Monday, August 27, 2012

ప్రపంచము లేక జగత్తు ఏర్పడ్డ విధానం-1


సృష్టికి పూర్వం ఆత్మ ఒక్కటే ఉందనీ అదే పరమాత్మఅని, ఆ పరమాత్మ సృష్టించాలని చూసినట్లును, చూపుతోనే సంకల్పముతోనే ఈ లోకాలన్నిటినీ సృష్టించినట్లు ఐతరేయోపనిషత్తు చెబుతోంది.
అత్మ (బ్రహ్మము) నుండే క్రమంగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, ఉర్వి, ఓషధులు అన్నము, దేహములు సంభవించాయనీ, బ్రహ్మమనెడి ఆ అత్మనుంచే లోకములన్నీ ఉద్భవించినట్లుగా తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది.
సృష్టికి పూర్వము సత్త మాత్రమే ఉన్నదనీ, ఇది అనేకములు కావలెనని చూసి అగ్నిని, జలమును, అండజములు మొదలైన వాటినన్నిటిని సృష్టించెనని ఛాందోగ్యం చెబుతోంది.
ఉజ్వలంగా మండే  అగ్ని నుండి నిప్పురవ్వలు అనేకములుద్భవించు నట్లు, అక్షర బ్రహ్మము నుండి చేతనములు, జడములు, వివిధములై ఉద్భవించాయని ముండకోపనిషత్తు చెబుతోంది.
సృష్టికి పూర్వము బ్రహ్మమునందు జగత్తు అవ్యాకృత రూపమున ఉండెనని, అదే దృశ్యములైన నామ రూపములచే ఇపుడు విరాట్టు మొదలగు వానియందు స్పష్టముగా ఏర్పడినదనియు, ఆ విరాట్టు నుండే మనువు, మనుష్యులు, పశు పక్ష్యాదులు ఉద్భవించెనని బృహదారణ్యకం చెబుతోంది.

ఇలా వేదాలన్నీ సృష్టి ఈశ్వర కృతమేనని చెబుతున్నాయి. అంతేకాని అదృష్టంవల్ల గాని, స్వభావంవల్ల గాని, యాదృచ్చికంగా  కాదని స్పష్ట పరుస్తున్నాయి. బ్రహ్మము తనకు భిన్నమైన జీవరూపాన్ని ఏర్పరచుకొని దేహాలలో ప్రవేశించినట్లుగా శ్రుతులు చెబుతున్నాయి.

ప్రపంచ సృష్టి విధానాన్ని గురించి చెప్పేటపుడు కొన్ని అభిప్రాయ భేదాలు మనకు కన్పిస్తాయి. వేదాంతంలో కొన్నిచోట్ల త్రివృత్కరణం అనే ప్రక్రియ ద్వారా జరిగిందని ఛాందోగ్యోపనిషత్తు లోను, బ్రహ్మ సూత్రాల్లోను పేర్కొనడం జరిగింది. మరోచోట తైత్తిరీయోపనిషత్తు,శ్వేతాశ్వరోపనిషత్తులలో పంచభూతాలనుండే సృష్టి జరిగినట్లుగా చెప్ప బడింది. స్మృతి యందు అంటే మహాభారత పురాణాలలో మరో విధంగా చెప్ప బడింది. సాంఖ్యులు ప్రకృతినుంచి సృష్టి జరిగిందనగా, వేదాంతులు పరమాత్మ నుండి జరిగిందని చెబుతారు. దీని బట్టి చూస్తే మనకు సృష్టి యొక్క రచనా విధానంలో వివిధ అభిప్రాయాలున్నట్లు  తెలుస్తోంది. వాటిని గురించి క్లుప్తంగా తెలుసు కుందాం.

