Monday, September 24, 2012

కర్మబంధము - 2

కర్మబంధము-----------------------------------------------
కర్మలు మూడు విధాలు. అవి    
1)  సంచిత కర్మలు - గడచిన జన్మల అనేక కర్మల సముదాయమని చెప్పవచ్చు.  ప్రతీ జీవితం చివరలోనూ మనం చేసిన కర్మలలో కొన్ని,మూటకట్టి దాచబడతాయి. ఇవే మరలా జన్మ ఎత్తడానికి కారణం. వీటిని సంచిత కర్మలంటారు.

2)  ప్రారబ్ద కర్మలు - ఈ శరీరానికి కారణమైన సంచితాలలో కొంత భాగం పక్వానికొచ్చి, ఇప్పుడు అనుభవించడానికి ప్రారబ్దంగా మారతాయి. ఇవి తప్పించుకో లేనట్టివి. మూల్యం  చెల్లించవలసినదే. ఇవి జ్ఞానికీ అజ్ఞానికీ సమానమే. జ్ఞానికి పునర్జన్మ హేతువులైన సంచిత,ఆగామి కర్మలే నశిస్తాయి. ప్రారబ్దాన్ని ఎంతటి వారైనా  అనుభవించి తీరాలనేది కర్మ సిద్ధాంతం.
   
3)  క్రియామాను కర్మలు - వీటినే ఆగామీకర్మలనీ / వర్తమాన కర్మలనీ అంటారు.  ఇవే ఇప్పుడు చేసేవి. మన భవిష్యత్తును నిర్ణయించేవీను. మనం ఇప్పుడు కర్తృత్వ, భోక్త్రుత్వ అభిమానంతో చేసే కర్మలు సంచితంలో చేరి రాబోయే జన్మలో ప్రారబ్దంగా పరిణామం చెందుతాయి.

మనం వద్దు అని అనకున్నా గత కర్మల ఫలితాన్ని అనుభవించడానికి అవుసరమయ్యే పనులు చేసేందుకు మనలో ఆశలను, కోర్కెలను చిగురింప జేస్తాయి. మనం ఈ జన్మలో గతకర్మల ఫలితాల్ని అనుభవిస్తూ భవిష్యత్తులో ఎలాంటి కర్మలు చెయ్యాలో వాట్నిచేసే అధికారం మనకు ఉంది. ఇలా మనం, ఈ జన్మలో గతకర్మల ఫలితాల్ని అనుభవిస్తూ వాటిని తీరుస్తూ, రాబోయే జన్మలో ప్రారబ్దంగా పరిణమించే కర్మలనూ చేస్తాం. అంచేత ఈ రెండూ అంటే సంచితమూ, క్రియామాను కర్మలను విడదీయలేకుండా ఒకదానికొకటి పెనవేసుకునే ఉంటాయి. దీన్లో గమనిస్తే ,  ఏ ప్రయత్నమూ లేకుండా లభించేవి గతజన్మ కర్మల ఫలితంగాను, వేటికోసం ప్రయత్నిస్తామో అవి మన కొత్త కర్మలుగాను అనుకోవచ్చు.

మనం ఏ క్రొత్త కర్మలను చేస్తామో అందులో కొన్నిటిని ప్రతీ జీవితం చివరిలో వేరుగా ఉంచబడతాయి. ఇలా ఒక జీవితంలో కర్మలు చెయ్యకపోవడం అసంభవమే అయినా, మళ్ళీ ఈ  సంచిత కర్మానుసారంగా జన్మను పొందుతాం. ఈ కర్మలే అదృష్టం లేక ప్రారబ్దంగా పరిణామం చెందుతాయి . జీవుడుడు ఇలా కర్మబంధాల నుంచి విముక్తుడు కాడు. కర్మ బంధంలో ఇరుక్కుపోయిన జీవుడు బయట పడటానికి మార్గం తాను కనుక్కోలేక పోతున్నాడు. అంచేత కర్మ మార్గంలో చెప్పబడినట్లు కర్మలు చెయ్యడంలో నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి.  ప్రారంభంలో మానవ జన్మ ఉత్తమ మైనదని చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ జనన మరణాల పరంపర నుండి బయట పడి మోక్షాన్ని పొందటానికి భూమిపైన గల సుమారు  8.4 మిలియన్ల జీవ రాసులలో మానవ జన్మ ద్వారానే సాధ్యం. శరీరమే సాధనం.

