మనస్సుయొక్క
అవస్థలు –
అహంకారము, ఈ
మూడు అవస్థలు, సూక్ష్మ స్థూలశరీరాలు, ప్రపంచమూ ఇలా చూడబడేవన్నీ జడములు. ఈ మూడు
అవస్థలూ మనచేత మాయవల్ల అనుభవించ బడుతున్నాయి. జడమైన చూడబడే వాటికీ, చూసే
చైతన్యవంతమైన వానికీ మాయచేత విడదీయలేని బంధం ఏర్పడింది. వాస్తవానికి మాయకు
అస్తిత్వం లేదు. ఇది కేవలం ప్రాపంచిక అనుభవాలు పొందడానికే. స్వప్నంలో మనస్సు
తనకున్న శక్తితో ఏ విషయము, వస్తువూ లేకున్నా ఒక ప్రపంచాన్ని సృష్టించి దాని
అనుభవాలను పొందుతుంది. అలాగే జాగ్రదావస్థలోనూ ఈ ప్రపంచం మనస్సుచేతనే కల్పించబడిన
దవుతోంది.
మానవ
శరీరయాత్రలో జాగ్రతు స్వప్నము సుషుప్తి అనే అనుభవాలు కలుగుతుంటాయి. ఇవి మనస్సుచే
ఏర్పడ్డవే. జాగ్రదావస్థ అహంకారం పూర్తిగా
వ్యక్తమయ్యే స్థితి. దీన్లో జ్ఞాపకాలు అనే వాసనలు చిదాభాసునితో కలసి
బాహ్యప్రపంచంలో వ్యక్తులను, వస్తువులను జ్ఞానేంద్రియాలతో మనకంటే బయట ఉన్నట్లు
ఊహించుకుంటాం. ఇలా జాగ్రదావస్థలో ప్రాపంచికజ్ఞానం నిరంతరము కలుగుతూ ఉంటుంది. ఈ
అవస్థలో అహంకారం సూక్ష్మశరీరంతోను, స్థూలశరీరంతోను తాదాత్మ్యం చెంది జీవుని
వ్యక్తిత్వం పూర్తిగా వ్యక్తమవుతుంది. దీన్లో జీవుడిని విశ్వుడు / వైశ్వానరుడని
అంటాం. ఒకోసారి మనం సుషుప్తి స్వప్న జాగ్రదావస్థల మధ్య ఉంటుంటాం. మెలకువలో
స్వప్నము, నిద్రలో మెలుకువతోను ఉండటం జరుగుతూంటుంది. అలాంటప్పుడు అహంకారం పాక్షికంగా స్థూలశరీరంతో తాదాత్మ్యం
పొందుతుంది. ఈఅవస్థలు అహంకారానికి సంబంధించినవే కాని శుద్ధచైతన్యానికి
సంబంధించినవి కావు. మనకు జాగ్రదావస్థ వాస్తవంగాను స్వప్నావస్థ భ్రాంతిగాను తోస్తుంది.
జాగ్రదావస్థలో
సగటు మానవుడు తనప్రపంచాన్ని తనే సృష్టించుకుంటాడు. కాని జ్ఞాని భగవతుని సృష్టిలో
ఆనందం అనుభవిస్తూ జీవిస్తుంటాడు. మనస్సు ,
అహంకారంతో కూడిన జడమైన స్థూలశరీరమే ఈ మూడు అవస్థలను, జనన మరణాలను పొందుతోంది.
పంచభూతములు జడమైనవి. అలాగే వాటి కార్యమైన స్థూల సూక్ష్మశరీరాలూ జడమైనవే.
సూక్ష్మశరీరానికి శుద్ధచైతన్యాన్ని ప్రతిబింబించే గుణము ఉంది. దీని ద్వారా మరొక
దాన్ని తెలుసుకొనే వీలుంటుంది గనుక దీన్ని లింగశరీరం అంటారు. లింగము అంటే చిహ్నము.
స్థూలశరీరం సూక్ష్మశరీరంతో కలసినపుడు అది చైతన్యవంత మవుతుంది. సూక్ష్మశరీరంనుంచి
విడిపోతే జడముగా ఉంటుంది. ఆత్మచైతన్యమే జననమరణాలకు సాక్షిగా ఉండేది. ఎందుకంటే ఆత్మ
జన్మించలేదు, మరణించలేదు. అది లేని కాలమేలేదు.
