Monday, September 9, 2013

జ్ఞానయోగము- సాధన (7)


సమాధానం :-

క్రింది స్థాయిసమాధిని  శమాదిషట్కంలో సమాధానం అంటారు. ఇది అప్రయత్నంగా సిద్ధించే సమాధిస్థితి గనుక ఇది సాధనగా చెప్పబడలేదు.  మనస్సును /చిత్తాన్ని ఒకచోట సంపూర్ణంగాను, నిలకడగాను ఉంచడాన్ని సమాధానమని అంటారు. ఒక సమయంలో అనేకమైన విషయాలను చింతించే దాన్ని ఒకచోట కదలకుండా ఉంచడం సమాధానం. మనస్సును కలపడం. అంటే దాన్ని ఒకచోట సంపూర్ణంగా ఉంచడం. అటూ ఇటూ కదలకుండా ఉంచడాన్ని సమాధానం అంటారు. దీన్లో ఉండేది బ్రహ్మముతో ఏకత్వమే. సమాధానం వల్ల మనస్సు విశ్రాంతంగా ఉంటుంది.

శంకరులు శ్రద్ధనుగురించి చెప్పేటపుడు మనస్సులోనే విశ్వాసం ఉంచాలని చెబుతూ బుద్ధితో నిశ్చయించి అని  చెప్పారు. సమాధానం గురించి చెప్పేటప్పుడు బుధ్ధి అనే పదాన్నే వాడారు. బుద్ధిని ఎల్లపుడూ బ్రహ్మమునందే సరైన రీతిలో ఉంచడాన్ని సమాధానమని అన్నారు. అంటే బుద్ధి తన సమస్త శక్తులను ధారబోసి బ్రహ్మంపై లగ్నం కావాలి. ఇదే, బుద్ధిని సరిగ్గా ఉంచడమంటే( సమ్యగ్ స్థాపనం ). ఇలా నిరంతరమూ కొనసాగటాన్ని బుధ్ధియొక్క సమాధానం అంటారు. మనస్సు ఏది మంచి అనుభవమో, ఏదికాదో తెలియక అన్నిటిలోనూ మునిగి ఉంటుంది.  ఆవేశంలో కొట్టుకుపోకుండా ఏది సత్యమో, ఏది అసత్యమో బుధ్ధి మంచి చెడుల న్యాయనిర్ణయం చేస్తుంది. ఇలాంటి బుధ్ధికూడా ఇక్కడ ప్రక్కకు తప్పుకోవాలి సమాధానంలో”.

క్రిందిదశలో బుద్ధికి బాగా పదునుపెట్టాలి. అలాంటి పదునైన బుధ్ధి, నిత్యానిత్య వస్తువివేకం చేస్తుంది. ఇప్పుడు చెప్పుకున్న సమాధానంలో సాధకుడు ఒకస్థాయికి చేరుకున్నాడు. బుద్దినుంచి తెలుసుకోవలసిన జ్ఞానంతో అతడికి ఏ సంబంధమూ లేదు. అన్నివేళలా బ్రహ్మమును గురించిన చింతనే ఉంటుంది. అందుకే ఇక్కడ బుద్ధిని కూడా విడవాలి. ఇది రెండోదశ అనవచ్చు. సమాధానం అనేది క్రిందిస్థాయి సమాధి అని చెప్పుకున్నాం.

ఇక మూడవదశ సమాధిలో బుద్ధిని బ్రహ్మమనే సముద్రంలో ముంచెయ్యాలి. అంటే బుద్ధి తన సమస్త శక్తులను ధారబోసి బ్రహ్మంపై లగ్నం కావాలి. ఇదే బుద్ధిని సరిగ్గా ఉంచడమంటే( సమ్యగ్ స్థాపనం ). ఇలా నిరంతరమూ కొనసాగటాన్ని బుధ్ధియొక్క సమాధానమని చెప్పుకున్నాం. కాని ఇక్కడ బ్రహ్మానుభవం ఇంకా కాలేదు. అది చివరన వస్తుంది. ఐతే బుద్ధిని శుద్ధబ్రహ్మముపై లగ్నం చెయ్యడం అంటే, బ్రహ్మమును గురించి చెప్పబడ్డ శాస్త్ర విషయాలమీద, గురువు బోధించిన ఆత్మ విషయాలపైనా, బ్రహమును గురించిన బుద్ధిజ్ఞానంపైన  ఏకాగ్రతతో బుద్ధిని ఉంచాలి. ఇదే బుద్ధియొక్క సమాధానమని కంచిపీఠాధిపతి  శ్రీ చంద్రశేఖర స్వామి వారు అద్వైతసాధన అనే ఉపన్యాసాల సంపుటిలో చెబుతారు.

