Monday, September 17, 2012

త్రిగుణాలు -1


త్రిగుణాలు  
సత్వగుణము, రజోగుణము, తమోగుణము అనే మూడూ త్రిగుణాలుగా చెప్పబడే ప్రకృతి గుణాలు. ప్రకృతిలో ఈ మూడు గుణాలూ  సమతుల్యంగా ఉంటాయి. ఈ మూడు గుణాలలోను హెచ్చు తగ్గులు కల్గినపుడు సృష్టి ఆరంభమవడానికి సంకేతంగా అనుకోవచ్చు.  ప్రకృతి వల్లనే జగత్తు ఏర్పడినప్పుడు, సృష్టిలో ప్రతీ జీవిలోను, పదార్ధంలోనూ ఈ మూడు గుణాలూ ఉంటాయి. ఒక్కో జీవి నిర్మాణాన్ని బట్టి, ఈగుణాలు  వేర్వేరు పాళ్ళల్లో ఉంటాయి.  ఈ మూడు గుణాలు పరస్పరం కలయికతో విభిన్నమైన జీవరాశులు ఏర్పడుతున్నాయి. అలాగని ఈ గుణాలు ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండవు. పరిస్థితులను బట్టి, ఒకోసారి సత్వగుణమూ మరోసారి రజోగుణమూ మరోసారి తమో గుణమూ ఆధిక్యంలో ఉంటాయి. ఈ మూడు గుణాలలో  ఒక గుణము హెచ్చుగా ఉంటే ,  మిగిలిన రెండూ  తక్కువగా ఉంటుంటాయి. సత్వగుణమంటే జ్ఞానశీలతగాను, రజోగుణాన్ని క్రియాశీలతగాను, తమోగుణాన్ని స్థితిశీలతగాను సామాన్యంగా  చెప్పవచ్చు.

సత్వగుణ కార్యము వల్ల పుణ్యము, రజోగుణ కార్యము వల్ల దుఃఖము, తమోగుణ కార్యము వల్ల అజ్ఞానము కలుగుతాయి. సాధనలో అందుకే ముందు తమోగుణాన్నితగ్గించుకోవాలనీ, సత్వగుణాన్ని పెంపొందించు కొవాలనీ చెబుతారు. ఒక గుణం ఎప్పుడు అధికమవుతుందో అప్పుడు మిగిలిన రెండూ తగ్గుతాయని అంటారు. ఆతర్వాత శుద్ధ సత్వాన్నిపొంది చివరగా దాన్నీ త్యజించి త్రిగుణాతీతంగా అవ్వాలని చెబుతారు. అప్పుడు చిత్తవృత్తులన్నీ అణుగుతాయి. మీ మనస్సు మీరు చెప్పినట్లు వింటుంది. దాంతో గమ్యాన్ని చేర వీలవుతుందని విజ్ఞులు బోధిస్తుంటారు. 

రజోగుణం

క్రియారూపమైన విక్షేపశక్తి రజోగుణ సంబంధమైనది. దీని వల్లనే సమస్త క్రియలూ జరుగు తున్నాయి. రాగము, దుఃఖము అనే మనోవికారాలు కలుగుతున్నాయి. కామము, క్రోధము, లోభము, దంభము, అసూయ, అహంకారము, ఈర్ష్య , మత్సరమనే ఘోర లక్షణాలు రజోగుణ ధర్మములుగా చెప్పబడ్డాయి. రజోగుణము రాగము  లక్షణముగా గలదై ఆశ, మమకారములచేత, కర్మయందు ఆసక్తికలిగించి దేహిని బంధిస్తోంది. రజోగుణము పెరిగినపుడు లోభము, కర్మ ప్రవృత్తి, అశాంతి, భోగలాలసత్వము కల్గుతాయి. ఈ గుణాదిక్యత యందు మరణిస్తే , కర్మయందాసక్తిగల మానవజాతి యందు పునర్జన్మ కలుగుతుందని అంటారు. వీరు యక్షులను, రాక్షసులను ఆరాధిస్తారు. 

ఎక్కువగా ఉప్పు, కారము, పులుపు,  చేదు , ఎక్కువ వేడిగా ఉండి దాహాన్ని, ఉద్రేకాన్ని కల్గించే ఆహార పదార్ధాలు  రాజసునకు ఇష్టము. ఇవి దుఃఖము, శోకము,  రాగములను కల్గిస్తాయి. ఇలాంటి ఆహారం మనస్సును విచలితం చేసి ప్రాపంచిక సుఖాలవేపుకు లాగుతుంది. గ్రుడ్లు, చేపలు, ఉప్పు, కారం, కుంకుమ పువ్వు, పిండి వంటలూ, మసాలా వంటి సుగంధ ద్రవ్యాలు, శరీరాన్ని ఉద్రేక పరచే కాఫీ , టీ , వేడి పాలు వంటివి రాజసిక ఆహారంలోకి వస్తాయి. అతిగా తినేది ఏదైనా రాజసిక ఆహారమే.
 
