Friday, December 14, 2012

మాయాస్వరూపము -1



అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవుడు, పరమేశ్వరుడు, శుద్ధ చైతన్యము , జీవ పరమాత్మల భేదము, అవిద్య (మాయ), మాయా చైతన్యాల సంబంధమూ , ఈ ఆరూ అనాదులని చెబుతారు. ప్రపంచంలో సృష్టి , మొదలైనవి పరిశీలిస్తే ఒక క్రమ పద్ధతిలో జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇలా ఒక క్రమపద్ధతిలో జరగాలంటే సర్వనియామకుడైన వాడొకడున్నాడని అంగీకరించాలి. అలా కాకుండా, స్వభావంచేతనే సృష్టి జరుగుతోందని అంటే, దాన్లో ఒక పద్ధతీ, నియమమూ ఉండకూడదనేది స్పష్టమవుతుంది. 

నామ రూపాలచేత విడిగా కనిపించే అనేకమంది కర్తలతోను, కర్మఫలాలను అనుభవించే భోక్తలతోను, ఊహించడానికి కూడ శక్యంగాని విధంగా సృష్టి రచనావిధానం తెలియబడుతోంది.  బ్రహ్మసూత్రాల్లో  “జన్మాద్యస్య యతః “ - అంటే ఈ జగత్తుయొక్క జన్మ- స్థితి - ప్రళయములు దేనివల్ల కల్గుతున్నాయో, అది బ్రహ్మము అని చెప్పబడింది. సృష్టి అంటే యిదివరలో లేనిది, ఇప్పుడు కల్పించబడి కన్పించేదని స్థూలంగా అనుకోవచ్చు. “సృష్టికి పూర్వం బ్రహ్మమొక్కటే ఉండెను. మాయలచేత బహురూపమైన బ్రహ్మ ప్రత్యక్షమైనది. దీనికి కారణం ఏదీ లేదు. కార్యం కూడ ఏదీ లేదు. ద్వితీయ వస్తువేదీ లేదు. ఈ ఆత్మయే బ్రహ్మ. సర్వమునూ అనుభవించేది, తెలుసుకొనేదీ” అనే వాక్యాలు   ఛాందోగ్యోపనిషత్తు యందు చెప్పబడ్డాయి.

నిర్గుణుడు , నిర్వికారుడు , నిష్క్రియుడుగాను చెప్పబడ్డ బ్రహ్మమునుండి, ఈ జగత్తు ఎలా ఏర్పడినదనేది విచారించాలి. జీవుడు, పరమేశ్వరుడు, శుద్ధచైతన్యము, అవిద్య (మాయ) , జీవ పరమాత్మల భేదము, మాయా చైతన్యముల సంబంధమూ  అనాదులని చెప్పబడ్డాయి. అంటే ఇవన్నీ ఎప్పుడు మొదలయ్యాయో తెలియ శక్యం కాదు. కల్పాంతంలో జరిగే బ్రహ్మ ప్రళయమందు , సమస్త జీవరాసులూ తమతమ కర్మవాసనలతో ప్రకృతిలో లీనమవుతాయి. అలా తనలో  సమస్తమునూ ఇముడ్చుకొన్న ప్రకృతి; ఈశ్వరుని యందు లీనమవుతుంది. అంటే  ప్రళయమున  సమస్తవిశ్వమూ, అందలి ప్రాణకోట్లు ఈశ్వరునియందు బీజప్రాయంగా  ఉంటాయి. తిరిగి కల్పారంభంలో జీవులు వాటి  వాటి  కర్మానుసారంగా , వాటి వాసనలను బట్టి జన్మలను పొందుతాయి. ఇలా కల్పానికే ఆది/ ఆరంభం ఉన్నది గాని సృష్టికి ఆది లేదని పెద్దలు చెబుతారు.

అవిద్యారూపమైన బీజశక్తిని ‘అవ్యక్తము’ అని అంటారు. అది పరమేశ్వరుడిని ఆశ్రయించి యున్న మాయారూపమైన మహానిద్ర. దీన్లో సంసారులైన జీవులంతా స్వరూపజ్ఞానం లేకుండా నిద్రపోతున్నారు. శాస్త్రాల్లో అంటే భగవద్గీత, భాగవతం, పురాణాలు మొదలైన వాటిలో మాయ  పరతత్వాన్ని ఆచ్ఛాదించి, వాస్తవంలో లేని ప్రపంచాన్ని ఉన్నట్లుగా చూపిస్తుందని చెప్పబడింది. ఉదాహరణకు ఒక ఇంద్రజాలికుడు ఉన్నాడనుకొందాం. అతడు మన కళ్ళముందే ఏవోవో వస్తువులను సృష్టిస్తుంటాడు. ఆ వస్తువులను సృష్టించేశక్తికి ఆశ్రయం ఇంద్రజాలికుడు. చూసే వాళ్లకి ఇంద్రజాలకునిశక్తి అక్కడ ఉండే యదార్ధ స్వరూపాన్ని కప్పివేసి, లేని వస్తువును ఉన్నట్లుగా చూపిస్తుంది. ఇంద్రజాలకుని శక్తిలాగే, మాయాశక్తి , పరమాత్మలో ఉండే అద్భుతశక్తిగా చెప్పవచ్చును. మాయాశక్తి పరమాత్మ అధీనంలో ఉంటుంది. అంచేత తన యిష్టం వచ్చినట్లు దాన్ని ప్రవర్తింప జేయడం, ఉపసంహరించడం కూడ చెయ్యగలడు. జీవులంతా మాయకు లోబడిన వారే. కాని పరమాత్మ దీనికి అతీతుడు. 

