మొదట్లో మనిషి భగవంతుడి నుంచి వస్తాడు. చివరికి భగవంతుడిలో కలుస్తాడని ద్వైతం చెబుతుంది.
మనిషి నిజానికి భగవంతుడే గనుక అది
తెలుసుకుని చివరకు భగవంతుడే అవుతాడని అద్వైతం చెబుతుంది. మోక్షమంటే – జననమరణ సంసారబంధం నుండి
విడుదలవ్వడమే. అంటే మళ్ళీ జన్మ కలగకుండా ఉండటం. ఈ శరీరం ఉండగానే మోక్షం / ముక్తిని
పొందడాన్ని జీవన్ముక్తి అంటారు.
చేసిన ఉపాసనల మరియు నిష్కామకర్మల ఫలితంగా
స్వర్గానికి పోయి, అక్కడ కల్పాంతం వరకూ ఉండి జ్ఞానాన్ని ముక్తిని
పొందడాన్ని క్రమముక్తి అంటారు. జీవన్ముక్తి కల్గితే వెంటనే ముక్తుడు
మరణించడు. ఆ ముక్తిస్థితిలో జీవన్ముక్తునిగా జీవించి మరణానంతరం మోక్షం
పొందుతాడు.
ఐతే,ఈ సంసారబంధం కలిగించేవి ఏవో తెలుసుకొని, వాటిని నిర్మూలించుకుంటే పునర్జన్మలు ఉండవు. అవిద్యావరణంతో ఉండే కారణశరీరం నిర్మూలమవ్వాలంటే, కోరికలు కర్మఫలములు పూర్తిగా నశించి ఆత్మజ్ఞానం కలగాలి. అంటే అనుభవ పూర్వకమైన ఆత్మవిద్యయే మోక్షం. పునర్జన్మ ఎలాకల్గుతుందో చూద్దాం. జీవుడు భౌతికశరీరాన్ని వదలిపోయేపుడు అవిద్యావరణంగా ఉన్న కారణశరీరంతోబాటు కోరికలు(కామము), కర్మఫలాలు, పృధివి మొదలైన పంచభూతాల తన్మాత్రలు కలసి వాసనల రూపంలో కారణశరీరమందు నిక్షిప్తమై పయనిస్తాయని చెబుతారు.
వీటిలో కోరికలూ, కర్మఫలాలూ స్వయంకృతాలు. ఇవి పూర్తిగా నశిస్తే భూతతన్మాత్రలు వాటంత అవే పోతాయి. కాని వీటన్నిటికీ మూలమైన కారణశరీరం నశించాలంటే అజ్ఞానం పోవాలి. అంటే ఆత్మజ్ఞానం కలిగితే అజ్ఞానావరణమైన కారణశరీరం ఏర్పడదు కాబట్టి, ఇక జన్మనెత్తవలసిన పని ఉండదు. అంచేత కర్మఫలాలు, వాసనలు, అవిద్యాకోశం అనే బంధాలనుండి విడుదలవ్వాలి. బ్రహ్మచైతన్యాన్ని కప్పిఉంచిన అవిద్యాకోశాన్ని ఎవరికివారే ఛేదించుకోవాలి. అనుభవపూర్వకమైన ఆత్మవిద్యయే మోక్షమని చెప్పబడింది.
No comments:
Post a Comment