ఒక కష్టం వచ్చిందంటే దానివల్ల శారీరకంగాను, మానసికంగాను ఏవిధంగా బాధను ఎదుర్కొన్నామో తెలుసుకోవాలి. ఆ అనుభవం వల్ల, అలాంటి  బాధను ఇంకొక వ్యక్తికి కలుగ చేయకుండా ఉండగలగాలి. అలాంటి బాధతో ఉండే  వ్యక్తులకు  సహాయం చేయడానికి, ఈ అనుభవం మనకు కల్పించబడిన ఒక అవకాశం.  కాని మనం చేస్తున్నదేమిటి?  ప్రతి విషయంలోనూ మన బాధలకు, కష్టాలకూ కారణమైన వ్యక్తులను, పరిస్థితులను, సంఘటనలను కారణంగా చూస్తూ, నిర్ణయం తీసు కొంటున్నాం. ప్రతీకారచర్యలకు పాల్పడుతున్నాం.  మన బాధలకు మూలాన్ని గుర్తించలేక పోవడమే  దానికి దానికి కారణం. అన్నిటికీ మూలమైన కర్మ నేర్పేదాన్ని, నేర్చు కోకపోవడం వల్ల ఇలా జరుగుతోంది.  దాంతో మన స్నేహితుడి లాంటిదైన కర్మ మరొక రూపంలో, మరొక సందర్భంలో  మరొకసారి మన జీవితంలోకి వస్తుంది. మనం నేర్చుకోవలసిన  పాఠాన్ని నేర్చుకోనేదాకా కర్మ మన వెంట వస్తుంటుంది. కాబట్టి తప్పెవరిదో  ఒకరిదిగా నిర్ణయించే పనిని తీసుకోకూడదు. అంతా ఒక పద్ధతి ప్రకారమే జరుగుతోందని, ఆ సత్యం అనుభవ పూర్వకంగా నేర్చుకొంటే మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం. 
 
ఇలా ప్రతీ జన్మలోను మనం పరిణామం చెందుతూ మోక్షాన్ని సాధించటమే గమ్యం. మనం తెలియకుండా చేసే పనులకన్న తెలిసి చేసే పనులకు ఎక్కువ కర్మానుభవం (weightage) ఉంటుంది. అంచేత శుభ సంకల్పాలతో  కర్మానుభవాన్ని, దుఖాన్ని తగ్గించుకోవచ్చు. మనం చెడుకల్గించే కర్మలనే చేస్తాం. ఎందుకంటే మనకు కర్మను గురించి సరిగ్గా తెలియదు గనుక. వేదాంతపరంగా దేవుడు నిష్కారణంగా సుఖాలను గాని దుఃఖాలను గాని ఇవ్వడు. ఎవరికేది ప్రాప్తించాలో అలానే ప్రాప్తించడం జరుగుతుంది. ఏ శరీరంలో మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతామో, అలాంటి జన్మలనే మనం పొందుతాం. కొందరికి ఒకే జన్మలో అనుభవిస్తే, మరికొందరు అనేకమైన జన్మలు దాలిస్తేనే కాని వారి కర్మ తీరడంలేదు. మనం ఇక్కడకు కొన్ని పాఠాలు నేర్చుకోడానికి వచ్చాం. మనం అభివృద్ది చెందాలంటే ఆ పాఠాలను నేర్చుకొని తీరాలి. ఎంత తొందరగా నేర్చుకొంటే, అంత తొందరగాను కర్మ మనలను వీడి పోతుంది. కాని ఎన్ని సంఘటనలు మనకు ఎదురైనా మనం వాటి నుండి నేర్చుకునేది ఉండక దుఖితులమవుతున్నాం.
    