ఈ ప్రపంచమంటే పేర్లు, ఆకారాలు, కర్మలూ మాత్రమే. ఇలా కన్పించే విశ్వానికి  ‘వ్యాకృతము’ అని పేరు. ఈ వ్యాకృతం యొక్క పూర్వావస్థకు అంటే సృష్టి ఏర్పడక మునుపు,  బీజరూపంలో ఉన్న ప్రపంచానికి బీజశక్తి/ అవ్యక్తము/ లేక ప్రకృతి అని మాయకు గల కొన్ని పేర్లు. ప్రకృతియే మాయ అని శ్వేతాశ్వరోపనిషత్తు చెబుతోంది. అయితే జగత్తుకు కారణం మాయ . సృష్టికి పూర్వం మాయ ఎక్కడ ఉందీ అంటే, బ్రహ్మము నందే ఉందని అనుమాన ప్రమాణమున ఊహించాలి. ఈ ఊహకు ఉదాహరణగా మాయావి యొక్క శక్తిని ప్రస్తావించుకున్నాం. ఇప్పడు మరొక ఉదాహరణను పరిశీలిద్దాం. అగ్నిని తాకితే చెయ్యి కాలి బొబ్బలు ఏర్పడతాయి. చెయ్యి కాలడమనే కార్యానికి పూర్వం, కారణమైన దాహకశక్తి ( దహించేశక్తి ) అగ్నియందు ఉందని చెప్పడానికి ఆధారం లేదుకదా! బొబ్బలు ఏర్పడిన తర్వాతే అగ్నికి దహనశక్తి ఉందని తెలుస్తుంది. అగ్నికిగల ఈశక్తి అగ్నికంటే వేరనిగాని, ఆ శక్తియే అగ్ని అనిగాని చెప్పడానికి వీల్లేదు.

అలాగే మాయాశక్తి కూడ బ్రహ్మము నందున్నట్లు ఊహించ వచ్చు. అంటే కార్యమైన జగత్తు గమ్యంగా గలదని ఉద్దేశ్యం. అగ్నియొక్క దాహకశక్తియే అగ్నికానట్లు , మాయకూడ బ్రహ్మము కాజాలదు. అది బ్రహ్మమునకన్న వేరని కూడ చెప్పలేం. మాయాశక్తి కార్యమే జగత్తు. మాయ తనకార్యమైన ఈ జగత్తునకన్న, తనకు ఆధారమైన బ్రహ్మమునకన్ననూ  విలక్షణమైనది. బ్రహ్మము నందు జగత్కల్పన జరిగినపుడు జగత్తునుచూసి మాయ ఇట్టిదని అనుకొంటాం.

శక్తి, శక్తిగలవానికన్న భిన్నముగా ఉండదు. అంటే శక్తి తన ఉనికికోసం మరొక సద్వస్తువు మీద ఆధారపడే ఉంటుంది. కాని సద్వస్తువు తన ఉనికికై శక్తిమీద ఆధారపడవలసిన పనిలేదు. అంచేత శక్తి స్వతంత్రమైనది కాదు. సృష్టికి పూర్వం ఆ శక్తియొక్క కార్యం లేనే లేదు. అంచేత రెండవ సత్తను అంటే సత్పదార్ధమును అనుమానించ లేము. కాబట్టి అద్వయ సత్తయే సత్యమని భావము. ఆ శక్తి బ్రహ్మమునందు అంతటా లేదు. ఒక భాగముననే ఉండి, మిగిలిన మూడు భాగములూ స్వయం ప్రకాశములని శృతి చెబుతోంది. అనగా మాయ బ్రహ్మము యొక్క ఒక అంశమును మాత్రమే ఆవరించి ఉందనేది స్పష్టం. నిజానికి  బ్రహ్మమునందు అంశములు లేకపోయినా,  మిగిలిన మూడు భాగములని చెప్పడం  సృష్టియొక్క అల్పత్వం తెలియజేయడానికే.


No comments:

Post a Comment