ప్రస్తుతం సాధకుడు ధ్యానంలో, బుద్ధిని ఆత్మలోలీనం చెయ్యడానికి కావలసిన సమర్ధత ఇంకా రాలేదు. అంచేత బుద్ధి తన వ్యాపార మైన శాస్త్రవిషయాలు, ఆత్మగురించి తెలిసుకున్న విషయాలమీదా  పనిచేస్తుంది. అదే చివరకు ఆధ్యాత్మిక ప్రగతికి దారి చూపిస్తుంది.

సాధన తొలిదశ- నిత్యానిత్యవివేకంలో బుద్ధికి బాగా పదును పెట్టాలి. ఎపుడు ఆత్మ సాధకుడయ్యాడో, ఇక బాహ్య ప్రపంచజ్ఞానం గాని, మిగిలిన విషయాలను గాని తెలుసుకోవలసిన అవుసరం అతనికి ఉండదు. బ్రహ్మచింతనలోనే నిరంతరమూ ఉంటాడు. అంటే సమాధి స్థితి ఉన్నతమయ్యేకొద్దీ (మూడవ దశ సమాధిలో) బ్రహ్మమనే సముద్రంలో బుద్ధిని ముంచెయ్యాలి. మనం ఏ జ్ఞానాన్నైనా తెలుసుకునేది బుద్దితోనే.  అట్టి బుధ్ధి, ఇక్కడ తన శక్తులన్నిటినీ ధారపోసి బ్రహ్మంపైనే లగ్నం కావాలి. ఇదే సమ్యగ్ స్థాపనమంటే. ఇలా నిరంతరం కొనసాగించడాన్ని బుధ్ధియొక్క సమాధానం అంటాం. ధ్యానంలో కూర్చుని బుద్ధిని, ఆత్మలోలీనం చెయ్యలేకపోతే బుధ్ధి పనిచేస్తూంటుంది. శాస్త్రాలు, ఆత్మను గురించిన విషయాలపైకీ  బుధ్ధి పోతుంటుంది. అంటే ఈ దశలో బుద్ధిని సంపూర్ణంగా బ్రహ్మమందు స్థిరంగా ఉంచడమే సమాధానం.

ముందుదశలో సాధకుడు నిత్యానిత్యవస్తు వివేకంలో బుద్ధికి పదును పెట్టాలి. రెండవ దశకు చేరుకున్న సాధకుడికి జ్ఞానం యొక్క ఆవశ్యకత ఉండదు/ లేదు. అందుకే సమాధానంలో జ్ఞానానికి కారణంగాఉండే బుధ్ధి కూడా ప్రక్కకు తప్పుకోవాలి. అందుకే క్రిందిదశ సమాధిగా చెప్పే సమాధానంలోనే బుధ్ధి ప్రస్తావన. మూడవదశలో సమాధిస్థితి ఉన్నతం  అయ్యే కొలదీ బ్రహ్మమనే సముద్రంలో బుద్ధిని ముంచి వెయ్యాలి. బ్రహ్మానుభవం చివరనే వస్తుంది. బుద్ధిని శుద్ధబ్రహ్మముపై సంపూర్ణంగా నిలపాలి అంటే ఇక్కడ బ్రహ్మమును గురించి చెప్పిన శాస్త్రంపైనా, గురూపదేశంపైనా బుద్ధిని ఏకాగ్రతతో ఉంచడం అని విజ్ఞుల అభిప్రాయం.       



Wednesday, September 4, 2013

జ్ఞానయోగము- సాధన (6)


ఉపరతి :-

శమదమాలను నిరంతరం అభ్యసిస్తూంటే, మనస్సు ఎలాంటిపనీ చెయ్యని ప్రశాంతస్థితిలో ఉంటుంది. ఇలా మనస్సు ఆలోచనారహితంగాను, నిశ్చలతస్థితిలోనూ ఉండటాన్ని ఉపరతి అంటారు. ఇది ఏకాంతంగా ఉండే శూన్యస్థితి. ఇంకా ఆత్మసాక్షాత్కారం అవ్వలేదు.

