Thursday, June 27, 2013

TO SUM UP -2


వేదంలో పూర్వభాగమందు కర్మకాండ ప్రతిపాదితమైన అపరావిద్య ప్రవృత్తి మార్గంగానూ, చివరి భాగంలో పరావిద్య అనబడి నివృత్తి మార్గాన్ని సూచించే ఆత్మజ్ఞానమూ చెప్పబడ్డాయి.  ఈ చివరిభాగాలను ఉపనిషత్తులని అంటారు. ఇవి వేదవిజ్ఞతకంతకూ సారం. ఉపనిషత్తులు 108 చదువ దగ్గవని చెప్పబడ్డా వాటిలో ముఖ్యమైనవి  10-12 మాత్రమేనని చెబుతారు. ఇలా తత్వచింతనలో  వేదప్రమాణాన్ని అంగీకరించే వారిని ఆస్తికులని, వేదప్రమాణాన్నిఅంగీకరించని వారిని నాస్తికులనీ చెప్పబడుతున్నారు. భారతీయ తత్వచింతనలో ఎందఱో ఋషులు / మహాపురుషులు వారి సాధనలలో వారు దర్శించిన సత్యాలను “దర్శనముల” రూపంలో పొందుపరిచారు.  వీటిలో లోకాయతిక, జైన, బౌద్ధదర్శనాలు మూడూ నాస్తికదర్శనములని చెప్పబడ్డాయి.
 
ఇక సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, న్యాయ దర్శనం, వైశేషిక దర్శనం, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస అనే ఆరూ ఆస్తిక దర్శనములని  ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇవే షడ్దర్శనాలుగా చెప్పబడే భారతీయ ఆస్తిక తత్వచింతనకు మూలస్థంభాలు. ఈ దర్శనాలలో వాటి మూల పురుషులు దర్శించిన సత్యాలనే గాకుండా ఆ సత్యాన్ని అనుభవ పూర్వకంగా తెలుసుకోడానికి తగిన సాధనామార్గాన్ని కూడ నిర్దేశించారు. వీటన్నిట్లోనూ ప్రపంచం ఎలా ఏర్పడింది, దీనికి సృష్టికర్త ఎవరు, జీవుల బంధమోక్షాలనేవి ఎలా ఏర్పడుతాయనే దానిగురించి ముఖ్యంగా చెప్పబడింది.

సృష్టిలో 84 లక్షల జీవరాసులున్నాయి. వాటిలో కొన్ని చలనాన్నికలిగి, కొన్ని చలనం లేనివిగాను ఉన్నాయి. జ్ఞానేంద్రియాలలో ఎకేంద్రియ జీవులనుండి జ్ఞానేంద్రియాలు ఐదూ గల జీవులున్నాయి. పశుపక్ష్యాదులనుండి అన్ని జంతువులలోను మనస్సనేది ఉన్నా, మనిషిలోనే అది బుధ్ధిరూపాన్ని పొందింది. అలాంటి బుద్దిరూపాన్ని పొందిన మనస్సుతోనే నివృత్తిమార్గాన్ని ఎన్నుకొని జననమరణ సంసారబంధం నుండి విడుదలయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతారు. మనం ఉన్నతజన్మలనుకొనే దేవ, గంధర్వాదులు  గడచిన జన్మల్లోచేసుకున్న పుణ్యకార్యాలవల్ల ఈ జన్మలు లభించాయని విజ్ఞులు చెబుతారు. ఐతే వారి కర్మానుభావాలు పూర్తయ్యేకా మళ్ళీ జన్మలను పొందాల్సి ఉంటుంది. అంటే వీరు కూడ వారి శరీరాలతో మోక్షం పొందలేరు. తిరిగి మానవజన్మ లభిస్తేనే మోక్షసాధనకు ప్రయత్నించి సఫలతపొందే అవకాశం ఉంటుంది. అనేక జన్మల ఫలితంగా మానవజన్మ అనేది  లభ్యమవుతుంది. అందుకే మానవ జన్మ లభించడం కడు దుర్లభమని, అన్ని జన్మల్లో మానవజన్మే ఉత్తమమైనదనీ చెబుతారు. 


No comments:

Post a Comment