ఈ సందర్భంలో వేదాంత పంచదశి ఏమి చెబుతోందో
చూద్దాం. "శుద్ధసత్వప్రధానమైన ప్రకృతిని మాయ అంటారు. అందు ప్రతిఫలించిన
బ్రహ్మమును ఈశ్వరుడు అంటారు. ( ఇక్కడ రజస్తమో గుణములు నిద్రాణమై ఉండగా సత్వగుణ
ప్రధానమని చెప్పబడింది). ప్రతిఫలించుట అనగా మాయ యొక్క ఉపాధిని పొందటం.
రజస్తమోగుణములు చైతన్యవంతమైనపుడు
రజస్తమోగుణములతో కూడినసత్వమును మలినసత్వము లేక
అవిద్య అని అంటారు. ఈ మలినసత్వప్రధానమైన ప్రకృతిని ఉపాధిగా జేసుకొన్న బ్రహ్మము, జీవుడని పిలువబడుతున్నాడు".
తమఃప్రధానమైన ప్రకృతిని ఉపాధిగా
స్వీకరించిన బ్రహ్మము, జగత్తుగా వ్యవహరించబడుతోంది.
ఈశ్వరుడు సృష్టించవలెనని చూచుట లేక ఇచ్చించుటయే
ఆజ్ఞ. అట్టి ఈశ్వరాజ్ఞను నిమిత్తముగా చేసుకొని తమః ప్రధానమగు ప్రకృతినుండి
సూక్ష్మపంచభూతములు( పంచ తన్మాత్రలు) ఏర్పడినవి. ప్రతీతన్మాత్ర యందూ మూడుగుణాలు ఉంటాయి. వీటి
సత్వాంశలనుండి యిదివరలో జగత్తు ఏర్పడ్డ విధానంలో చెప్పుకున్నట్లుగా పంచ
జ్ఞానేంద్రియముల సూక్ష్మతత్వములు , అంతఃకరణచతుష్టయము ఏర్పడగా, రజోగుణ అంశాలనుండి
పంచకర్మేంద్రియాల సూక్ష్మతత్వములు , పంచప్రాణములూ ఏర్పడతాయి. ఇలా పందొమ్మిది సూక్ష్మతత్వాలతో సమిష్టి సూక్ష్మశరీరం ఏర్పడుతోంది. అంతఃకరణం మనస్సు బుధ్ధి అనే రెండు
తత్వాలను మాత్రమే తీసుకొంటే పదిహేడు సూక్ష్మతత్వాలతో కూడిన సూక్ష్మశరీరం
ఏర్పడుతోంది.
ఇక మిగిలిన తమోగుణవిభాగాల(పంచతన్మాత్రల
నుంచి) నుంచి పంచీకరణం అనే ప్రక్రియ ద్వారా స్థూలసృష్టి అంటే జగత్తు అందలి
జీవులు, సమస్త లోకములు, అందలి జీవులుఅనుభవించడానికి తగిన వస్తువులు/ పదార్ధాలూ
ఏర్పడ్డాయి. ఇలా పంచీకరణం తర్వాత పంచమహాభూతములతో కలసి ముందు చెప్పుకున్న
పందొమ్మిది తత్వాలతో కలసి ఇరవై నాలుగు తత్వాలతో స్థూల శరీరాలు ఏర్పడ్డాయని శృతి
చెబుతోంది. ఇంతదాకా బ్రహ్మమును గురించి, సృష్టికి
బ్రహ్మమునకూ ఉన్న సంబంధం గురించీ టూకీగా తెలుసుకోడానికి ప్రయత్నం చేశాం. ఆ సంబంధమే
మాయ అని చెప్పుకున్నాం కూడ. అయితే ఇప్పుడు మాయను గురించి తెలుసుకోడానికి
ప్రయత్నిద్దాం.
వేదాంతశాస్త్రంలో బ్రహ్మమే ఈజగత్తుకు
అభిన్న నిమిత్త, ఉపాదాన కారణమని చెప్పబడింది. సృష్టికోసం అవినాశి, నిర్గుణుడైన
బ్రహ్మమూ, సగుణము అసత్యము అయిన ప్రకృతిఅనబడే మూలమాయ పరస్పరము తోడుపడి ఉన్నాయి. ప్రకృతి, బ్రహ్మమునకన్న వేరు గాకపోయినా
కల్పితభేదం కనబడుతోంది. నిరాకార, నిర్గుణ బ్రహ్మమునందు సగుణ, సాకార రూపమైన మాయ ఎలా
కలిగింది అనేదానికి అద్వైతులు చెప్పిన ఒక దృష్టాంతము – రజ్జువునందు సర్పభ్రాంతి కలిగినట్లు, మాయ బ్రహ్మమునందు
భాసిస్తోంది అని అంటారు. శుద్ధబ్రహ్మమునందు కలిగిన ప్రధమచలనమే మూలమాయ లేక
మూలప్రకృతి. ఇది సృష్టికిపూర్వం అస్పష్టంగా, సూక్ష్మంగా గుణసామ్యమున అభిన్నమైన
విక్షేపశక్తిగా ఉండేది. ఇలా తనను ఆశ్రయించి ఉన్న మాయయందు బ్రహ్మ చైతన్యము
ప్రతిఫలించి , సృష్టి కొరకు అనేక విధములగుదునని సంకల్పించి నామ రూపాత్మకమగు
జగత్తును సృష్టించెను. ఇట్లు ప్రతిఫలించిన బ్రహ్మ చైతన్యము ‘అహం’ స్ఫురణ రూపమున
నానాత్మ కల్పనా సామర్ధ్యముతో “చిచ్ఛక్తిగా”
చెప్పబడినది.