వైరాగ్యంలో కోరికలపట్ల ఏహ్యభావమూ విసుగూ వాట్ని నిర్మూలించుకోడమూ ఉంటాయి. కాని ఉపరతిలో కోరికలు ఉండవు కాబట్టి విసుగు/రోత అనేది ఉండదు. ప్రశాంతమైన స్థితే ఐనా, ఉపరతిలో ఆనందం లేదు. దీన్లో బాహ్యమైన ఆలంబనలు ఉండవు. అంటే అన్నిటినీ పూర్తిగా విడిచినట్లన్నమాట. అలా అన్నిటినీ విడవటమే సన్యాసం. సాధకుడి కర్మఫలాలు పూర్తిగా నశించినప్పుడే, పరమాత్మ అతడిని సమాధానస్థితికి తెచ్చి మహావాక్యోపదేశం .....ఇలా ముందుకు నడిపిస్తాడు.

తితిక్ష :-

అన్నిబంధాలనుండీ విశ్రాంతి కలిగే ఉపరతి తర్వాత తితిక్ష (ఓర్పు ) కోసం సాధన చెయ్యాలి. ఇక్కడ తర్వాతని చెప్పినా, ఇదివరలో చెప్పుకున్నట్లు సాధనలో అన్ని అంగాలను కలిపే అభ్యసించాలి. ఉపరతిలో తీవ్రసుఖంగాని, తీవ్రదుఃఖంగాని సంభవిస్తే ఉన్నస్థితిలో చలనం కలుగుతుంది. అందుకే ఓర్పు/సమభావన/సహనం అనేదాన్ని సాధనతో పొందాలి. జరిగేది జరిగేతీరుతుందనే భావన దృఢమైనపుడు మనం ఎట్టి మనో వికారాలకూ లోనవ్వం. కర్మఫలంవల్ల మంచి జరిగినా, చెడుజరిగినా వాటిని త్రోసివెయ్యక వాటిపట్ల సమభావంతో ఉండటమే సాధన. ఇదే తితిక్ష. ఇలా ద్వందాలకు అతీతంగా ఉన్నపుడు ఇక మిగిలేది ఆత్మయే.


శ్రద్ధ :-

ఇది మొదటినుండీ చివరిదాకా ఉండాల్సిందే. సాధన ముందుదశలో  శాస్త్రాలమీద గురువాక్యాలపైనా నమ్మకం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు తర్కానికి అందని విషయాలు ఉంటాయనే భావన ఉంటుంది గనుక. ప్రస్తుతం ఉపరతి, తితిక్ష తర్వాత అంటే సాధనలో పురోగతి సాధించాకా, దేన్ని సాధించాలో దాన్ని పొందవచ్చుననే భావంతో ఉంటాడు. ఇదీ ఒకరకమైన అహంకారమే. అంచేత సాక్షాత్కారమయ్యే దాకా శ్రద్ధ ఉండాలని చెబుతారు. పరతత్వం బుద్ధికి లొంగదు. గురువు సూచించిన మార్గంలో పయనిస్తూ, ప్రత్యక్షంగా సత్యదర్శనం చేయాలనే పట్టుదల ఉండాలి. 

ఎప్పుడూ శ్రద్ధ ప్రక్కనే అశ్రద్ధ ఉంటుంది. అలాంటి అశ్రద్ధను జయించడమే శ్రద్ధ అనబడుతోంది. శ్రద్ధపై విజయం లభిస్తేనే సమాధాన స్థితి పొందటం జరుగుతుంది. సాధనలో పతనం చెందకూడదంటే అభ్యాసం కొనసాగాలి. జ్ఞానమార్గంలో పయనించడం పదునైన కత్తిమీద నడవడం వంటిదని విజ్ఞులు చెబుతారు. అందుకే శ్రద్ధతో ముందుకు సాగుతూంటే దానికి అనుగ్రహం తోడవుతుంది.

