Thursday, November 1, 2012

కుండలిని - 5

కుండలిని - 5


అనాహతము 

వక్షస్థలమున రొమ్ముఎముకకు వెనుక ఉండే హృదయ పద్మాన్ని అనాహతం అంటారు. ధూమ్రవర్ణం గల షట్కోణాకృతిలో ఉండే పన్నెండు దళములు గల పద్మమిది. వాయు సంబంధ మైనదగుట వల్ల త్వగింద్రియ(చర్మము)ముతో పండ్రెండు విధముల స్పర్శలు తెలియును. తల్లి, తండ్రి, భార్య, తనయులు, మిత్రులు , ధనము, సోదరులు, శరీరము, వాతము, పైత్యము, శ్లేష్మము , మరణము అనునవి తెలియబడును. ఈ ద్వాదశ దళముల కమలమునకు అధిపతి పార్వతితో కూడి యుండు రుద్రుడు. ఇచట కొట్టబడకయే మ్రోగు శబ్దము ఉండుటచే అనాహతమని చెప్పుదురు. దీనిని శబ్దబ్రహ్మము అందురు. శబ్దము నుండి ధ్వని కల్గును. ధ్వని నుండి వివేకమను వెలుగు/ జ్యోతి పుట్టును. ఈ వివేకమున మనస్సు అంతర్భాగమై ఉన్నది. ఎపుడు అమనస్క మగునో, అపుడు బ్రహ్మమునందు లీన మగును. 

మనస్సును వశపరచుకొనుటకు ముందుగా ఈ చక్రమున దృష్టి నిలిపినచో, శబ్దము అణగి, ప్రణవ నాదమను ధ్వని వినపడును. సాధన కొనసాగుచుండగా ప్రణవ నాదము తగ్గి, స్వప్రకాశమను ఆత్మజ్యోతి కనబడును. ఇంకనూ సాత్విక అహంకారముండుటచే బ్రహ్మమును చూడజాలకున్ననూ, మనస్సు బ్రహ్మమునందు ఐక్య మగును. నాదమనగా మూలాధారము నుండి కదలిన కదలికచే, హృదయమున పుట్టిన సంగీతధ్వని, కుండలినీశక్తి చేత యోగమున నాదబ్రహ్మమును లేపి, ఆనందమును చెందుట. 



అనాహత చక్రము పండ్రెండు దళములు గల పద్మము. 

" యం" దీని బీజాక్షరము. హృదయము కేంద్రము. ప్రేమ, సత్కర్మాచరణను కలుగజేయును. శరీరమున వాయువు గ్రహించబడుట, విసర్జించ బడుట దీనివల్ల జరుగును. ఊపిరితిత్తులు, గుండె ఈ కేంద్రమునకు లోబడి పనిచేయును. స్పందన, ప్రతిస్పందన అను ప్రవృత్తులు ఇచటనే పుట్టును. తల్లికి బిడ్డయందు కల్గు ప్రేమ ఈ కేంద్రమువల్ల కలుగు చున్నది. ఇందు ప్రీతి, ప్రియత్వము పుట్టుచున్నవి. జీవునియందు చైతన్యమును  కలుగ చేయును. కరుణవల్ల అమృతత్వము కల్గి జీవునకు శరీరబంధము తెగిపోవును. దీనిని ధ్యానించువాడు వాక్కునకు అధిపతియై క్షమాగుణము కల్గి యుండును. ఇంద్రియములు వాని వశమున నుండును. ఈ దేహమందు తనకు తానున్నానని  తెలియునది హృదయమందే. తననుండే శ్వాస పుట్టుచున్నదని తెలియువాడు ఎరుక గలవాడు.

అనాహతం బీజాక్షరం-  యంగ్ . పండ్రెండు దళములు కల్గిన ఆకుపచ్చని పద్మం. దాని మధ్యలో నక్షత్రాకారము వలె  ఉండి, దాని మధ్యలో yellowish red  జ్యోతి ఉండును.

