Thursday, October 17, 2013

జ్ఞానయోగము- సాధన (12)



ఆత్మకు నిలయమని చెప్పే హృదయం మన ఛాతీకి ఎడమవేపున ఉండే భౌతికంగా చెప్పే హృదయం కాదు. ఆధ్యాత్మిక హృదయం జీవులకు కుడివేపున ఉంటుందని రమణమహర్షి చెప్పేవారు. ఆత్మమీద మనస్సును లగ్నం చేసేప్పుడు, మానసికంగా ఒకచోటున ఉన్నట్లు భావించుకోవాలి. అంటే అంతఃకరణం ఆత్మస్థానంలోకూడుకునేటట్లు చెయ్యాలి. అంతఃకరణం తాను కల్పించుకున్న జీవభావాన్నిబట్టి ఉంటుంది. ప్రాణులకు ప్రాణదానం చేసే ప్రాణశక్తి కూడా ఆ స్థానంలోనే ఉంటుంది. ఆ ఏకాగ్రమైన స్థానమునందే ఆత్మబోధ కూడా జరుగుతుంది. ఈ స్థానం ఎంత సూక్ష్మం అంటే అది నివ్వరిధాన్యపు/ధాన్యపుగింజ కొనముల్లులా సూక్ష్మంగా ఉంటుంది. అక్కడే ఆత్మ ప్రకాశిస్తూంటుంది. ఆ ఏకాగ్రమైన స్థానమే ఆత్మస్థానం.
 
ఈ ఆధ్యాత్మిక హృదయం అధోముఖమైన తామరపూ మొగ్గలా ఉంటుంది. దాన్లో ఉండేఖాళీ స్థలాన్ని (space) సూక్ష్మాకాశం అంటారు. హృదయాన్ని దహరం అని కూడా అనడం చేత దీన్ని దహరాకాశమని  చెబుతారు. దీని నుండి ప్రాణాగ్నిజ్వాల శరీరమంతా వ్యాపించి ఉంటుంది. దహరాకాశంలో ఉండే అగ్నిజ్వాల మధ్యలో దేదీప్యమానంగా , మెరుపులా ప్రకాశించే ప్రాణాగ్ని ఉంది. ఇది ఒక సూక్ష్మస్థానం వద్ద వడ్లగింజపై కొనముల్లంత సూక్ష్మంగా ఉండే ప్రదేశంలో అంతమవుతుంది/ కేంద్రీకరింపబడి ఉంటుంది. అందే ఆత్మ భాసిస్తూంటుందని నారాయణ సూక్తం చెబుతుంది. ఈ ఆత్మస్థానం ఎలాఉంది అంటే, దహరంలో దహరం ఉన్నట్లుగా చెప్పబడింది. ఇక్కడ దహరం అంటే స్వల్పమనే అర్ధంలో వాడబడింది. అంటే సర్వ వ్యాపకమైన ఆత్మ జీవశరీరంలోఅంత సూక్ష్మంగా ఉన్నట్లుగా భావించాలన్నమాట.

త్రిప్పిన తామరపూమొగ్గలా ఉండే హృదయంలో గల సూక్ష్మాకాశం సమీపాన  బిందుమాత్రంగా సూక్ష్మమైన ద్వారం ఉంది. బయటివాడు లోపలకు రావాలన్నా , లోపలివాడు బైటకు పోవాలన్నా ఈ ద్వారం నుండే రాకపోకలు జరగాలి. సాధనలో పరిపక్వత చెందిన జీవుడు, ముడుచుకుని, ముడుచుకుని ఈ ద్వారంలోపలికి ప్రవేశించి ఆత్మస్థానంలో లీనమవుతాడు. ఇట్టి స్థితి జీవుడు శివుడైనప్పుడే ప్రాప్తిస్తుంది. అలాగే సత్ స్వరూపం/శివుడు దేహేంద్రియాలు అంతఃకరణంతోను అవతరించేప్పుడు అహంకారం అంకురించి జీవభావంతో ఆ హృదయద్వారం గుండానే బయటకు రాగా; తాను బ్రహ్మమునకన్న భిన్నుడననే భావం కల్గుతుంది. ఇదే శివుడు జీవుడిగా అవతరించడమంటే. జీవుడు ముక్తి పొందినప్పుడు తన గుర్తింపును శాశ్వతంగా కోల్పోయి హృదయం మధ్యలో ఉండే ఆత్మస్థానంలోనే ఐక్యం చెందుతాడు. ఇలా శివుడు జీవుడవ్వాలన్నా, జీవుడు శివుడవ్వాలన్నా దానికి హృదయమే మూలకారణం. 


