కుండలిని - 5
అనాహతము
వక్షస్థలమున రొమ్ముఎముకకు వెనుక ఉండే హృదయ పద్మాన్ని అనాహతం అంటారు. ధూమ్రవర్ణం గల షట్కోణాకృతిలో ఉండే పన్నెండు దళములు గల పద్మమిది. వాయు సంబంధ మైనదగుట వల్ల
త్వగింద్రియ(చర్మము)ముతో పండ్రెండు విధముల స్పర్శలు తెలియును. తల్లి, తండ్రి, భార్య, తనయులు, మిత్రులు , ధనము, సోదరులు, శరీరము, వాతము, పైత్యము, శ్లేష్మము , మరణము అనునవి తెలియబడును.
ఈ ద్వాదశ దళముల కమలమునకు అధిపతి పార్వతితో కూడి యుండు రుద్రుడు. ఇచట కొట్టబడకయే
మ్రోగు శబ్దము ఉండుటచే అనాహతమని చెప్పుదురు. దీనిని శబ్దబ్రహ్మము అందురు. శబ్దము
నుండి ధ్వని కల్గును. ధ్వని నుండి వివేకమను వెలుగు/ జ్యోతి పుట్టును. ఈ వివేకమున
మనస్సు అంతర్భాగమై ఉన్నది. ఎపుడు అమనస్క మగునో, అపుడు బ్రహ్మమునందు లీన
మగును.
మనస్సును వశపరచుకొనుటకు ముందుగా ఈ చక్రమున దృష్టి నిలిపినచో, శబ్దము అణగి, ప్రణవ నాదమను ధ్వని
వినపడును. సాధన కొనసాగుచుండగా ప్రణవ నాదము తగ్గి, స్వప్రకాశమను ఆత్మజ్యోతి
కనబడును. ఇంకనూ సాత్విక అహంకారముండుటచే బ్రహ్మమును చూడజాలకున్ననూ, మనస్సు
బ్రహ్మమునందు ఐక్య మగును. నాదమనగా మూలాధారము నుండి కదలిన కదలికచే, హృదయమున పుట్టిన
సంగీతధ్వని, కుండలినీశక్తి చేత యోగమున నాదబ్రహ్మమును లేపి, ఆనందమును చెందుట.
అనాహత చక్రము పండ్రెండు దళములు గల పద్మము.
" యం" దీని బీజాక్షరము. హృదయము కేంద్రము. ప్రేమ, సత్కర్మాచరణను కలుగజేయును. శరీరమున వాయువు గ్రహించబడుట, విసర్జించ బడుట దీనివల్ల జరుగును. ఊపిరితిత్తులు, గుండె ఈ కేంద్రమునకు లోబడి పనిచేయును. స్పందన, ప్రతిస్పందన అను ప్రవృత్తులు
ఇచటనే పుట్టును. తల్లికి బిడ్డయందు కల్గు ప్రేమ ఈ కేంద్రమువల్ల కలుగు చున్నది.
ఇందు ప్రీతి, ప్రియత్వము పుట్టుచున్నవి. జీవునియందు చైతన్యమును కలుగ చేయును. కరుణవల్ల అమృతత్వము కల్గి
జీవునకు శరీరబంధము తెగిపోవును. దీనిని ధ్యానించువాడు వాక్కునకు అధిపతియై క్షమాగుణము కల్గి యుండును. ఇంద్రియములు వాని వశమున నుండును. ఈ దేహమందు తనకు
తానున్నానని తెలియునది హృదయమందే. తననుండే
శ్వాస పుట్టుచున్నదని తెలియువాడు ఎరుక గలవాడు.
అనాహతం బీజాక్షరం- యంగ్ . పండ్రెండు
దళములు కల్గిన ఆకుపచ్చని పద్మం. దాని మధ్యలో నక్షత్రాకారము వలె ఉండి, దాని మధ్యలో yellowish red జ్యోతి ఉండును.
No comments:
Post a Comment