నిత్యానిత్య వివేకంతో ఆత్మే నిత్యమైనదని అనుకుంటాడు గాని దృఢమైన నమ్మకం ఏర్పడదు. విచారణ, గురూపదేశం, శాస్త్రపఠనం – వీటివల్ల ఆత్మ ఒకటుందనే భావన ఉంటుంది. ప్రాపంచికవిషయాలన్నీఅనిత్యాలని అనుభవమూ అవుతుంది. ఐనా సచ్చిదానందమైన ఆత్మపట్ల గట్టి నమ్మకం ఇంకా కలుగదు. సమబుధ్ధి వల్ల దేన్ని త్యజించాలో తెలుసుకుని శమదమాలను ఆచరణలో పెడతాడు. కొంతకాలానికి మనస్సు శూన్యంగా ఉండే ఉపరతి కలుగుతుంది. కాని ఆత్మానుభవం ఇంకా కాలేదు. కాని ముందునుండీ చూఛాయగా ఆత్మానందం ఉంటుంది. అంచేత సాధన శ్రద్ధతో కొనసాగాలి. బుద్ధికి అతీతమైన శాస్త్రవిషయాలపైనా, గురువు చెప్పిన మాటలనూ సందేహించక విశ్వాసంతో ఉండాలని చెప్పబడింది. అలా ఉన్నప్పుడే సత్యం అవగతమవుతుంది.







Saturday, August 31, 2013

జ్ఞానయోగము- సాధన (5)


విషయనిందను గురించి చెప్పే సందర్భంలో శంకరులు వివేకచూడామణి( 78 ) లో
“శబ్దాదిభిః పంచభిరేవ పంచ
పంచత్వమాపుః స్వగుణేన బధ్ధాః
కురంగ మాతంగ పతంగ మీన
భృంగా నరః పంచభిరంచితః కిమ్”
అంటే శబ్దాది విషయాలమీద ఉండే జీవులు ఎలా బంధానికి గురవుతున్నాయో చెబుతూ, లేడి అతివేగంగా పరుగుతీయగలిగేదైనా, స్వభావసిద్ధంగా దానికున్న శబ్దప్రీతిచేత, వేణువు శబ్దానికి తన్మయత్వంతో నిశ్చలంగా ఉండిపోతుంది. అందుకే వేణువును ఊది, ఈ ఉపాయంతో బోయవాడు లేడిని బంధిస్తాడు. ఇలా లేడి శబ్దప్రీతితో బంధానికి చిక్కుకుంటోంది.

ఏనుగు బలమైనదే. అరణ్యంలో స్వేచ్ఛగా తిరుగుతూంటుంది. అంతటి బలమైన ఏనుగూ స్పర్శప్రీతివల్ల, ఆడ ఏనుగును ఎరగా చూపి ప్రలోభపెట్టి దాన్ని బంధించడం చేస్తుంటారు.
మిడుత అగ్నియొక్క ప్రకాశానికి రూపప్రీతివల్ల, అగ్నివేపుకి ఆకర్షించబడి అగ్నికి ఆహుతి అవుతుంది.
చేప రుచికి ప్రలోభపడి రసప్రీతిచేత గాలానికి గ్రుచ్చే మాంసానికి ఆకర్షించబడి ఎరకు చిక్కుకుంటుంది.
భ్రమరం (తుమ్మెద) సంపంగి పుష్పపు (చంపక పుష్పం) సువాసనకు, దానికిగల స్వభావసిద్ధమైన గంధప్రీతిచేత ఆకర్షించబడి, పుష్పాన్ని చేరాలనే కఠినతాపత్రయంలో సాటి భ్రమరములతో ఉండే పోరాటంలో ఇది నశిస్తుంది. **
దీన్నే కొన్నిచోట్ల ఇలా విశ్లేషించారు. భ్రమరం పూర్తిగా విచ్చుకున్న తామరపుష్పపు సువాసనకు ఆకర్షించబడి, దానిపైనే కూర్చుండి పోతుంది. సూర్యాస్తమయ సమయానికి పుష్పం ముడుచుకుంటుంది. ఆ సుగంధపు మత్తులో గంధప్రీతిచేత పుష్పంమీదే ఉండిపోడంవల్ల దాన్లో చిక్కుకుంటుంది.