ఒక ఫలితాన్ని ఆశించి గాని,  ఆడంబరంతోగాని  చేసేది  రాజసిక యజ్ఞం అనబడుతుంది. పుణ్యం కల్గుతుందనిగాని, లేక తిరిగి సహాయం పొందే ఉద్దేశ్యంతోనూ, బాధతోనూ చేసేది రాజసిక కార్యం అనబడుతుంది.

Sunday, September 16, 2012

వాసనలు

నిర్మలమైన మనస్సు నిశ్చలంగా ఉండే సరస్సు లాంటిది. నిశ్చలంగా ఉండే సరస్సులో ఏ ఒక చిన్న రాయిని విసిరినా, అనేకమైన తరంగాలు కల్గుతాయనేది మనకందరకూ తెలిసిన విషయమే. కొంత సమయం తర్వాత ఆ అలలు శాంతించి సరస్సు తిరిగి నిశ్చలంగా అవుతుంది. కాని దాన్లోకి విసరిన రాయి మాత్రం సరస్సు అడుగు భాగంలో ఉంటుంది.


అలాగే  మన మనస్సు బాహ్య విషయాల వేపుకు పోయినపుడు నిర్మలంగా ఉండాల్సిన చిత్తమనే సరస్సులో; ఆ విషయాకృతిని చెందేపుడు వృత్తులనే తరంగాలు కలుగుతాయి. అప్పుడు మనస్సు వికారాలకు (మార్పు) లోనవుతుంది. సరస్సులో విసిరిన రాయి ఎలా అడుగు భాగాన ఉండే ఉంటుందో, అలా విషయానుభవం గతించినా ఆ విషయానుభవం మాత్రం బీజరూపంలో సంస్కారరూపంగా ఉంటుంది. అలా బీజరూపంలో ఉండే సంస్కారాలనే వాసనలు అని అంటారు. ఈ వాసనలు అనుకూల పరిస్థితులు కల్గినపుడు తలెత్తుతాయి. ఇలాంటి విషయానుభవాలనే వాసనలు, అనేక జన్మల నుండి ఏర్పడినవై చిత్తంలో ఉంటాయి.
          
ఈ వాసనలు/ సంస్కారాలు  మంచివైతే సద్వర్తనమూ, చెడువైతే దుష్టవర్తనమూ కలుగుతాయి. దుష్ట సంస్కారాలను(మలిన వాసనలను) వీటికి వ్యతిరేకమైన వాసనలతో అంటే శుద్ధవాసనలతో అరికట్ట వచ్చని 
పెద్దలు చెబుతారు. ముక్తికి తోడ్పడేవి శుద్ధ వాసనలనీ, సంసారంలో బంధించేవి మలినవాసనలనీ అంటారు.

శుద్ధ వాసనలు – కరుణ, మైత్రి లాంటి  సుహృద్భావాలను కలిగి ఉండటం, వేదాంత శ్రవణము సజ్జన సాంగత్యము మొదలైన వాటిపై అభిరుచి కలిగి ఉండటం వంటివి శుద్ధ వాసనల లోకి వస్తాయి. వీటిని సిద్దావస్థ కలిగే వరకూ వదలి పెట్ట కూడదని అంటారు.

మలిన వాసనలు – సమాజంలో వివిధ మనస్తత్వాలు కలిగిన వ్యక్తులుంటారు. అందరికీ అనుగుణంగా ప్రవర్తించడం లోక వాసనల్లోకి వస్తుంది. జ్ఞాని నిందా స్తుతులకు దూరంగా ఉంటాడు. ధర్మమార్గంలోనే వ్యవహరిస్తాడు. అంచేత లోకులను తృప్తి పరచాలనేది ఉండదు.

శాస్త్రాధ్యయనమనేది బ్రహ్మవిద్యకు ఎంత వరకూ అవుసరమో అంతవరకే చెయ్యాలి. వేదాంత శ్రవణం చెయ్యకుండా కేవలం శాస్త్రాధ్యయనంతో సమయాన్ని గడపటం ఒక వ్యసనంగా మారి, మలిన వాసనలలో చేరుతుంది. కొందరు మడి అనీ, వారాలనీ , పలానా తిధి అనీ ఇలా అనేకమైన వాటిని ఆచరిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటారు. అనుష్టానమనేది వ్యసనంగా ఏర్పడి దాన్లోనే ఉండటం వల్ల ; బ్రహ్మవిద్యకు ప్రతిబంధక మవుతుంది.