నిజంగా వ్యక్తిగతమైన కర్మ లేదు. మానవ జాతి కర్మ మాత్రమే ఉంది. మనం గాలి పీల్చుకొని  గాలిని వదలుతున్నట్లే , ఆలోచనలని తీసుకొని ఆలోచనలను వదులుతున్నాం. అదే ఆలోచనావరణం అనేది. మానవుడు పదకొండు వేల సంవత్సరాలనుండి వదలిన ఆలోచనలు, అనుభవాలు, ఆశయాలూ ఆలోచనావరణంలో భద్రపరచబడి ఉన్నాయి. అదే మానవ జాతి కర్మ అంటాం. మానవుడు ఈ మానవ జాతి కర్మకు లోబడి ఉన్నాడు. మనలను ప్రపంచంలో ఉంటూనే కర్మఫలాన్ని అనుభవించమని బోధిస్తుంది. జరుగుతున్న సంఘటనలను బాగా అర్ధం చేసుకుంటే అవి మనకిలా దోహదపడుతాయి - మన సుఖ దుఖానుభవాల నుండి మన బలహీనతలను అధిగమించ డానికి, ధనవంతులమైతే నమ్రతను దీనత్వాన్ని అలవరచు కోడానికి ఉపయోగించు కోవాలి. ఈ జన్మలో పురుష ప్రయత్నం బలీయంగా ఉంటే పూర్వ జన్మలో కర్మ ఫలాలను ఓడించ వచ్చునని యోగ వాశిష్టం చెబుతోంది. 


Saturday, September 22, 2012

కర్మబంధము - 1


కర్మబంధము 
కర్మ అంటే పనిచేయటం. ప్రతీ పనీ కర్మే. అంటే మనం మనస్సుతో చేసే సంకల్పం, మాట్లాడే ప్రతీమాటా, శరీరంతో చేసే ప్రతీపనీ కూడ కర్మగానే రూపుదిద్దుకుంటుంది. ఏపనీ చెయ్యకుండా ఎవరూ ఉండలేరు. మనం చేసే ప్రతీ పనికీ ప్రతిచర్య అనేది ఉంటుంది.  కర్మసిద్ధాంతం చర్య, ప్రతిచర్యలకు సంబంధించినది.

ఇప్పుడు నాటిన విత్తనాన్ని ఈ జన్మలోనో, మరు జన్మలోనో  ఫలాన్ని పొందక తప్పదు. నీవు ఏదైనాచేస్తే అదే
నీకు అనేక రెట్లుగా తిరిగి నీజీవితంలోకి వస్తుంది.  ఏవిత్తనం నాటితే, దాని ఫలితమే అనేక రెట్లుగా అనుభవిస్తాం. ఉదాహరణకు  స్నేహితుడి దగ్గరకు వెళ్లి మనం  ఏవిషయం మాట్లాడడానికి ఇష్టపడితే, ఆ విషయం గురించే అతడు  మాట్లాడతాడు. అది స్నేహితుని నిర్ణయం కాదు. మనం కోరుకున్నదాన్నే అతడు మనకు ఇస్తున్నాడు. కర్మ కూడా ఇంతే. ఏవిత్తనాన్ని నాటామో, ఆ పంటను ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఏ విత్తనాన్ని నాటుతామో, ఆపంటను భవిష్యత్తులో అనుభవిస్తాం. ఈరోజు మనం ఉన్న పరిస్థితి, గతంలో చేసిన కర్మల ఫలితమన్నమాట. 

