పాదమనగా జీవునిచే పొందబడేది. అవి విశ్వ, తైజస, ప్రాజ్ఞ, తురీయులు. అవే అకార ఉకార మకార
నాదములు. ఈ పాదములనే "ఓం"అనే ప్రణవంలో మాత్రలని అంటారు. మాత్రలన్నా పాదములన్నా
ఒక్కటే. అకార ఉకార మకారములచే ప్రతిపాదించబడని వాడు అమాత్రుడు. విశ్వ తైజసులు
ప్రతిదినం ప్రాజ్ఞునిలో ఐక్యం చెందుతుంటారు. అందుకే వారు మాత్రల శబ్దమున వ్యవహరించబడు
చున్నారు. తురీయుడు అలా ఐక్యం చెందడు గనుక అమాత్రుడని అనబడుచున్నాడు. జాగ్రత్
స్వప్న సుషుప్తులందు నిర్వికారుడై
ఏకభూతుడై పరిశుద్దాత్ముడై అంతర్యామిగా ఉండి నిర్వహించు తురీయుడు నాదముగా
ఉపాసించ బడుచున్నాడు.
"అ"కారమును వైశ్వానరునిగా ఉపాసించు వారికి
కాంక్షించిన సమస్త పదార్ధములను పొంది అందరిలో ప్రధానుడగును. ఇట్లు ఉపాసించు
వైశ్వానరుని ఆత్మయొక్క భాగము విశ్వుడుగా అంతటా వ్యాపించినవాడుగా అకారమునకు
అర్ధమని ఎరిగి ధ్యానించిన వాడు సర్వ కామములను పొంది విశ్వునితో సామ్యమును పొందును.
"ఉ"కారమును తైజసునిగా ఉపాసించినవారు జ్ఞానముతో
ఉత్కృష్టులై ఉందురు. వీరి వంశమున బ్రహ్మజ్ఞానము లేనివారు ఉండరు. తైజసుని ఉ కార
శబ్దవాచ్యునిగా ఉపాసించినవారి జ్ఞానధార అవిచ్చిన్నముగా సాగి సమానత్వము కల్గి శరీర
బంధమునుండి విడివడుట స్పష్టముగా గోచరించును.
"మ"కారమును ప్రాజ్ఞునిగా ఉపాసించినపుడు
ఇందు సర్వ జగత్తు లయమొందునని ఎరిగినవాడు సమస్త జగత్తూ ఇట్టిది అని ఎరుగును.
ఇట్టివాడు పరమాత్మతో వేరుగా చూచుటకు వీలుండక చేరియుండును. అనగ మోక్షమును పొందును.
అట్టి వాని దుఃఖములన్నీ పోయి సమానుడగుట వల్ల ప్రాజ్ఞునితో సమానుడగును. అన్నీ
తనలో లయమగుటను చూచును. ఇట్లు ఉపాసించిన వారు వారి వారి అధిష్టానములైన విశ్వ తైజస
ప్రాజ్ఞుల వాసుదేవునితో ఐక్యమగుదురని మాండూక్యోపనిషత్తు నందు చెప్పబడినది.
No comments:
Post a Comment