స్వప్నావస్థలో –
అహంకారం పాక్షికమైన మార్పులు చెందుతుంది. దీన్లో అహంకారం సూక్ష్మశరీరంతో
తాదాత్మ్యం చెందుతుంది గాని స్థూల శరీరంతో కాదు. ఇంద్రియాలు నిర్లిప్తమై మనస్సుతో
కలసి ఉంటాయి. ఈ దశలో మనస్సే పనిచేస్తుంది. భూమిగాని, సముద్రంగాని, జంతుజాలం
మొదలైనవిగాని ఏవీ ఉండవు. మనస్సే జాగ్రదావస్థలో అనుభవాలనుండి వీటిని
సృష్టించుకుంటుంది. మనస్సే ఇలా మార్పుచెందుతూ కర్తగాను, విషయముగాను వ్యవహరిస్తూ
అదే చూసేదిగాను, చూడబడేది గాను స్వప్నంలో వ్యవహరిస్తుంది. స్వప్నంలో జీవుడిని తైజసుడు అంటారు. అంటే స్వప్న
విషయాలను ప్రకాశింప చేసేవాడు. స్వప్నంలో మనకు అనుభవానికి వచ్చే విషయాలన్నీ ఆత్మ
ప్రకాశం వల్లే అనుభవానికి వస్తున్నాయి. దీనివల్ల ఆత్మస్వయం ప్రకాశమని
తెలుస్తుంది. జాగ్రత్తులో మనస్సు బాహ్య
విషయాలపై ఆధారపడితే, స్వప్నంలో తనంత తానే జాగ్రదావస్థలోని అనుభవాల ఆధారంగా
విషయాలను సృష్టించుకొని ఆనందము లేక దుఖాన్ని పొందుతుంటుంది. మెలకువ రాగానే కలలో
అనుభవాలు మాయమవుతాయి. ఐనా అవి పోయాయనే బాధ ఉండదు. ఎందుకంటే అవి వాస్తవం కాదు, కలలో
విషయానుభవాలని తెలియడం వల్ల. ఇదే విశ్లేషణ ఆధారంగా బ్రహ్మమును తెలుసుకొంటే
జాగ్రత్తులో కన్పించే జగత్తు భ్రమ అని అనుభవమవుతుంది. అపుడు ప్రపంచమే స్వప్నతుల్యం
అని అనిపిస్తుంది. జాగ్రదావస్థ కూడ
సుదీర్ఘస్వప్నమే అనిపిస్తుంది. మనస్సులో ఇదివరకే ముద్రించబడిన జ్ఞాపకాలపై చైతన్యము
యొక్క ప్రకాశం పడి స్వప్నప్రపంచంగా వ్యక్తమవుతోంది. అంటే స్వప్నం మన వాసనలచేత
కల్పించబడుతోంది.
సుషుప్త్యావస్థలో - అహంకారం లీనమై దేహం అచేతనంగా అవుతుంది.
వేదాంతంలో ఈ గాఢనిద్రను అహంకారం తన వ్యవహారాలనుండి తప్పుకున్న స్థితిగా
చెప్పబడింది. అహంకారం నాశనం కాదు గాని అది బీజావస్థలో కారణశరీరంతో తాదాత్మ్యం
చెంది ఉంటుంది. సూక్ష్మశరీరం స్థూలశరీరంతో కలవక విడిగా ఉంటుంది. అందుకే ప్రాపంచిక
వ్యవహారాలన్నీ తాత్కాలికంగా ఆగిపోతాయి. స్థూలశరీరం జడమైనదిగా ఉంటుంది. సుషుప్తిలో
రాగద్వేషాలుండవు. మనస్సు దానికి కారణమైన అధిష్టానంలో లీనమై ఉంటుంది. కాని ఆత్మ
ఉంటుంది. నిద్రనుంచి లేవగానే నిద్రాసుఖాన్ని అనుభవించేనని తెలుసుకుంటాడు. సుషుప్తి
రెండవదే లేని అద్వైతస్థితి. సుఖంగా నిద్రించానని తెలియడం వల్ల ఆత్మచైతన్యం
ఎల్లప్పుడూ ఉండేదేనని తెలుస్తుంది. నిద్రపోయాడు అంటే అతడు తన “సత్” లోకి వెళ్ళేడని
ఛాందోగ్యోపనిషత్తు చెబుతుంది. ద్వైతమంతా జాగ్రత్ స్వప్నాలలోనే.
స్వప్నంలో
సంఘటనలు మనలను మోహపరుస్తాయి. ఆధ్యాత్మిక సాధనకు స్వప్నదృష్టాంతము , జాగ్రదావస్థ
రెండూ మిధ్య అని చెప్పడానికి ఉపయోగ పడుతుంది. జాగ్రదావస్థ లోను స్వప్నావస్థ లోను
మనస్సే నేను నీవు, నాది నీది, నావారు పైవారు, సుఖదుఃఖాలు , కులభేదాలు, లింగభేదాలు
సృష్టించుకుంటుంది. పరమాత్మ జీవులలో విశ్వుడు , తైజసుడు , ప్రాజ్ఞుడు అనే నామాలతో
విలసిల్లుతున్నాడు. విశ్వుడు/ వైశ్వానరునికి కుడి కన్ను , తైజసునికి మనస్సు కంఠ స్థానమునను,
ప్రాజ్ఞుడు/ ప్రజ్ఞకు హృదయము వరుసగా జాగ్రత్తు, స్వప్నము, సుషుప్త్యావస్థలలో స్థానములని చెప్పబడింది. సుషుప్తినుండే స్వప్న జాగ్రదావస్థలు ఏర్పడుతాయి.
No comments:
Post a Comment