ఈ జన్మయొక్క అనుభవాలు రాబోయే స్థితిగతులను నిర్ణయిస్తాయి. భవిష్యత్తులో ఏమి కాదలచుకున్నామో లేక కాగలమో దాన్ని మన కర్మలూ, ప్రయత్నాలూ నిర్ణయిస్తాయి. ఈవిధంగా  కర్మసిద్ధాంతం క్రియ, ప్రతిక్రియలతో ముడిపడి ఉంది. మనం ఎత్తే ప్రతీజన్మా ముక్తిమార్గంలో పయనించడానికి ఇవ్వబడిన అమూల్యమైన అవకాశం. కర్మ, కోరికనుంచి పుడుతుంది. మొదట్లో ఒకవస్తువు కావాలనే భావన కల్గి, అది ఆశగా మారుతుంది. అప్పుడొక ఆలోచనా కెరటం తలెత్తుతుంది. ఈస్థితిలో మనం గనుక ఒక వ్యతిరేకమైన ఆలోచనా కెరటాన్ని జనింప చేయగల్గితే ఆ ఆశ నశిస్తుంది. అలా చెయ్యలేకపోతే మానస అనే బలమైన కోరికగా మారుతుంది. అది తృష్ణ అనే మహా దాహంగా రూపు చెంది, మనలను ఈ ప్రపంచానికి బందీలను చేస్తుంది. సంసార ప్రగతి, వ్యాపార సఫలత/ వైఫల్యమూ అన్నీ మన కర్మానుసారంగానే జరుగుతాయి.

దేవతారాధన, తీర్థయాత్రలు మొదలైన కార్యాలు ఇహ పరలోకాలలో సుఖాన్ని కల్గిస్తాయి. ఇలాంటి పుణ్యకార్యాలను చేసినందుకు వాటిని అనుభవించడానికి మళ్లీ జన్మను ఎత్తవలసి ఉంటుంది. ఈ పుణ్య  కర్మానుభవ సమయం పూర్తవ్వగానే, మళ్లీ ఈ ప్రపంచంలోనే, మానవ జన్మనెత్త వలసి ఉంటుంది. అదేవిధంగా పాపకార్యాలు చేస్తే, దాని ఫలితమైన దుఖాన్ని అనుభవించాలి. ఇలా పాపపుణ్యాలు రెండూ జనన మరణాలనే సంసార చక్రంలో బంధించేవే. కర్మ బలీయమైనది. మనకున్న స్వతంత్రమంతా పనులను చేసే ముందు వాటిని ఎంపికచేసే అధికారము మాత్రమే. ఆ కర్మల ఫలితాన్ని తప్పక అనుభవించ వలసినదే. మనం ఎంత వద్దనుకున్నా గత కర్మల ఫలితాన్ని అనుభవించటానికి అవుసరమయ్యే పనులుచేయడానికి, మనలో కోరికలు, ఆశలూ అంకురిస్తాయి.



Thursday, September 20, 2012

త్రిగుణాలు - 2


త్రిగుణాలు--------------------------
తమోగుణం
ఒక వస్తువును మరొక వస్తువుగా గ్రహించే ఆవరణ శక్తి తమోగుణం వల్ల కలుగుతుంది. ఇదే జననమరణ రూపమైన సంసారానికి మూల కారణం. ఈ ప్రపంచ వ్యవహారమైన మాయయొక్క విక్షేప శక్తికి ఇదే కారణమవుతోంది. ఎంతటి పండితుడైనా తమోగుణ గ్రస్తుడైనప్పుడు ఒక వస్తువును చూచి దానియందు తాను కల్పించుకొన్న వస్తువే సత్యమని తలుస్తాడు. దాని గుణాలనే ఆశ్రయిస్తాడు. సత్యమది కాదని ఎన్ని విధాలుగా బోధించ ప్రయత్నించినా అతని చెవికి ఎక్కదు. తమోగుణం యొక్క ఆవరణశక్తి అంత బలమైనది.
(మాయ ఆవరణ శక్తి, విక్షేప శక్తి అని రెండు విధములు. విక్షేప శక్తి అంటే – లేని వస్తువును ఉన్నట్లుగా కల్పించటం. ఆవరణ శక్తి అంటే – ఉన్న వస్తువును లేదనుకొనేలా చేసేది).  
అభావన ( అంటే బ్రహ్మము లేదను భావన), విపరీత భావన ( శరీరమే నేను అనే భావన), అసంభావన ( ఏదైనా ఉన్నదని కలిగే సందేహము ), విప్రతిపత్తి (ఉందా , లేదా అనే సంశయ వృత్తి ). ఈ నాలుగూ తమోగుణం యొక్క శక్తులు. ఇవి తమోగుణము యొక్క ఆవరణ శక్తితో సంబంధపడిన వ్యక్తిని విడిచి పెట్టవు. అలాగే విక్షేప శక్తి కూడ మానవుడిని ఎప్పుడూ నిలకడగా ఉండనియ్యదు.
   
