శరీరము మజ్జ,
ఆస్థి, క్రొవ్వు, రక్తము,శుక్లము, మాంసము, చర్మము అను సప్త ధాతువులచే ఏర్పడినది. పాదములు, తొడలు,
వక్షస్థలము, భుజములు, వెన్ను, మస్తకము అనే
అవయవాలు ఉపాంగములుగా కల్గి, మలమూత్ర భరితమై నేను, నాదను అహంకార మమకారములకు ఆశ్రయమైనది
స్థూల దేహము. ఇది పంచ భూతముల
కలయికచే ఏర్పడటంచేత పంచభూతాత్మకమని చెప్పబడింది. ఈ భూతముల తన్మాత్రలే
జీవునికి శబ్ద స్పర్శాది విషయాలుగా సుఖమును కలిగించి, వాటియందు రాగ బధ్ధులను చేసి కర్మానుసారముగా
సంసారమున త్రిప్పుతుంది. అవిద్య వల్ల
విషయానురాగము, పరమార్ధమును వదలి
శరీర పోషణకే నిమగ్నమయేటట్లు మనలను చేస్తుంది.
కాలము
మ్రింగివేయని వస్తువేదీ ఈ ప్రపంచంలో లేదు. ఈ ప్రపంచంలో అన్నపానాదులు, స్త్రీ పురుష సంగాది ఇంద్రియ విషయాలే తప్ప ఏపురుషార్ధమూ లేదు. ముల్లోకాలనబడే
పాతాళ, భూ, స్వర్గ లోకాల్లో
పంచ భూతాలే తప్ప ఆరవ వస్తువేదీ లేదు. శరీరం నేడో రేపో నశించి పోయేదని తెలిసినా, అజ్ఞానం వల్ల ఆ శరీర హితము కోసమే ప్రయత్నిస్తున్నాం.
ఎలాంటి వ్యక్తైనా దృశ్య పదార్ధాల మీద ఆశ
చేతనే బంధించ బడుతున్నాడు. భోగ విషయాలపై
వాంఛ బంధము. వాంఛలు త్యజించడం మోక్షమని యోగ వాశిష్టం చెబుతోంది.
పంచీకృత మహా
భూతములతో స్థూలదేహము ఏర్పడింది. శరీరం
ఆత్మకు భోగస్థానం. దీంతో తాదాత్మ్యం చెందటం వల్ల శరీరమే తాననుకొని, వివిధ విషయాలను
బాహ్యేంద్రియాల ద్వారా సేవిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. స్థూలశరీరం వల్లే
జీవుడికి బాహ్యజగత్తు కలుగుతోంది. ఈ స్థూల శరీరానికే జననము, వార్ధక్యము, మరణమనే
ధర్మాలుంటాయి. బాల్య యౌవన కౌమారాది అవస్థలు, అనేక వర్ణాశ్రమ నియమాలు, మానావమానాలు,
పూజ బహుమానము వంటివి కలుగుతున్నాయి. ఈ స్థూల శరీరమే జాగ్రదావస్థలో కనిపించేది.
దీని యందు అభిమానమున్న చైతన్యము విశ్వుడు లేక వైశ్వానరుడు. బుధ్ధి జాగ్రదావస్థ
యందు వివిధ వాసనలతో కలసి కర్తృత్వ భావంతో భాసిస్తుంటుంది. సాక్షికి బుధ్ధి ఉపాధిగా ఉన్నా, బుద్ధిచే చెయ్యబడే
కర్మలు సాక్షికి అంటవు. ఎందుకంటే సాక్షి అసంగమైనది.
సూక్ష్మశరీరం
పంచ ప్రాణాలు, పంచ కర్మే౦ద్రియములూ , జ్ఞానేంద్రియములు , మనస్సు , బుద్ధితో
కలసి 17 తత్వములతో కలసి లింగశరీరము / సూక్ష్మ శరీరము ఏర్పడుతుంది.
(వేదాంత పంచదశి). స్థూల శరీరం పంచీకృత మహాభూతాలచే ఏర్పడగా , సూక్ష్మ శరీరం
అపంచీకృత భూతములతో ఏర్పడుతోంది. అంటే సూక్ష్మ భూత తన్మాత్రలతో ఏర్పడుతోంది.
(కొన్ని చోట్ల
దశేంద్రియాలు, పంచప్రాణాలు, పంచభూతాలు, అంతఃకరణంతో కలసి 21 తత్వాలతో సూక్ష్మశరీరం ఏర్పడుతున్నట్లుగా చెబుతారు.
వివేక చూడామణిలో
ఆదిశంకరులు- 1) జ్ఞానేంద్రియాలు 2) కర్మేంద్రియాలు 3) ప్రాణ పంచకము 4) పంచభూతాలు
5) అంతఃకరణ చతుష్టయము 6) అవిద్య 7)
కామము 8) కర్మ కలసి - ఈ 8 తత్వాలూ సూక్ష్మ శరీరాన్ని ఏర్పాటు
చేస్తాయంటారు). (ఇంకా ఉంది)
చాలా బాగుంది. ధన్యవాదములు.
ReplyDelete