ఇలా శబ్దాదివిషయాల్లో పైన పేర్కొన్నట్లుగా  ఒక్కొక్క ఇంద్రియం మీద మాత్రమే ప్రీతి ఉంటే అవన్నీ ఆపదల్లో చిక్కి, తమ నాశనాన్ని తెచ్చుకుంటుంటే,  ఈ ఐదు ఇంద్రియవిషయాల  మీదా  అనురక్తితో ఉండే మానవుడి విషయంలో ఏమి చెప్పగలం? అంటారు. అంచేత కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించకపోతే, ఈ ప్రపంచంలోనే గాకుండా మరుజన్మలోనూ దుఖాన్ని అనుభవించాలి గదా! అందుకే శమదమాలను ఆచరిస్తూ మనస్సును, ఇంద్రియాలను జాగరూకతతో ఎప్పటికప్పుడు నియంత్రించడమే దీన్లో సాధన అంటారు.


 

Friday, August 23, 2013

జ్ఞానయోగము- సాధన (4)

శమాది షట్క సంపత్తి  

దీన్లో  శమము, దమము, ఉపరతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానము  అని ఆరుఅంగాలు ఉన్నాయి. వీటిని పాటిస్తే  జ్ఞానం  కలుగుతుందని విజ్ఞులు చెబుతారు. గతజన్మ వాసనలవల్ల  శబ్ద స్పర్శ రూప రస గంధాలనే ఇంద్రియ విషయాలకోసం, మనస్సు  తహతహ లాడుతుంటుంది. ఈ విషయాలను వివేక వైరాగ్యాలతో  పరిశీలిస్తే, ఇవి  దోషపూరితాలని తెలుస్తుంది.  వీటికై వెంపర్లాడటం ఆత్మజ్ఞానానికి  ఆటంకమని  గ్రహిస్తాడు. అప్పుడు  వీటిని విసర్జించి, అంటే  వీటికి  దూరంగాఉంటూ సాధన కొనసాగిస్తాడు. ఆత్మయే  సుఖశాంతులకు నిలయమని  తెలిసి, మనస్సును  అట్టివాసనలనుండి పుట్టేకోరికలను  నియమిస్తూ, సాధనాభ్యాసాన్ని చేస్తుంటాడు. మనస్సును  నియమించడం శమంలోకి వస్తుంది.

ఇక్కడ మనస్సును, ఇంద్రియాలనూ  ఒకేసారి నిగ్రహించాలి. శమం  మనస్సును నియమించడం  ఐతే దమం  ఇంద్రియాలను  నియమించడం. అంటే  శమ దమాలను  ఒకేమారు  నిగ్రహించాలి. అంటే  ఒకదాని పిదప మరొకటిగా  గాక  రెండిటినీ  కలిపే,  సాధన ఉండాలి. జ్ఞానేంద్రియాలు  తమంత  తాము  పనికి పూనుకోకపోయినా, కర్మేంద్రియాలు  వాటి పనిని, అవి చేస్తూనే ఉంటాయి. జ్ఞానేంద్రియాలు  ప్రాపంచిక విషయాలను గ్రహించి  అనుభవిస్తుంటాయి. వీటివల్లే  జీవుడు మాయా సంసారంలో  చిక్కుకుంటున్నాడు. సాధనలో ఇంద్రియాలను  నియమించే  దమము అవుసరం అందుకే.

కళ్ళూ చెవులూ  మూసుకొని, కాళ్ళూ  చేతులూ బంధించి ఉంచినా, ఇంద్రియాలు  ఏ విషయాన్నీ అనుభవించక పోయినా, మనస్సు  ఏవేవో ఊహించుకొంటూనే ఉంటుంది. అంటే  మనస్సే ఇంద్రియాలను  ప్రేరేపించేదని  తెలుస్తోంది. అందుకే  శమము  ముందుగాను, దమము తర్వాత వస్తాయి. ఐనా రెండిటినీ  ఒకేసారిగా  అభ్యసిస్తూ నిగ్రహించాలి. శమదమాలవల్ల  మనస్సు  ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు  ఆగిపోతే ఆత్మ ప్రకాశిస్తుంది. శమదమాలున్నవాణ్ని  సన్యాసి  లేక యతి అంటారు.

మనస్సులో  ఉత్పన్నమయ్యే  కోరికలను  ఎప్పటికప్పుడు నిరసిస్తూ, త్యజిస్తూ జాగరూకతతో  ఉండటం శమాన్ని, ఇంద్రియాల ద్వారా  విషయాలు లోపలికి  ప్రవేశించకుండా నిగ్రహించడం దమాన్ని సూచిస్తాయి. అంటే  బాహ్యాభ్యంతర  విషయాలవల్ల మనస్సు చలించకుండా జాగ్రత్త పడటం శమదమాలని  చెప్పబడింది. 




