Thursday, July 25, 2013

జ్ఞానయోగము- సాధన


మనం ఇంతవరకూ తెలుసుకున్న విషయాలన్నీ, అంటే మోక్షంనుండి పురుషప్రయత్నం దాకా (కుండలిని తప్ప)  జ్ఞాన సంబంధమైనవే. కుండలిని రాజయోగం/యోగమార్గంలోనిది. భక్తి, కర్మయోగాలను ఎలా సాధించుకోవాలో విపులంగానే చర్చించడం జరిగింది. ఇపుడు జ్ఞాన యోగంలో మరిన్ని విషయాలు పరిశీలిద్దాం. ఆ తర్వాత రాజయోగంలో ధ్యానం గురించి తెలుసుకుందాం. 

అజ్ఞానంవల్ల ఇంద్రియలోలులైన మానవులు, ప్రపంచంలోని వస్తువులు విషయాలు వాస్తవం అనుకొని, వాటికి బానిసలై సుఖాన్వేషణలో అంతులేని కోర్కెలతో సతమతమవుతున్నారు. జీవితంలో ఎదురుదెబ్బలు తింటున్నా, సంతృప్తి కలుగుతుందనే ఆశమాత్రం చావడం లేదు. ఈ దేహమే నేనని అనుకోవడం అజ్ఞానం. దానివల్ల రాగద్వేషాలు కల్గి, సంసారబంధంలోకి ఆకర్షించబడుతున్నాం. భోగాసక్తి, అహంకార మమకారములు ఉన్నంతవరకూ జననమరణాల బంధంనుండి విముక్తి లేదని చెబుతారు. వాస్తవంగా ఉన్నదల్లా అద్వితీయము, అవినాశిఐన, చావుపుట్టుకలు లేని ఏకైక సత్పదార్ధమే. అదే అన్నిజీవులలోను, ఒకేలా చైతన్యస్వరూపంగా ప్రకాశించే ఆత్మ. ఆ ఏకరూపమైన సత్పదార్ధం నుండే, మాయచేత నామరూపాలుగల  ప్రకృతి, జీవుడు, జగత్తు, అందలి వస్తువులుగాను కల్పించబడుతున్నాయి. ఈ నామరూపములనే భేదాలను తొలగిస్తే, ఇక మిగిలేది ఏకరూపంగా ప్రకాశిస్తుంది. అంచేత మీరు, నేను, ఈ కన్పించే వస్తుసముదాయమూ అన్నీ భ్రాంతిరూపాలే.

జననమరణాలు ఉపాధిగానున్న శరీరానికే గాని, ఉపాధిని స్వీకరించిన ఆత్మకు కాదు. పునర్జన్మ కలగకుండా ఉండాలంటే ఆత్మను సాక్షాత్కారించు కోవాలి. దీనికి జ్ఞానం ఆవశ్యకత ఎంతైనా ఉంది. జ్ఞానమంటే పరమాత్మను గురించిన జ్ఞానమే. అదే బ్రహ్మవిద్య. అలాంటి జ్ఞానంవల్ల అజ్ఞానం తొలగుతుంది. అపుడు తానీశరీరం కాదని, తనే బ్రహ్మమని అనుభవం అవుతుంది. అదే అహం బ్రహ్మస్మి అనే ఉపనిషద్వాక్యం. బ్రహ్మవిద్య బ్రహ్మత్వాన్ని పొందించి శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ఆత్మ, జగత్తు, మాయ మొదలైన వాటిని గురించిన జ్ఞానం, ఏ మార్గంలో బ్రహ్మమును అన్వేషించే వారికైనా కొంత తెలియాలి. మన సస్వరూపాన్ని తెలుసుకోవాలంటే అజ్ఞానజనితమైన మాయను తొలగించుకోవాలి. దీనికోసమే మనప్రయత్నమంతా. వేదాంతశాస్త్రమంతా కూడ అధ్యాస తొలగడానికే.

అధ్యాస అంటే, ఉన్నది ఒకవస్తువైతే, మరోవస్తువుగా భ్రాంతిచెందటం లేక ఆరోపించడం. అంటే దేహంలో ఉండే తను, తానుగాని దేహమేతానని,భ్రమచెండటం. ఈ భ్రమ తొలగితే ఆత్మతత్వం అవగతమవుతుంది. బ్రహ్మచర్యం పూర్తిచేసుకొని, గృహస్థ వానప్రస్థాశ్రమాల తర్వాత, కర్మల నాచరిస్తూ చిత్తశుద్ధి పొంది బ్రహ్మజిజ్ఞాసకు పూనుకుంటే మోక్షం లభిస్తుందని చెప్పబడింది.

