మనం జీవితాన్ని తరచి చూసినప్పుడుగాని, ప్రకృతిలో విషయాలను అర్ధంచేసుకునే ప్రయత్నం చేసినప్పుడుగాని అనంతమైన సృష్టిలో ఎన్నోక్లిష్టమైనవిషయాలు మనప్రమేయం లేకుండానే ఒక పద్ధతిప్రకారం జరిగిపోతున్నాయని ఆలోచనాపరులకు తెలుస్తుంది. ఇలా నిర్ణీతమైన పద్ధతిలో జరగడానికి అనంతమైన శక్తి, జ్ఞానము గల్గిన సర్వేశ్వరుడు ఒకరు సృష్టికర్తగా ఉండి ఉండాలనేది గ్రహిస్తాం. ఆ సృష్టికర్తనే భగవంతుడని విజ్ఞులు అంటారు.
దాదాపుగా అన్ని మతాలూ భగవంతుడనేవాడు ఒకడున్నాడని,
ఆయన ప్రేమమయుడనీ, మనమంతా ఆయన బిడ్డలమని మనం ఆయనను ఆరాధించాలని, చివరకు మనమంతా ఆయన
గృహానికే పోవాలనే విషయంలో అన్నిమతాలకూ ఏకాభిప్రాయమే ఉంది. భగవంతుడు ఒకడే అయినా వారి
వారి మత ధర్మాలను బట్టి, అభిరుచులను బట్టీ వివిధ నామాలతో పిలుస్తారు. అన్ని మత ధర్మాలకూ ఒక ప్రవక్త, మతగ్రంధమనేవి
ఉన్నాయి. కాని హిందూధర్మంలో చెప్పడానికి ఒక ప్రవక్త అని గాని, వారి మతగ్రంధం ఇదీ
అనిగాని నిర్దిష్టంగా చెప్పలేం. అంచేత పండితులు వేదాన్ని ప్రామాణికంగా
అంగీకరించారు.
ధర్మము, అర్ధము , కామము , మోక్షము అనే నాల్గూ పురుషార్దాలు.
ఇవి మన దైనందిన జీవనంలో ఆచరించాల్సిన నైతిక విలువలని చెప్పబడ్డాయి. శాస్త్రవిహితమైన ధర్మార్ధకామాలను అనుభవిస్తూ
పవిత్రమైన జీవనాన్ని గడిపిన వానికి మోక్షమని చెప్పే నాల్గో పురుషార్ధం
అప్రయత్నంగా లభిస్తుందని విజ్ఞులు చెబుతారు. మోక్షము అంటే సంసారంలో జననమరణాలనే
బంధం నుంచి విడుదలవ్వడం. అందుకే మోక్షం
పరమ పురుషార్ధంగా చెప్పబడింది. దీన్ని చెప్పడానికే వేదం అనేక శాఖలుగా
విస్తరించింది.
No comments:
Post a Comment