Thursday, August 15, 2013

జ్ఞానయోగము- సాధన (3)


వైరాగ్యము 

ఇంద్రియాలెప్పుడూ విషయసుఖాలను అపేక్షిస్తాయి. కోరికలను కలుగ జేస్తుంటాయి. మనం చెయ్యాల్సిన పనులెన్నో ఉంటాయి. ముందుగా మనం చెయ్యకూడని పనులను వదిలెయ్యాలి. వైరాగ్యంఅంటే ఎలాంటి కోరికా లేకుండా ఉండటం. అంటే కోరికలను విడిచిపెట్టడం.

బ్రహ్పదవి మొదలుకొని గడ్డిపోచ దాకా ఉండే  సృష్టి అంతటమీదా, ఎలాంటి కోరికాలేకుండా ఉండటం వైరాగ్యం. అంటే ఈలోకంలో ఉండే సుఖాలనుండి పరలోకసుఖాల  పర్యంతమూ,  ఏవిధమైన కోరికా లేకుండటమే గాక  ఏహ్యభావం /జుగుప్స/రోత కలిగి ఉండటాన్ని వైరాగ్యం తెలియజేస్తుంది. ఈ ఏహ్యభావం ఎలాంటి దంటే కాకిరెట్ట మీద ఎట్టి ఏహ్యభావం ఉంటుందో, అలా అన్నివిషయాల పట్లా ఎంతమాత్రమూ  ఆకర్షణలేకుండా ఉండట
మన్నమాట. అంటే చూసే వస్తువులన్నిటినీ విడిచిపెట్టాలనే భావనకలిగి ఉండటం.

మనస్సు మనకు తెలియకుండానే విషయాలవేపుకి పోతుంటుంది. అప్పుడు బుద్దిచేత  అట్టివిషయాల  వ్యర్ధత్వాన్ని, వాటి  మిధ్యత్వ, అశాశ్వతత్వాన్ని గుర్తుచేసుకుని, మనస్సును వాటినుంచి మళ్ళిస్తూ ఉండాలి. దీనికే వైరాగ్యం  అవుసరం. వైరాగ్యంతోఉన్న మనస్సు,  విషయవాంఛలవేపుకి  పరుగులు తీయదు. అలాంటి మనస్సే  ఉన్నతమైన  ధ్యానంలో  నిశ్చలంగా  ఉండగల్గుతుంది.

కర్మమార్గంలో  ఉండేవారు  కూడా  యజ్ఞయాగాదులు చేసి  సంపాదించే  స్వర్గసుఖంకూడ అనిత్యమని తెలిసి,  వారు వైరాగ్యాన్ని అభ్యసిస్తారు. అప్పుడే బ్రహ్మజిజ్ఞాసకు పూనుకుంటారు. సాధకుడు  కోరికచేత  చంపబడని వాడు  కావాలి. ఎలాంటి కోరికైనా  మనస్సును  ఆక్రమిస్తే, దాన్ని త్యజించటమే వైరాగ్యం. వైరాగ్యంవల్ల  చిత్తము  యొక్క  చంచలత్వం  అదుపులోకి  వస్తుంది.

మనం  వింటున్నదానిమీద గాని, విన్నదానిమీదగాని, వినబోయే దానిమీద గాని  కోరిక ఉండకూడదు. అలాగే  చూస్తున్న  దానిమీద గాని, చూసిన దానిమీదగాని , చూడబోయే  దానిమీదగాని ఎలాంటి కోరికా  ఉండకూడదు. ఇలా యివన్నీ కలిపితే, దాన్ని  వైరాగ్యమని  చెప్పవచ్చు. దేనిమీదైనా  అనురాగం కలిగితే,  అది కోరికగా  మారుతుంది. అంటే  కోరికకూ, అనురాగానికీ  కార్యకారణసంబంధం ఉంటుంది.