తమోగుణము అజ్ఞానమే స్వభావముగా గల్గి నిద్ర, సోమరితనము, పరాకులను కల్గించి దేహిని బంధిస్తుంది. అజ్ఞానము, అలసత్వము, జడత్వము, నిద్ర, ప్రమత్తత , మూఢత్వము తమోగుణ లక్షణములు. దీనివల్ల మానవుడు ఏమీ తెలిసుకోలేడు. ఇది సత్వగుణం ఉన్నవాళ్ళని కూడ భ్రమింప జేస్తుంది. ఈ గుణము పెంపొందితే  కళావిహీనత,  పరాకు,  భ్రమ,  సోమరితనము విపరీత జ్ఞానము కలుగుతాయి. ఈ గుణాధిక్యత ఉండగా మరణిస్తే అధోలోకములందు జంతువులుగా జన్మిస్తుంటారు.
   
తామసిక శ్రద్ధ గలవారు భూత ప్రేతాలను  ఆరాధిస్తారు. ఆహారవిషయమున వండి చల్లారిపోయినది , సరిగా పక్వముకానిదీ, రుచిలేనిదీ, పాసిపోయినది, ఎంగిలిది  అపవిత్రమైన పదార్దములు  తామసునకు ఇష్టము. ఇది సోమరితనం, కోపం మొదలైన చెడు లక్షణాల్ని కల్గ జేస్తుంది. మాంసం, మద్యం, పొగాకు మొదలైన ఘాటైన పదార్ధాలు, మత్తు కల్గించేవి తామసిక ఆహారం లోకి వస్తాయి. డైరీ గ్రుడ్డు నిర్జీవమే అయినా దాన్లో తామసిక ప్రవృత్తి ఉంటుంది.

సత్వగుణం

సత్వగుణము స్వచ్చమైనది నిర్మలముగా ప్రకాశించునది. అయినా రజో తమోగుణాలతో కూడి సంసారబంధానికి కారణమవుతుంది. ఈ సత్వగుణమందు ఆత్మ ప్రతిబింబము చెంది సూర్యునిలా సమస్త జడపదార్దాలనూ ప్రకాశింప జేస్తుంది. యమనియమాదులను, భక్తి , శ్రద్ధ , మోక్షాపేక్ష , దైవీ సంపద, అసత్తయిన దానిని విడవడం అనేవి మిశ్రితమైన సత్వగుణ లక్షణాలు.

ప్రసన్నత, ఆత్మానుభవం, పరమశాంతి, తృప్తి, ప్రహర్షము, పరమాత్మ యందు నిష్ఠ అనేవి, విశుద్ధ సత్వగుణ లక్షణాలు. శుద్ధసత్వగుణం వల్ల ముముక్షువు నిత్యానంద రసాన్ని పొందుతాడు.  ఉపద్రవములు లేనిది. జ్ఞానముచేతను, సుఖములందు ఆసక్తిచేత  దేహిని బంధిస్తుంది. సత్వగుణము వృద్ధిలో ఉన్నపుడు జ్ఞానము కలగుతుంది.  తేజస్సుతో దేహము కాంతివంతముగా ఉంటుంది. సుఖాన్ని జ్ఞానాన్ని కలిగింప జేస్తుంది. జీవరాశులందు కరుణ, మైత్రి కలిగిస్తుంది. త్యాగమును కలిగిస్తుంది. సత్వగుణ పోషణ ముముక్షువునకు అవుసరము.  సత్వగుణము హెచ్చు గా ఉన్నపుడు మరణించిన వాడు, ఉత్తమ జ్ఞానులు పొందే నిర్మలమైన పుణ్య లోకాన్ని పొందుతాడు.  సత్వగుణమునందు శ్రద్ధ ఉండే వాళ్ళు దేవతలను ఆరాధిస్తారు.  

