అనాదినుంచీ మానవుడు సుఖాన్వేషణలోనే ఉన్నాడు. దానికోసం తిరుగని చోటులేదు. కన్పించిన వారినల్లా అర్ధిస్తూ కాలం గడుపుతున్నాడు. అజ్ఞానంచేత దారి కన్పించడం లేదు. మనస్సు ఎపుడూ బహిర్ముఖంగానే తిరుగుతూ ఉంటుంది. దానివల్ల ఆవేశాలకూ, ఆవేదనలకూ , సుఖదుఃఖాలకూ లోనవుతూన్న మనస్సు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎప్పుడూ కోరికలతో సతమతమవుతూ ఉంటుంది. మహారాజులా ఉండవలసిన మనం , మనసుకు బానిసగా మారితే అది నియంత అయ్యికూర్చుంటోంది. మనలని జీవచ్చవంలా నడిపిస్తోంది. కోరికలతోనో, ఆదర్శంతోనో, అహంకారంతోనో , బాంధవ్యాలతోనో మనం జీవితంలో రాజీపడి, జీవితాన్ని ఈడ్చుకుంటూ బ్రతుకుతున్నామే తప్ప, నిజానికి జీవిత మాధుర్యాన్ని అనుభవించడం లేదు. అంటే జీవితాన్ని జీవించడం లేదు. జాగరూకతతో మనం దాన్నిగమనిస్తే, అదెలా ప్రవర్తిస్తుందో అవగాహన కల్గితే, నెమ్మదిగా దానితో స్నేహంచేసి దాన్ని వశపరచుకుంటే తిరిగి మనసింహాసనాన్ని పొందగల్గుతాం.
మనసే బంధానికీ,
జీవితానుభవాలతో ఉన్నతినిచెంది మోక్షసాధనకూ కారణమవుతుంది. మనస్సును సంయమనంతో
నిగ్రహించి బ్రహ్మమందు లయం చేస్తే అది బ్రహ్మాకారవృత్తిని పొందుతుంది. జ్ఞాని
ఎపుడూ బ్రహ్మాకారవృత్తిలో ఉండటంవల్ల తనకన్నా భిన్నమైన రెండవ వస్తువు గోచరించదు.
అందుకే సమస్త వాసనలూ బీజరూపంలో ఉండగానే నశిస్తాయి. ఆత్మజ్ఞానం వల్ల వాసనలు నశించగా
మనస్సూ నశిస్తుంది. భూత భవిష్యద్విషయాలపై ఆలోచనలను నిరోధిస్తే చిత్తము
నశిస్తుందని విజ్ఞులు చెబుతారు. అప్పుడు వర్తమాన విషయాలయందే ప్రవర్తిస్తుంటాం.
అట్లే జ్ఞాని ఎప్పుడూ వర్తమానమందే ప్రవర్తిస్తూ వాటిని క్షణకాలం బాహ్యబుద్ధితో
సేవిస్తుంటాడు. అందుకే జ్ఞానికి ప్రారబ్దకర్మలచే క్రొత్త వాసనలూ, కర్మఫలాలూ
ఏర్పడవు.
బ్రహ్మచైతన్యాన్ని
ఆవరించిన తమోగుణం అనేపొర బ్రహ్మమును ఎరుగనీయక మరుగున ఉంచుతుంది. దాని ఆవరణ
ధర్మంవల్ల దేహవాసనతో దేహాత్మభావం కల్గి, తాను బ్రహ్మమనేది తెలియకుండా చేస్తుంది.
ఆత్మజ్ఞానం వల్లే ఇది నశిస్తుంది. అనేక అలవాట్లకు, క్షణిక ఆవేశాలకు, ఉద్వేగాలకు
లోనయ్యే మనస్సును అదుపులో పెట్టవచ్చు. అదుపు చెయ్యగలిగేది కూటస్థబ్రహ్మమే.
మనముందుండే వస్తువును ఎలా చూడగలుగుతున్నామో అలా మన మనస్సులో జరిగే ఆలోచనలను గమనించే
వాడొకడు ఉండాలి. ఆ గమనించేవాడే బ్రహ్మము. ఉదాహరణకు మనముందు ఒక కుండ ఉందనుకుందాం.
అది తనను తాను చూసుకోలేదు. దాన్ని చూడడానికి ఒక కన్ను అవుసరం. కన్నుతోబాటు
చూసేవాడూ కావాలి. అపుడే చూసేవాడు ఆ కుండను కన్నుద్వారా చూడగల్గుతాడు. మన ఎదుటగల
వస్తువును చూస్తున్నామంటే మనలో ఎట్టిమార్పులకూ లోనుగాని శాశ్వతమైన తెలుసుకునేవాడు
ఉండి తీరాలి. అలాంటి వాడే నిరంతరమూ జీవుని మనస్సులో కలిగే మార్పులను, ప్రేరణలనూ సాక్షిగా
వీక్షించేది.
మనస్సుతోనే
బ్రహ్మమును తెలిసికోగలం. తన సంకల్పశక్తితో తనకోరిక మేరకు ఆయావిషయాలతో తాదాత్మ్యం
చెందేది “నేను” గా చెబుతాం. అదే అంతర్యామిగా ఉండే చైతన్యం. ఇదే స్వాప్నిక
అనుభవాలన్నిటినీ ప్రకాశింప జేసేది. మనస్సును జాగరూకతతో గమనిస్తే ఎప్పటికీ
నాశనంకాని శాశ్వతమైన, నిర్మలము స్వయంప్రకాశమైన మార్పులేని ఎరుక అనుభవంలోకి
వస్తుంది. అసలు ఉన్నది పరిపూర్ణమైనది ఆ స్వచ్చమైన ఎరుకయే. అదే కూటస్థచైతన్యం. అట్టి
దానిపై ధ్యానంచేస్తే దుఃఖం దూరమై మనస్సు ఏకాగ్రమై ప్రశాంతంగా ఉంటుంది. కూటము అంటే
కంసాలి ఆభరణాలను చెయ్యడానికి ఉపయోగించే ఇనుపమొద్దు/డాగలి. దీనిపై బంగారాన్ని
ఆభరణాలుగా నామ రూపములు మారుతున్నా , ఈ ఇనుప దిమ్మె మాత్రం ఎట్టి మార్పుకూ లోనవ్వక
నిర్వికారంగా ఉంటుంది. అందుకే దాన్ని కూటమని అంటారు. అదే విధముగా నిర్వికారమైన
ఆత్మకు కూటస్థుడు/కూటస్థమని పేరు.