Wednesday, December 25, 2013

జ్ఞానయోగము- సాధన (21)


నిదిధ్యాసన

తొట్రుపడకుండా శ్రద్ధాభక్తులతో సాధన కొనసాగించాలి. శ్రవణ మననాలచేత నిస్సందేహంగా దృఢపడిన అర్ధంపై మనస్సును స్థాపించడాన్ని నిదిధ్యాసనం అంటారు. తత్వం తెలుసుకునే మార్గానికి , శృతి- శ్రవణానికి,
యుక్తి - మననానికీ , అనుభవం - నిదిధ్యాసనకూ ప్రమాణాలని చెబుతారు. సాధనలో గమ్యం చేరడానికి కర్మవాసనలు పూర్తిగా నశించాలి. అవి బలీయంగా ఉంటే సాధనకు ఆటంకం ఏర్పడుతుంది. 

ఇంతకాలం నుండి సాధన చేస్తున్నా, లక్ష్యం చేరుకోగలనా లేదా అని భావన కలగడాన్ని సంశయం లేదా అసంభావన అనబడుతుంది. ఈ ఆటంకం వల్ల అద్వైతసిద్దిమీదే సందేహాన్ని కల్గించి, లక్ష్యం చేరలేనేమో అని, ద్వైతమే సత్యమేమో అనే భావనను కలిగించి, తాను బ్రహ్మమునకన్న భిన్నుడనని అనుకునే విపరీతభావన రెండో ఆటంకంగా ఏర్పడుతుంది. అసంభావన తొలగడానికి మననము, విపరీతభావన తొలగడానికి నిదిధ్యాసనమూ చేస్తూండాలి. వేదాంత వాక్యాలను నిరంతరం మననం చెయ్యడం వల్ల బ్రహ్మ సాక్షాత్కారానికి మార్గం సుగమమవుతుంది. నిదిధ్యాసనం నిరంతరం కొనసాగించడం వల్ల విపరీతభావన తొలగుతుంది.






Tuesday, December 17, 2013

జ్ఞానయోగము- సాధన (20)

సస్వరూప అనేదానికి అర్ధం ఒక దానియొక్క సహజరూపం అని. అంటే మాయతో కలియని సహజమైన సత్యమైనది ఆత్మ. జీవుడంటే మాయతో కూడినట్లుగా చెప్పుకోవాలి. రూపం అంటే మనస్సు. ఈ పదం ఎక్కడ వాడినా ఆ వస్తువు జీవంతో ఉన్నట్లుగా భావించాలి. అంటే అట్టి జీవంతో కూడిన దానితో అనుసంధానం చెయ్యాలని చెబుతారు. ఇలా భక్తితో అనుసంధానం చేసిన ముముక్షువుకు గురువే అతనిలో ఉన్న వివేక వైరాగ్యాలు, శమాదిషట్క సంపత్తినీ చూసి, సన్యాసస్వీకారం మహావాక్యోపదేశమూ ఉంటాయి. అదే శ్రవణం. యిదివరలో ఆత్మజ్ఞానం కోసం సన్యాసాన్ని అర్హతగా చెప్పగా, ఇప్పుడు జ్ఞానం కలిగాక సన్యాసమని చెప్పబడుతోంది.  భక్తిలో పరిణతి చెందినప్పుడు సన్యాసాశ్రమం స్వీకరించి, భక్తితో అహంకారాన్ని క్రమంగా లీనంచేస్తూ ఉండగా శ్రవణ మనన నిదిధ్యాసనాలను చేస్తాడు.
ఇంతదాకా బుద్దివల్ల తాను విన్నదీ , చదివినదీ ఒంటబట్టించుకొని, కోరికలన్నిటినీ త్యజించి సన్యాసి అవుతాడు. కర్మలన్నీ జ్ఞానంతో పరిసమాప్తి అవుతాయి. ఇక శ్రవణ మనన నిదిధ్యాసలన్నమాట.