1. త్రివృత్కరణం –
నామరూపాలతో ఉండే జగత్తు ఏర్పడడానికి ముందు బ్రహ్మము మాత్రమే ఉండెనని చెప్పబడింది. అతడు ముందుగా తేజస్సును(అగ్ని)సృష్టించగా, ఆ తేజస్సు నుండి జలము, జలము నుండి పృధివి( అన్నము) కలిగెనని చెప్పబడుతోంది. భూమికే అన్నమని మరొక పేరు. ఈ మూడూ ఇప్పుడు తన్మాత్రల రూపంలో అంటే సూక్ష్మ రూపంలో ఉన్నాయి. ఈ సూక్ష్మ రూపంలో ఉన్న భూతములను ఒక్కోటీ రెండర్ధ భాగములు చేయబడతాయి. వాటిలో ఒక భాగాన్ని వదలి, రెండవ అర్ధ భాగాన్ని మళ్ళీ రెండు అర్ధభాగాలుగా విభజించగా
అప్పుడు  ఒక్కొక్క భూతమునకు రెండవ అర్ధ భాగమునుండి రెండేసి చొప్పున భాగములేర్పడతాయి. ఇవి పావు భాగములు. ముందర్ధభాగమునకు రెండవ అర్ధభాగమునుండి ఏర్పడిన తక్కిన భూతముల ఒక్కొక్క పాతిక భాగమును కలిపితే ముందర్ధభాగం యొక్క స్థూల భూతం ఏర్పడుతుంది. 

       అగ్ని(తేజస్సు) 1/2
             జలము 1/2
            పృధివి 1/2
     జలము1/4+పృధివి 1/4
       పృధివి1/4+అగ్ని1/4     
   అగ్ని1/4+జలము1/4
                     !                                        !                                          !        
                     అగ్ని                                 జలము                                     పృధివి

అలా అగ్ని, జలము, పృథ్వి అనే స్థూల భూతములేర్పడతాయి. ఇలా ఈ మూడు భూతతన్మాత్రల పరస్పర కలయిక వల్ల ఏర్పడిన స్థూల భూతముల  ప్రక్రియను 'త్రివృత్కరణం' అని అంటారు. ఈ స్థూల భూతాలతోనే సమస్త సృష్టి జరుగుతోందని చెప్పబడుతోంది. ఇక్కడ ఆకాశము వాయువులు నిరవయవములు గా పరిగణించబడటం వల్ల, అవి వీటిలోనే అంతర్భూతములని చూసుకోవాలి.

సూక్ష్మ భూతాంశాలైన అగ్నియందలి ఎర్రని రూపం తేజస్సు, అలాగే తెల్లని రూపం  త్రివృత్కరణం కాని ఉదకానిది(జలం). నల్లని రూపం  త్రివృత్కరణం కాని పృథ్విది. ఇలా మూడు రూపాలుగా ఉన్న తేజస్సు, జలము, పృథ్వి అనే తత్వాలే సత్యము. ఎందుకంటే ఈ మూడు తత్వాలతోనే సమస్తమూ ఏర్పడుతోంది కాబట్టి. ఇలాగే బ్రహ్మము ఆత్మరూపంలో, భూజలాగ్నులనే మూడు భూతములలోను ప్రవేశించి సృష్టికి కారణమవుతున్నట్లు చెప్పబడింది.                                                                                                 
                                                                                           (ఇంకా ఉంది 


Sunday, August 26, 2012

ప్రపంచము లేక జగత్తు ఏర్పడ్డ విధానం-3


2) రెండవ విధానం
స్థూల సూక్ష్మ శరీరములు ఏర్పడే విధానాన్ని వివరించడానికి వాటికి  కారణాలైన పంచ మహాభూతాల సృష్టి చెప్పబడుతోంది. ఈ పంచ మహాభూతాలనుంచే సకల జీవరాసులూ, వాటి శరీరములు, జగత్తు ఏర్పడుతున్నాయి.గుణరహితమైన  అత్మనుండి ఆకాశం కలిగింది. పంచమహాభూతాలు అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధివి అనే ఐదు. బ్రహ్మము నుండి ముందుగా ఆకాశ తన్మాత్ర కలిగినది. దాని యందు మిగిలిన వన్నీ సూక్ష్మ రూపంలో ఉన్నట్లు చెప్ప బడింది. ఈ తన్మాత్ర నుండి ఆకాశము కలుగగా ఆకాశము నుండి వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలము, జలము నుండి పృధివి అనే సూక్ష్మ భూతములు కలిగాయి. ఇలా పంచ భూతాలయొక్క తన్మాత్రలు ఏర్పడతాయి. తన్మాత్రాలంటే సూక్ష్మాంశాలుగా చెప్పుకోవచ్చు.
   
