ఆజ్ఞాచక్రమునకు మీదుగా కపాలము నందుండును. జ్ఞానసిద్దిపొందిన జీవులను తనయందు
ఐక్యముచేసుకొను 'ఓం'కారస్వరూపుడైన పరబ్రహ్మ ఇచ్చట కలడు. ఈ సహస్రారకమలము సహస్రదళములతో కూడి కోటిసూర్యుల ప్రకాశముకల్గి యుండునని చెప్పబడినది. దీనియందు ఎనిమిది
దళములు గలవు. ఒక్కొక్క దళమునకు నూట ఇరువదియైదు రేకులు ఉండుటచే, సహస్రదళపద్మమని
చెప్పుదురు. ఈ చిద్బిందువే లీనమగు కేంద్రము. ఇందు కేవల సాక్షిమాత్రుడగు పరమాత్మ
అధిపతిగా, ప్రణవనాద స్వరూపముగా పాటలవర్ణ రూపమున గలడు. ఇచటగల వర్తులాకార
షట్కోణమందు గల కేంద్రబిందు సంజ్ఞయే మనస్సు నిలుపవలయు స్థానము. ముందుగా మనసును
విషయములనుండి మరల్చి, ఆజ్ఞాచక్రమున నిలిపి
పిమ్మట సహస్రారమున చేర్చుటచే వృత్తిరహితమగును. ఇదే యోగుల గమ్యస్థానము. ఇచట ఇష్టదేవత లేక
గురువు పాదపద్మములున్నవని భావింతురు. 'ఓం' కారము నుచ్చరించ వచ్చని చెప్పెదరు.
దీనియందు బ్రహ్మరంధ్రము ఉన్నది. ఇటనుండి దేవయాన మార్గమున బ్రహ్మలోకమునకు పోవు
ఉపాసకులు నిర్గమింతురు.
ముఖ్య విషయాలు
ధ్యానం :- మన అంతరంగిక ప్రపంచాన్ని గురించి చేసే సాధన.
ఈ సాధన చెయ్యడానికి ముందు గురువును/ లేక ఇష్టదైవాన్ని గాని ధ్యానంలో సరైన బాటలో నడిపించమని ప్రార్ధన చెయ్యాలి. ఒక వస్తువుపై మనస్సును కేంద్రీకరింప జేయటమే ధ్యానం అని చెప్పబడుతోంది.
ఆసనం :- స్థిరంగాను, సుఖంగాను ఎక్కువ సమయం
ఉండగలిగే ఏ ఆసనాన్నైనా ఎన్నుకోవచ్చు. నియమాలేవీ లేవు. పద్మాసనం, సుఖాసనం, వజ్రాసనం అనువైనవని విజ్ఞులు అంటారు.
వెన్నెముక :- వెన్నెముక తోబాటు తల, మెడ, చాతీ నిటారుగా ఉండేలా ఆసనంలో ఉండాలి.
ముద్ర :- ఒకటి - బొటన వేలికొన చూపుడు వేలి కొనతో కలిపి మిగిలిన మూడు వ్రేళ్ళనూ నిటారుగా ఉంచి
అరచేతిని చాచాలి.
రెండు :- చూపుడువేలికొనను బొటనవేలి మధ్య అంటే మొదటి కణుపుతో కలిపి ఉంచాలి.
మూడు :- చూపుడువేలికొనను బొటనవేలి రెండవ కణుపుతో కలిపి ఉంచాలి.
సాధారణంగా మొదటి రెండు చక్రాల ధ్యానానికీ మొదటి ముద్రను, తర్వాతి రెండు చక్రాల
ధ్యానానికీ రెండవ ముద్రను, ఆపై చక్రాల ధ్యానానికి మూడవ ముద్రను చెప్తారు. (ఈ
విధంగా నేను నేర్చుకున్నాను). ఇలా ముద్రలను మార్చడానికి సందేహం ఉంటే అన్ని చక్రాల
ధ్యానానికీ మూడవ ముద్రను నిర్ద్వందంగా ఉపయోగించ వచ్చును.
మూలాధారంతో చక్రధ్యానం మొదలు పెడితే అన్నిచక్రాల ధ్యానము, ఒకదాని తర్వాత
మరొకటి క్రమంగా చెయ్యడానికి సుమారుగా ఐదు నిమిషాలు ఒకో
చక్రానికీ పడుతూ, మొత్తం పూర్తయ్యేసరికి నలభైఐదు నిమిషాల నుండి యాభై నిమిషాలదాకా
పట్టవచ్చు. సహస్రారం పూర్తయ్యే సరికి ఒకవిధమైన ఆనందానుభూతి కల్గుతుంది. ఆ
అనుభూతిని కొనసాగించడానికి కళ్ళు అలాగే మూసి, శవాసనంలో కొంత సేపు ఉండాలని
చెప్తారు.
శ్వాసను గమనించు :- కళ్ళు మూసుకొని శ్వాస వేగం తగ్గేదాకా గమనించుతూ ఉండాలి.
క్రమంగా శ్వాస నిమిషానికి 14 సార్లు కంటే తగ్గాలి.
ధ్యానంలో శ్వాసను గమనిస్తుంటే అది క్రమంగా భ్రూమధ్యంలోకి చేరుకొని, ఆలోచనారహిత స్థితిలో చక్కటి శారీరిక, అత్మానుభూతులను గమనిస్తాం.
ధ్యానం అనవసరపు ఆలోచనా పరంపరలను ఆపుతుంది. అపుడు దివ్యచక్షువు ఉత్తేజమై ఇతరలోక
దృశ్యాలు కనిపిస్తాయని చెబుతారు.
No comments:
Post a Comment