భక్తి పండితే హృదయమంతా ప్రేమతో నిండిఉంటుంది. అంటే సూక్ష్మాహంకారమున్న హృదయం లోకే ప్రేమ చొచ్చుకు పోతుంది. అలా సగం భౌతికంలా ఉండే హృదయంలో అహంకారం ప్రేమతో కరిగి, బాగా సూక్ష్మమైనపుడు, దాన్లో భగవానుడు హృదయకమలవాసిగా విరాజిల్లుతున్నాడని అంటారు. అంటే ప్రేమ అత్యున్నత శిఖరాల్లో ఉన్నప్పుడు అహంకారం కరిగిపోగా హృదయకమలవాసిగా ఆ భగవానుడే విరాజిల్లుతుంటాడు. ఇలా ప్రేమకు సంబంధించిన విషయాలే గాక ఈశ్వరుని మాయాశక్తివల్ల అనేక ఇతర విషయాలు హృదయం నుండే జీవాహంకారం వల్ల జరుగుతుంటాయ. యిదివరలో చెప్పుకున్న నాడులే జీవుని వ్యక్తిగత విషయాలను నియంత్రిస్తూ, అవయవాలన్నిటికీ ప్రాణశక్తిని ఇస్తాయి. హృదయం నుంచి బయలుదేరే అనేక నాడులలో ; కొన్ని మన శరీరంలో నవద్వారాల్లో అంతమవుతాయి. ఎవరైతే మరోజన్మ పొందాలో, వారి ప్రాణం ఈ నవ ద్వారాలనుండే పోతుంది. ఈ తొమ్మిది నాడులే గాకుండా మరొక ముఖ్యమైన శీర్షనాడి (మూర్ధ నాడి) తలవరకూ వ్యాపించి ఉంటుంది. ఎవరికి మరుజన్మ లేదో అట్టి కర్మయోగి ప్రాణం ఈ శీర్షద్వారం నుండే పోతుందని చెబుతారు. ఐతే జ్ఞానికి మాత్రం సాక్షాత్కారం కాగానే అతని ప్రాణం ఎక్కడికీ పోదు. అంతఃకరణం మాయనుండి విడువడి, అదృశ్యమవుతుందని చెబుతారు. అందుకే జ్ఞాని మరణించాడని గాక సిద్ధిని పొందాడని చెబుతారు. అంటే జీవన్ముక్తుడవుతాడన్న మాట. ఇలా ఇక్కడ చెప్పబడిన శీర్షనాడి యోగశాస్త్రంలో చెప్పే సుషున్నూనాడి కాదు. ఉపనిషత్తులలో చెప్పబడిన ఈ పది నాడులూ జీవంతోను, ప్రాణం పోకడలతోనూ సంబంధం కలిగి ఉంటాయి.
జ్ఞానమార్గంలోఅడుగిడిన వ్యక్తి సాధనా శిఖరాన్ని చేరాకా భక్తిని
ఆశ్రయిస్తాడు. మనస్సు, బుధ్ధి అహంకారానికి నిలయమైన హృదయంలోకి రాగా, హృదయం సూక్ష్మంగా ప్రేమతో నిండుతుంది. అహంకారం పలుచబడి ముడుచుకొని ,ముడుచుకొని
హృదయ ద్వారంలోకి ప్రవేశిస్తుంది. ఇదంతా అతడికి తెలియకుండానే జరిగిపోతుంది. ఎలాగంటే
అది ఆలోచనకు, ప్రాణానికీ మూలమైన స్థానమని గురువు చెప్పగా,
అక్కడే తన దృష్టినంతా కేంద్రీకరిస్తాడు. ఆ స్థానం హృదయానికి మధ్యలో
ఉంటుందని గురువు చెప్పియుండవచ్చు. వాస్తవానికి ఈ స్థితిలో సాధకుని చిత్తము
/అంతఃకరణం పూర్తిగా ఆ స్థానంలోకి పోదు. అంటే సాధకుడు ఆ స్థానాన్ని
కనుక్కున్నాడంతే. అతని చిత్తం ఆ స్థానంలో క్షణకాలం నిలిచిందని చెప్పాలి.
వాసనలు, అహంకారమూ పూర్తిగా నిర్మూలమైతేనే అంతఃకరణం అక్కడ నిలుస్తుంది. అంటే అది
అక్కడ ఆగి, దానితో సంబంధించి ఉంటుంది. యిదంతా అతడికి
తెలియకుండానే జరిగిపోతుంది. అతడి దృష్టి అంతా ఆత్మస్ఫురణపైనే ఉండటం వల్ల ఈ నాడుల
గురించిగాని, హృదయంలో జరిగేదిగాని ఏమీ తెలియవు. తెలియవలసిన
అవసరమూ అద్వైత సాధనలో లేదు. అంచేత తను పయనించిన మార్గం గురించి ఏమీ చెప్పలేడు.
యోగశాస్త్రంలో సాధనాపద్ధతులు, నాడులలో ప్రాణశక్తి మొదలైనవి
ప్రస్తావించబడుతాయి. కాని వేదాంతపద్ధతిలో హృదయనాడులూ, హృదయ
ద్వారము తెలియక్కర లేదు. ఆత్మవిచారణ మాత్రమే ఉంటుంది. సాధకుడి జీవన విధానము,
ఉపాసన, ఆత్మాన్వేషణలకు అనుగుణంగానే, జీవభావం నాడులతో కలసి ఆత్మస్థానం
చేరుతుంది. ఇదంతా సాధకుడి ప్రమేయం లేకుండానే అప్రయత్నంగా జరిగిపోతుంది.
యోగశాస్త్రంలో పురోగతి ఒక్కొక మెట్టూ నిచ్చెన ఎక్కేటట్లు ఉంటుంది. ఇక్కడ
ఒక్కసారిగా అకస్మాత్తుగా ఒక elevator లాగ అప్రయత్నంగా
హృదయనాడులు లక్ష్యాన్ని చేర్చుతాయి. జీవభావం అనంతచైతన్యంలో కరిగిపోవడమే
జ్ఞానమార్గంలో జరిగేది.