Thursday, October 10, 2013

జ్ఞానయోగము- సాధన (11)



ముముక్షుత్వంతో సాధన చతుష్టయం పూర్తయింది.
భారతీయ తత్వచింతనకు తలమానికాలైన ప్రస్థానత్రయంలో ఒకటైన బ్రహ్మసూత్రాలు “అధాతో బ్రహ్మజిజ్ఞాస “ అనే సూత్రంతో మొదలవుతుంది. సాధన చతుష్టయం సమకూరిన తర్వాత బ్రహ్మజిజ్ఞాస చెయ్యాలి అని సూత్రార్ధం. అంటే బ్రహ్మజ్ఞానంకోసం విచారణ చెయ్యాలన్నమాట. వైరాగ్య ముముక్షుత్వాలు తీవ్రంగా లేకపోతే ఆత్మ తెలియబడదు. తీవ్రసాధన ఉన్నపుడే మనస్సు నియమించబడి, ఉన్నతస్థితిని చేరుకోగలం. 
   
ఆత్మజ్ఞానం కలగాలంటే సాధనచతుష్టయం తోబాటు అంతరంగ సాధనాలైన శ్రవణ మనన నిదిధ్యాసనలు ఉండాలి. సాధన చతుష్టయం పూర్తిగా అంతరంగ సాధనం కాపోయినా దీన్లోకే చేరుతుంది. సాధన చతుష్టయం పూర్తిచేసుకున్న ముముక్షువుకు ఈ సందర్భంలో శ్రవణ మననాలను గాకుండా శంకరులు భక్తి ప్రస్తావన చెబుతారు. జ్ఞానమార్గంలో అడుగు పెట్టడానికి ముందే మనస్సు ఏకాగ్రమవ్వడానికి నిష్కామ కర్మ , భక్తి చెప్పబడ్డాయి. అవి  పరోక్షంగా ఉపకరించే బాహ్యాంగ సాధనాలని చెబుతారు.  సాధనచతుష్టయంలో అడుగు పెట్టడానికి ముందు  ఏకాగ్రతకోసం చెప్పబడ్డ భక్తి క్రింది స్థాయికి చెందినది. ఇది బాహ్య సాధనంగా చెప్పబడింది. అలాగే జ్ఞానానికి, జ్ఞానోదయం అయ్యాకా కూడా పుట్టే  ఉన్నత స్థాయికి చెందిన భక్తిదశలు ఉన్నాయి. ప్రస్తుతం అంతరంగ సామాగ్రి గురించి చెప్పుకునే సందర్భంలో భక్తి ముఖ్యమైన అంతరంగ సాధనంగా పేర్కోవడం జరిగింది.

క్రిందిదశలో  సాధకుడు సగుణాకారంపై దృష్టిపెట్టి ఏకాగ్రత పొందుతాడు. సాధన చతుష్టయం పూర్తయ్యాకా, నిరాకార నిర్గుణ వస్తువుపై దృష్టిపెట్టి భక్తిని చూపుతాడు. ఈ దశలో నిరాకార నిర్గుణ వస్తువుపై భక్తిని చూపెట్టడం కూడా సులువే. అంటే ఈ దశలో ప్రేమ చూపడానికి వస్తువు అవుసరం లేదు. తనంత అదే పెల్లుబికి వస్తుంది. ఇలాంటి అవ్యాజమైన  ప్రేమ లేకపోతే, సాధకుడికి ఈ దశలోనూ అహంకారానికి లోనయ్యే /దారితీసే ప్రమాదము ఉంటుంది. సృష్టిలో జీవులన్నిటినీ కలిపి ఉంచేది ప్రేమ. ప్రేమలో తనకు తాను అర్పించుకోవడమే ఉంటుంది. అంటే యితరులకు తృప్తి కలిగిస్తూ తృప్తిని పొందటం. కోరిక అనేది పొందటాన్ని సూచిస్తే, ప్రేమ పంచి ఇవ్వడాన్ని సూచిస్తుంది. ఐతే ఇలాంటి ప్రేమ కలగాలంటే అంతఃకరణం శుద్ధమవ్వాలి. అప్పుడు మనస్సు బుద్ధీ అహంకారం వేపుకు లాగబడితే, అంతఃకరణం దానికి శాశ్వత నిలయమైన హృదయంవేపు పరుగుతీసి అది హృదయస్థానం నుండే పనిచేస్తుందన్నమాట.

