Thursday, December 6, 2012

బ్రహ్మము-2

వ్యవహారంలో ప్రపంచంలో ఉండే అన్నివస్తువులూ; దేశము, కాలములచేత పరిమితమవుతాయి. వ్యక్తిగతంగా మానవుడు దేశంతోను, కాలంతోను పరిమితుడు గనుక ; అన్ని కోరికలను, అనుభవాలనూ ఒకేసమయంలో గాక, ఒకదాని తర్వాత మరొకటి మాత్రమే పొందటం సాధ్యమవుతుంది. కాని బ్రహ్మము దేశ కాలాలకు అతీతుడు. అన్ని కాలములూ, అన్ని దేశములూ బ్రహ్మం లోనివే. ఇలా దేశ కాలాలచేత పరిమితం కాదు గనుక బ్రహ్మము అనంతము అని చెప్ప బడింది. బ్రహ్మవిద్యచేత పొందే బ్రహ్మస్వరూపం గురించి, తైత్తిరీయోపనిషత్తు బ్రహ్మానందవల్లి ప్రధమానువాకం నందు “సత్యం జ్ఞాన మనంతం బ్రహ్మ”  అని చెప్పబడింది.

బ్రహ్మము ఏకరసము , అద్వితీయము, వస్తువు కానిది అవ్వడం చేత లక్షణాలను చెప్పలేం. అందుకే శృతిలో  బ్రహ్మము  అవాజ్ఞ్మానసగోచరమని చెబుతూ, అరుంధతీన్యాయంగా జిజ్ఞాసువుకు తెలియజేయడానికి ప్రపంచంలో ఉండే వస్తువుల్లాంటిది కాదంటూనే, సత్యత్వాదిలక్షణాలు  చెప్పబడ్డాయి. ( అరుంధతీ న్యాయమంటే అరుంధతీ నక్షత్రం చూపదలచుకునేవాడు, దాని దగ్గరేఉన్న ఒక పెద్దనక్షత్రాన్ని; అదేఅరుంధతి అనిచూపి, తర్వాత అదికాదు నిజమైన అరుంధతి అనిచెప్పి, నిజమైన అరుంధతిని ఏవిధంగా చూపుతాడో, అలాగే ఈ సత్యత్వాది లక్షణాలు చెప్పబడ్డాయి).

లోకవ్యవహారమంతా కర్త, కర్మ, క్రియల రూపంలోనే జరుగుతోంది.
చూసే వాడు / ద్రష్ట /జ్ఞాత / ప్రమాత,
చూడబడేది / దృశ్యము / జ్ఞేయం / ప్రమేయం,
చూడటం అనే ప్రక్రియ / దర్శనం /జ్ఞానం / ప్రమ. 

లోకవ్యవహారంలో చూసేవాడు, చూడబడేది, చూడటం అనే ప్రక్రియ – అంటే  త్రిపుటి ఉంటుంది.  బ్రహ్మము సర్వవ్యాపకము కాబట్టి, చూసేవానికన్న భిన్నంగా ఉండదు. బ్రహ్మాన్నిగురించిన జ్ఞానం ఉన్నవాడు బ్రహ్మమే అవుతున్నాడు. అంటే బ్రహ్మముతో తాదాత్మ్యం చెందుతాడు గనుక అపుడిక జీవుడు మిగలడు. అట్టి అనుభూతివల్ల బ్రహ్మమున, త్రిపుటి ఉండదు/ ఉండలేదు.

ప్రపంచంలో ఉండే ప్రతీవస్తువూ 1) ఉండటం, 2) పుట్టడం 3) మరణించడం 4) పెరగటం 5) క్షీణించడం 6) మార్పు చెందటం అనే ఈ ఆరువికారాలకు లోనవుతుంది. కాని బ్రహ్మము ఈ షడ్భావవికారములు లేని శాశ్వతమైన పదార్ధముగా చెప్పబడింది. 

ఒకచోట ఉండి మరొకచోట లేకపోవడం గాని, ఒకప్పుడుండి మరొకప్పుడు లేకపోవడం గాని, ఒక వస్తువునందుండి మరొక వస్తువునందు లేకపోవడమనేది గాని ఉండదు. ఇలా పరిచ్చేదము కానిది గనుక బ్రహ్మము సర్వవ్యాపకము అని చెప్పబడింది.

నాశనము లేనిదగుటచే అవినాశి లేక సత్తు లేక సత్యస్వరూపమనియు,
జడము కానిది గనుక చిత్తు లేక చిద్రూపము లేక చైతన్యమనియు,
అద్వితీయమగుటచే నిరుపమానము అనియు,
మనస్సు లేనిదగుటచే  సంకల్ప వికల్పములు లేనిదనియు,

అవిభాజ్యము, అపరిమితము, అఖండము, సర్వస్వతంత్రము, స్వయం ప్రకాశము  మరియు దుఃఖము లేనిదగుటచే బ్రహ్మము ఆనందమయము అనియు చెప్పబడినది. బ్రహ్మము అనుభూతి చెందేదే గాని సాధించి పొందబడేది కానిదగుటచే అసాధ్యమనియు, బ్రహ్మము ఇట్టిది, అట్టిది అని చెప్పుటకు వీలులేనిదగుటచే అనిర్వచనీయమనియు చెప్పబడినది. ఏకైక సత్యస్వరూపమైన బ్రహ్మమునందు భాగములు లేనందున నామరూపములు లేవు. అట్టి బ్రహ్మము లేక బ్రహ్మజ్ఞానము శుద్ధసత్వ ప్రధానమైన మనస్సు చేతనే పొందబడును. బ్రహ్మమూ ఆత్మా ఒక్కటేనని శృతి చెబుతోంది. ఇలా ఇవన్నీ వివిధ ఉపనిషత్తులు చెబుతూ చివరికి ఏజ్ఞాని బ్రహ్మ స్వరూపము తెలియబడదని భావించు చున్నాడో వాడే దానిని చక్కగా తెలిసిన వాడు . ఎవడు బ్రహ్మ స్వరూపము తెలిసినట్లు భావించు చున్నాడో వాడు బ్రహ్మమును తెలియని వాడని  కేనోపనిషత్తు చెబుతోంది. 



2 comments:

  1. చక్కటి విషయాలను తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  2. మీ అభిమానానికి కృతజ్ఞతలు.
    సూర్యచంద్ర గోళ్ల.

    ReplyDelete