శ్రవణం
అంటే గురువు నుండి మహావాక్యోపదేశాన్ని వినడం శ్రుతిలోనికి వస్తుంది. ఇదేగాక, గురుసాంప్రదాయం గురించీ, జీవ బ్రహ్మములను ఐక్యం చేసే పద్ధతులను గురించీ కూడా గురువు చెప్పవచ్చు. ఇదంతా శ్రవణం లోకే వస్తుంది. ఇచ్చట గమనించ వలసిందేమంటే, పూర్వాశ్రమంలో గురువూ, ఇప్పటి గురువూ ఒక్కరే కావచ్చు లేదా వేర్వేరుగాను ఉండవచ్చు.

తత్వమసి మొదలైన మహావాక్యాల అర్ధం తెలుసుకోవడం శ్రవణమని చెబుతారు. తనంత తాను శాస్త్రాలనుండి పఠనం వల్ల నేర్చినదీ జడంగానే ఉంటుంది. కాని ఆ విషయాలే గురుముఖతా ఉపదేశరూపంలో వచ్చినప్పుడు సజీవంగా అవుతుంది. గురువుకన్న తాను తక్కువవాడిననే భావనవల్ల  అహంకార  నిర్మూలన , వినయమూ, విధేయత కలుగుతాయి. అప్పుడు గురువు చెప్పినదాన్ని ఆచరణలో పెట్టడం, గౌరవంతో కూడిన వినయము ఏర్పడి గురుసేవ చెయ్యడానికి బుద్ధిని పుట్టిస్తుంది. అలాంటి సేవనే శుశ్రూష అంటారు. గురువు సాక్షాత్ భగవంతుడే అనే భావనవల్ల గురువు అనుగ్రహం కల్గి, సాధకుడిని గమ్యం చేర్చుతుంది.

మననం
సన్యాసి గురూపదేశం పొంది, అద్వైత బ్రహ్మభావనపైనే లక్ష్యం ఉంచాలి. శ్రవణంలో తెలుసుకున్న అర్ధాన్ని విచారణతో ఇదే సరైనదని నిర్ధారించుకోవడం మననం అనబడుతోంది.
లోకంలో ఏ విషయం మీదైనా నిర్ణయానికి రావలసినప్పుడు యుక్తిని ఉపయోగిస్తాం. శ్రద్దాభక్తులున్న మనో బుద్దులతో, ఒక విషయాన్ని విశ్లేషించడం యుక్తి అనబడుతోంది. యుక్తి అనుభవంతో గాని, హేతువాదంతో గాని చేసే తర్కం కాదు. విచారించడం వల్ల మనస్సుతో కలిగే అనుభవం అనవచ్చు. అట్టి యుక్తివల్ల అహంకారం నిర్మూలనమై మనస్సు శుభ్రం చెయ్యబడుతుంది. శాస్త్రీయమైన సత్యం, వివేకంతో కూడినప్పుడు, మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది. శాంతం యొక్క తటస్థస్థితిని సాత్వికమని చెబుతారు. ఈ దశలో సాధకుడి అనుభవం అంతరాత్మతో సంబంధించి ఉంటుంది. ఉపదేశాన్ని నిత్యమూ మననం చేయడం వల్ల మనస్సు చలించదు. అవిద్యనుంచి బయట పడేదాకా ధ్యానాన్నీ, మననాన్నీ అదే భావనతో కొనసాగించాలి. మననం చేస్తుండగా ఆత్మను గురించిన అనేక భావాలకు పరిష్కారం లభిస్తుంది. అపుడది నిదిధ్యాసనకు దారి తీస్తుంది.




Thursday, December 5, 2013

జ్ఞానయోగము- సాధన (19)

శమదమాలను అభ్యసించి మనస్సును నియంత్రించాడు గనుక సాధకుడిక మానసిక వృత్తులపై దృష్టి పెట్టడు. అంచేత భక్తి ఎలా వికసించిందో కూడా గమనించని స్థితి. ఇలాంటి భక్తి జీవుడిని లయం చేస్తూ , అదీ లయమైపోతుంది. దీన్లో తీవ్ర త్యాగం ఉంటుంది. ఈ స్థితిలో నిర్గుణ పరమాత్మతో బాంధవ్యం ఎలా ఉంటుందంటే పిడుగు పడినా చలించని గ్రహించని స్థితిలో సమాధినిష్టుడై అతనితో ఐక్యం చెంది ఉంటాడు. ఒకదానితో కలవడాన్ని సంధానం అంటాం. నిరంతరం కలసి ఉండటాన్ని అనుసంధానం అంటారు. ఇక్కడ జరిగేది పరమాత్మతో అనుసంధానం. ఏ కొద్దిపాటి ద్వైతానికీ తావులేదు. ఆత్మ నిశ్చలంగా తన సహజరూపంలోనే ఉంటుంది. జరిగేదల్లా ఏది జీవుణ్ణి పరమాత్మతో కూర్చలేక పోయిందో , అట్టి అంతఃకరణం మ్రింగ బడాలన్నమాట. అంటే చిత్తము ఆత్మయొక్క నిరంతర స్మరణలో మునిగి ఉండాలన్న మాట. ఇలా ఆత్మకు సంబంధించిన భావనలపై చిత్తం ఉండటమే అనుసంధానమని చెప్పబడింది. 

