Friday, March 15, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-7

అరిషడ్వర్గాలు
 
మనస్సుకు మలినము, విక్షేపము, ఆవరణము అనే దోషాలు మాయవల్ల కలుగుతున్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనేవి మలినాలు. వీటినే అంతరంగంలో ఉండే శత్రువులుగా చెప్పడం విన్నాం కూడ. విక్షేపశక్తి అంటే లేనివస్తువును ఉన్నట్లుగా కల్పించడం. మాయయొక్క విక్షేపశక్తి వల్ల అరిషడ్వర్గాలు కలుగుతున్నాయి. ఇవి కారణశరీరమందలి రజోగుణం యొక్క విక్షేపశక్తి వల్ల కల్గి, మనస్సులోనికి వ్యాప్తిచెంది అనేకమైన కర్మలకు, వాటి ఫలాలకూ కారణమవుతున్నాయి. ఇలా మలినమైన ఆలోచనకు అహంకారం తోడై, నేను చేస్తున్నాను అనే భావం కలిగి బంధానికి కారణమవుతోంది. అందుకే కర్మయోగంలో ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యాలని చెప్పబడింది. ఇట్టి కర్మాచరణ వల్ల చిత్తము పరిశుద్ధమై జ్ఞానం కల్గుతుంది. అలా కర్మాచరణ చేస్తుండగా నిర్వికారమైన మనస్సుతో కర్మలు చేసే నైపుణ్యం కల్గుతుంది. 

కామము
కామము అంటే కోరిక. ఇదే విషయవాసన. మనస్సు ఇంద్రియాలతో కలసి ప్రాపంచిక విషయాలవేపుకు పోతుంది. అచ్చటి విషయాలు, సుఖాలు కావాలనే కోరికను కలిగిస్తుంది. ఒక కోరిక తీరిన పిదప మరో కోరిక కల్గుతూ అలా అనంతమైన కోర్కెలతో మనస్సు పరుగులు పెడుతుంది. వీటిలో తీరని కోరికలు మరణ సమయానికి మిగిలి ఉండటం వల్ల వాటిని అనుభవించడానికి మరో జన్మను పొందాల్సి వస్తూ , ఇలా జనన మరణ చక్రంలో బంధాన్ని కల్గిస్తున్నాయి. ఈ కోర్కెలు నశించాలంటే ఆత్మజ్ఞానం కలగాలి. ఆత్మజ్ఞానం వల్ల అనాత్మ వస్తువులయందు ఆసక్తి సన్నగిల్లుతుంది. వైరాగ్యం కలిగి చివరకు తనే బ్రహ్మమనే అనుభవానికి దోహదమవుతుంది. ఆత్మసాక్షాత్కారం కల్గిన జ్ఞానికిజగత్తంతా బ్రహ్మంగానే గోచరించి కామం పూర్తిగా నశిస్తుంది.

క్రోధము
కామక్రోధాలు కలిసే ఉంటాయి. ప్రాపంచిక విషయవాంఛ కలుగగానే ఆ కోరికను తీర్చుకోడానికి ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నం విఫలమైతే ఆలోచనను క్రోధం మలినం చేస్తుంది. అట్టి క్రోధంవల్ల అవివేకం కల్గి బుధ్ధి నశిస్తుంది. అప్పుడు చెయ్యరాని పనులను చేస్తాం. అందుచేత కామం నశిస్తేనే గాని క్రోధం నశించదు. కామక్రోధాలు రెండూ నశించాలంటే ఆత్మజ్ఞానం కలగాలి.

లోభమోహాలు
మోహం అజ్ఞానలక్షణం. అవివేకమే మోహం. ఈ శరీరమే నేను అనే భ్రాంతి మోహము. శరీరానికి సంబంధించిన సంపదలు, భార్య, పుత్రులు, మిత్రులు తనవారని అభిమానించడం మోహం. అదే దేహవాసన. ఈ మోహం వల్లఫలాపేక్షతో కూడిన కర్మప్రవృత్తి కల్గి బంధానికి కారణమవుతుంది. మోహం లేకపోతే కర్మఫలాలు, వాసనలు ఏర్పడవు. అంచేత జననమరణాలుండవు. సృష్టి కొనసాగుతోంది అంటే డానికి మొహమే కారణం.
లోభము అనేది తనకు తనవారికి సంపద, సుఖాలు మొదలైనవి దాచుకొనే స్వభావమే లోభం. మోహం తొలగితేనే లోభమూ నశిస్తుంది. ఈ రెండూ ఆత్మజ్ఞానం వల్లే నశిస్తాయి.

మదము మాత్సర్యములు
ఎదుటివారు తనకన్నా ఎక్కువ సంపదను కలిగి ఉండటంగాని లేదా మరోవిధంగా గాని అధికులైతే మదనపడుతుంటారు. ఇదే మత్సరం అంటే. కొందరిలో మిగిలిన వారికంటే తానే అధికుడను అనే భావముంటుంది. ఇదే మదము అనబడుతుంది. మదమాత్సర్యాలు రెండూ అనవసరమే.
మానవులంతా ఆత్మస్వరూపులు ఐనపుడు సుఖదుఃఖాలను అనుభవించేది ఒకే ఆత్మచైతన్యం. కర్మఫలాలను బట్టి ఈ వ్యత్యాసాలు కలుగుతాయి. ఆత్మజ్ఞానం వల్లనే ఈ మదమాత్సర్యాలు సన్నగిల్లుతాయి.
ఈ అరిషడ్వర్గాలు అజ్ఞానం వల్ల కల్గుతున్నాయి. ఇవి కారణశరీరం యొక్క రజోగుణ విక్షేపధర్మం వల్ల కల్గుతున్నాయి. కారణశరీరం అజ్ఞానం వల్ల ఏర్పడింది. అజ్ఞానం నశిస్తే ఇవన్నీ నశిస్తాయి. దీనికి ఆత్మసాక్షాత్కారం ఒక్కటే మార్గం. అరిషడ్వర్గాలు నశించాలంటే మనస్సు నశించాలి. మనోనాశనమే మోక్షమని చెప్పబడింది.
                  


No comments:

Post a Comment