Thursday, September 19, 2013

జ్ఞానయోగము- సాధన (8)

ముముక్షుత్వం 

సాధనచతుష్టయంలో మూడు అంగాల వివరణ పూర్తయ్యింది. ఇప్పుడు ముముక్షుత్వం.
ముముక్షుత్వం అంటే మోక్షంమీద ఆపేక్ష ఉండటం అని యిదివరలో చెప్పుకున్నాం. అసలు మోక్షం మీద ఆపేక్ష ఉండబట్టే ఇంతదాకా సాధన చెయ్యడం జరిగింది కదా! ఇక్కడ దీనిగురించి ఎందుకు చెప్పబడింది అంటే, మోక్షం మీద తీవ్రమైన కోరిక ఉండటం అన్నమాట. తీవ్రమైన కోరిక అంటే, మోక్షం కోసం ఎంతటి కఠినప్రయత్నమైనా చెయ్యడానికి సిద్ధపడిన స్థితినిగురించి ఇక్కడ చెప్పబడింది. తీవ్రమైన కోరికతోను, మనోవేదనతోనూ ఉండే ముముక్షుత్వం. దుఃఖాలు కల్గినప్పుడు తాత్కాలికంగా వైరాగ్యం కలగవచ్చు. ఐతే సుఖాలు కల్గినప్పుడు ఇవి మాయావికారాలనే  దృఢ బుధ్ధి కలిగి అచంచల విశ్వాసంతో సంసారం నుండి బయట పడాలని గురువు సమక్షంలోనో , దైవసన్నిధిలోనో చేసే ఆక్రందన అన్నమాట. 
   
మనోవేదన దేనికీ అంటే, జననమరణాలనే సంసారబంధంలో చిక్కుకున్నట్లు తెలుసుకున్నాడు గనుక దాన్నుండి   బయటపడాలనే తీవ్రమైన కోరిక. అంతేగాని చిన్న చిన్న చిరాకులవల్ల కలిగిన ఆక్రందనవల్ల కాదు. దీన్లో సంసారబంధం నుండి విముక్తి కలిగితే చాలదు. బంధవిముక్తి కలిగాకా జీవుడు కేవలం జడునిగా ఉండకూడదు. స్వస్వరూప అవబోధం కావాలి. అంటే సాక్షాత్కారం / ఆ జ్ఞానంయొక్క ఎరుక కలిగి ఉండాలి. తనను తాను గుర్తించడానికే బంధంనుంచి దూరంకావాలనే కోరిక. మోక్షమనే పదం దేన్ని విడిచిపెట్టాలో సూచిస్తుందే గాని దేన్ని చేరుకోవాలో అనేదాన్ని కాదు. వేదాంతంలో మోక్షం పొందటమంటే  బ్రహ్మానుభవమే. అంటే ఉన్నదాన్ని తెలిసికోవడమే. కొత్తగా సచ్చిదానంద స్థితి రావడం కాదు. జీవుడే బ్రహ్మము. కాని మాయావరణం వల్ల బంధితుడై ఉన్నాడు. అంచేత సాధనలో మాయాబంధాన్ని త్రెంపుకుంటే తన సహజానంద స్థితిలో ఉంటాడన్నమాట.        

అజ్ఞానమే మాయ. ఈ శరీరమే నేను అనుకోవడం మాయాకార్యం. దీనివల్ల అహంకారం ఏర్పడి, తాను పరమాత్మ కన్న భిన్నుడనని జీవుడు భావిస్తాడు. ముందు సూక్ష్మరూపంలో ఉండే ఆహంకారం దేహమంతా వ్యాపించి  శరీరమే తాననే భావన ఏర్పడి, జీవుడు బద్ధుడవుతున్నాడు. విముక్తి యొక్క లక్ష్యం స్వస్వరూపావబోధం. అవబోధం అంటే మేల్కొనడం. అంటే అజ్ఞానమనే చీకటినుండి జ్ఞానోదయం అవ్వడమే ఇక్కడ మేల్కొన్న స్థితి అని చెప్పబడింది. ఈ జ్ఞానం స్వస్వరూపం గురించి. అదే తన సహజానందస్థితి. ఆత్మయే జ్ఞానం కాబట్టి ఆత్మజ్ఞానం 
అన్నమాట. అదే ఎరుక కలిగి ఉండటం అంటే. అట్టి ఎరుకయే ఆత్మ. అజ్ఞానం నుంచి మేల్కోగా, కలిగే జ్ఞానం యొక్క ఎరుకకై  ఉండే తపనయే ముముక్షుత్వ మని చెప్పబడింది. అంటే అజ్ఞానమనే చీకటి తొలగగా తన సహజస్థితిలో ప్రకాశించి ఉండటాన్ని మేల్కొన్న స్థితిగా చెప్పవచ్చు. అలాంటి స్వయంప్రకాశమైన స్వస్వరూపము యొక్క ఎరుకయే ఆత్మ.
 
అదే జీవాత్మ పరమాత్మల అభేదతను గుర్తించడం. అదే ఆత్మసాక్షాత్కారం. అదే నిత్యమైన ఎరుక అన్నా, సస్వరూపాన్ని ఎరుగుట అన్నా రెండూ ఒక్కటే. బంధవిముక్తీ, ఆత్మ సాక్షాత్కారమూ ఒకేసారి జరుగుతాయి. కాబట్టి ఆత్మ జ్యోతిని చూడటమే వేదాంతం యొక్క లక్ష్యం. అట్టి స్వీయానుభవం వల్ల మాయాబంధం తొలగినట్లు గ్రహిస్తారు. ఆత్మాన్వేషణలో మునిగినవారు , వారికి తటాలున ఆత్మదీప్తి కలిగినట్లు చెబుతారు. అందుకే అద్వైతసాధకుడు చివరి దశలో జీవ బ్రహ్మముల ఐక్యతను వివరించే మహావాక్యాలపై దృష్టిని పెడతాడు. ఆ అనుభవం వల్ల మాయబంధం తొలగినట్లు భావిస్తాడు. అందుకే ముముక్షుదశలో సాధకుడు బంధం నుంచి విముక్తి కోరుతాడు. అది దాటి తత్వజ్ఞానం కల్గినప్పుడు తన అసలైన సస్వరూపం తెలుసుకోవడం వల్ల బంధవిముక్తి పొందినట్లే. అంటే పొందినట్లు భావిస్తాడు. 


 

2 comments:

  1. చక్కటి విషయములను తెలియజేసినందుకు మీకు ధన్యవాదములండి.

    ReplyDelete
  2. కృతజ్ఞతలండీ.
    సూర్యచంద్ర గోళ్ల.

    ReplyDelete