మనస్సు అంటే ఏమిటి? అదెలా ఏర్పడింది?
మానవుడంటే శరీరము, మనస్సు , ఆత్మల కలయిక. శరీరం
పనిచేయడానికి మనసు జ్ఞానాన్ని కల్గిస్తుంటే , ఆత్మ
మార్పులేని ‘సత్’ పదార్ధంగా వీటిని నడిపిస్తుంటుంది.
“భూమిరాపో 2 నలో వాయుః ఖం మనో
బుధ్ధి రేవ చ
అహంకార
ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టధా “ (భగవద్గీత 7-4).
పృథ్వి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము,
మనస్సు, బుధ్ధి, అహంకారము అనే భగవంతుని అష్టప్రకృతులలో మనస్సు ఒకటిగా చెప్పబడింది.
బ్రహ్మమే తన సంకల్పశక్తిచేత ప్రకృతినుండి పురుషుడు / హిరణ్యగర్భుడు ఆవిర్భవింప చేసాడు.
అంటే ప్రకృతి నుంచి హిరణ్యగర్భుడు ఆవిర్భవించాడు. ఈ హిరణ్యగర్భుడి నుంచే సమిష్టి
రూపమైన మనస్సు , దానినుండి పంచభూతములు, వాటినుండి జగత్తు ఏర్పడినట్లుగా
చెప్పబడింది.
హిరణ్యగర్భుడినే కార్యబ్రహ్మ
లేక కార్యసంభూతి అంటారు. ఇతడే మనస్సునకు మూలం. మనస్సు సూక్ష్మమైనది. జగత్తులో ఉండే
అన్ని జీవరాసుల మనస్సులూ కలపబడి/ అనుసంధానం చెయ్యబడిన హిరణ్యగర్భుడే ఈ మనస్సుల సమిష్టిగా చెప్పబడినది.
ప్రాణులన్నిటి యందూ ఉండే సూత్రాత్మ కూడ హిరణ్యగర్భుడే. అంటే ప్రతీ జీవికీ
ప్రత్యేకమైన ప్రాణము, మనస్సూ కలిగియున్నా, వీటన్నిటినీ కలిపి ఉంచే చైతన్యమే
హిరణ్యగర్భుడు.
వేదాంతపంచదశిలో – తమోగుణప్రధానమైన
ప్రకృతి నుంచి పంచభూతములు ఏర్పడ్డాయని, ఈ సూక్ష్మపంచమహా భూతముల ఒక్కో సత్వాంశము
నుండి ఒక్కో జ్ఞానేంద్రియం చొప్పున పంచజ్ఞానేంద్రియములు ఏర్పడినాయి. ఈ పంచభూతాల
సత్వాంశాలు ఐదూ కలసి అంతఃకరణం ఏర్పడిందని చెప్పబడినది. చేసే వృత్తిభేదాన్ననుసరించి
అదా, ఇదా అని సంశయించి విమర్శించే భాగాన్ని మనస్సనీ, వివేచనచేసి ఈ కారణంచేత ఇది
ఫలానా విషయమని నిశ్చయించే భాగాన్ని బుధ్ధి అని చెప్పబడింది.
సాంఖ్యుల సిద్ధాంతం ప్రకారం అవ్యక్తం
నుంచి ముందుగా ఏర్పడిన ‘మహత్తు’ సమిష్టి మనస్సుగా చెప్పబడింది. ఇలా మనస్సు
ప్రకృతిపైన , ప్రకృతి బ్రహ్మము పైన ఆధారపడి ఉన్నాయి. మహత్తు నుండి అహంకారం
పుట్టగా, అహంకారం యొక్క సాత్విక భాగం నుంచి మనస్సు , రాజసిక భాగం నుంచి ప్రాణము,
తామసిక భాగం నుంచి పంచతన్మాత్రలు, వీటినుండి పంచమహాభూతములు, ఈ పంచ భూతముల నుండి
స్థూల ప్రపంచమూ కలిగాయని చెబుతారు. ఇలా అహంకారం నుండి ఏర్పడిన మనస్సు ఎపుడూ ఏదొక
స్థూలవస్తువుతో సంబంధపడి గుర్తింపును కలిగి ఉంటుంది. ఆ గుర్తింపే ‘నేను’ అనే
దానిగా చెప్పబడుతూ, ఆ నేనే మనస్సనే
మహావృక్షానికి బీజమవుతుందని చెప్పబడింది. దేనితోనూ సంబంధపడకుండా మనస్సుకు వేరే ఉనికి
లేదు.
మనస్సు అంటేనే ఆలోచనల సమూహం. మనస్సులో
ఉండే ఆలోచనలను బట్టే మానవుడు ప్రవర్తిస్తుంటాడు. అంచేతనే “యద్భావం తద్భవతి” అని
చెబుతారు. అంతఃకరణమనే పదాన్ని మనస్సనే అర్ధంలో వాడుకలో ఉంది. అంతఃకరణ చతుష్టయం
అన్నపుడు మనస్సు, బుద్ధితోబాటుగా అహంకారము, చిత్తము అనేవి కూడ కలసి ఉంటాయి. ఇలా
వృత్తి భేదాన్నిబట్టి వేర్వేరుగా పిలువబడుతున్నాయి. ఒకేవ్యక్తి కుటుంబంలో
కుమారుదిగాను,తండ్రిగాను, తాతగాను, భర్తగాను, మరియూ వృత్తిపరంగా న్యాయవాది మొదలైన
విభిన్న పాత్రలను పోషిస్తూ వివిధ నామములతో పిలువబడుతున్నట్లుగా సంకల్ప వికల్పములను
కలిగించేటపుడు మనస్సని చెప్పబడుతోంది. సంకల్పం అంటే ఆలోచనలే. వికల్పమంటే సంశయం .
మనస్సు అదా? ఇదా? అనే సంశయాన్ని కల్గించి విమర్శించే భాగంగా చెప్పబడింది.
వివేకంతో ఈ కారణంచేత ఇది ఫలానా అని
నిశ్చయించే భాగాన్ని బుధ్ధి అంటారు. అంటే బుధ్ధి నిర్ణయాత్మకమైనది. నేను నాది అని
గుర్తింపుతో ఉండేది అహంకారమని చెప్పబడింది. ఇక చిత్తము అనేది సంస్కారాల మూట.
దీన్లో అనుభవాలు, ఆలోచనలు భద్రపరచబడి, అవసరమైనపుడు తిరిగి వ్యక్తమై గుర్తుకు
వస్తుంటాయి. మనస్సు పనిచేసేటపుడు బుధ్ధి అహంకారములు కూడ మనస్సుతోబాటు
పనిచేస్తుంటాయి. బుధ్ధి నిశ్చయించిన విషయాన్ని కర్మేంద్రియాలద్వారా ఆచరణలో
పెట్టేటపుడు మనస్సును వ్యాకరణాత్మకమైనదిగా చెప్పబడింది.