మరికొందరు శాస్త్రజ్ఞానం లేనివారు,  శాస్త్రజ్ఞానం ఉన్నచార్వాకులలోనూ ఈ దేహమే నేను అనే భావన ఉండి, ముక్తితో పని లేదనే చెబుతారు. దేహం నశించేది కాబట్టి, దాంతో అన్నీ నశిస్తాయి. అంచేత ఏదో ఎక్కడో లభిస్తుందని ఇప్పుడు సమయం వృధా చేసుకోకూడదని వాదిస్తారు. కొందరు శరీరం బుద్బుద ప్రాయమనేది మరచి,  దేహభ్రాంతి వల్ల శరీర సౌందర్యానికి పాటుబడుతుంటారు. కొందరు పుణ్యనదుల స్నాన మాచరించడం వంటి  శాస్త్ర విహిత కర్మలందే  లగ్నమవ్వడం వల్ల, వారు పావనమవ్వవచ్చే గాని పురుషార్దానికి దూరం అవుతారు. అంచేత ఇవి మలినవాసనలలోకి వస్తాయి.

కొందరు తమకు అపవిత్రత కలిగిందనే భావంతో స్నానాదులను, సంధ్యావందనాదులను అనుష్ఠానం చెయ్యడంచేత ఆ అపవిత్రతను తొలగించు కొంటున్నామనే భ్రాంతితో ఉంటారు. శాస్త్ర, దేహ, లోక వాసనలు బంధ హేతువులుగా చెప్ప బడ్డాయి. ఇవే గాక ఇంద్రియ వాసనలూ బంధహేతువులే. శుద్ధవాసనలతో  మలిన వాసనలను అరికట్ట వచ్చునని పెద్దలు చెబుతారు.
        
          

Saturday, September 15, 2012

స్థూల,సూక్ష్మ,కారణ శరీరములు-2

సూక్ష్మశరీరం --------------------------

సూక్ష్మశరీరం స్థూలశరీరానికి లోపల ఉంటుంది. కంటికి కన్పించదు. శరీరం ఏర్పడటంలో ముందుగా కారణశరీరము, పిదప సూక్ష్మశరీరము, ఆ తర్వాత స్థూలశరీరము ఏర్పడతాయి. ఒకదాని కొకటి లోపలగా స్థూలశరీరంలో సూక్ష్మ శరీరమూ, సూక్ష్మశరీరంలో కారణ శరీరమూ ఉంటాయి. ప్రాణమే పంచప్రాణాలుగా సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరంతో అనుసంధానం చేస్తుంది. 
        
తైజసుడు దీని అభిమాని. స్వప్నావస్థలో వ్యక్తమవుతుంది. స్వప్నావస్థలో ఇంద్రియాలు పనిచెయ్యవు. ఈ స్వప్నావస్థలో తైజసుడు 17 తత్వాలతోను అనేక క్రియలను జరుపుతూంటాడు. జాగ్రత్తులో చూసినదీ, చూడనిదీ, విన్నవీ, విననివీ, అనుభవించినవీ, అనుభవించనివీ, నిజమైనవీ, నిజంకానివీ, గత జన్మల అనుభవాలనూ  స్వప్నంలో చూస్తుంటాడు. కంఠస్థానము ఆశ్రయం. ఇది వాసనలతో కూడి ఉండటం వల్ల, కర్మ ఫలాలను అనుభవింప జేస్తుంది.  ఆత్మ, సంగ రహితమైనది. ఈ సూక్ష్మ శరీరం/లింగ శరీరం చిదాత్మ రూపుడైన పురుషుని వ్యాపార సాధనకు కరణమై ఉంటుంది(అంటే సాధనము).
      