బ్రహ్మప్రాప్తి అనేది బ్రహ్మము ఇట్టిదని తెలుసుకుంటే కలుగదు. శ్రద్ధాభక్తులతో కూడిన సాధన చెయ్యగా చెయ్యగా, కర్మ పరిపక్వమైనపుడు పరమాత్మ అనుగ్రహంవల్ల కలుగుతుందని విజ్ఞులు చెబుతారు. ఈ సాధనకు నిత్యానిత్య వస్తువివేకము, వైరాగ్యము, శమాదిషట్క సంపత్తి, ముముక్షుత్వము అనే నాలుగుఅంగాలు సాధన చతుష్టయంగా చెబుతూ, వీటిని సాధించాకా శ్రవణమననాదులు చెయ్యడంవల్ల బ్రహ్మప్రాప్తి అని చెప్పబడింది. చివరకు తనే బ్రహ్మమని తెలుసుకోవడం, దాని గురించి చేసే ప్రయత్నమూ అద్వైతానుభూతికోసమే. అంటే అది కావడానికే. 



                            

Thursday, July 18, 2013

TO SUM UP -5


జ్ఞాని మరణించాడని అనం. సిద్ధిని పొందాడనే అంటాం. అద్వైతి తప్ప, మిగిలిన సాధకులందరూ అంటే యోగులూ, భక్తులూ, కర్మయోగులూ  ఉపాసకులే. జ్ఞానికే పరమాత్మతో ఐక్యత ఉంటుంది. తక్కినవారందరూ వారి సాధన పరిపక్వమైతే, మరణానంతరం అత్యున్నతమైన హిరణ్యగర్భుని లోకం చేరుకొని ప్రళయంలో ఆ బ్రహ్మతోబాటు శుద్ధ బ్రహ్మములో కలుస్తారు.  సంసార బంధం నుండి విముక్తులవుతారు. అంతేగాని అద్వైత ముక్తి లభించదు. ఎందుకంటే వీరికి అద్వైతభావన, పరమాత్మతో ఐక్యంచేందేస్థితి ఉండదు గనుక.
       
మన అంతర్గతంగా ఉండే దివ్యత్వాన్ని వ్యక్తపరచడమే మన పరమావధి. దీనికోసం పండితులు కొన్ని మార్గాలను సూచించారు. అవే భక్తియోగం, కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం అని పిలువబడుతున్నాయి. ఒక గమ్యాన్ని చేరడానికి వివిధమార్గాలున్నట్లు, మన ధ్యేయమైన మోక్షాన్ని చేరుకోడానికి ఈ నాలుగూ మార్గాలని చెప్పవచ్చు. మానవులలో ఉండే త్రిగుణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. అంచేత ఎవరి అభిరుచి లేక గుణాధిక్యత వల్ల వారొక మార్గాన్ని సహజంగా ఇష్టపడతారు. ఏ ఒకమార్గం ఎంచుకొని సాధన కొనసాగించి ప్రావీణ్యం పొందుతున్నా, ఆమార్గం మరికొన్ని మార్గాలతో కలుస్తుంది. గమ్యాన్ని చేరడం, మన సాధననుబట్టి, ప్రయత్నాన్నిబట్టి ఉంటుంది. వీటిని గురించి యిదివరలో చెప్పుకున్నాం. 


Thursday, July 11, 2013

TO SUM UP -4


మొదట్లో మనిషి భగవంతుడి నుంచి వస్తాడు. చివరికి భగవంతుడిలో కలుస్తాడని ద్వైతం చెబుతుంది.
మనిషి నిజానికి భగవంతుడే గనుక అది తెలుసుకుని చివరకు భగవంతుడే అవుతాడని అద్వైతం చెబుతుంది. మోక్షమంటే – జననమరణ సంసారబంధం నుండి విడుదలవ్వడమే. అంటే మళ్ళీ జన్మ కలగకుండా ఉండటం. ఈ శరీరం ఉండగానే మోక్షం / ముక్తిని పొందడాన్ని జీవన్ముక్తి అంటారు.

చేసిన ఉపాసనల మరియు నిష్కామకర్మల ఫలితంగా స్వర్గానికి పోయి, అక్కడ కల్పాంతం వరకూ ఉండి జ్ఞానాన్ని ముక్తిని పొందడాన్ని క్రమముక్తి అంటారు. జీవన్ముక్తి కల్గితే వెంటనే ముక్తుడు మరణించడు. ఆ ముక్తిస్థితిలో జీవన్ముక్తునిగా జీవించి మరణానంతరం మోక్షం పొందుతాడు.
  