మనస్సును ( అదే  అంతఃకరణాన్ని) ఆత్మలో లీనం చెయ్యాలని గదా చెప్పుకున్నాం. ఆత్మ అంతటా వ్యాపించి ఉంది. ఆత్మలేని చోటే లేదు. ద్వైతభావంతో ఉండే మనం మనస్సుని ఆత్మపై లగ్నం చెయ్యడానికి ; నిర్గుణము నిరాకారము ఐన ఆత్మను మానసికంగా ఒకచోటున ఉన్నట్లుగా ఊహించుకోవాలి. వాస్తవంగా బ్రహ్మమునకు/ఆత్మకు  ఒక ప్రదేశమంటూ చెప్పలేపోయినా , ఉపాధి విశేషం చేత జీవుల హృదయాన్ని స్థానం కల్పించినట్లుగా బుధజనులు చెబుతారు.
 





Friday, October 4, 2013

జ్ఞానయోగము- సాధన (10)


ఇక మూడవ దశలో శ్రవణ మనన నిదిధ్యాసనలనే అంగములు ఉన్నాయి.  
అన్నిటినీ వదలటమే సన్యాసం. ఇలా సాధనచతుష్టయం తర్వాత సన్యాస స్వీకారం ఉంటుంది. జీవన్ముక్తి లభించేదాకా సాధకుడు ముముక్షువుగానే చెప్పబడతాడు. గురువుపట్ల శరణాగతి ఉండాలి. అప్పుడే తన ప్రయత్నంతో బాటు గుర్వనుగ్రహం తోడై సాధనలో పురోగతి చెందుతాడు. శాస్త్రజ్ఞానంతో అనుభవజ్ఞానమూ కలుగుతుంది. వైరాగ్యము, ముముక్షుత తీవ్రంగా లేకపోతే ఆత్మ తన రూపాన్ని చూపదు. ఈ దశలో మనస్సు ప్రశాంత స్థితిలో ఉన్నా, అది భ్రాంతి అనే అనుకోవాలి. సాధనలో ముముక్షుత, వైరాగ్యమూ తీవ్రతరం చేస్తే మనస్సు నియమించబడి, ఉన్నత స్థితిని చేరుకో గల్గుతాడు.

ఈ సందర్భంలో శ్రవణ మననాలను గాకుండా శంకరులు భక్తి ప్రస్తావన తెస్తారు. జ్ఞానమార్గంలో అడుగు పెట్టడానికి ముందు మనస్సు ఏకాగ్రమవ్వడానికి నిష్కామ కర్మ , భక్తి చెప్పబడ్డాయి. అవి  పరోక్షంగా ఉపకరించే బాహ్యాంగ సాధనాలని చెబుతారు. సాధకుడికి ముందునుంచీ భక్తి ఉంటుంది. ఇలా సాధనచతుష్టయం అభ్యసించాకా సన్యాసము, మహావాక్యోపదేశము అవుతాయి. శ్రవణ మనన నిదిధ్యాసనాలతో మార్గం పూర్తవుతుంది. ఆ తర్వాత ఆత్మ సాక్షాత్కారము,  జీవన్ముక్త స్థితీ ఉంటాయి. బ్రహ్మ సాక్షాత్కారం కలిగేదాకా సాధకుడు ముముక్షువే.

ఇలా మొదటిదశలో – కర్మయోగంద్వారా చిత్తశుద్ధి, భక్తియోగంతో మనస్సు ఏకాగ్రతను పొందడమనేవి జ్ఞానయోగంలో ప్రాధమికాలు. అప్పుడు ఆత్మవిచారణకు పూనుకునే అర్హత వస్తుంది.

రెండవ దశలో – సాధనచతుష్టయం సాధించాలి. దీనివల్ల దుష్టవాసనలు చాలామట్టుకు పెకలించ బడుతాయి.

మూడవ దశలో – సన్యాస స్వీకారము, ఉపదేశము, శ్రవణ మనన నిదిధ్యాసనలు ఉంటాయి. ( విద్యా గురువు వేరు, దీక్షాగురువు వేరుగాను ఉండవచ్చు. లేదా పూర్వాశ్రమంలో గురువే దీక్షాగురువు కావచ్చు).

చివరిదశలో – ఆత్మసాధన. దీన్లో కర్మపరిత్యాగము, బ్రహ్మవిచారణ, ఆత్మసాక్షాత్కారము ఉంటాయి.
క్రింది స్థాయిలో ఏ యోగాన్ని అభ్యసించేవానికైనా భక్తి అవుసరమే. ఈశ్వరుడిపై భక్తినిచూపే భక్తుడే, అంటే క్రింది స్థాయిలో ఉండే భక్తుడే కర్మఫలాలను ధారపోయ్యాలి. అద్వైతజ్ఞానం అందరికీ ఉండాల్సిందే ఐనా అద్వైత సాధన మాత్రం జ్ఞానులకనే చెప్పబడింది.




