సగుణ నిర్గుణాలు
ఉపనిషత్తులు నిర్గుణం గురించే చెప్పాయనే
మాటను ప్రమాణంగా తీసుకుని దాన్నే చింతిస్తూ శ్రద్ధతో ముందుకు సాగిపోతే నిర్గుణ
బ్రహ్మానుభవం కలుగుతుంది. మనస్సు పనిచేస్తున్నంత వరకూ అప్పుడపుడు ఈశ్వరుడు
జ్ఞప్తికి వస్తుంటాడు. అసలు హృదయంలో ఉన్నది నిర్గుణుడే. ఐనా అలా గుర్తుకువచ్చినప్పుడు
ఓ భగవంతుడా! నీ దయవల్ల అద్వైతంలో అడుగు పెట్టి , కొద్ది కొద్దిగా పురోగమిస్తున్నాను. నీ కృప కటాక్షాలతో నన్ను అద్వైతానికి
చేర్చమని ప్రార్ధించాలి. జ్ఞానమార్గంలో ఇలా అప్పుడపుడు కల్గే భక్తి కొద్ది
సమయానికే ఉన్నా , అది సజీవంగా తొణికిసలాడేదిగా ఉంటుంది. కృతజ్ఞతతో
ఉండే భక్తి నిత్యమూ ఉరే ఊట వంటిదని చెప్పబడింది. మన ధ్యేయం నిర్గుణం కాబట్టి,
సగుణం నుంచి మనస్సును మళ్లించాలి. ప్రేమ ఎటువెళ్ళాలో సూచించే ఏ
సగుణమూర్తి ఐనా గురువే. అతడే ప్రేమను నిర్గుణం వేపు మళ్లించి ఉద్ధరించేవాడు. ప్రేమ,
భక్తి ఒకదానితో మరోటి అనుబంధం కలిగే ఉంటాయి. ఇప్పుడు ఆత్మనే
వరించాలనే తపనతో అనుబంధం కలిగి ఉన్నాం. జీవాహంకారం లేదు. పరమైన వస్తువు పట్ల చూపే, ప్రేమయే భక్తి అనబడుతోంది.
జీవుడికి అనుబంధమనేది జీవం ఉన్నవాటితోనే
ఉంటుంది. ఇప్పటి వరకూ సాధన జడంగానే సాగుతోంది. ప్రాణం ఇంకా మహాప్రాణంతో
అనుసంధానమవ్వ లేదు. అంటే బౌద్ధులు చెప్పే శూన్యం మాదిరిగానే ఇంతవరకూ ఉంది. కాని
వేదాంతంలో చెప్పే బ్రహ్మం శూన్యం కాదు. అది సచ్చిదానందమయం. ఆనంద స్వరూపంగా భావించి
ఆ పరిపూర్ణతలో మునిగి పోవడమే ఇందులో జరిగేది. దీనికి ప్రేమతో కూడిన భక్తి అవుసరం.
ఇప్పటి వరకూ సాధన శుష్కంగా జరిగినా, ఇకనుండి శ్రవణ మననాదులను
భక్తితోను ప్రేమతోను కొనసాగించాలి. బాహ్యప్రపంచాన్ని విడచిన సన్యాసం ప్రేమామృతంతో
తడిసినదిగా ఉంటుంది.
ఇక్కడినుండే మలయమారుతం వీస్తుంది.
అంచేత సాధకుడు
శుష్కప్రాయంగా జీవించడం మానాలి.
No comments:
Post a Comment