మరణానంతరం వివిధ లోకాల్లోకి, శరీరాల్లోకి ఇదే ప్రయాణం చేసేది. స్థూల శరీరం పడిపోగానే జీవుడు ఈ సూక్ష్మ శరీరంతో యాతాయాతాలు చేస్తుంటాడు. వాస్తవంగా ఇవి జీవుడికి లేవు. ఇవి సూక్ష్మ శరీరానికే.  సూక్ష్మ శరీరం ఎక్కడికి వెడితే అక్కడ ఆత్మ ఉంటుంది. అక్కడ ఆ శరీరంతో సంబంధపడుతుంది. దేశ , కాల , మాన , పరిస్థితులను అధిగమించి  ఈ సూక్ష్మ శరీరం పయనించ గల్గుతుంది. ఇది మరణానికి ముందు చేసిన తప్పొప్పులను బేరీజు వేసుకొని, చేసిన పనులకు పశ్చాత్తాపం పడి, తనంత తానే ఒక నిర్ణయానికి వస్తుందని అంటారు. స్వచ్చందంగా; తానెలాంటి తల్లితండ్రులకు పుడితే  ఉద్ధరించ బడుతుందో, ఎలాంటి జీవితాన్ని గడపాలో , ఎలాంటి శరీరాన్ని పొందాలో ఇవన్నీనిర్ణయించు కొంటుంది. తిరిగి జన్మించగానే తాను తీసుకున్న నిర్ణయాలు మరచి , దృశ్య ప్రపంచం వేపు అనురాగంతో ఈ జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూంటుంది. అంటే మన తల వ్రాతను మనమే వ్రాసుకొంటున్నామన్న మాట.       

కారణ శరీరము

జాగ్రదావస్థ యందు ఇంద్రియములతో చేసే కర్మల ఫలితాలను, వాసనారూపంలో కారణ శరీరంలో  పొందు పరచబడి ఉంటాయి. ఇవి మరు జన్మకు కారణమవుతాయి. అలా మరుజన్మకు కారణమయ్యే వాసనలు దీన్లో ఉండటం వల్ల దీన్ని, కారణ శరీరమంటారు. కాని ఇది ఆత్మ కాదు.

కారణశరీరం అవ్యక్తము. దీన్లో సత్వరజస్తమములనే  మూడు గుణాలూ ఉంటాయి. ఆత్మకు కారణ శరీరమిది.  శరీర పతనానంతరం కారణ శరీరం, ఆత్మతో శరీరాన్ని వదలి పోతుంది.  నిష్క్రియుడైన ఆత్మ ఈ కారణశరీరంలో ఉంటుంది. సుషుప్త్యావస్థలో ఇంద్రియాలు మనస్సులో లీనమై ఉంటాయి. అంచేత అవి పనిచెయ్యక బాహ్య అనుభవాలు మనకు రావు. ప్రాణ శక్తులు మాత్రమే పనిచేస్తుంటాయి. ఈ ప్రాణమే  గాఢనిద్రలో శరీరం యొక్క సమస్త వ్యాపారాలనూ నడిపిస్తుంది. ఇంద్రియవృత్తులు, మనస్సూ తనలో (ఆత్మలో) లీనమై ఉంటాయి. అలాంటి సుషుప్తిలో ఈ కారణ శరీరం మాత్రమే భాసిస్తుంది/ ఉంటుంది. సుషుప్తిలో ఏమీ తెలియదు. సుషుప్తి నుంచి లేచాక, నేను బాగా నిద్రపోయాను అని తెలుసుకొనేది మనస్సు. దీనికి అభిమాని ప్రాజ్ఞుడు. ప్రాజ్నుడిది హృదయ స్థానం. ఏమీ తెలియని స్థితి అయిన సుషుప్తిలో కేవలం అవిద్యయే ఉంటుంది. అంటే అవిద్యచేత కారణ శరీరం ఏర్పడుతుంది. ఇది వాస్తవమైనది కాదు గనుక , బ్రహ్మజ్ఞానం వల్ల అజ్ఞానం (అవిద్య) నశించగా ఇదీ నశిస్తుంది.

ఈ మూడు శరీరాలకూ ఆత్మే సాక్షి. దేనితోనూ తాదాత్మ్యం చెందదు. స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలకు భిన్నంగా; స్వప్రకాశ రూపమై కర్తగా గాని , భోక్తగా గాని కాకుండా అన్నిటికీ చైతన్యాన్ని ఇచ్చే ఆత్మయే మహాకారణ శరీరంగా చెప్పబడింది. ఇది గాఢనిద్రలో అనుభవంలోకి వచ్చే స్థితి. ఇదే తురీయావస్థ. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తీ  స్థూలశరీర ధర్మాలు. స్థూలశరీరం- క్రియాశాక్తికీ , సూక్ష్మశరీరం- ఇచ్ఛాశక్తికీ , కారణశరీరం- జ్ఞానశక్తికీ ఆశ్రయాలుగా చెప్పబడ్డాయి.                   



