Friday, January 25, 2013

మాయాస్వరూపము – 7


ఆరోపము  సోపాధికము, నిరుపాధికము అని రెండు విధములు.
త్రాడుపై పాము, ముత్యపు చిప్పపై వెండి అనే ఆరోపములు – నిరుపాధికములు . అంటే ఉపాధి లేనివి. వీటి యందు  జ్ఞాన ఫలితంగా పాము, వెండి అనే భ్రాంతి తొలగిపోడమే గాకుండా ఆయా వస్తువులు కనిపించవు.
సోపాధికములైన ఆరోపములందు ఉపాధి ఉన్నంత వరకూ ఆయా వస్తువులు కనిపిస్తాయి. కాని అవి సత్యమనే బుధ్ధి, భావన నశిస్తాయి. మట్టికుండ , బంగారు ఉంగరం అనేవాటి యందు కుమ్మరి వాని పని, కంసాలి పని ఉపాధులుగా ఉండి ఆవస్తువులు కనిపిస్తూనే ఉంటాయి. కాని జ్ఞానం వల్ల కుండ, ఉంగరము అనే నామరూపాలు సత్యమనే భావం నశించి మట్టి, బంగారము మాత్రమే  సత్యమనే బోధ కల్గుతుంది. 
    
ముముక్షువుకు సస్వరూప సాక్షాత్కారానుభవం కల్గిన పిదప ఈ జగత్తు సత్యమనే భ్రాంతి నశించినా, అది కన్పిస్తూనే ఉంటుంది. ఈ భ్రాంతికి ఆధారమైన బ్రహ్మమే సత్యమని బోధపడినప్పుడు, దానిపై వివర్తమైన జగత్తు కన్పిస్తున్నా అది అసత్యమని బోధపడుతుంది. అపుడు దానియందు సత్యత్వ బుధ్ధి నశిస్తుంది. ఇక్కడ మరో ఉదాహరణను చూద్దాం. నీటి గట్టున నిలబడినపుడు నీటి యందు ప్రతిబింబం తలక్రిందుగా కనిపిస్తుంది. అది నీటి గట్టున నిలబడిన పురుషునిలా ప్రతిబింబం సత్యం కాదు. అలా స్వచ్ఛమైన నీటి యందు ప్రతిబింబం చూసినపుడు అది అక్కడ నిలబడిన పురుషుడే  అనే భ్రాంతి కల్గుతుంది. అంటే ప్రతిబింబం మీద పురుషత్వము సత్యత్వము  ఆరోపించ బడింది. కాని అది ప్రతిబింబం అనే బోధ కలగగానే దాన్లో పురుషత్వమూ, సత్యత్వమనే బోధ నశిస్తుంది. ఐనా ప్రతిబింబం కనిపిస్తూనే ఉంటుంది.

అలాగే జగత్తు సత్యమనే భ్రాంతి నశించినా, అది కనిపిస్తూనే ఉంటుంది. ఈ భ్రాంతికి ఆధారమైన బ్రహ్మము సత్యమని బోధ పడినప్పుడు దానిపై వివర్తమైన జగత్తు కన్పిస్తున్నా అసత్యమని బోధపడటం వల్ల , దానియందు సత్యత్వ బుధ్ధి నశిస్తుంది. అలాంటి బోధ అద్వైతంలో మోక్షాన్ని కలిగిస్తుందని చెప్పబడింది.
అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శ్రీ శంకర భగవత్పాదులు మూడురకాలైన సత్తలను లేక సత్యత్వాలను ప్రతిపాదించారు.

మొదటిది – ప్రాతిభాసిక సత్త :- ఎండ పడటం వల్ల ముత్యపు చిప్ప, గాజు ముక్క ధగ ధగా మెరిసి, వెండి అనో బంగారమనో భ్రాంతి కలుగుతుంది. అదేవిధంగా స్వప్నం చూస్తున్నంత సేపూ అనేక పదార్ధాలు కనబడుతాయి. వాస్తవంలో అవి అక్కడ లేకపోయినా, ఆ సమయంలో కనబడుతున్నాయి కాబట్టి లేవని చెప్పలేం. నిజానికి అవి అక్కడ లేవని, అంటే అది వెండి గాని బంగారం గాని కాదని తర్వాత తెలుస్తుంది. ఇలా భ్రాంతి జ్ఞాన సమయంలో ఆ రజతాదులకున్న సత్తను ప్రాతిభాసికం అంటారు. 

వ్యావహారిక సత్త :- వస్తువునకున్న దూరము, కను చీకటి అనేదోషంచేత త్రాడు మీద సర్పం కనపడి నట్లు , నిద్రాది దోషంచేత స్వాప్నిక జగత్తు కనబడినట్లుగా, అనాదిగా వస్తున్న అజ్ఞానంచేత జీవుడు నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూపమైన బ్రహ్మము మీద ఈ జగత్తును , జగత్తు కన్న ఈ బ్రహ్మమునకన్న తనను వేరుగా కల్పించుకొని చూస్తున్నాడు. ఈ అవిద్యకు లోబడి ఉన్నంత సేపూ జగత్తు, తానూ, బ్రహ్మమూ వేర్వేరుగా ఉంటారు. ఇలాగే లోకవ్యవహారం అంతా జరుగుతోంది. ఈ భూమికలో ఇదంతా సత్యమే. ఇదే వ్యవహారిక సత్త.

పారమార్ధిక సత్త :- ఉపనిషద్వాక్యాల శ్రవణ మనన నిదిధ్యాసనల వలన అద్వైత బ్రహ్మం ఒక్కటే సత్యమని, జగత్తు కల్పితమైనది , నేను బ్రహ్మమూ ఒక్కటే నని ఆత్మసాక్షాత్కారం కల్గిన తర్వాత తెలుస్తుంది. అపుడీ జగత్తు, విభేదాలూ అన్నీ లీనమై పోతాయి. అంతా బ్రహ్మము గానే కనిపిస్తుంది. ఇదే పారమార్ధిక సత్యం. ఈ సత్యాన్ని అనుభవంచెందే వరకూ వ్యవహార భూమికలో భేదాలన్నీ ఉంటాయి.

మాయ పరతత్వాన్ని ఆచ్ఛాదించి వాస్తవంలో లేని జగత్తును ఉన్నట్లుగా చూపిస్తుందని చెప్పబడింది. మాయకుండే ఆవరణశక్తిచేత పరమార్ధ తత్వాన్ని కప్పివేయగా, విక్షేపశక్తి చేత లేని ప్రపంచాన్ని ఉన్నట్లుగా చూపిస్తుంది. అంచేత మాయ యొక్క అసలు స్వరూపం తెలుసుకున్నపుడు , అది తనంత తానే తొలగి పోతుంది. రజ్జు స్వరూపం తెలిసిన తర్వాత సర్పం తొలగి పోయినట్లుగా ఆత్మ స్వరూపం తెలిశాకా జగత్తు అదే తొలగి పోతుంది. అప్పుడు మిగిలేది అద్వితీయ ఆత్మతత్వమే. ఇదే మాయా స్వరూపం.      

No comments:

Post a Comment