రసవంతములు, చమురు గల్గినవి, చాల కాలమువరకు ఆకలిని కలుగ జేయని  ఆహార పదార్దములు  సాత్వికులు ఇష్ట పడతారు. ఇవి దీర్ఘాయుస్సు , దేహబలము , బుద్ది బలమునూ ఇస్తాయి. ఆరోగ్యాన్ని,  సంతోషాన్నికల్గిస్తాయి.  మనస్సును నిర్మలం చేసి శాంత స్వభావాన్ని కలుగజేసే కూరగాయలు, పళ్ళు , గోరువెచ్చని పాలు, పెరుగు, వెన్న, నెయ్యి , జున్ను, వంటి పాలనుండి తయారైన పదార్దములు, తేనె, బాదం పప్పు, గోధుమలు, పప్పు ధాన్యాలు వంటివి సాత్విక ఆహారంలోకి వస్తాయి. తేలికైన కొద్ది మోతాదులో తీసుకునే వన్నీ సాత్విక ఆహారంలోకి వస్తాయి. ఏ ఫలమూ ఆశించకుండా కర్తవ్యతా బుద్ధితో చేసే పనిని సాత్విక యజ్ఞం అంటారు. 

మన మానసిక ప్రవృత్తి ఈ గుణాల మీదనే ఆధారపడి ఉంటుంది. అందుకే సాత్విక ఆహారం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుందని అంటారు. రజస్తమో గుణాలు మోక్షానికి ప్రతిబంధకాలుగా చెప్పబడ్డాయి. ప్రకృతిని జయించాలంటే రజస్తమో గుణాలను అణగ త్రొక్కి, సత్వగుణం వృద్ది చేసుకోవాలి. ఒక్క ఆహారంలోనే గాకుండా గ్రహించే విషయాల్లోనూ, నివశించే పరిసరాల్లోనూ, మనం కలిసే వ్యక్తులూ సత్వగుణాన్ని వృద్ది చేసుకొనేవిగా ఉండాలని పెద్దలు చెబుతారు.    




Monday, September 17, 2012

త్రిగుణాలు -1


త్రిగుణాలు  
సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే మూడూ త్రిగుణాలుగా చెప్పబడే ప్రకృతి గుణాలు. ప్రకృతిలో ఈ మూడు గుణాలూ  సమతుల్యంగా ఉంటాయి. ఈ మూడు గుణాలలోను హెచ్చు తగ్గులు కల్గినపుడు సృష్టి ఆరంభమవడానికి సంకేతంగా అనుకోవచ్చు.  ప్రకృతి వల్లనే జగత్తు ఏర్పడినప్పుడు, సృష్టిలో ప్రతీ జీవిలోను, పదార్ధంలోనూ ఈ మూడు గుణాలూ ఉంటాయి. ఒక్కో జీవి నిర్మాణాన్ని బట్టి, ఈగుణాలు  వేర్వేరు పాళ్ళల్లో ఉంటాయి.  ఈ మూడు గుణాలు పరస్పరం కలయికతో విభిన్నమైన జీవరాశులు ఏర్పడుతున్నాయి. అలాగని ఈ గుణాలు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు. పరిస్థితులను బట్టి, ఒకోసారి సత్వగుణమూ మరోసారి రజోగుణమూ మరోసారి తమో గుణమూ ఆధిక్యంలో ఉంటాయి. ఈ మూడు గుణాలలో  ఒక గుణము హెచ్చుగా ఉంటే ,  మిగిలిన రెండూ  తక్కువగా ఉంటుంటాయి. సత్వగుణమంటే జ్ఞానశీలతగాను, రజోగుణాన్ని క్రియాశీలతగాను, తమోగుణాన్ని స్థితిశీలతగాను సామాన్యంగా  చెప్పవచ్చు.

