైన వాడు.  ఏ గుణ విశేషాలూ లేనివాడు.  శుద్ధ స్ఫటికంలా నిర్మల మైనవాడు. స్ఫటికం ముందు ఏ వస్తువు౦చినా దాన్ని ప్రతిబింబి౦ప చేస్తుంది. అలాగే పురుషుడూ నిర్మలుడవడం వల్ల తనముందు ఉండే వస్తువులను ప్రతిబింబింప జేస్తాడు. ప్రకృతి ప్రపంచ వ్యవహారాలు నడుపుతుంటే జీవుడు భోక్తగా అనుభవిస్తూంటాడు. కాని కర్తృత్వం  లేదు.

ఈ జగత్తు యొక్క  సృష్టికి,  ప్రకృతి మూలకారణం. అంచేత దీన్ని మూలప్రకృతి అనీ, ప్రధానం అనీ అనడం జరుగుతోంది. వీరిది  సత్కార్య వాదం . దీన్లో విషయం - శూన్యంనుంచి ఏదీ నిర్మితమవ్వదు. కార్యానికి ముందే అది కారణంలో ఉంటుంది. ప్రతీ విషయమూ  సుఖము, దుఃఖము, నిర్లిప్తతలతో కలసి ఉంటుందనీ, దానికి సత్త్వ,రజస్,తమో గుణాలే కారణంగా చెబుతారు. 

ప్రకృతి సత్వ ,రజస్,తమో గుణాలతో కూడి ఉంటుంది. ఈమూడూ సామ్యావస్థలో ఉన్నపుడు సృష్టి ఉండక స్థిరంగా ఉంటుంది. కర్మానుసారంగా పురుషునికి ఈ ప్రకృతితో సంబంధం ఏర్పడుతుంది. అపుడు  సత్వరజస్తమో గుణాలు వాటి సామ్యావస్థను కోల్పోయి ప్రకృతి  సృష్టికి సన్నద్ధం అవుతుంది. ముందుగా ప్రధానం నుంచి ఈ మూడు గుణాలు పరస్పరము విశిష్టంగా  కలియడం వల్ల మహత్తు / మహత్తత్వం  పుడుతుంది. పురుషుని చైతన్యం జగదుత్పత్తికి బీజమైన మహత్తులో ప్రతిబింబం చెంది చేతనంలా ప్రకాశిస్తుంది. స్వయంగా ప్రకృతి జడమవడం వల్ల అది ప్రకాశవంతం కాదు. పురుషుని వల్లనే అది ప్రకాశవంత మవుతుంది. దాన్ని బుద్ది తత్త్వం అంటారు. ఇది అహంకారంగా మారి నేను, నాది  అనే అభిమానానికి కారణం అవుతుంది. దీనితో (అహంకారంతో) సంబంధపడటం వల్ల పురుషుడు తనే కర్త అనుకుంటాడు. కాని వాస్తవానికి ముందు చెప్పుకున్నట్లు పురుషునికి  భోక్తృత్వమే గాని కర్తృత్వం లేదు.





Wednesday, June 6, 2012

బౌద్ధ దర్శనం (2) నాస్తిక దర్శనం

సమ్యగ్ దృష్టి , సమ్యగ్ సంకల్పం , సమ్యగ్ వాక్కు , సమ్యగ్ కర్మాంతం , 
సమ్యగ్ జీవనం , సమ్యగ్ వ్యాయామం , సమ్యగ్ స్మృతి , సమ్యగ్ సమాధి 
అని చెప్పబడే అష్టాంగమార్గం ద్వారా దుఃఖాన్ని తొలగించుకోవచ్చు. 
ఇక్కడ చెప్పబడిన అష్టాంగమార్గం యోగాచార్యుడైన పతంజలి  అష్టాంగమార్గం కాదు. 
దీనిలో చెప్పిన విషయాలను ఆచరించడంవల్ల మనస్సు ఏకాగ్రమై, ధ్యానస్థితి కల్గి 'నిర్వాణం' లేక మోక్షం అనేది లభిస్తుంది. అపుడిక దుఃఖం ఉండదు.  
బుద్ధుడు తాను గ్రహించిన సత్యాలను ఉపదేశరూపంలో బోధించాడేతప్ప గ్రంధరూపంలో కాదు. 
కాలాంతరంలో బౌద్ధులు అర్ధం చేసుకున్న విధానాన్నిబట్టి , కొన్ని శాఖలుగా రూపుదిద్దుకున్నాయి.

