బ్రహ్మము-1
మాయను గురించి తెలుసుకొనేముందు బ్రహ్మము గురించి
తెలుసు కోవాలి.
ఇదివరలో ఆత్మ-1
,ఆత్మ-2 లలో ఆత్మగురించి వ్రాయబడింది. ఆత్మయే బ్రహ్మమని
చెప్పుకున్నాం. అంచేత వాటిని ఈ వ్యాసంతో కలిపి చదువుకోవాలి.
బ్రహ్మము గురించి-
దుఃఖాన్ని దూరం చేసుకోడానికి భగవంతుడిని సేవించాలని/
ప్రార్ధించాలని పెద్దలు చెబుతూంటారు. ప్రతీ వ్యక్తికీ తనతో బాటుగా, కనిపించే బాహ్యప్రపంచం ఉందనేది తెలిసిన విషయమే. పెద్దలు
చెప్పడాన్నిబట్టో లేక శృతి ద్వారానో లేక అనుమాన ప్రమాణంగానో పరమాత్మ ఉన్నాడని
తెలుసుకొంటారు. ఇలా జీవుడు, జగత్తు, పరమాత్మ ఉన్నారని తెలిసినా, ఈ మూడింటికీ ఉండే పరస్పర సంబంధాన్ని గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఏ
కొద్దిమందికో ఉండి , దాన్ని తెలుసుకోడానికి ప్రయత్నిస్తారు.
బాహ్య విషయాలు తెలుసుకునేందుకు
ప్రత్యక్షప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్దప్రమాణముల వంటివి ఆయా విషయాలను గూర్చిన
యదార్ధజ్ఞానాన్ని కల్గిస్తాయి. కాని ఇవేప్రమాణాలు అలౌకికవిషయాలైన స్వర్గ నరకాలు,
పాప పుణ్యాలు, ఆత్మఅనాత్మల గురించి తెలియడానికి ఉపకరించవు. ఇలాంటి విషయాలు
తెలియాలంటే శ్రుతిని ఆధారంగా తీసుకోవాలని విజ్ఞులు చెబుతారు. వేదాల పూర్వభాగంలో
ఎవరి అభిరుచిని బట్టి వారు ఆచరించడానికి తగినట్లుగా వివిధకర్మలూ, ఉపాసనలూ
చెప్పబడ్డాయి. ఈ కర్మకాండ, ఉపాసనలలో భేదదృష్టి అంతర్లీనంగా కనిపిస్తుంది. అలాంటి
భేదభావం/ద్వైతభావం తోనే, లోకవ్యవహారమంతా జరుగుతోంది కూడా.
వేదాల చివరిభాగాలైన ఉపనిషత్తులలో, బ్రహ్మమును
తెలుసుకొనే విచారణ చెయ్యబడటంవల్ల వేదాంతమని పిలువబడుతోంది. దేన్ని తెలుసుకొంటే,
ఇక తెలుసుకోవలసినదేదీ ఉండదో, ఆకారణం వల్ల వేదాంతమని చెప్పబడింది. మనం వాడుకలో
భగవంతుడు లేక దేవుడు అని చెప్పేదాన్ని వేదాంతంలో పరము, పరతత్వము, బ్రహ్మము,
పరబ్రహ్మము , పరమాత్మ, నిర్గుణబ్రహ్మము అని చెప్పబడింది. ఈ సంసారసాగరమనే జననమరణాల
దుఃఖంనుండి విముక్తి లభించాలంటే, బ్రహ్మమును తెలుసుకోవాలి. అంటే శ్రవణ, మనన,
నిదిధ్యాసనలను అభ్యసించి, బ్రహ్మాత్మైక్య అనుభవాన్నిపొందాలి/బ్రహ్మవిద్యను తెలుసుకోవాలి.
బ్రహ్మము
అవాజ్ఞ్మానస గోచరమని శృతి చెబుతోంది. అంటే మాటలచేత గాని, మనస్సు చేత గాని ,
జ్ఞానేంద్రియముల చేత గాని తెలియబదనిది. అయినా అందరికీ అర్ధమవ్వడానికి నామరూపములు
లేని నిర్గుణబ్రహ్మమైన శుద్ధచైతన్యమును పరుడు,
చిత్తు, సత్తు అనే పేర్లతో చెప్పబడినది. ఆ నిర్విశేష బ్రహ్మమును బోధించడానికి వేదాంత
శాస్త్రము నేతి, నేతి – ఇది కాదు, ఇది
కాదు అని; సమస్త వస్తువుల స్వరూపమును విచారించి త్రోసివేయగా చివరకు నిషేధింప
వీలుకానిది బ్రహ్మమని నిశ్చయము చేయబడినది. ఇది నిషేధపద్ధతి. ఇది గాక బ్రహ్మము సద్రూపుడు, చిద్రూపుడు, అనంతరూపుడు
అని శబ్దప్రయోగములతో చెప్పే పద్ధతిని విధి అని చెబుతారు. ఇలా విధి , నిషేధములు బ్రహ్మ బోధకు ఉపాయములుగా
వేదాంతము నందు గ్రహించబడ్డాయి.