Thursday, September 13, 2012

స్థూల,సూక్ష్మ,కారణ శరీరములు-1



శరీరము మజ్జ, ఆస్థి, క్రొవ్వు, రక్తము,శుక్లము, మాంసము, చర్మము అను  సప్త ధాతువులచే ఏర్పడినది. పాదములు, తొడలు, వక్షస్థలము, భుజములు, వెన్ను, మస్తకము అనే  అవయవాలు ఉపాంగములుగా కల్గి, మలమూత్ర భరితమై నేను, నాదను అహంకార మమకారములకు ఆశ్రయమైనది  స్థూల దేహము. ఇది పంచ భూతముల  కలయికచే ఏర్పడటంచేత పంచభూతాత్మకమని చెప్పబడింది. ఈ భూతముల తన్మాత్రలే జీవునికి శబ్ద స్పర్శాది విషయాలుగా సుఖమును కలిగించి, వాటియందు రాగ బధ్ధులను చేసి కర్మానుసారముగా సంసారమున  త్రిప్పుతుంది. అవిద్య వల్ల విషయానురాగము,  పరమార్ధమును  వదలి  శరీర పోషణకే నిమగ్నమయేటట్లు మనలను చేస్తుంది.

కాలము మ్రింగివేయని వస్తువేదీ ఈ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో అన్నపానాదులు, స్త్రీ పురుష సంగాది ఇంద్రియ విషయాలే తప్ప ఏపురుషార్ధమూ లేదు. ముల్లోకాలనబడే పాతాళ, భూ, స్వర్గ లోకాల్లో పంచ భూతాలే తప్ప ఆరవ వస్తువేదీ లేదు. శరీరం నేడో రేపో నశించి పోయేదని  తెలిసినా, అజ్ఞానం వల్ల ఆ శరీర హితము కోసమే ప్రయత్నిస్తున్నాం. ఎలాంటి వ్యక్తైనా  దృశ్య పదార్ధాల మీద ఆశ చేతనే  బంధించ బడుతున్నాడు. భోగ విషయాలపై వాంఛ బంధము. వాంఛలు త్యజించడం మోక్షమని యోగ వాశిష్టం చెబుతోంది. 
     
పంచీకృత మహా భూతములతో  స్థూలదేహము ఏర్పడింది.  శరీరం ఆత్మకు భోగస్థానం. దీంతో తాదాత్మ్యం చెందటం వల్ల శరీరమే తాననుకొని, వివిధ విషయాలను బాహ్యేంద్రియాల ద్వారా సేవిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. స్థూలశరీరం వల్లే జీవుడికి బాహ్యజగత్తు కలుగుతోంది. ఈ స్థూల శరీరానికే జననము, వార్ధక్యము, మరణమనే ధర్మాలుంటాయి. బాల్య యౌవన కౌమారాది అవస్థలు, అనేక వర్ణాశ్రమ నియమాలు, మానావమానాలు, పూజ బహుమానము వంటివి కలుగుతున్నాయి. ఈ స్థూల శరీరమే జాగ్రదావస్థలో కనిపించేది. దీని యందు అభిమానమున్న చైతన్యము విశ్వుడు లేక వైశ్వానరుడు. బుధ్ధి జాగ్రదావస్థ యందు వివిధ వాసనలతో కలసి కర్తృత్వ భావంతో భాసిస్తుంటుంది. సాక్షికి  బుధ్ధి ఉపాధిగా ఉన్నా, బుద్ధిచే చెయ్యబడే కర్మలు సాక్షికి అంటవు. ఎందుకంటే సాక్షి అసంగమైనది.  

సూక్ష్మశరీరం 

పంచ ప్రాణాలు, పంచ కర్మే౦ద్రియములూ , జ్ఞానేంద్రియములు , మనస్సు , బుద్ధితో కలసి 17 తత్వములతో కలసి  లింగశరీరము / సూక్ష్మ శరీరము ఏర్పడుతుంది. (వేదాంత పంచదశి). స్థూల శరీరం పంచీకృత మహాభూతాలచే ఏర్పడగా , సూక్ష్మ శరీరం అపంచీకృత భూతములతో ఏర్పడుతోంది. అంటే సూక్ష్మ భూత తన్మాత్రలతో ఏర్పడుతోంది. 

(కొన్ని చోట్ల దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, అంతఃకరణంతో కలసి 21 తత్వాలతో సూక్ష్మశరీరం ఏర్పడుతున్నట్లుగా చెబుతారు.
వివేక చూడామణిలో ఆదిశంకరులు- 1) జ్ఞానేంద్రియాలు  2) కర్మేంద్రియాలు  3) ప్రాణ పంచకము 4) పంచభూతాలు
5) అంతఃకరణ చతుష్టయము 6) అవిద్య  7) కామము  8) కర్మ కలసి - ఈ 8 తత్వాలూ సూక్ష్మ శరీరాన్ని ఏర్పాటు చేస్తాయంటారు). 

                                                                                           (ఇంకా ఉంది)