ఆకాశము ఇతర భూతములు ఉండటానికి అవకాశమును కలుగ జేస్తుంది. ఒక్కో సూక్ష్మ భూతమందూ సత్వ రజస్ తమో గుణాలు మూడూ ఉంటాయి. అంటే ఆకాశమునకు సత్వ, రజస్,తమో గుణాలుంటాయి. అలాగే వాయువుకూ, అగ్నికీ, జలమునకూ, పృధివికీ కూడ ఈ సత్వ, రజస్, తమో గుణాలు ఉన్నాయి.

ఆదిశంకరుల తర్వాత అద్వైతాన్ని బోధించిన ప్రముఖులైన శ్రీ విద్యారణ్యులు, వేదాంత పంచ దశిలో సృష్టిని గురించి చెప్పేటపుడు ప్రకృతిని ప్రతిపాదిస్తూ ప్రకృతికి బ్రహ్మము కన్న స్వతంత్రమైన ఉనికి లేదన్నారు. ప్రకృతి సత్వము, రజస్సు , తమస్సు అని మూడు గుణాల సామ్యావస్థ.  జీవుడు, జగత్తు, ఈశ్వరుడు అనే వ్యవహారానికి కారణంగా ప్రకృతి ప్రతిపాదించ బదిండి. ప్రకృతిని తీసివేస్తే సృష్టికి కారణం లేదు/తెలియదు గనుక తత్వాని గ్రహించాలి. అంతే గాని అనవసర వాదాల వల్ల ప్రయోజనం ఉండదని విజ్ఞులు చెబుతారు.

ప్రకృతి సత్వ,రజ,స్తమో గుణాలతో కూడి సమతుల్యంలో ఉంటుంది. ఈ గుణాల పరస్పర కలయిక చేత మనకు కన్పించే జగత్తు ఏర్పడుతోంది. బ్రహ్మముకన్న భిన్నంగా ఉండే  ఉనికి ప్రకృతికి లేదు. జీవుడు,జగత్తు, ఈశ్వరుడు అనే వ్యవహారానికి  ప్రకృతి మూలకారణంగా ప్రతిపాదించ బడుతోంది. అంటే వీరు ప్రతిపాదించిన ప్రకృతికీ బ్రహ్మమునకూ తేడా ఏమీ లేదనుకోవచ్చు.

సాంఖ్య దర్శనంలో ప్రకృతి కూడ పురుషునిలాగానే సర్వ స్వతంత్రమైనదని చెబుతారు. అంచేత ఇక్కడ ప్రతిపాదించబడినది బ్రహ్మమున కన్న భిన్నము కాదని అనుకుంటే తత్వం అర్ధమవుతుంది. బ్రహ్మము యొక్క చిదానంద స్వరూపంతో కలసి ఉన్న ప్రకృతి రెండు విధములుగా చెప్పబడింది. అవి
అ) శుద్ధ సత్వము - మిగిలిన ఇతర గుణములతో చేరకుండా ఉండే  సత్వాన్ని శుద్ధ సత్వము అంటారు. దీన్నే మాయ అని కూడ అంటారు. దీన్లో ప్రతిబింబించిన  బ్రహ్మము ఈశ్వరుడు.
ఆ) మలిన సత్వము-  రజస్తమో గుణాలతో కలసి ఉండే  సత్వాన్ని మలిన సత్వము లేక అవిద్య అని అంటారు.దీన్లో ప్రతిఫలించిన బ్రహ్మము జీవుడు.

{ఆవిద్య యందు రజస్తమో గుణాల హెచ్చు తగ్గుల వలన దేవతలు, పశుపక్ష్యాది జీవులూ ఏర్పడుతున్నాయి. ఈ అవిద్యకే కారణ శరీరమని పేరు. ఈ కారణ శరీరంతో సంబంధ పడిన జీవుడే ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞులు సుఖ దుఖములను అనుభవించుటకు ఈశ్వరుని ఆజ్ఞచే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధివి అనే మహాభూతములు ఉద్భవించినవి.} ఇలా పంచభూతాల సూక్షాంశాల వరకే భేదం కనిస్తుంది. అక్కడ నుంచి ఈ ప్రతిపాదనలలో భేదమేమీ లేదు.

