Thursday, July 4, 2013

TO SUM UP -3


అన్ని జన్మల్లో మానవజన్మే ఉత్తమమైనదని చెప్పబడినా మనం ఏంచేస్తున్నాం? పరిపక్వతలేని క్రిందిజీవులైన  పశుపక్ష్యాదులలా సుఖాన్వేషణలో జీవితాన్ని గడుపుతున్నాం. ఒక సుఖం తర్వాత మరొకటి ఇలా కోరికలకు లోనై, వాటిని పొందే ప్రయత్నంలో వ్యయప్రయాసలకు గురై జీవితంలో సంఘర్షణ పొందుతున్నాం. కోరికలే సంసారచక్రంలో బంధిస్తున్నాయనే ఎరుక మాత్రం కలగటం లేదు. కొందరు ఆలోచనాపరులు ఇట్టి అంతులేని కోరికలవల్ల శాశ్వతమైన ఆనందం లభించదని, శాశ్వతమైన ఆనందాన్ని, సంతృప్తినీ కలిగించేదేదో ఉండే ఉంటుందని గ్రహించి దానికోసం పట్టుదలతో ప్రయత్నం చేస్తారు.
 
మానవ జన్మ ఉత్తమమైనదని చెప్పుకున్నాం. అంటే ఇదే అత్యున్నతమైనదని అనుకోవద్దు. ఇదే శ్రేష్ఠమైనదైతే అసంతృప్తీ, జీవితం భరించలేనిదిగాను ఎందుకుంటుంది. జీవత్వాన్ని లయం చేసుకుని దివ్యత్వము, పరిపూర్ణస్థితీ  పొందడానికి మానవజన్మ ఒక సాధనం అని మహాత్ములు చెబుతున్నారు. ఈ అసంతృప్తి, నిస్సహాయతలనే సంసారసాగరం నుండి తరించి, ఎంతత్వరగా బయటపడితే అంతత్వరగా దివ్యత్వం పొందుతాం.

మనందరికీ మూలకారణమైన ఈశ్వరుడినే  భగవంతుడు/బ్రహ్మము అంటాం. ఈ సృష్టిజాతమంతా ఎవరిలో పుట్టి, ఎవరిలో జీవిస్తూ, తిరిగి ఎవరియందు ప్రవేశిస్తుందో అంటూ వేదం చెబుతుంది. చివరకు మనమంతా మూలకారణమైన బ్రహ్మమును చేరాలి. బ్రహ్మమును చేరడం ఉన్నతమైన స్థితే.  అట్టి ఉన్నతమైన స్థితినుండి పతనం చెంది ఇప్పటి మనిషి స్థితిని చేరుకున్నాం. తిరిగి క్రమంగా పరివర్తనచెంది, ప్రతీ మానవుడూ గమ్యమైన బ్రహ్మమును చేరుకుంటాడు. మనకు కనిపించే దృశ్యప్రపంచమే జ్ఞానానికి సరిహద్దు కాదు. దీన్ని దాటిన అతీంద్రియ జ్ఞానముందని చెప్పి, దాన్ని పొందిన మహాత్ములు ఉన్నారు. ఇట్టి ఆత్మజ్ఞానంవల్ల జననమరణాలనే సంసారచక్రం నుండి తరిస్తామని కూడ బోధించారు.


No comments:

Post a Comment