 

Friday, October 26, 2012

కుండలిని - 4


మణిపూరకము

 
దారమున కూర్చబడిన మణివలె ఉండుటచే, దీనికి మణిపూరకమని పేరు. వాయుప్రేరణ కల స్వరూపము కల్గి, నాభి స్థానమున, దశదళములతో నుండు పద్మముగా చెప్పబడినది. దీనియందు  జీవుడు పాప పుణ్యములచేత నియమించ బడ్డవాడై, బ్రహ్మమును తెలుసుకోనంత వరకూ తిరుగుచునే ఉండును. లింగము యొక్క పైభాగమునను, నాభికి క్రిందను పక్షి గ్రుడ్డువంటి ఆకారమున నుండుదాని యందు , డబ్భైరెండు వేల నాడులు పుట్టి, ఇవి ప్రాణ వాహినులై శరీరమంతా వ్యాపించి ఉన్నాయి. పది దళములతో కూడిన మణిపూరకము పసుపు పచ్చని రంగు కలది. అగ్నికి స్థానమగుటచే నేత్ర సంబంధము చెప్పబడినది. నేత్రేంద్రియ సంబంధముచే తెలియబడు రంగులూ, రూపములయిన పొట్టి, పొడుగు, లావు, సన్నము; పుట్టుట, చచ్చుట, క్షీణించుట, వృద్దిచెందుట, సుఖదుఃఖములు, బాల్య యౌవన కౌమార వార్ధక్యములను అవస్థలూ కలిపి దశ విధములైన రూపములని తెలియ నగును. దీనికి అధిపతి లక్ష్మీదేవితో కూడిన విష్ణువు. అగ్ని సంబంధ మగుటచే, ఇచ్చట అగ్ని, భుజించిన సమస్త పదార్ధములనూ జీర్ణము చేయును. చిత్తమునకు స్థానము. ఇచట ఘంటా నాదము వినదగును.
  
శరీర మందలి ద్రవములను , వాటి సాంద్రత, వాటి ప్రసరణలను నిర్వర్తించును. ఉద్రేకావేశములకు పర్యవసానముగా పరితపించుట, దుఃఖించుట , కోపము తెచ్చుకొనుట మున్నగు మార్పులను కల్గించి వానివల్ల పరమాత్మ  జీవునికి మనోవికాసమును కల్గించు చున్నాడు. బాధ, కష్టము అనువాని వల్ల దుఃఖపడుట అను లక్షణమును మనస్సున కల్పించి, దానిని జాలి అను సంస్కారముగా ముద్రించును. ఇలా సంస్కారములేర్పడిన పిదప, సాటివారికట్టి పరిస్థితి కలిగినపుడు తాను పడిన బాధ గుర్తుకు వచ్చి, వాని యందు సానుభూతి , దయ  ఏర్పడును. ఇట్లు ఉత్తమ సంస్కారము లేర్పడు చున్నవి. స్త్రీలయందు మాతృత్వమును చూచి ఆరాధించుట, పూజించుట అనువాటివల్ల కామమను పశులక్షణమును జీవుడు దాటుచున్నాడు. స్వాధిష్టానమందలి శుక్ర తేజస్సు ఊర్ధ్వగతమై మణి పూరకమందు ఆవేశముగా మార్పు చెంది, హృదయ పద్మమునందు ప్రేమగా మేల్కొని, భ్రూమధ్యమందు బుద్దియను మహాతేజస్సుగా ప్రకాశించు చున్నది. నిరంతర ఆలోచనలవల్ల కల్గు మనోవ్యాకులత , సంఘర్షణల నుండి తాత్కాలిక విముక్తి కలిగించుటకు మార్పును కూడ కల్పించుచున్నది. ఈ కేంద్రము  వల్లనే  వాక్కు పుట్టుచున్నది.



ఇది నాభిమూలమున ఉండును. మణిపూరకము యొక్క బీజాక్షరము - రంగ్. పది దళములు కల్గిన పసుపు పచ్చని పద్మం. దాని మధ్య ముక్కుపొడుం/ బ్రౌన్ రంగుతో  తిరగబడినట్లున్న త్రిభుజమూ  దాని మధ్యలో పసుపు పచ్చనిరంగుతో కూడిన ఎర్రనిరంగు గల మంటతో మణిపూరకము ఉంటుందని చెప్పబడినది.