పంచ మహాభూతములూ తమఃప్రధానమైన ప్రకృతి నుండి ఏర్పడ్డాయి. వీటి సత్వగుణాంశల నుండి వరుసగా ఆకాశమునుండి శ్రవణేంద్రియము, వాయువు నుండి స్పర్శేంద్రియము, అగ్ని లేక తేజస్సు నుండి నేత్రేంద్రియము, జలము నుండి రసనేంద్రియము, పృధివి నుండి ఘ్రాణేంద్రియము ఇలా ఒక్కొక్క దాన్నుంచి ఒకో  అంతర్ జ్ఞానేంద్రియము ఏర్పడుతుంది. అంతర అని ఎందుకు అన్నామంటే ఇక్కడ చెప్పిన జ్ఞానేంద్రియాలు బాహ్యంగా ఉండే మాంస గోళాలు కాదు గనుక. ఇవి పంచభూతాలలో ఉండే గుణాలు.

ఈ ఐదు జ్ఞానేంద్రియాల సత్వాంశాలు మొత్తం కలసి అంతఃకరణం ఏర్పడుతుంది. అంతఃకరణం విమర్శాత్మకమైన మనస్సు, నిశ్చయాత్మకమైన బుద్ది అని రెండు రకాలుగా స్వీకరిస్తారు. పైన చెప్పుకున్న అంతర్ జ్ఞానేంద్రియాల్లో ఒక్కొక్క భూతాంశమే ఉంటుంది. అంచేత కన్ను వినలేదు. నాలుక చూడలేదు. ఈ పంచేంద్రియాలూ తెచ్చే విషయాలను గ్రహించడానికి వీలుగా ఐదు భూతాల సత్వాంశలూ కలసి అంతః కరణంగా ఏర్పడి వీటన్నిటినీ గ్రహించ గలుగుతుంది.

ఇప్పుడు సూక్ష్మభూతాల యొక్క రాజసికాంశల చేత (కర్మేంద్రియములైన)  వరుసగా ఆకాశమునుండి వాక్కు ( నోటిలో నుంచి వచ్చే మాట), వాయువు నుండి చేయి (పాణి ), అగ్ని నుండి పాదము, జలము నుండి గుదము(పాయువు), పృధివి నుండి ఉపస్థ (జననేంద్రియము/గుహ్యము ) ఏర్పడుతున్నాయి. ఇవి కూడ సూక్ష్మాంశములే. మాంస గోళములు కావు. అంతరింద్రియములే. ఈ ఐదు తన్మాత్రల రజోంశములూ కలసి ప్రాణము ఏర్పడుతుంది. ఈ ప్రాణానికే ముఖ్య ప్రాణమని పేరు. ముఖ్య ప్రాణము చేసే పనుల భేదాన్నిబట్టి ప్రాణమును వేర్వేరు పేరులతో పిలుస్తారు. ఈ పంచ ప్రాణాలనూ వివేచన చేసే టపుడు ముందుగా ప్రాణము నుంచే వివేచన చెయ్యాలి. ఇవి ప్రాణము, అపానము, సమానము, ఉదానము, వ్యానము అనేవి పంచ ప్రాణాలుగా పిలవబడు తున్నాయి. ఇవి కర్మేంద్రియాల ద్వారా శరీరాన్ని నడిపిస్తాయి.

ఇంతవరకూ అన్నీ పరిశుద్ధంగా ఉన్నాయి. అంటే ఇంతవరకూ చెప్పిన తత్వాలన్నీ పరిశుద్ధంగా ఎక్కడా మిశ్రమం ( ఒకదాంతో మరోటి సంయోగం చెంద లేదు) జరుగ లేదు. అంచేత అవి సూక్షాలుగా చెప్ప బడ్డాయి. ఇప్పుడు జీవులకు స్థూల శరీరాల్ని కల్పించడానికి ; పంచీకరణం అనే ప్రక్రియ ద్వారా  స్థూలమహా భూతాలైన  ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృధివి అనే స్థూల పంచ మహాభూతాలు  ఏర్పాటు చెయ్య బడ్డాయి. జీవులు సుఖదుఖాలను అనుభవించడానికి తమః ప్రదానమైన ప్రకృతి నుండి బ్రహ్మము యొక్క సంకల్పము చేత ఆకాశము, వాయువు, అగ్ని , జలము, పృధివి అనే మహాభూతాలు ఉద్భవించాయి. జీవులు అనుభవించడానికి అన్నపానాది భోగ్య విషయాలను, వాటిని అనుభవించడానికి తగ్గ శరీరాలను సృష్టించడానికి సూక్ష్మ ఆకాశాది మహా భూతాలను( పంచ తన్మాత్రలను) పంచీకరణము చేసి; స్థూలశరీరాలను ఏర్పరచడానికి  స్థూల భూతములను కల్పించ వలసి వచ్చింది.

