Wednesday, April 24, 2013

మనస్సు- కొన్ని విశేషాలు-13



మనస్సు ఏకాగ్రమవుతుంటే మామూలుగా నిమిషానికి పదహారు సార్లువరకూ జరిగేశ్వాస క్రమంగా ఎనిమిది లేక పదిసార్లుగా/తడవులుగా చేరుకుంటుంది. శ్వాసను గమనిస్తూఉండాలి. సాధనలో ఆత్మనుండి శక్తినీ, విశ్వాసాన్నీ తెచ్చుకుంటూ ఆనందంగా ముందుకు సాగాలి. ధ్యానంలోవచ్చే అవరోధాలను ఓపికతో అధిగమించాలి. సాధన మధ్యలో నిస్పృహతో వదలకుండా బ్రహ్మసాక్షాత్కారం పొందాలనే పట్టుదలతో ముందుకు సాగేవాని ముందు, మాయ నిలబడలేదు.  అహం బ్రహ్మస్మి”, “ తత్వమసి వాక్యాల విచారణవల్ల విషయాసక్తి/ విషయాలు  నశిస్తాయి. సాధనలో నిద్రలోకి జారుకోకూడదు. సంస్కారాలు పోయేదాకా కలలు కంటూనే ఉంటాం. సవికల్ప సమాధిలో ఉండే సంతోషమూ అవరోధమే. దానిపై రాగం కల్గితే నిర్వికల్ప సమాధిస్థితికి పోనియ్యదు. మనస్సు ఎడతెరిపిలేకుండా తైలధారలా బ్రహ్మభావనలో ఉంటే జగత్తు స్వప్నతుల్యమనిపిస్తుంది. అపుడు జ్ఞానోదయమవుతుంది. మనస్సు ఒకేలక్ష్యంపై ఏకాగ్రమై ఉంటే అది సమాధిస్థితి. అపుడు  త్రిపుటి ఉండదు. మనస్సు బ్రహ్మములో లీనమై ఉంటుంది. చిదాభాస, జీవుడు కూడ మాయమై కేవలం స్వచ్చమైన చైతన్యం ఎరుకగా మిగులుతుంది. ఆ ఎరుకే / ఆ ఉనికే మోక్షం అని చెబుతారు.

జీవాత్మ అనేది అభాస చైతన్యం( reflected consciousness ). మనస్సు, జీవాత్మ కలిసే ఉంటాయి. మనోనాశమంటే అది శుద్ధచైతన్యంగా అవ్వడమే. దేశ,కాలపరిచ్చేదం లేనిది అఖండమని చెబుతారు. చిత్తము వృత్తి రహితమైతే అహంకారం నశించి కేవలం అస్తి/ చిన్మాత్ర/శుద్ధ చైతన్యం/ చిదాకాశమాత్ర మిగులుతుంది. అదే ఆత్మ. అనంతమైన నేను /ఆత్మ/ కూటస్థచైతన్యము / బ్రహ్మమే సమస్తాన్ని ప్రకాశింప జేసేది.  ముక్తి మనస్సుకి, ప్రకృతికి. జీవుడు బ్రహ్మమేగనుక ముక్తి జీవునికికాదు. జ్ఞాని ఎప్పుడూ స్వేచ్చగా సర్వవ్యాపకమైన బ్రహ్మముతోను, అజ్ఞాని శరీరంతోను గుర్తింపు కల్గి ఉంటారు.

మనస్సు క్షయించాలంటే

*ఆలోచన వచ్చేటపుడు దాన్ని పారద్రోలాలి/ గెంటి వెయ్యాలి. నేతి,నేతి ఈ ఆలోచన కాదు , ఈ ఆలోచన కాదు. ఈ ఆలోచన నాకు వద్దు అనుకోవాలి.
* ప్రతిపక్ష భావన వచ్చిన భావనను దానికి వ్యతిరేకమైన భావనతో ప్రతిక్షేపించాలి(substitute చెయ్యాలి).
ఉదాహరణకు అసహ్యం, భయం లాంటి భావనలు వస్తే వాటిని వ్యతిరేకమైన భావనలతో అంటే ప్రేమతో అసహ్యాన్ని, ధైర్యంతో భయాన్ని అధిగమించాలి.
*బ్రహ్మభావన వల్ల సంకల్పాలన్నీ నశిస్తాయి.
*ఉదాసీన భావంతో మనస్సుకు సాక్షిగా ఉండు.
*నేనెవరను అని విచారణ చెయ్యడం వల్ల ఆలోచనలన్నీ నశిస్తాయని, చివరకు మనస్సు మిగలదని చెప్పబడింది.

మనోలయం నిద్రలోతాత్కాలికం. మనోనాశమే మోక్షానికి దారితీస్తుందని చెబుతారు. మనస్సు సత్యాన్ని ప్రతిబింబించే దర్పణం లాంటిదని చెప్పబడింది. బ్రహ్మమే సత్యము గనుక అట్టి అనుభవమే అపరోక్షానుభూతి. అదే మనందరి గమ్యము.                        





4 comments:

  1. చక్కటి విషయాలను తెలియజేసారు.

    ReplyDelete
  2. మీ అభిమానానికి కృతజ్ఞతలండి.
    సూర్యచంద్ర గోళ్ల.

    ReplyDelete
  3. ఎంతో విలువైన సమాచారాన్ని ఇచ్చినందుకు సూర్యచంద్ర గారికి ధన్యవాదాలు

    ReplyDelete
  4. ధన్యవాదములండి.
    సూర్యచంద్ర గోళ్ల.

    ReplyDelete