వాటిలో మొదటిది - మానసిక, భౌతిక ప్రపంచాలు  అజ్ఞానంచేత కల్పించ బడ్డాయేగాని,  అవి వాస్తవంగా లేవు. వీరు సర్వమూ శూన్యం అని చెప్పడంవల్ల, దీన్ని శూన్యవాదం అంటారు. దీన్నే మాధ్యమికమతం అనికూడా అంటారు.

రెండవది - బాహ్యప్రపంచం లేదు గాని మానసికభావాలే విజ్ఞానరూపంలో బయట కన్పిస్తుందని వాదించేవారు అవడంవల్ల, విజ్ఞానవాదం లేక యోగాచారమతం అని అనబడుతోంది.

ఇక మూడవది - బాహ్య, మానసిక ప్రపంచాలు రెండూ సత్యమే. బాహ్యప్రపంచం, అంతరంగిక విజ్ఞానం వల్ల ,  మనం  ఎదుట ప్రపంచాన్నిఊహిస్తున్నాం. అంచేత బయటి పదార్ధాలన్నీ అనుమేయాలే. ఇలా చెప్పడంవల్ల దీన్ని అనుమేయవాదం లేక సౌత్రాంతికమతం అంటారు. 

ఇక నాల్గవది - వైభాషిక మతం . దీన్లో బాహ్య , మానసిక ప్రపంచాలు రెండూ సత్యమే. అనుమేయం కాదు. అంచేత దీన్ని బాహ్య ప్రత్యక్షవాదం అంటారు.

మళ్ళీ, వీరిసిద్ధాంతాలనూ, ఆచారవ్యవహారాలను బట్టి, మాధ్యమిక , యోగాచారమతాలవారిని హీనయానమనీ , సౌత్రాంతిక వైభాషిక  వాదులను మహాయానం అనీ రెండు శాఖలుగా  బౌద్ధం ప్రచారంలోకి వచ్చింది.  
బుద్ధుడు  దుఃఖనివారణకు ఉపకరించని వాటిని గురించి మౌనం వహించడంవల్ల , ఈ ప్రపంచం అనేదాన్లో భిన్నాభిప్రాయాలు తరువాతి వారిలో  వచ్చాయి. 
మౌలికంగా బుద్ధుడు  బోధించిన విషయాలలో భేదంలేదు. 
బౌద్ధులు అనాత్మవాదులు. దైవాన్ని అంగీకరించక, తమ స్వప్రయత్నం మీదనే మోక్షం పొందటం జరుగుతుందని నమ్ముతారు. ప్రతీ కార్యానికీ ఒక కారణమనేది ఉంటుందని చెబుతారు. కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. పునర్జన్మలు వాంఛలవల్ల కలుగుతాయని చెబుతారు. ఇదీ సంక్షిప్తంగా బౌద్ధం. 





Tuesday, June 5, 2012

బౌద్ధ దర్శనం (1) - నాస్తిక దర్శనం

బౌద్ధ దర్శనానికి గౌతమ బుద్ధుడు మూలపురుషుడు. 
తన చుట్టూఉన్న పరిసరాలను చూసినపుడు , తనకు ఎదురుపడిన సంఘటనలైన ముసలితనము, వ్యాధులు, మరణము మొదలైనవాటిని ఎవరూ తప్పించుకోలేరని గ్రహించి, వీరు, వీరి కుటుంబీకులు పడే దుఃఖానికి చలించిపోయాడు. ఈ దుఃఖాన్ని నివారించడానికి మార్గాలను అన్వేషించ సాగేడు. 
ఎంతోమంది మహాపురుషులను ఆశ్రయించినా; సరైన సమాధానం లభించలేదు. 
అన్వేషణలో భాగంగా సుదీర్ఘమైన తపస్సుచేసి, దుఃఖానికి నివారణోపాయాన్ని కనుగొన్నాడు. 
అవి నాలుగు సత్యాలుగా ప్రచారంలోకి వచ్చాయి.

