Thursday, July 18, 2013

TO SUM UP -5


జ్ఞాని మరణించాడని అనం. సిద్ధిని పొందాడనే అంటాం. అద్వైతి తప్ప, మిగిలిన సాధకులందరూ అంటే యోగులూ, భక్తులూ, కర్మయోగులూ  ఉపాసకులే. జ్ఞానికే పరమాత్మతో ఐక్యత ఉంటుంది. తక్కినవారందరూ వారి సాధన పరిపక్వమైతే, మరణానంతరం అత్యున్నతమైన హిరణ్యగర్భుని లోకం చేరుకొని ప్రళయంలో ఆ బ్రహ్మతోబాటు శుద్ధ బ్రహ్మములో కలుస్తారు.  సంసార బంధం నుండి విముక్తులవుతారు. అంతేగాని అద్వైత ముక్తి లభించదు. ఎందుకంటే వీరికి అద్వైతభావన, పరమాత్మతో ఐక్యంచేందేస్థితి ఉండదు గనుక.
       
మన అంతర్గతంగా ఉండే దివ్యత్వాన్ని వ్యక్తపరచడమే మన పరమావధి. దీనికోసం పండితులు కొన్ని మార్గాలను సూచించారు. అవే భక్తియోగం, కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం అని పిలువబడుతున్నాయి. ఒక గమ్యాన్ని చేరడానికి వివిధమార్గాలున్నట్లు, మన ధ్యేయమైన మోక్షాన్ని చేరుకోడానికి ఈ నాలుగూ మార్గాలని చెప్పవచ్చు. మానవులలో ఉండే త్రిగుణాలు అందరిలోనూ ఒకేలా ఉండవు. అంచేత ఎవరి అభిరుచి లేక గుణాధిక్యత వల్ల వారొక మార్గాన్ని సహజంగా ఇష్టపడతారు. ఏ ఒకమార్గం ఎంచుకొని సాధన కొనసాగించి ప్రావీణ్యం పొందుతున్నా, ఆమార్గం మరికొన్ని మార్గాలతో కలుస్తుంది. గమ్యాన్ని చేరడం, మన సాధననుబట్టి, ప్రయత్నాన్నిబట్టి ఉంటుంది. వీటిని గురించి యిదివరలో చెప్పుకున్నాం. 


No comments:

Post a Comment