సత్వగుణ కార్యము వల్ల పుణ్యము, రజోగుణ కార్యము వల్ల దుఃఖము, తమోగుణ కార్యము వల్ల అజ్ఞానము కలుగుతాయి. సాధనలో అందుకే ముందు తమోగుణాన్నితగ్గించుకోవాలనీ, సత్వగుణాన్ని పెంపొందించు కొవాలనీ చెబుతారు. ఒక గుణం ఎప్పుడు అధికమవుతుందో అప్పుడు మిగిలిన రెండూ తగ్గుతాయని అంటారు. ఆతర్వాత శుద్ధ సత్వాన్నిపొంది చివరగా దాన్నీ త్యజించి త్రిగుణాతీతంగా అవ్వాలని చెబుతారు. అప్పుడు చిత్తవృత్తులన్నీ అణుగుతాయి. మీ మనస్సు మీరు చెప్పినట్లు వింటుంది. దాంతో గమ్యాన్ని చేర వీలవుతుందని విజ్ఞులు బోధిస్తుంటారు. 

రజోగుణం

క్రియారూపమైన విక్షేపశక్తి రజోగుణ సంబంధమైనది. దీని వల్లనే సమస్త క్రియలూ జరుగు తున్నాయి. రాగము, దుఃఖము అనే మనోవికారాలు కలుగుతున్నాయి. కామము, క్రోధము, లోభము, దంభము, అసూయ, అహంకారము, ఈర్ష్య , మత్సరమనే ఘోర లక్షణాలు రజోగుణ ధర్మములుగా చెప్పబడ్డాయి. రజోగుణము రాగము  లక్షణముగా గలదై ఆశ, మమకారములచేత, కర్మయందు ఆసక్తికలిగించి దేహిని బంధిస్తోంది. రజోగుణము పెరిగినపుడు లోభము, కర్మ ప్రవృత్తి, అశాంతి, భోగలాలసత్వము కల్గుతాయి. ఈ గుణాదిక్యత యందు మరణిస్తే , కర్మయందాసక్తిగల మానవజాతి యందు పునర్జన్మ కలుగుతుందని అంటారు. వీరు యక్షులను, రాక్షసులను ఆరాధిస్తారు. 

ఎక్కువగా ఉప్పు, కారము, పులుపు,  చేదు , ఎక్కువ వేడిగా ఉండి దాహాన్ని, ఉద్రేకాన్ని కల్గించే ఆహార పదార్ధాలు  రాజసునకు ఇష్టము. ఇవి దుఃఖము, శోకము,  రాగములను కల్గిస్తాయి. ఇలాంటి ఆహారం మనస్సును విచలితం చేసి ప్రాపంచిక సుఖాలవేపుకు లాగుతుంది. గ్రుడ్లు, చేపలు, ఉప్పు, కారం, కుంకుమ పువ్వు, పిండి వంటలూ, మసాలా వంటి సుగంధ ద్రవ్యాలు, శరీరాన్ని ఉద్రేక పరచే కాఫీ , టీ , వేడి పాలు వంటివి రాజసిక ఆహారంలోకి వస్తాయి. అతిగా తినేది ఏదైనా రాజసిక ఆహారమే.
 
ఒక ఫలితాన్ని ఆశించి గాని,  ఆడంబరంతోగాని  చేసేది  రాజసిక యజ్ఞం అనబడుతుంది. పుణ్యం కల్గుతుందనిగాని, లేక తిరిగి సహాయం పొందే ఉద్దేశ్యంతోనూ, బాధతోనూ చేసేది రాజసిక కార్యం అనబడుతుంది.