మొదటి సత్యం - ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది. ఈ దుఃఖం పైపైకి కన్పించేది మాత్రమే కాదనీ , అంతటా సంసారంలో  స్థిరంగా పాతుకుపోయి ఉందనీ, సుఖాలుగా కన్పించే విషయాల్లోనూ అంతర్గతంగా దుఃఖంఉందని, బుద్ధుడు కనుగొన్న మొదటిసత్యం. 

ఇక రెండవ సత్యం - ఈ దుఃఖానికి కారణం ఉంది. విషయవాంఛ/ లేక తృష్ణ అనేది దుఃఖానికి కారణం. ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఉండే స్థిరమైనపదార్ధం గాని, వస్తువుగాని, విషయం అనేదిగాని లేదు. ప్రతీ వస్తువు మార్పుచెందే స్వభావం కలిగినదే. కాని మనం ప్రతివిషయంలోనూ స్థిరత్వాన్ని కోరుకుంటాం. అందుచేత దుఃఖానికి లోనవుతూ ఉంటాం. ఆలోచించి చూస్తే దుఃఖముకూడా ఎప్పటికీ ఉండదు. ఈ ప్రపంచంలో పుట్టడమే దుఃఖానికి కారణం. ఇలా తిరిగితిరిగి పుట్టడానికి విషయ వాంఛలే కారణం. ఇది అజ్ఞానంవల్ల ఏర్పడుతుంది. 

ఇక మూడవ సత్యం - ఈ దుఃఖాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు. దుఃఖకారణాన్ని తొలగిస్తే దుఃఖం పోతుంది. అజ్ఞానాన్ని తొలగించుకొని  నిర్వాణం  పొందటంవల్ల దుఃఖం పూర్తిగా నశిస్తుంది . 

ఇక నాల్గవ సత్యం - దుఃఖానికిగల కారణాన్ని తొలగించుకోడానికి మార్గం ఉంది.


       

Monday, June 4, 2012

జైన దర్శనం - నాస్తిక దర్శనం


జైనదర్శనానికి వ్యవస్థాపకుడు రిషభ దేవుడు. జైనులు ప్రత్యక్షప్రమాణంతోబాటు అనుమాన , శబ్ద ప్రమాణాలను అంగీకరిస్తారు. దూరంగా కన్పించే పొగనుచూచి,  అక్కడ అగ్నిఉందని ఊహించడం లాగ, ఒక కారణాన్నిబట్టి మరొక వస్తువును ఊహించడాన్ని అనుమానప్రమాణం అంటాం. ఆప్తులు చెప్పిన మాటలను శబ్దప్రమాణంగా పరిగణిస్తాం. మహిమాన్వితులైన తీర్థా౦కరుల ఉపదేశాలు శబ్ద ప్రమాణంలోకి  వస్తాయి. ప్రయత్నంతో తీవ్రమైన తపస్సు, ధ్యానముచేసి, సుఖదుఃఖాలను, రాగ ద్వేషాలను జయించి, ప్రశాంతచిత్తంతో తమ ఆత్మగమ్యాన్నిచేరిన వారిని  తీర్థా౦కరులని అంటారు. వీరిని, మానవరూపంలో ఉన్న భగవంతునిగా భావించి  దైవశక్తులు ఉన్నట్లుగా పూజిస్తారు. మహావీరుడు జైనధర్మంలో ఇరువది నాల్గవ తీర్థా౦కరుడు .

వీరు దైవాన్ని  అంగీకరించరు. పంచమహాభూతాలతోబాటు కాలము, ధర్మము, అధర్మము అనే తత్వాలను కూడా అంగీకరిస్తారు. చలనానికి ఉపకరించేది ధర్మము, స్థితికి ఉపకరించేది అధర్మంగాను పరిగణిస్తారు. ఎన్నిశరీరాలుంటే అన్నిజీవాత్మలు ఉన్నాయని చెబుతారు. వివిధజీవుల్లో వాటికుండే జ్ఞానేంద్రియాలనుబట్టి జ్ఞానంలో తేడాలు ఉంటాయని చెబుతారు. తరులతాదులలో ఒక జ్ఞానేంద్రియం ఉంటే,  జీవుల పరిణామక్రమంలో కొన్నిటికి రెండు జ్ఞానేంద్రియాలు , కొన్నిటికి మూడు,  కొన్నిటికి నాల్గు, మరికొన్నిటికి అయిదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి. 