అందుకే  వివేకవైరాగ్యాలు  కలిసే  ఉండాలి. ఏది  నిత్యం, ఏది అనిత్యం  అనేది  గ్రహించి  వైరాగ్యంతో  అనిత్యమైన వాటిని  గెంటివెయ్యాలి. అలా  సమబుద్ధి  కలిగి ఉండటం  సాధనకు  తొలిమెట్టు. సాధనచతుష్టయంలో  అంగాలను  మనకు  తెలియడానికి  ఒకదాని తర్వాత  మరొకటిగా  ఒక క్రమపద్ధతిలో  చెబుతున్నా, అన్నిటినీ కలిపి  ఒకేమారు సాధనలో  కొనసాగించాలి. అంటే  ఒకదానిపై  ఎక్కువఏకాగ్రత, మరొకదానిపై కొంచెం తక్కువ  ఏకాగ్రతా  ఉంచుతూ అభ్యాసం  ముందుకు సాగాలి.







Thursday, August 8, 2013

జ్ఞానయోగము- సాధన (2)

సాధనచతుష్టయంలో ముందుగా ఉండేది నిత్యానిత్య వస్తువివేకము.
  
గురువునుండి ఆత్మవిద్య నేర్చుకున్నవాడు, ఆత్మయే శాశ్వతమైనదని, అసలుసుఖం ఆత్మజ్ఞానం వల్లనే కలుగుతుందని తెలుసుకుంటాడు. నిష్కామకర్మలాచరిస్తూ సాధనచతుష్టయంలోకి అడుగు పెడతాడు. ఈ దృశ్య ప్రపంచంలో ఎన్నో వస్తువులూ, విషయాలూ ఆకర్షణీయంగా కనిపిస్తాయి, మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించేవిగా కూడా అనిపిస్తాయి. మనస్సు ఏకాగ్రమై, కొంతవరకూ నిర్మలంగా ఉంది గనుక నిత్యానిత్య వస్తువివేకం చెయ్యాలి. ఇదీ ఇక్కడసాధన. ఇక్కడ బుద్ధికి పదునుపెట్టాలి. మనకు తెలిసేజ్ఞానమంతా బుద్దిబలం వల్లనే కలుగుతుంది. ఈ ఆకర్షించే వస్తువులూ విషయాలన్నీమనోరంజకంగా అనిపిస్తుంటాయి. ఎందుకంటే ఇంకా తొలిమెట్టులోనే సాధకుడున్నాడు. ఇపుడు వివేచనవల్ల, వీటివలన కలిగేది తాత్కాలికానందమేనని గ్రహిస్తాడు. అపుడు నిత్యమూ, సత్యము ఐనదానికోసం అన్వేషించడం ఆరంభిస్తాడు.

అలా శాశ్వతమైనదేదో, క్షణికము అనిత్యమైనదేదో, అని విచారణచెయ్యడంవల్ల అనిత్యమైనదేదో తెలుస్తుంటుంది. అపుడు అనిత్యమైనవాటిని తననుండి గెంటివేస్తుండాలన్నమాట. ఇలా అభ్యాసం సాగుతుంటే మామూలు సుఖాలకి వెంపర్లాడటం జరుగదు. క్రమంగా మనస్సుయొక్క చంచలత్వం పోతుంది. శాశ్వతమైన వాటిగురించి శాస్త్రాలు చెబుతాయి. మహాత్ములబోధలు, పురాణాలు, తీర్థయాత్రలు అశాశ్వతమైనవేనైనా  అవి శాశ్వతమైన దాన్ని( ఆత్మను) చేరడానికి పరోక్షంగా దోహదం చేస్తాయి. అందుకే వివేకంతో ఏది ఆత్మను చేర్చుతుంది, ఏది చేర్చదో తెలుసుకొని, అశాశ్వతమైన దాన్నల్లా వదిలేస్తుండాలి.

మామూలుగా మనంచేసే పనులను సమర్ధించుకుంటాం. అలాంటి సమర్ధన సబబో, కాదో వివేకంతో గ్రహించాలి. అపుడపుడు ఆత్మవిచారణ నుండి దూరమవ్వడం జరుగుతుంది. ఇంద్రియాలను తృప్తిపరచడం కూడా ఉంటుంది. జాగరూకతతో ఉండి, తిరిగి ఆత్మవిచారణలో నిమగ్నమవుతూ అనిత్యము, క్షణికము ఐనవాటిని వివేకాన్ని ఉపయోగించి గెంటివేయాలి. ఇదంతా బ్రహ్మసత్యం, జగన్మిధ్య అనేది ఒంటబట్టించుకొని దృఢనిశ్చయం కలిగినప్పుడే సాధ్యమవుతుంది. ఇలా పరిమితిగల, అనిత్యమైనవాటిని విసర్జిస్తూ, అనంతమైన ఆత్మను అన్వేషించాలని  ఉపనిషత్తులు చెబుతున్నాయి. నిత్యవస్తువును కనుక్కున్నవానికే శాశ్వతమైన శాంతి లభిస్తుందని చెబుతాయి.



