Thursday, January 3, 2013

మాయాస్వరూపము - 4


మాయకు విక్షేపశక్తి, ఆవరణశక్తి అని రెండు విధములైన శక్తి ఉంది. విక్షేపశక్తి అంటే  లేని వస్తువును  ఉన్నట్లుగా చూపడం. ఆవరణశక్తి అంటే ఉన్న వస్తువును లేదనుకొనేటట్లు చెయ్యడం. ఈ రెండిటివల్ల బ్రహ్మమునందు జగద్భ్రాంతియును, బ్రహ్మము లేదనుట జరుగుతోంది.
   
సత్వగుణ సామ్యమున ప్రకృతి  వ్యక్తమవుచుండగ, అందు బ్రహ్మము సాక్షిచైతన్యముగా ప్రతిబింబించెను. ఇట్టి బ్రహ్మచైతన్యమే విక్షేపశక్తిగా సత్వగుణోద్రేకం పొందిన ఆవరణశక్తితో కూడి అవ్యక్తమని చెప్పబడుతోంది. ఈ శుద్ధ సత్వగుణప్రధానమైన మాయ  చిచ్ఛక్తిగాచెప్పబడుతోంది. ఇదే ఈశ్వరునకు  ఉపాధి. మాయా రూపమగు చిచ్చక్తి , మాయాధిష్టాన చైతన్యము,  మాయా ప్రతిబింబచైతన్యములు కలసినదే- ఈశ్వర చైతన్యము. ఈచైతన్యమే  జగత్కర్తగా  నిమిత్త ఉపాదాన కారణమగుచున్నాడు. నాశరహితమగు బ్రహ్మమును పొందు పరాప్రకృతిచే  విక్షేప, ఆవరణశక్తుల సహాయమున జగద్రచన జరిగెను. ఇందు విక్షేపశక్తి క్షేత్రజ్ఞుడు. ఆవరణశక్తి క్షేత్రము. 

ఈ చిచ్ఛక్తి అంశములైన అస్తి , భాతి , ప్రియము అనేవి క్షేత్రజ్ఞుని విక్షేపశక్తిగాను ,  నామ రూపములను అంశములు జగద్రూపమున క్షేత్రస్వరూపమగు ఆవరణశక్తిగనూ తెలియబడుతోంది. (అస్తి - అంటే ఉనికి కల్గి ఉండటం . అదే సత్తు. భాతి అంటే ప్రకాశము . అదే చిత్తు. ప్రియము అంటే ఆనందము ). అనగా బ్రహ్మచైతన్య రూపిణిగా నున్న పరా ప్రకృతే ఆత్మగాను , ఆమెకన్న భిన్నమైనది అనాత్మగాను చెప్పబడింది. ఆమెయే పరతత్వము. ఈ చిచ్ఛక్తియే క్రియా , ఇచ్ఛా , జ్ఞాన , ఆది , పరాశక్తి రూపములలో చెప్పబడుచున్నది. జగద్రచనను ఇచ్ఛాశక్తిగాను, జగద్రక్షణ జ్ఞానశక్తిగాను , లోకోపసంహారము క్రియాశక్తిగాను , ఈ మూడిటికి అధిష్టానమైనశక్తిని ఆదిశక్తిగాను , నిరధిష్టాన మాయాత్మకమగు పరాశక్తి  సర్వసంకల్పాత్మకమగు శుద్ధచిచ్ఛక్తి గాను చెప్పబడు చున్నది. చిచ్ఛక్తి , బ్రాహ్మీ , మహేశ్వరి , కౌమారి , వైష్ణవి , వారాహీ , ఇంద్రాణి అను సప్తమాతృకలుగా ఈ జగన్మాతయే తెలియబడుచున్నది. రాజరాజేశ్వరి , శ్రీవిద్య , పంచదశాక్షరి , మహాత్రిపురసుందరి , బాలాంబిక , మాతంగి , భువనేశ్వరి , మహాలక్ష్మి , మహాకాళి , మహాసరస్వతి , గాయత్రి , సావిత్రి , బ్రహ్మానందరూపిణి అని మూలమాయ అనేక నామములతో పిలువబడు చున్నది. 

ఈ జగన్మాత లేక మూలమాయ బ్రహ్మమున  ఏకదేశమునందున్నపుడు తనయందు బ్రహ్మము ప్రతిబింబించగ ఆ బ్రహ్మచైతన్యము వల్ల జగత్తును నిర్మాణము చేయుచున్నది. ఇట్లు తనచే సృజించబడిన జగత్తు మాయాకార్య  సంగమము లేని శుద్ధబ్రహ్మమునందు ఆరోపించబడు చున్నది. ఈమెయే అవ్యక్తరూపమున బ్రహ్మమునందు కేవల శక్తిస్వరూపిణి అగు నీళ అనియు , వ్యక్తమగు అన్ని శరీరములందు మూలప్రకృతి రూపమై జ్ఞేయమగు ప్రణవ స్వరూపమనియు చెప్పబడుచున్నది. సర్వ చైతన్య స్వరూపమునకూ, ఆ మూల ప్రకృతియే ఓంకారరూపిణి, చిచ్ఛక్తి. ఈ మూలమాయ  బ్రహ్మమున ఏకదేశమున నున్నపుడు సత్వరజస్తమోగుణ సామ్యమున ఉండును. ఇదే శుద్ధసత్వ ప్రధానమైనచో మాయ అనియు, మలినసత్వ ప్రధానమైనచో అవిద్య అనియు ఈశ్వర , జీవ భేదములు తెలియబడు చున్నవి. 

మూలమాయ బ్రహ్మచైతన్యశక్తియై  నారాయణి , వైష్ణవి , దేవి , త్రిగుణాత్మిక , ప్రకృతి అని చెప్పబడుతోంది. ఈ శక్తియే పరాప్రకృతి , అపరా ప్రకృతి అని రెండు విధములు. ఇందు ఇరువదినాలుగు తత్వములతో కూడినది ( పంచమహా భూతములు, దశేంద్రియములు, పంచ తన్మాత్రలు, మనస్సు, బుధ్ధి, అహంకారము , అవ్యక్తము ) అపరాప్రకృతి. ఇది దైవి, ఆసురి అని రెండు విధములు. ఇందు దైవి- శుద్ధసత్వప్రధానమై విద్యామాయ అనబడును. అసురియే- అవిద్య. బ్రహ్మచైతన్యమే మాయాసంబంధమున ఈశ్వరుడనియు , అవిద్యా సంబంధమున జీవుడనియు చెప్పబడు చున్నది. ఇట్లు అపరా ప్రకృతి / అవిద్య/ క్షరము/ క్షేత్రము / పదము అని చెప్పబడు ఈ ప్రకృతిశక్తియే   పరమాత్మ సన్నిధానమును పొందినదై , బ్రహ్మము ప్రకృతుల ప్రతిబింబములు ఒక దానియందు మరొకటి కలియుటచే అభిన్నత్వము చెంది ఆ ప్రకృతియే పరాప్రకృతి అనియు విద్య/ అక్షరము / క్షేత్రజ్ఞుడు / సత్తు/ పురుషుడు అని పిలువబడు చున్నది.  ఇట్లు మూలమాయ క్షేత్ర, క్షేత్రజ్ఞ విభాగములచే అపర, పరాప్రకృతి అని తెలియ బడుచున్నది. ఈ మూలమాయాశక్తి ఉందని గాని , లేదనిగాని నిర్ధారించ లేమని చెప్పబడింది.






No comments:

Post a Comment