Thursday, September 26, 2013

జ్ఞానయోగము- సాధన (9)


ముముక్షుత్వం-2


ముక్తి  దేన్నిచేరుకోవాలో అనేదాన్ని గాక, విడచిపెట్టడాన్నిమాత్రం సూచిస్తుంది. లోకాయత దర్శనం తప్ప తక్కినవన్నీ సంసారం నుండి ఎలా విముక్తిని పొందాలనేదే వివరిస్తాయి. బౌద్ధం శూన్యం గురించి, న్యాయశాస్త్రం అపవర్గం గురించీ చెబుతాయి. అంటే దుఃఖరహిత స్థితినే గాని బ్రహ్మానందాన్ని కాదు. సాంఖ్యులు చెప్పే కైవల్యం అనేదీ, ప్రకృతినుండి, మాయాప్రపంచం నుండీ విముక్తేగాని ఆనందస్థితిని గురించి చెప్పలేదు. పతంజలి యోగసూత్రాలలో చిత్తవృత్తులను నిరోధిస్తే సంసారం నుంచి విముక్తి అనే చెప్పడం జరిగింది. ఐతే వేదాంతంలో మోక్షమంటే బ్రహ్మానుభవమే. జీవుడే బ్రహ్మము. దీన్లో సాధన అంతా మాయాబంధాన్ని త్రెంచుకోవడమే. అది తొలగ గానే, ఎప్పుడూ ఉండే సహజమైన ఆనందస్థితిలో ఉంటాడన్నమాట.

ఈ దశదాకా వచ్చిన సాధకుడి మనస్సు చలించకుండా ఉండాలి. మనస్సు చలిస్తే పెద్ద అపరాధం చేసినట్లవుతుంది. తనంత తాను సరిదిద్దుకోనూ లేడు, సమర్ధించుకోనూ లేడు. అంచేత స్వప్రయత్నంతో బాటు గురుకటాక్షం ఉండాలి. శ్రద్ధ సమాధానాల గురించి చెప్పేటప్పుడు బుద్ధితో కలిపారు. ప్రస్తుతం ముముక్షుత్వం ప్రస్తావించేప్పుడు శంకరులు మనస్సుతో కలిపారు. మనస్సు లేదని భావించే దశకు వచ్చేవరకూ; మనసు మంచి విషయాలనే గాక, చెడు విషయాలనూ అనుభవిస్తుంటుంది. అంచేత ముముక్షువు చెడు నుంచి మనస్సును మరల్చాలి. ఎపుడైతే మనస్సు లేదని భావించే దశకు చేరుకుంటాడో, అంటే మనస్సు పూర్తిగా లయమైనప్పుడు ఇక మంచినీ త్యజించ గలగాలి. అంటే మంచీ చెడులను గ్రహించే మనస్సును ఆత్మలో లీనం చెయ్యాలి. ఇంకో విధంగా చెప్పాలంటే మంచీచెడులను ఆలోచించకు.

కర్మలను చేయించడానికి, వాటి ఫలాలను అనుభవింప చేయించేదీ మనస్సే. అవిద్య కూడా మనస్సు పరిధిలో ఉండేదే. అందుకే మనస్సును విడిచిపెట్టాలి. విడిచే ముందు దాన్లో దట్టంగా ఉన్న వాసనలను శుభ్రంచేసి, తెలికయ్యేలా చెయ్యాలి. ముముక్షుత తీవ్రంగా లేకపోయినా, గురువు అనుగ్రహం లేకపోయినా ఆత్మను తెలుసుకోలేరని చెబుతారు. ఇక్కడ గుర్వనుగ్రహం అంటే భగవదనుగ్రహమే. ఈశ్వరుడే గురురూపంలో వచ్చాడని శిష్యుడు భావించాలి. అద్వైత సాధనలో ఉపాసనకు బదులు జ్ఞానాన్వేషణ మాత్రమే ఉంటుంది. ఇంత పరిపక్వ దశకు చేరినా ఇంకా తనకు అర్హత లేదేమో అనే భావనలు కలుగుతుంటాయి. అట్టి భావాలను గట్టి ప్రయత్నంతో గెంటి వేస్తూ, నాకు గుర్వనుగ్రహం ఉంది గనుక  నాఆశయాన్ని నేరవేర్చుకుంటా ననే నిశ్చయానికి వస్తాడు. ఇలా ముముక్షుత్వంతో సాధన చతుష్టయం పూర్తయింది.