అన్నిజీవులకూ ఆనందము, సర్వజ్ఞత్వము పొందటానికి సామర్ధ్యం ఉంటుందని నమ్ముతారు. కాని ఆ సామర్ధ్యం కర్మబంధంచేత ఆవరించబడి ఉంటుంది. చేసే కర్మలవల్ల జీవులకు అచేతన పదార్థంతో సంబంధం ఏర్పడి, తమ సహజమైన సర్వజ్ఞత్వం మరుగున పడిపోవడం జరుగుతుంది. ఏజీవి అయినా స్వప్రయత్నంచేత, ఈ కర్మబంధాన్ని తొలగించుకొని తమ సహజత్వాన్ని పొందగల్గుతుంది.

 కర్మబంధాన్ని  సమ్యగ్ దర్శనం, సమ్యగ్ జ్ఞానం , సమ్యగ్ చరిత్రం అనే రత్నత్రయం ద్వారా తొలగించుకోవచ్చునని  అంటారు. తీర్థా౦కరుల ఉపదేశాలపై విశ్వాసం కలిగి ఉండటాన్ని సమ్యగ్ దర్శనం అంటారు. ఈ సమ్యగ్ దర్శనంచేత క్రమంగా  అజ్ఞానంపోగా కలిగే తత్వజ్ఞానానికి,  సమ్యగ్ జ్ఞానం అని పేరు. వీటితోబాటు  సత్యము, అహింస, అస్తేయము, బ్రహ్మచర్యము, వైరాగ్యము కలిపి సమ్యగ్ చరిత్ర  అనే అయిదు సదాచారాలను ఆచరిస్తే క్రమంగా క్రోధం, మానం, లోభం, మాయ అనే వికారాలు నశించి కర్మబంధం తొలగడానికి వీలవుతుంది. అపుడు తమ సహజమైన సర్వజ్ఞత్వము, సర్వ శక్తిమంతత్వమూ పొందుతారు. దీన్నే వీరు మోక్షం అని పిలుస్తారు.

 ఎలాంటి చిన్న జీవులనైనా దయతో చూడాలనేది వీరిసిద్ధాంతం. పరమత సహనానికి వీరు పెట్టింది పేరు. దీనికి వీరి స్యాద్వాదం ఎంతో ఉపకరించింది. ఒక సమయంలో కొన్ని పరిస్థితులలో ఒక వస్తువును ఒకదృష్టి కోణంతోచూస్తే ఒకవిధంగాను, అదేవస్తువు మరొక సమయంలో వేరేపరిస్థితులలో వేరే దృష్టికోణంతోచూస్తే మరొక విధంగాను కనపడవచ్చు. ఈ సత్యాన్నిబట్టి జైనులు సప్తభంగీనయం అనే స్యాద్వాదాన్ని అంగీకరించారు. వీరు పునర్జన్మలను, పాపపుణ్యాలను, స్వర్గనరకాలను అంగీకరిస్తారు. కాలక్రమేణా భగవాన్ మహావీరుని మరణంతర్వాత జైనధర్మం దిగంబరులనీ, స్వేతాంబరులనీ రెండుశాఖలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి.

సప్తభంగీనయం

స్యాదస్తి - అంటే, ఉండవచ్చును. స్యాన్నాస్తి  అంటే లేకపోవచ్చును. స్యాదస్తిచ నాస్తిచ అంటే ఉండవచ్చును , లేకపోవచ్చును కూడా . స్యాదవక్తవ్యం అంటే వర్ణించ శక్యంగాక పోవచ్చును.  స్యాదస్తిచ  అవ్యక్తవ్యంచ  అంటే ఉండవచ్చును, వర్ణించ శక్యంగాకపోవచ్చును. స్యాన్నాస్తిచ అవ్యక్తవ్యంచ  అంటే   లేకపోవచ్చును , వర్ణించ శక్యంగాక పోవచ్చును. స్యాదస్తిచ, నాస్తిచ,అవ్యక్తవ్యచ అంటే  ఉండవచ్చును , లేకపోవచ్చును,  వర్ణించ శక్యంగాక పోవచ్చును.