మనం ఇంతవరకూ
తెలుసుకున్న విషయాలన్నీ, అంటే మోక్షంనుండి పురుషప్రయత్నం దాకా (కుండలిని
తప్ప) జ్ఞాన సంబంధమైనవే. కుండలిని రాజయోగం/యోగమార్గంలోనిది. భక్తి, కర్మయోగాలను ఎలా సాధించుకోవాలో విపులంగానే
చర్చించడం జరిగింది. ఇపుడు జ్ఞాన యోగంలో మరిన్ని విషయాలు పరిశీలిద్దాం. ఆ తర్వాత
రాజయోగంలో ధ్యానం గురించి తెలుసుకుందాం.
అజ్ఞానంవల్ల
ఇంద్రియలోలులైన మానవులు, ప్రపంచంలోని వస్తువులు విషయాలు వాస్తవం అనుకొని, వాటికి బానిసలై
సుఖాన్వేషణలో అంతులేని కోర్కెలతో సతమతమవుతున్నారు. జీవితంలో ఎదురుదెబ్బలు
తింటున్నా, సంతృప్తి
కలుగుతుందనే ఆశమాత్రం చావడం లేదు. ఈ దేహమే నేనని అనుకోవడం అజ్ఞానం. దానివల్ల
రాగద్వేషాలు కల్గి, సంసారబంధంలోకి ఆకర్షించబడుతున్నాం. భోగాసక్తి, అహంకార
మమకారములు ఉన్నంతవరకూ జననమరణాల బంధంనుండి విముక్తి లేదని చెబుతారు. వాస్తవంగా
ఉన్నదల్లా అద్వితీయము, అవినాశిఐన, చావుపుట్టుకలు లేని ఏకైక
సత్పదార్ధమే. అదే అన్నిజీవులలోను, ఒకేలా చైతన్యస్వరూపంగా ప్రకాశించే ఆత్మ. ఆ
ఏకరూపమైన సత్పదార్ధం నుండే, మాయచేత నామరూపాలుగల ప్రకృతి, జీవుడు, జగత్తు, అందలి వస్తువులుగాను కల్పించబడుతున్నాయి.
ఈ నామరూపములనే భేదాలను తొలగిస్తే, ఇక మిగిలేది ఏకరూపంగా ప్రకాశిస్తుంది. అంచేత
మీరు, నేను, ఈ కన్పించే
వస్తుసముదాయమూ అన్నీ భ్రాంతిరూపాలే.
జననమరణాలు
ఉపాధిగానున్న శరీరానికే గాని, ఉపాధిని స్వీకరించిన ఆత్మకు కాదు. పునర్జన్మ
కలగకుండా ఉండాలంటే ఆత్మను సాక్షాత్కారించు కోవాలి. దీనికి జ్ఞానం ఆవశ్యకత ఎంతైనా
ఉంది. జ్ఞానమంటే పరమాత్మను గురించిన జ్ఞానమే. అదే బ్రహ్మవిద్య. అలాంటి
జ్ఞానంవల్ల అజ్ఞానం తొలగుతుంది. అపుడు తానీశరీరం కాదని, తనే
బ్రహ్మమని అనుభవం అవుతుంది. అదే అహం బ్రహ్మస్మి అనే ఉపనిషద్వాక్యం. బ్రహ్మవిద్య
బ్రహ్మత్వాన్ని పొందించి శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తుంది. అందుకే ఆత్మ, జగత్తు, మాయ మొదలైన
వాటిని గురించిన జ్ఞానం, ఏ మార్గంలో బ్రహ్మమును అన్వేషించే వారికైనా కొంత
తెలియాలి. మన సస్వరూపాన్ని తెలుసుకోవాలంటే అజ్ఞానజనితమైన మాయను తొలగించుకోవాలి.
దీనికోసమే మనప్రయత్నమంతా. వేదాంతశాస్త్రమంతా కూడ అధ్యాస తొలగడానికే.
అధ్యాస అంటే, ఉన్నది ఒకవస్తువైతే, మరోవస్తువుగా భ్రాంతిచెందటం లేక ఆరోపించడం.
అంటే దేహంలో ఉండే తను, తానుగాని దేహమేతానని,భ్రమచెండటం. ఈ భ్రమ
తొలగితే ఆత్మతత్వం అవగతమవుతుంది. బ్రహ్మచర్యం పూర్తిచేసుకొని, గృహస్థ
వానప్రస్థాశ్రమాల తర్వాత, కర్మల నాచరిస్తూ చిత్తశుద్ధి పొంది బ్రహ్మజిజ్ఞాసకు
పూనుకుంటే మోక్షం లభిస్తుందని చెప్పబడింది.
బ్రహ్మప్రాప్తి
అనేది బ్రహ్మము ఇట్టిదని తెలుసుకుంటే కలుగదు. శ్రద్ధాభక్తులతో కూడిన సాధన చెయ్యగా
చెయ్యగా, కర్మ పరిపక్వమైనపుడు పరమాత్మ అనుగ్రహంవల్ల కలుగుతుందని విజ్ఞులు
చెబుతారు. ఈ సాధనకు నిత్యానిత్య వస్తువివేకము, వైరాగ్యము, శమాదిషట్క సంపత్తి,
ముముక్షుత్వము అనే నాలుగుఅంగాలు సాధన చతుష్టయంగా చెబుతూ, వీటిని సాధించాకా
శ్రవణమననాదులు చెయ్యడంవల్ల బ్రహ్మప్రాప్తి అని చెప్పబడింది. చివరకు తనే బ్రహ్మమని
తెలుసుకోవడం, దాని గురించి చేసే ప్రయత్నమూ అద్వైతానుభూతికోసమే. అంటే అది
కావడానికే.
చక్కటి విషయాలను తెలియజేసారు.
ReplyDeleteమీ అభిమానానికి కృతజ్ఞతలండి.
ReplyDeleteసూర్యచంద్ర గోళ్ల.