Thursday, August 1, 2013

జ్ఞానయోగము- సాధన (1)


ప్రపంచంలో ఉండే వస్తువులు, విషయాలపై ఆకర్షణ ఉంటుంది. ఇవన్నీ శాశ్వతంకావని గ్రహించడంచేత, వాటిపై అనురక్తి పోయి, విరక్తి కలుగుతుంది. అలాంటిభావన వైరాగ్యానికి దారితీస్తుంది. సాధనచతుష్టయం వల్ల మనోనిగ్రహం కలుగుతుంది. అప్పుడు సాధకుడు సర్వాన్నీ ఆత్మగానే చూస్తాడు. శ్రవణ,మనన,నిదిధ్యాసనాలవల్ల సమాధిస్థితి లభిస్తుంది. ఆత్మ స్వరూపాన్నే ధ్యానించడంవల్ల, ఆత్మసాక్షాత్కారమై, తనే బ్రహ్మమవుతాడనేది క్రమంగా సాధనవల్ల కలిగే ఫలమని చెప్పబడింది.
 
దీనికోసం ముందుగా సద్గురువునుండి ఆత్మవిద్య నేర్చుకోవాలి. నేర్చినదాన్ని మనస్సుకు పట్టించుకొని, దాన్ని ఆచరణలో పెట్టగలగాలి. ఇదివరలో మనస్సు గురించిన విశేషాలు చెప్పుకున్నపుడు, అదెలా మలినమవుతుందో తెలుసుకున్నాం. మనస్సు మలినంగా ఉండటంవల్ల ఎప్పుడూ చలిస్తూ చంచలంగా ఉంటుంది. అలాంటి మలినమైన మనస్సులో ఏదీ సరిగా ప్రతిబింబం చెందదు. అంటే దేన్నీ, సరైన దృష్టితో చూడలేం. అందుచేత ముందుగా భక్తిద్వారా మనస్సును ఏకాగ్రం చెయ్యాలి. పిదప ఆమాలిన్యాన్ని/మురికిని వదిలించుకోవాలి. దానికోసం శాస్త్రసమ్మతమైన కర్మలను చేస్తూండటం వల్ల, క్రమంగా చిత్తంశుద్ధమై నిర్మలంగా ఉండగల్గుతుంది. అలా నిర్మలము, ఏకాగ్రము అయిన మనస్సులో అన్నివిషయాలూ స్పష్టంగా కనిపిస్తాయి. ఇలా, సాధనక్రమం తప్పకుండా కొనసాగిస్తూంటే, ఆ సాధనే తర్వాత మార్గాన్ని సాధనచతుష్టయం నిర్దేశిస్తుంది.

మనస్సుయొక్క స్థితి, సత్వరజస్తమోగుణాల కలయిక ఎలాఉందో, దాన్నిబట్టి ఉంటుంది. వర్ణాశ్రమధర్మమంటే, తను పుట్టిన కులంగాక, వాసనలచేత ఏర్పడ్డ మనస్సుయొక్క గుణాధిక్యతనుబట్టి వర్ణం అనేది నిర్ణయించ బడుతోందని శాస్త్రం.  బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం అనేవి నాలుగూ ఆశ్రమాలుగా చెప్పబడ్డాయి. ఒకవ్యక్తి యొక్క మానసికస్థితి, ఈ ఆశ్రమాల జీవనవిధానంపై ఆధారపడి ఈ వర్ణాశ్రమధర్మాలు నిర్ణయించ బడుతాయి. దానికి  అనుగుణంగానే సాధన జరగాలి. కర్మానుష్టానమూ జరగాలి. మనస్సును అదుపులో ఉంచుకొని, సాధనచతుష్టయంలో అడుగిడాలి.