జగత్తు యొక్క సృష్టికి కారణమని చెప్పు మాయ, సాంఖ్యులు చెప్పే ప్రధానం అని పేరు కల్గిన మాయ కాదు. సాంఖ్యులు చెప్పే మాయ నిత్యమైనది, సత్యమైనది, స్వతంత్ర మైనదని వారు అంటారు. కాని అద్వైతులు చెప్పే మాయ స్వతంత్రమైనది కాదు. అది పరమేశ్వరుని అధీనంలో ఉంటుంది. బ్రహ్మమందలి ఈ మాయాశక్తి, సృష్టి జరుగునపుడే వ్యక్తమవుతుంది. కాబట్టి బ్రహ్మముయొక్క ఈ సృజనాత్మక శక్తియే మాయ అనబడుతోంది. మాయయే జగత్తుయొక్క సృష్టి స్థితి లయములకు కారణమవుతోంది. ఎందుకంటే బ్రహ్మము దేనికీ కారణం కాదు. అద్వితీయమైన ఏకైక పదార్ధమది. అలాగే బ్రహ్మమునకు వేరొక కారణం కూడ లేదు.
బ్రహ్మమునందు ఇమిడియున్న మాయ సృష్టి
లయములు చెందుతున్నా, బ్రహ్మమునకెట్టి సంబంధమూ లేక నిర్లిప్తంగా స్వయం ప్రకాశమై ఉంటుంది.
బ్రహ్మమును ఆధారముగా చేసుకొని, మాయాశక్తి
ప్రపంచ వికారముల ననేకములను కల్పిస్తుంది. మాయకు బ్రహ్మమున కన్న వేరే ఉనికి
లేదు. మాయ నశించు స్వభావం కలది. ప్రపంచం రూపంలో కన్పిస్తోంది కాబట్టి లేదని
చెప్పలేం. నిజానికి స్వయంగా ఆధారమును వదలితే, దానికి ప్రత్యేకమైన ఉనికి లేదు
కాబట్టి ఉందనీ చెప్పలేం. అంటే మాయ సత్తు కాదు. అసత్తు కాదు. అంచేత అనిర్వచనీయం అని
చెప్పబడింది. ఒకప్పుడు ఒకవిధంగాను, మరొకపుడు మరోవిధంగాను కనిపిస్తుంది కాబట్టి
దీన్ని మాయ అన్నారు. ఇది మోహింప జేస్తుంది/ లేక భ్రమను కలుగజేస్తుంది. ఎలాగంటే
అవివేకంవల్ల సత్యమును అసత్యముగాను, అసత్యమును సత్యముగాను భ్రమింప జేస్తుంది. దీనికి
తమస్సు / అవిద్య/ అవ్యక్తము / ప్రకృతి / ప్రళయము అని అనేక నామములతో పిలువ బడుతోంది.
అద్వైతులు చెప్పే ప్రకృతికి
బ్రహ్మమునకన్న భిన్నమైన ఉనికి లేదు. బ్రహ్మము నిష్క్రియుడు/ అకర్త. కర్తృత్వం లేదు
కాబట్టి సృష్టిని జరుపలేడు. బ్రహ్మమున్న చోటుననే ఇమిడియున్నమాయను మూల ప్రకృతి అంటారు. ఈ ప్రకృతి జడము. అంటే చైతన్యము లేనిది.
అంచేత మూల ప్రకృతి కూడ సృష్టి చెయ్యలేదు.
మూలప్రకృతి సత్వ రజ స్తమో గుణములతో కలసి ఉండటం చేత త్రిగుణాత్మకము అంటారు. బ్రహ్మము చైతన్య స్వరూపుడని చెప్పబడింది. బ్రహ్మము
యొక్క చైతన్యము తనయందు ఏకదేశమై యున్న
చైతన్యరహితమైన మాయలోనికి వ్యాప్తి చెందినపుడు, మాయ చైతన్యవంతమై సృజనాత్మకశక్తిని పొంది సకల
చరాచర ప్రపంచాన్నీ సృష్టిస్తోంది.(బ్రహ్మమున్న చోటుననే ఇమిడి యుండుటను ఏకదేశమందు
ఉండుట అంటారు).
బ్రహ్మమునందు ఒకభాగముననే మాయ ఆవరించి
సృష్టి స్థితి లయములు చేయుచుండగా తక్కిన మూడు భాగములూ స్వయం ప్రకాశములని శృతి
చెబుతోంది (వేదాంత పంచదశి 55ద్వితీయ ప్రకరణం).
త్రిగుణాత్మకమని చెప్పబడ్డ మూలప్రకృతి లేక మాయయందు, రజస్తమోగుణములు
నిద్రాణమై యున్నట్లు భావిస్తే అది సత్వగుణ ప్రధానమై ఉందని చెప్పుకోవచ్చును. అంటే
మాయలో ఏవిధమైన చలనమూ లేకుండ సృష్టికి ముందు ఉండేదని తెలుస్తోంది. శుద్ధ సత్వగుణ
ప్రధానమైన మాయలోనికి బ్రహ్మచైతన్యం ప్రవేశించి, రజస్తమో గుణాలను చైతన్యవంతం
చెయ్యడం వల్ల త్రిగుణాత్మకమైన అవిద్య ఏర్పడుతోంది. అంటే చైతన్యవంతమైన మాయ సృష్టికార్యం నిర్వహించడానికి సన్నద్ద మైనదని
చెప్పుకోవచ్చును.
thanks
ReplyDelete