ఈ పంచ మహాభూతాలూ, ఇంద్రియాలు, అంతఃకరణము, ప్రాణము ఇవన్నీ పరస్పరమూ కలిసి స్థూల భూతములు ఏర్పడుతున్నాయి. ఇలా వివిధ శరీరాలను జీవరాసులను సృష్టించి నట్లుగా చెప్ప బడింది. ఈ స్థూల భూతాలచేత బ్రహ్మాండము, అందలి పదునాల్గు భువనములు, వాటికి తగిన భోగ్య విషయాలు, వాటిని అనుభవించ డానికి తగ్గ శరీరాలను పంచీకృత భూతములచే ఏర్పరచెను.

Friday, August 24, 2012

ప్రపంచము లేక జగత్తు ఏర్పడ్డ విధానం -2


త్రివృత్కరణం -----------------------------------  
తేజస్సు సంబంధం చేత వాక్కు, జల సంబంధం చేత ప్రాణము, పృధివి/ అన్నము యొక్క సంబంధం చేత మనస్సు ఏర్పడటం చేత, తేజోజలాన్నములు  మానవునికి ప్రధానములు. అన్నము యొక్క సూక్ష్మాంశము మనస్సుగాను, జలము యొక్క సూక్ష్మాంశము ప్రాణముగాను, అగ్ని యొక్క సూక్ష్మాంశము వాక్కులేక శబ్దంగాను తెలుస్తోంది.

అన్నము యొక్క మధ్యమాంశము చేత శుక్లము, జలము యొక్క మధ్యమాంశము నుండి రక్తము, పృధివి యొక్క మధ్యమాంశము వల్ల మజ్జ (bone marrow) ఏర్పడతాయని  చెప్పబడుతోంది.
అన్నము యొక్క కనిష్టికాంశము లేక స్థూలాంశము నుండి మలము, జలము యొక్క కనిష్టికాంశము మూత్రముగాను, అగ్ని యొక్క కనిష్టికాంశము ఎముకలుగాను ఏర్పడతాయి. ఇలా మనం భుజించే అన్నము, జలము, తేజస్వరూపమగు నేయి నూనె మొదలైన  పదార్ధాలు సూక్ష్మ, మధ్యమ, కనిష్టికాంశాలుగా విభజించబడి, జీవుల వికాసమునకు కారణమవుతుంది.
 
అన్నమునకు మూలము జలము. జలమునకు మూలము తేజస్సు. తేజస్సునకు మూలము సత్తు యందూ  ఉన్నాయి. ఆ సత్తే సూత్రాత్మగా వాగ్మనఃప్రాణ రూపమున బీజ రూపముగా తెలియబడుతోంది. మరణించు వాని వాక్కు మనస్సు నందు, మనస్సు ప్రాణమందు, ప్రాణము తేజస్సు నందు, తేజస్సు అత్మయందు లయమవుతాయని చెప్పబడింది. గనుక సర్వమూ బ్రహ్మ స్వరూపమై ఉంది. ఛాందోగ్యోపనిషత్తులో వాగ్మనఃప్రాణముల ఏకత్వానుసంధానము ప్రతిపాదించ బడింది. పరమాత్మ సృష్టికొరకు మనస్సు, వాక్కు, ప్రాణములను త్రివిధ అన్నములను సృష్టించెను. సమస్తమూ మనస్సు చేతనే తెలియ బడటం వల్ల సర్వము మనస్సుని చెప్ప బడింది. సర్వ శబ్దములూ వాక్కే. ఇది వస్తు నిర్ణయాన్ని బట్టి కలుగుతుంది. కనుక వాక్కు విజ్ఞాన స్వరూపము. ఇలా విజ్ఞాన స్వరూపమని తెలుసుకొనేది మనస్సు. ఇంద్రియ గోచర స్వరూపమైన అజ్ఞానమే ప్రాణముగా ఉంది. వాగ్మనఃప్రాణ స్వరూపుడైన  హిరణ్య గర్భుని తెలుసుకొను వాడు సర్వజ్ను డగుచున్నాడు.

