ఇక్కడినుండే మలయమారుతం వీస్తుంది. సాధకుడు శుష్కప్రాయంగా జీవించడం మాని, అహంకారం యొక్క దురభిమానానికి
దూరంగా ఉంటూండాలి. నేను నేనేది అహంకారం. దురహంకారం/ దురభిమానం అనేది అహంకార భావనకే
చెందినా అది విర్రవీగే తనాన్ని చూపుతుంది. ఉదాహరణకు నేను సాధనలో ఎన్నో మెట్లను
అధిరోహించి ప్రస్తుతం జ్ఞానమార్గంలో ఉన్నానని చెప్పడం వంటిది. ఐతే అహంకారం
పూర్తిగా చిట్ట చివరి దశలోనే నిర్మూలించ బడుతుంది. అందుకే ఈ స్థాయిలో వినయము, సమర్పణ భావమూ పెంపొందాలి. ఈ గర్వ,ఆహంకారాలకు దూరంగా ఉండటానికి భక్తి తప్పనిసరి అని శంకరులు ప్రతిపాదించారు.
ఇంతవరకూ గడించినదంతా పరమాత్మ దయవల్లనే లభించినదని ఎప్పుడూ అణకువతో ఉండాలి. ఆయన
దయలేందే మోక్షం రాదు. అంచేత సన్యాసం స్వీకరించడానికి ఈ దురభిమానాన్ని త్యాగం
చెయ్యాలి.
మనం దేనితోనైనా అనుబంధం ఏర్పరచుకోవాలంటే
అది జీవం ఉన్నవాటితోనే సాధ్యం. ఇలా అనుబంధంతో బాంధవ్యంతో ఉన్నప్పుడు బాంధవ్యంతో
బాటు జీవుడూ కరిగిపోయి అదే అవుతాడు. ఇలా కరిగిపోవడమే , అదే ప్రేమ అని చెబుతారు. బాంధవ్యం యొక్క సౌరభం ఒక
జీవుడు మరో జీవుడికి సర్వస్వాన్నీ ప్రేమలో
అర్పించుకోవడమే ఉంటుంది. ఇంతదాకా నిత్యానిత్యవస్తు వివేకం నుంచి శమాదిషట్క సంపత్తి
దాకా వీటిని పొందినా, సాధన జడం గానే సాగింది. ఇంకా ప్రాణం
మహాప్రాణంతో సంధానించ బడలేదు. అందుకే బౌద్ధులు చెప్పే శూన్యం వలె ఉంది. కాని
వేదాంతులు చెప్పే బ్రహ్మం సచ్చిదానందమయం. చిదానంద స్వరూపం ఆనందఘనం. అలా
పరిపూర్ణదశను ఆనందస్వరూపంగా భావించి, ఆ పరిపూర్ణతలో
మునిగిపోడమే దీన్లో జరిగేది. అందుకే ఈ స్థితిలో భక్తి యొక్క ఉద్దేశ్యం జీవుడు ఆ
పరిపూర్ణతను పొందటం. దాంతో బాంధవ్యాన్ని కలిగి ఉంటూ ఆ పరిపూర్ణ సచ్చిదానందంలో
కరిగిపోవటమే. ఇలా జడంగా జరిగే సాధన అనే మ్రోడును భక్తితో తడిపి, చల్లబరచి చిగురించేట్లు చేస్తాడన్నమాట.
మనస్సుకు ఆలోచనలు, బుద్ధికి అనుభూతులు, అహంకారానికి
నిశ్చయ జ్ఞానము ఎప్పుడూ ఉంటుంటాయి. అంచేత మనో బుద్ధ్యహంకారాలను వాటి పనులనుండి
ఎండింపచెయ్యాలి. అప్పుడే ప్రేమ మొలకెత్తుతుంది. భక్తి పరమాత్మ వేపుకి
మళ్ళినప్పుడు అహంకారం ఆత్మలో లయమవ్వడానికి
సిద్ధమవుతుంది. సాధనచతుష్టయం తర్వాత సన్యాస స్వీకారము, మహావాక్యాల
ఉపదేశము ఉంటాయి. నేర్చుకున్న శాస్త్రాలు వాక్యాలు సజీవంగా భావించుకొని
ప్రేమగా వాటితో అనుబంధం ఏర్పరచుకొని
వాటిలో కరిగిపోవాలి. సన్యాసంలో అన్నీ విడవడమే ఉండటంవల్ల బయటివారికి శుష్కంగా
అనిపిస్తుంది. కాని అలా విడచిపెట్టడంతో అసలైన చల్లని ప్రేమామృతం మొదలవుతుంది.
No comments:
Post a Comment