Thursday, March 7, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-6


రాగద్వేషాలు  
 
మనస్సే ఒక ఆలోచన మంచిదని గాని చెడ్డదని గాని రూపకల్పన చేస్తుంది. అందువల్ల బంధము, దుఃఖము కలుగుతున్నాయి. అంతేగాని జ్ఞానేంద్రియాల వల్ల కాదు. ఇలాంటి భేదభావాన్ని మనస్సే సృష్టించుకొంటుంది. అంటే సంకల్పమే సంసారము. సంకల్పం ఉన్నచోట మనస్సు ఉంటుంది. అందుకే వివేకంతో సంకల్పాలను నిర్మూలించి బాహ్య విషయాలనుండి మనస్సును అంతర్ముఖం చెయ్యాలి. మనస్సు మాయయొక్క విక్షేపశక్తివల్ల నామరూపములచే బాహ్యజగత్తును కల్పించుకుంటుంది. ఈ విక్షేపశక్తి జాగ్రదావస్థ స్వప్నావస్థల్లోనే ఉంటుఉంది. సుషుప్తిలో ఉండదు. సంకల్పవికల్పములు, వాసనలు నశిస్తేనే “నేను” అనేది నశించి బంధవిముక్తి కల్గుతుంది. మనస్సు అవిద్యాకార్యం. అజ్ఞానం తొలగితేనే మనోనాశం కల్గుతుంది. అవిద్య అనేది మనస్సు, బుధ్ధి , అహంకారము మొదలైన ఉపాధుల ద్వారానే తన ప్రభావాన్ని చూపుతుంది. చూసేవాడు, చూడబడేది అనే ద్వైతమంతా మనోకల్పనయే. మనస్సును లయింపచేస్తే జగద్భ్రాంతి తొలగుతుంది.

బుద్ధితో కూడిన ఆత్మయే అహంకారము. నేను, నాది అనేదంతా జీవసృష్టి. ఈ జీవసృష్టే బంధానికి కారణం. మనస్సే అహంకారానికి బీజం. లోకవ్యవహారంలో అనుకున్నవి సంభవిస్తే రాగము, ప్రతికూల ఫలితాలు సంభవిస్తే ద్వేషము కల్గుతాయి. రాగము, ద్వేషము, తటస్థంగా ఉండటం అనేవి మనోవృత్తులు. భావావేశాలన్నీ రాగాద్వేషాలే. సుఖ దుఃఖాలు, హర్షశోకాలు, ఉప్పొంగిపోవడం కృంగిపోవడం మొదలైనవి రాగద్వేషాలవల్లనే కలుగుతాయి. కోపం కోరికయొక్క మరోరూపం. కోపము భయము అనేవి రాగము సుఖములతో కలిసే ఉంటాయి. నిద్రలో ఈ రాగద్వేషాలు బీజరూపంలో ఉండి నిద్రనుంచి మేల్కొగానే తిరిగి ప్రత్యక్షమవుతాయి. మనస్సు కల్పించే భేదభావన తొలగితే రాగద్వేషాలు కలుగవు. ఇవి సంకల్పములు కనుక కర్మ చెయ్యడానికి ప్రేరేపించి బంధానికి కారణమవుతాయి.

ప్రకృతి గ్రుడ్డిది. ఎప్పుడూ తటస్థంగానే ఉంటుంది. సంతోషంగాని దుఃఖంగాని వస్తువులలోనో లేక విషయాలలోనో ఉండదు. వాటిపై మనకుండే మమకారంవల్ల సుఖదుఃఖాలు, రాగద్వేషాలు కల్గుతున్నాయి. మనం సంతోషంగా ఉన్నపుడే ప్రాపంచిక విషయాలు ఆకర్షిస్తాయి. తీవ్రమైన దుఃఖంలో మనస్సు ఆ విషయాలవైపుకు పోదు. ఇష్టాయిష్టాలనేవి మనస్సులో తరంగాలుగా ఏర్పడుతుంటాయి. తిరిగి అవి మనస్సులోనే లీనమవుతుంటాయి. ఇవి ఏర్పడటానికి కారణం ఏమీ ఉండదు. సరైన అవగాహన, ఎరుక కలిగి ఉంటే వీటిని నిశితంగా గమనించ గల్గుతాం. ఒక వస్తువుగాని విషయంగాని దాన్ని చూసే వ్యక్తియొక్క ఆలోచనాసరళిని బట్టి ఉంటుంది. ఉదాహరణకు ఒక స్త్రీని బిడ్డ మాతృమూర్తిగా చూస్తే,  భర్త తనకు సుఖాన్నిచ్చే వ్యక్తిగా భార్య స్థానంలో చూస్తాడు. అదే స్త్రీని ఒక క్రూరమృగం తనకు ఆహారంగా చూస్తుంది. ఇలాంటి భేదభావాన్నికలిగించేది బుధ్ధి. ఇలా చూసేదృక్పధాన్ని బట్టి ఆలోచనా సరళి మలినమవ్వడం జరుగుతూంది.

లోకవ్యవహారానికీ , ఆధ్యాత్మికజీవనానికీ మధ్య ఆలోచనే వారధిగా మనలను ప్రేరేపించేది. ప్రాపంచిక విషయాలకై ప్రాకులాడటమా లేక ఆధ్యాత్మిక అనుభవాలకు మన హృదయపు తలుపులను తెరచి ఉంచుతామా అనేది మన యిష్టం మీదనే ఆధారపడి ఉంటుంది. సాత్వికమైన మనస్సు ఆధ్యాత్మికత వేపు మొగ్గు చూపుతుంది. నిజమైన ఆనందం నీలోనే ఉంది. బాహ్య విషయాల్లోనో వస్తువుల్లోనో కాదు. ఆత్మయే ఆనందానికి మూలం. వైరాగ్యం లేని సాధన నిష్ప్రయోజనమని చెబుతారు.





No comments:

Post a Comment