Thursday, December 5, 2013

జ్ఞానయోగము- సాధన (19)

శమదమాలను అభ్యసించి మనస్సును నియంత్రించాడు గనుక సాధకుడిక మానసిక వృత్తులపై దృష్టి పెట్టడు. అంచేత భక్తి ఎలా వికసించిందో కూడా గమనించని స్థితి. ఇలాంటి భక్తి జీవుడిని లయం చేస్తూ , అదీ లయమైపోతుంది. దీన్లో తీవ్ర త్యాగం ఉంటుంది. ఈ స్థితిలో నిర్గుణ పరమాత్మతో బాంధవ్యం ఎలా ఉంటుందంటే పిడుగు పడినా చలించని గ్రహించని స్థితిలో సమాధినిష్టుడై అతనితో ఐక్యం చెంది ఉంటాడు. ఒకదానితో కలవడాన్ని సంధానం అంటాం. నిరంతరం కలసి ఉండటాన్ని అనుసంధానం అంటారు. ఇక్కడ జరిగేది పరమాత్మతో అనుసంధానం. ఏ కొద్దిపాటి ద్వైతానికీ తావులేదు. ఆత్మ నిశ్చలంగా తన సహజరూపంలోనే ఉంటుంది. జరిగేదల్లా ఏది జీవుణ్ణి పరమాత్మతో కూర్చలేక పోయిందో , అట్టి అంతఃకరణం మ్రింగ బడాలన్నమాట. అంటే చిత్తము ఆత్మయొక్క నిరంతర స్మరణలో మునిగి ఉండాలన్న మాట. ఇలా ఆత్మకు సంబంధించిన భావనలపై చిత్తం ఉండటమే అనుసంధానమని చెప్పబడింది. 

ఎప్పుడైతే  అహంకారం నిర్మూలమై జీవభావం తొలగుతుందో, అప్పుడు  ఆత్మే స్వయం ప్రకాశంగా ఉంటుంది. ఇదే సమాధి స్థితి. ఐతే ఈ స్థితిలో జీవభావం మ్రింగ బడటం, బయటకు రావడం వంటివి అంటే సమాధి స్థితిలోకి వెళ్ళడమూ, సమాధి స్థితినుండి బయటకు రావడమూ మాటి మాటికీ జరుగుతూ ఉంటాయి. ఇలా సమాధి స్థితిలోకి పోవడం, బయటకు రావడం అనేవి అనేకసార్లు జరుగుతుండగా క్రమంగా జీవభావం కరిగి ఇక లేశమాత్రంగా మిగులుతుంది. ఇక్కడ భక్తితో ఇంకా లీనమవ్వడానికి అనుసంధానం చెయ్యాలి.

ముముక్షుత గురించి చెప్పేటపుడు సస్వరూప అవబోధం అన్నాం. అవబోధం అంటే మేల్కోవడం. ముముక్షతలో  బంధం నుంచి విముక్తి మాత్రమే సరిపోదు, తన అసలు స్వరూపాన్ని తెలుసుకోనేట్లుగా సాధన ఉండాలి. అంటే తీవ్ర తపనతో తన నిజ రూపాన్ని తెలుసుకుని (అవబోధేన), బంధం నుండి విముక్తి పొందాలి. ఆత్మను మేల్కొలపాలనే ఆలోచన వచ్చిందీ అంటే మనం ఉన్నట్లే. అలా ఆత్మప్రబోధం భావనామాత్రంగా ఉండేప్పుడు, ఆ స్థితిని ఫలానా అని చెప్పలేం. కాకపోతే ఆత్మను గురించిన ఆలోచన అది అనంతమని, శుద్ధమని, సచ్చిదానందామని ఇలా ఆలోచన అంతఃకరణం ఉన్నంతవరకూ ఏదో ఆలోచన కొనసాగుతుంది. 
  
భక్తిని గురించి చెప్పేప్పుడు సస్వరూప అనుసంధానం అంటున్నాం. ఆత్మప్రబోధాన్ని భావించేపుడు దాన్ని సజీవంగా భావించాలి. జీవాహంకారాన్ని ఆ తత్ పదార్ధంపై ఉండేట్లుగా అంటే అదే భావనలో ఉండటమే భక్తి అనబడుతోంది. అదే అనుసంధానమంటే. ఈ అనుసంధానం అవబోధం తర్వాతే. అంటే బోధ కలిగిన తర్వాత ఆ తత్ పదార్ధంతో బాంధవ్యం కొనసాగాలి. అప్పుడు తాదాత్మ్యస్థితి ఏర్పడుతుంది. దానికి గుణాలను అంటగట్టడం గాని, పేరుపెట్టడం గాని చెయ్యకుండా కేవలం సాక్షి మాదిరిగా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడాలి. కాపోతే గుర్తుంచు కోవలసినదల్లా అది శూన్యం మాత్రం కాదని. జీవంతో ఉందని భావిస్తే,  దాంతో బాంధవ్యం ఏర్పడి ప్రేమ పుడుతుంది. దాన్ని నిజమైన ప్రేమగా మలచుకోవాలి . అంటే ఇది పోయి, దానితో ఐక్యమవ్వాలి/ లేక అది దీన్ని హరించాలి.



No comments:

Post a Comment