ఈ మాయ పరమాత్మ జ్ఞానము తెలిసినవానియందు లేదనియే చెప్ప బడినది. అజ్ఞానికి రజ్జుసర్ప భ్రాంతి
వలె అజ్ఞానము ఉన్నంత వరకూ
సత్యమేనని తోచును. అంచేత అసత్యము కాదు. కనుక సత్తును కాదు, అసత్తును కాదు. ఆదియగు మాయ
అవిద్య / అజ్ఞానమని చెప్పబడుట వల్ల బ్రహ్మమని చెప్పలేము. అంచేత మాయా స్వరూపము బ్రహ్మమునకన్న
వేరనిగాని , వేరుకాదని గాని నిర్ణయించ శక్యముకాదనిరి. సత్వరజస్తమో గుణముల
సామ్యావస్థయే మాయయొక్క స్వరూపము. ఇది కేవలము జడము. మోహాత్మకము. జగత్తుకు ఉపాదాన
కారణము. ఉత్పత్తి , స్థితి , లయములు లేని మహామాయ ప్రపంచమునకు వ్యక్తావస్థ
కలిగినపుడు ఉత్పత్తి , స్థితి , లయములు గల దానివలె షడ్భావవికారములు లేని శుద్ధ బ్రహ్మమునకు ఆ వికృతులు కల్గినట్లు
భ్రమను కలిగించి బ్రహ్మమును ఆవరించి యున్నది.
ఈ మాయయే సత్యమైన బ్రహ్మమును అసత్యమనియు ,
అసత్తగు జగత్తునందు సత్యత్వ భ్రాంతిని కల్పిత దోషములచే అవిద్యను పెంచుటకు
ప్రయత్నించును. బ్రహ్మమును ఎరిగిన జ్ఞానికి ఈ మాయ ఎట్టి వికారములను కలుగ జేయక అతని వశమై ఉండును. బ్రహ్మజ్ఞానమునకు జగన్మాతయే
ఇంద్రియ సంయమనముతో ప్రయత్నించు సాధకునికి సస్వరూప సాక్షాత్కార అనుభవమును పొందించు
చున్నది. తానే సమస్తమై, బ్రహ్మమును ఆవరించి యున్న ఈ చిచ్ఛక్తి - తన విక్షేప,
ఆవరణశక్తి విశేషమున బ్రహ్మమును మరుగున పడునట్లు చేయుచున్నది. ఈ మూలప్రకృతి యొక్క చైతన్యసత్తను ఎరిగిన జ్ఞానులు , జగన్మాత
అనుగ్రహమునకు పాత్రులై శుద్ధబ్రహ్మమును పొంది బ్రహ్మ స్వరూపులగు చున్నారు.
జగత్తు ప్రకృతి నుంచి ఏర్పడిందా లేక
బ్రహ్మము నుండి ఏర్పడిందా అనేది వేదాంతశాస్త్రంలో విస్తృతంగా చర్చించిన పిదప
బ్రహ్మము నుండే నామ రూపాత్మకమైన జగత్తు ఏర్పడిందని చెబుతూ బ్రహ్మమే నిమిత్త ,
ఉపాదాన కారణాలుగా నిశ్చయించడం జరిగింది. ఇప్పుడు నిమిత్త ఉపాదాన కారణాలంటే ఏమిటో
చూద్దాం. వీటిని తెలియజేయడానికి కుండ, కుమ్మరి, మట్టిని తీసుకొని చాలాచోట్ల దృష్టాంతంగా చెబుతారు. కుండ
తయారవడానికి మెత్తని మట్టి లేక మృత్తు కావాలి. ఇక్కడ మట్టిని ఉపాదానకారణం అంటారు.
మట్టిని కుండగాచేసే కుమ్మరిని నిమిత్తకారణం అంటారు. కుమ్మరి, కుండ చెయ్యడానికి
ఉపయోగించే చక్రము , దండము/కట్టె లను సహాయకారణం అంటారు. తయారైన కుండను కార్యము
అంటారు. ఇక్కడ మట్టి వేరు. కుమ్మరి వేరు. అంటే నిమిత్త ఉపాదాన కారణాలు వేర్వేరుగా
ఉన్నాయి. వివేచన చేసి చూస్తే , ప్రతీ వస్తువునకూ నిమిత్త ఉపాదాన కారణాలు వేర్వేరుగా
ఉంటాయి. కాని జగద్రచనలో మాత్రం ఈ రెండూ ఒకటిగానే ఉంటాయి.
పరిశీలించి చూస్తే ఇక్కడ మట్టితో చేయబడిన
కుండ అంతా మట్టే. అంటే కార్యమైన కుండలో ప్రతీ అణువూ ఉపాదాన కారణమైన మట్టి మాత్రమే.
అంటే కారణమైన మట్టి, కార్యమైన కుండలో
ఇమిడి ఉంది. దీన్నే కార్యకారణసంబంధం అంటారు. కుమ్మరియందే కుండ లీనమవ్వడం ఉండదు.
కాని మట్టియందే స్థితి లయములనేవి మనం చూడ గలుగుతాం. అలాగే జగత్తుయొక్క స్థితి,
లయములు ఉపాదానకారణమైన
బ్రహ్మము నందే ఉంటాయి.
No comments:
Post a Comment