ఎప్పుడైతే  అహంకారం నిర్మూలమై జీవభావం తొలగుతుందో, అప్పుడు  ఆత్మే స్వయం ప్రకాశంగా ఉంటుంది. ఇదే సమాధి స్థితి. ఐతే ఈ స్థితిలో జీవభావం మ్రింగ బడటం, బయటకు రావడం వంటివి అంటే సమాధి స్థితిలోకి వెళ్ళడమూ, సమాధి స్థితినుండి బయటకు రావడమూ మాటి మాటికీ జరుగుతూ ఉంటాయి. ఇలా సమాధి స్థితిలోకి పోవడం, బయటకు రావడం అనేవి అనేకసార్లు జరుగుతుండగా క్రమంగా జీవభావం కరిగి ఇక లేశమాత్రంగా మిగులుతుంది. ఇక్కడ భక్తితో ఇంకా లీనమవ్వడానికి అనుసంధానం చెయ్యాలి.

ముముక్షుత గురించి చెప్పేటపుడు సస్వరూప అవబోధం అన్నాం. అవబోధం అంటే మేల్కోవడం. ముముక్షతలో  బంధం నుంచి విముక్తి మాత్రమే సరిపోదు, తన అసలు స్వరూపాన్ని తెలుసుకోనేట్లుగా సాధన ఉండాలి. అంటే తీవ్ర తపనతో తన నిజ రూపాన్ని తెలుసుకుని (అవబోధేన), బంధం నుండి విముక్తి పొందాలి. ఆత్మను మేల్కొలపాలనే ఆలోచన వచ్చిందీ అంటే మనం ఉన్నట్లే. అలా ఆత్మప్రబోధం భావనామాత్రంగా ఉండేప్పుడు, ఆ స్థితిని ఫలానా అని చెప్పలేం. కాకపోతే ఆత్మను గురించిన ఆలోచన అది అనంతమని, శుద్ధమని, సచ్చిదానందామని ఇలా ఆలోచన అంతఃకరణం ఉన్నంతవరకూ ఏదో ఆలోచన కొనసాగుతుంది. 
  
భక్తిని గురించి చెప్పేప్పుడు సస్వరూప అనుసంధానం అంటున్నాం. ఆత్మప్రబోధాన్ని భావించేపుడు దాన్ని సజీవంగా భావించాలి. జీవాహంకారాన్ని ఆ తత్ పదార్ధంపై ఉండేట్లుగా అంటే అదే భావనలో ఉండటమే భక్తి అనబడుతోంది. అదే అనుసంధానమంటే. ఈ అనుసంధానం అవబోధం తర్వాతే. అంటే బోధ కలిగిన తర్వాత ఆ తత్ పదార్ధంతో బాంధవ్యం కొనసాగాలి. అప్పుడు తాదాత్మ్యస్థితి ఏర్పడుతుంది. దానికి గుణాలను అంటగట్టడం గాని, పేరుపెట్టడం గాని చెయ్యకుండా కేవలం సాక్షి మాదిరిగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడాలి. కాపోతే గుర్తుంచు కోవలసినదల్లా అది శూన్యం మాత్రం కాదని. జీవంతో ఉందని భావిస్తే,  దాంతో బాంధవ్యం ఏర్పడి ప్రేమ పుడుతుంది. దాన్ని నిజమైన ప్రేమగా మలచుకోవాలి . అంటే ఇది పోయి, దానితో ఐక్యమవ్వాలి/ లేక అది దీన్ని హరించాలి.