Thursday, April 4, 2013

మనస్సు – కొన్ని విశేషాలు-10

మనం తీసుకునే ఆహారంతోనే మనస్సు పనిచేస్తుంది. కొద్దిరోజులు ఆహారం తీసుకోకపోతే మనస్సు పనిచేసే విధంగా పనిచెయ్యలేదు. సత్వగుణం నిర్మలమైనది. మోక్షసాధనకు అనువైనది. సాత్వికాహారంవల్ల మనస్సు సత్వగుణోపేతమై ఏకాగ్రమవుతుంది. సర్వాత్మభావం అనుభవానికి వస్తుంది. నిష్కామకర్మయోగం వల్ల మనశ్శుద్దికల్గి బ్రహ్మవిచారణకు దోహదం చేస్తుంది. సాత్విక బుద్దినుంచే సాత్విక ఆలోచనలుకల్గి అవిద్య నివృత్తి అవుతుంది. జంతువులకు తమ సహజప్రేరణవల్ల విచక్షణాజ్ఞానము ఉండదు. ప్రతిచర్యలు ఎట్టి విచక్షణా లేకుండానే స్వాభావికంగా స్పందిస్తాయి. కోపము , లైంగిక వాంఛ మొదలైనవి  విచక్షణాజ్ఞానాన్ని హరించి జంతువుల్లా ప్రవర్తించేటట్లు మనలను ప్రేరేపిస్తాయి. అప్పుడు అవివేకంవల్ల చెయ్యకూడని పనులను చేస్తూంటాం. ఇలాంటి వాటిని నియంత్రించాలంటే రాగద్వేషాలు ఉండకుండా ఉదాసీనంగా ఉండటాన్ని అలవరచుకోవాలి. నేను మనస్సును గాను, సర్వవ్యాపకమైన ఆత్మను అనే జ్ఞానాన్ని మాటి మాటికీ గుర్తుతెచ్చుకుంటూ, నన్ను ఏవీ కదలించలేవనే భావనవల్ల వీటిని నియంత్రించ వచ్చని పెద్దలు చెబుతారు.

రజోగుణోద్రేకంవల్ల మనస్సు బాహ్యంగా పరుగులు తీస్తుంది. కోర్కెలూ, బాహ్యవిషయాలు వస్తువులూ, మనస్సును బహిర్ముఖం గావిస్తాయి. ఇలా బహిర్ముఖంగావించే శక్తులను నిర్మూలించేవరకూ మనస్సు అంతర్ముఖం కాలేదు. వైరాగ్య,త్యాగాలతో మనస్సును నిశ్చలంగా హృదయంలో నిలపాలి. మనస్సు ఒక సమయంలో ఒక్క ఆలోచననే చేస్తుంది. అంచేత విషయాకారవృత్తిని, బ్రహ్మాకారవృత్తిని ఒకేసారి పొందలేదు. మనస్సు ఒక విషయం మీద నుండి మరొక విషయం మీదికి పోవడానికి మధ్యఉండే సమయమే స్వరూప స్థితి. అదే బ్రహ్మము. ఆ అనుభూతిని నిరంతరము పొందడానికి ప్రయత్నించాలి. మనస్సు వృత్తిరహితమైనపుడు మౌనంతో హృదయకుహరంలో స్థితమై ఉన్నట్లన్న మాట. ఆ అనుభవమే ఆత్మ లేక బ్రహ్మము. అదే సస్వరూప స్థితి. అదే సంతోషానికీ ఆనందానికీ మూలం. వైరాగ్యం లేని సాధన నిష్ప్రయోజనం. మనస్సును ఆరవ ఇంద్రియముగా కొన్నిచోట్ల చెప్పబడింది.