ఐతే,ఈ సంసారబంధం కలిగించేవి ఏవో తెలుసుకొని, వాటిని నిర్మూలించుకుంటే పునర్జన్మలు ఉండవు. అవిద్యావరణంతో ఉండే కారణశరీరం నిర్మూలమవ్వాలంటే, కోరికలు కర్మఫలములు పూర్తిగా నశించి ఆత్మజ్ఞానం కలగాలి. అంటే అనుభవ పూర్వకమైన ఆత్మవిద్యయే మోక్షం. పునర్జన్మ ఎలాకల్గుతుందో చూద్దాం. జీవుడు భౌతికశరీరాన్ని వదలిపోయేపుడు అవిద్యావరణంగా ఉన్న కారణశరీరంతోబాటు కోరికలు(కామము), కర్మఫలాలు, పృధివి మొదలైన పంచభూతాల తన్మాత్రలు కలసి వాసనల రూపంలో కారణశరీరమందు నిక్షిప్తమై పయనిస్తాయని చెబుతారు. 
      
వీటిలో కోరికలూ, కర్మఫలాలూ స్వయంకృతాలు. ఇవి పూర్తిగా నశిస్తే భూతతన్మాత్రలు వాటంత అవే పోతాయి. కాని వీటన్నిటికీ మూలమైన కారణశరీరం నశించాలంటే అజ్ఞానం పోవాలి. అంటే ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానావరణమైన కారణశరీరం ఏర్పడదు కాబట్టి, ఇక జన్మనెత్తవలసిన పని ఉండదు. అంచేత కర్మఫలాలు, వాసనలు, అవిద్యాకోశం అనే బంధాలనుండి విడుదలవ్వాలి. బ్రహ్మచైతన్యాన్ని కప్పిఉంచిన అవిద్యాకోశాన్ని ఎవరికివారే ఛేదించుకోవాలి. అనుభవపూర్వకమైన ఆత్మవిద్యయే మోక్షమని చెప్పబడింది.





Thursday, July 4, 2013

TO SUM UP -3


అన్ని జన్మల్లో మానవజన్మే ఉత్తమమైనదని చెప్పబడినా మనం ఏంచేస్తున్నాం? పరిపక్వతలేని క్రిందిజీవులైన  పశుపక్ష్యాదులలా సుఖాన్వేషణలో జీవితాన్ని గడుపుతున్నాం. ఒక సుఖం తర్వాత మరొకటి ఇలా కోరికలకు లోనై, వాటిని పొందే ప్రయత్నంలో వ్యయప్రయాసలకు గురై జీవితంలో సంఘర్షణ పొందుతున్నాం. కోరికలే సంసారచక్రంలో బంధిస్తున్నాయనే ఎరుక మాత్రం కలగటం లేదు. కొందరు ఆలోచనాపరులు ఇట్టి అంతులేని కోరికలవల్ల శాశ్వతమైన ఆనందం లభించదని, శాశ్వతమైన ఆనందాన్ని, సంతృప్తినీ కలిగించేదేదో ఉండే ఉంటుందని గ్రహించి దానికోసం పట్టుదలతో ప్రయత్నం చేస్తారు.
 
మానవ జన్మ ఉత్తమమైనదని చెప్పుకున్నాం. అంటే ఇదే అత్యున్నతమైనదని అనుకోవద్దు. ఇదే శ్రేష్ఠమైనదైతే అసంతృప్తీ, జీవితం భరించలేనిదిగాను ఎందుకుంటుంది. జీవత్వాన్ని లయం చేసుకుని దివ్యత్వము, పరిపూర్ణస్థితీ  పొందడానికి మానవజన్మ ఒక సాధనం అని మహాత్ములు చెబుతున్నారు. ఈ అసంతృప్తి, నిస్సహాయతలనే సంసారసాగరం నుండి తరించి, ఎంతత్వరగా బయటపడితే అంతత్వరగా దివ్యత్వం పొందుతాం.

మనందరికీ మూలకారణమైన ఈశ్వరుడినే  భగవంతుడు/బ్రహ్మము అంటాం. ఈ సృష్టిజాతమంతా ఎవరిలో పుట్టి, ఎవరిలో జీవిస్తూ, తిరిగి ఎవరియందు ప్రవేశిస్తుందో అంటూ వేదం చెబుతుంది. చివరకు మనమంతా మూలకారణమైన బ్రహ్మమును చేరాలి. బ్రహ్మమును చేరడం ఉన్నతమైన స్థితే.  అట్టి ఉన్నతమైన స్థితినుండి పతనం చెంది ఇప్పటి మనిషి స్థితిని చేరుకున్నాం. తిరిగి క్రమంగా పరివర్తనచెంది, ప్రతీ మానవుడూ గమ్యమైన బ్రహ్మమును చేరుకుంటాడు. మనకు కనిపించే దృశ్యప్రపంచమే జ్ఞానానికి సరిహద్దు కాదు. దీన్ని దాటిన అతీంద్రియ జ్ఞానముందని చెప్పి, దాన్ని పొందిన మహాత్ములు ఉన్నారు. ఇట్టి ఆత్మజ్ఞానంవల్ల జననమరణాలనే సంసారచక్రం నుండి తరిస్తామని కూడ బోధించారు.