ఇక్కడ ఏ హృదయం చెప్పబడింది?
శరీరానికి రక్తప్రసరణను చేసేది మాంసమయమైన
హృదయం. ఇక్కడ మనం చెప్పుకునే హృదయం పూర్తిగా భౌతికం అనుకోకూడదు. భౌతికంలా అనిపించే
హృదయం అని అందాం ప్రస్తుతానికి. యోగులు చెప్పే చక్రాలు, నాడులూ ఆధునిక పరికరాలచేత కూడా తెలియబడవు. అలాగే మనం
చెప్పే హృదయం కూడా కంటికి కనపడదు. అలాగని సూక్ష్మమూ కాదు. భౌతిక , సూక్ష్మభౌతికాలకు మధ్య దశలో ఉంటుందని అనుకోవాలి. దీని నుండి వెలువడే నాడుల
ద్వారా హృదయం నుండి రక్తప్రసరణని, మిగిలిన యితరమైన పనులనూ
నియంత్రిస్తుంది. ఉదాహరణకు – ప్రాణశక్తినీ, రక్తప్రసారాన్నినియంత్రించే మాంసమయమైన భౌతిక హృదయాన్నేగాక, శ్వాసకు మూలమైన ఊపిరి తిత్తులను, జీర్ణ శక్తినీ,
మెదడు నిర్వహించే సర్వ కార్యకలాపాలనూ మనం చెప్పుకునే హృదయమే దాని
నుండి వెలువడే నాడుల ద్వారా నియంత్రిస్తోంది. నేననే జీవభావమే(అహంకారమే) లేకపోతే, శరీరంలో ఏదీ
జరుగదు. అందుకే అహంకారానికి నిలయమైన హృదయానికి అట్లాంటి శక్తి యివ్వబడింది. ఇలా
జీవుడికి సంబంధించిన సమస్త వ్యాపారాలను చేస్తోంది గనుక కేవలం భౌతికం అని గాకుండా సగం
భౌతికంలా ఉండే హృదయమని అంటున్నాం.
ఐతే వైరాగ్య శమదమాలవల్ల మనస్సుకున్న
క్రొవ్వు కరిగి, మధించబడటం చేత
తగ్గించబడింది. అంటే శుభ్రం చెయ్య బడింది. యిదివరలో చెప్పుకున్నట్లుగా అహంకారం
మనకు తెలియకుండానే విషయాల వేపుకు లాగుకొని పోతుంటుంది. నాకు శమదమాలు ఉన్నాయనే అహంకారం దాగి ఉండి,
మనకు తెలియకుండానే గొప్పలు చెప్పుకుంటూ ఉంటుంది. అంచేత సాధనలో
గడించిన లాభాలతో బాటు వ్యక్తిత్వాన్ని కూడా ఆత్మలో విలీనం చెయ్యాలి. అంటే సాధన
అంతా అహంకారాన్ని పోగొట్టుకోడానికన్న
మాట. సాధనలో అహంకారాన్ని సగం భౌతికంలాఉండే
హృదయంలో లీనం చెయ్యాలనే భావనతో ఉన్నప్పుడు
, అది సూక్ష్మమై చిన్న ఖాళీ ప్రదేశంగా అవుతుంది. ఆత్మస్థానం
ఇంతకన్నా సూక్ష్మంగా ఈ హృదయానికి మధ్య కారణాకాశంగా ఉంటుంది. అహంకారాన్ని
సూక్ష్మతరం చెయ్యగా చెయ్యగా, అది కారణాకాశంలో చేరగలుగుతుంది.
ఇలా అహంకారాన్ని కారణాకాశంలో చేరేంతగా కృశింప చెయ్యడం భక్తివల్లనే సాధ్యమవుతుంది.
No comments:
Post a Comment