నేను,నాది అని గుర్తింపు కల్గించే భావనే దుఃఖం. ఉదాహరణకు వీధిలో ఎవరో మరణించారు అనుకుందాం. పలానా వ్యక్తికి కాలం చెల్లిపోయింది అనుకుంటాం. అదే తన కుటుంబంలో వ్యక్తి ఐతే నావాడు చనిపోయాడని మిక్కిలి దుఃఖానికి లోనవుతాం. ఇలా మానవునికి కల్గే అనర్దాలన్నిటికీ, ఈ శరీరమే నేననే దేహాధ్యాసవల్ల – నా భార్య, నాపుత్రులు, నాయిల్లు అనే బంధమే దుఃఖానికి కారణం అవుతోంది. బాధగాని, దుఖంగాని మనస్సుతో సంబంధ పడినప్పుడే కల్గుతుంది. గమనిస్తే గాఢనిద్ర ( సుషుప్తి ) లో మనస్సు పనిచెయ్యదు గనుక అపుడు బాధ అనేది ఉండదు. అంటే మనోజయంతోనే శరీరాన్ని అదుపులో ఉంచగల్గుతాం అనేది అర్ధమవుతుంది.

ప్రాపంచిక అనుభవం పూర్తిగా పొందేవరకూ అనువైన అనేక శరీరాలు ధరించవలసి ఉంటుంది. ఇలా జన్మించినపుడు గతజన్మలో మనసాధనలచే ఎంతవరకూ పురోగతి సాధించామో అక్కడనుండే, వాసనలనుబట్టి మన పనులు ప్రారంభమవుతాయి. మనభావాలూ, మూఢనమ్మకాలూ మనలో గాఢంగానాటుకొని ఉన్నాయి. సరైన విచారణతో వాటిని నిర్మూలించాలి. దేహభావన వదలి నేను బ్రహ్మమును అనే భావంతో ఉండటం అనే అభ్యాసంవల్ల క్రమంగా దేహవాసన నశిస్తుంది. దురాకర్షణలకు దూరంగా ఉంటూ ధ్యానము, జపము, సజ్జన సాంగత్యము మొదలైన వాటితో సంస్కారాలవల్ల కలిగిన పాత అలవాట్లను మార్చుకోవచ్చు. సంకల్పాలన్నిటినీ వదలి అద్వైతనిష్ఠ కల్గి  బ్రహ్మభావంతో ఉంటూ బ్రహ్మమే సత్యము, జగత్తు మిధ్య, జీవుడే బ్రహ్మము అనే వాక్యాలను మననం చేసుకోడంవల్ల మనస్సు వృత్తి రహితమై అసంప్రజ్ఞాత సమాధి సిద్ధిస్తుంది.

స్వప్నం మరొక స్వప్నాన్ని సృష్టిస్తున్నట్లు చూడ్డానికి కూడ వీలులేనంత సూక్ష్మంగా ఉండే మనస్సు , వాస్తవంగా ఉనికికూడా లేని మనస్సు- వాస్తవంగా లేని దృశ్యాలను కల్పిస్తోంది. అంటే మనం చూసే జగత్తంతా సంకల్పమాత్రమేనని గ్రహించాలి. అది ఆకాశమాత్ర. భ్రాంతిమాత్రమే. విశ్లేషించి చూస్తే జగత్తు పంచభూతాలతోనే ఏర్పడినది. దాన్లో ఉండే వస్తువులూ మిధ్యారూపాలే. ఇలా విశ్లేషించి చూడగా ప్రపంచం ఉనికిని కోల్పోతుంది. అంతరిక్షము, కాలము, కారణము ఇలా అన్నీ మనోవృత్తులే. మనోలయం వల్ల సమస్తలోకాలు, త్రికాలములూ ఏవీ ఉండవు. అద్దంలో ఒకవస్తువు ప్రతిబింబం చెందుతున్నట్లు మనస్సులో ఈ ప్రపంచం ప్రతిబింబం చెందుతోంది. ఇదే మాయాకార్యం. సరైన అవగాహన లేకపోవడమే అవిద్య. మనస్సును మించిన అవిద్యలేదు. మనోనాశనంతో సర్వమూ ఉనికిని కోల్పోయి, ఆత్మానందంలో/ నిర్మలమైన శుద్ధచైతన్యంలో స్థితమై బ్రహ్మానుభవం పొందుతాం. 





No comments:

Post a Comment