సృష్టి నామరూపాత్మక మైనది. వాక్కు వల్లనే అన్ని నామములూ ఏర్పడటం వల్ల అన్ని నామములూ బ్రహ్మ స్వరూపమని చెప్పబడింది. అన్ని రూపములు నేత్రములచే తెలియబడి, నేత్రేంద్రియమే కారణంగా మనస్సు చేత తెలియబడటం చేత, ఇది బ్రహ్మ స్వరూపమని చెప్పబడుతోంది. సర్వ కర్మలకూ దేహమే కారణము. నామ రూప కర్మలు మూడూ దేహము నందే స్థితమై ఉన్నాయి. నామ రూపాత్మక కర్మలచే తెలియబడే దేహానికి ప్రాణము చైతన్యాన్ని ఇస్తుంది. అంచేత సమస్త భూతముల సారమైన మానవుని యందు, వాగ్మనఃప్రాణముల యందు  ఏకరూపమగు బ్రహ్మము తెలియ దగిన వాడు. అట్టి ఆత్మ స్వరూపము నందే సర్వ ప్రాణులు, సమస్త లోకములూ, సర్వ దేవతలు, సర్వ భూతములూ స్థితి కల్గి ఉన్నాయి. ఈ సమస్తమూ పృధివీవ్యాపస్తేజముల రూపములని ఎవడు తెలుసుకొను చున్నాడో అట్టివాడు, పరబ్రహ్మ స్వరూప నిశ్చయజ్ఞానము కలవాడగు చున్నాడు. ఆ ఆత్మయే పరబ్రహ్మ స్వరూపమని తెలియు చున్నది.


Monday, August 20, 2012

శ్రవణ మనన నిదిధ్యాసలు


సాధన చతుష్టయాన్నికలిగిన యోగ్యుడు శ్రవణ, మనన, నిదిధ్యాసలు చెయ్యాలని చెప్పబడింది.

శ్రవణము
వేదాంత శాస్త్ర జ్ఞానాన్ని స్వయంగా చదివి గాని, గురుముఖత గాని విని వేదాంత శ్రవణం చెయ్యాలి. మహావాక్యాల అర్ధాన్ని చక్కగా తెలుసుకోవాలి. శ్రవణ మాత్రం చేతనే యోగ్యుడైన వానికి మోక్షం కలుగుతుందని శ్రీ ఆదిశంకరులు చెబుతారు. కాని అట్టి వారు అరుదుగా ఉంటారు.

మననం 
విన్నవిషయాన్ని పలు మార్లు గుర్తుతెచ్చుకోవడాన్ని మననం అంటారు. వినిన అర్ధంయొక్క సాధక బాధకాలను చక్కగా విచారించి, నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చి, దాన్ని అనేక మార్లు మననం చెయ్యాలని అర్ధం. నేను శరీరాన్ని గాని, ఇంద్రియాలను గాని, మనస్సును గాని, బుద్ధిని గాని, అహంకారమును గాని కాదని నిశ్చయానికి రావడం. తాను జనన మరణ రహితమైన అత్మయేనని తెలిసికొని, ఆ విషయాన్ని ఎప్పుడూ మరువకుండా ఉండాలి. ఈ వాక్యాల భావం మనస్సులోనిండి, శరీరంలో ప్రతీ అణువులోను  ప్రవేశించాలని పెద్దలు అంటారు. ఇలా మననం చెయ్యడాన్ని నిదిధ్యాస కలిగే వరకు చెయ్యాలి.

నిదిధ్యాస  
శ్రద్ధగా ఏకాగ్రచిత్తంతో  మననం చెయ్యడం వల్ల నిదిధ్యాస సిద్ధిస్తుంది. నిదిధ్యాస సమాధి స్థితికి ప్రారంభ దశ. క్రమంగా ఇది పరిపక్వం చెంది సమాధి అనబడుతుంది. ఇది లభించడం చేత తత్వజ్ఞానం కలుగుతుంది. తత్వజ్ఞానం అంటే బ్రహ్మజ్ఞానమని అర్ధం.

ఈవిధంగా ముముక్షువై  గురువును ఆశ్రయించి, అత్మస్వరూపాన్ని గూర్చిన ఉపదేశాన్ని పొంది, తాను విన్న విషయాన్ని గూర్చి మననం చెయ్యాలి. తగిన యుక్తులచేత ఆవిషయం చక్కగా మనస్సుకు పట్టించుకొని ఆత్మస్వరూపాన్నే నిరంతరమూ ధ్యానం చెయ్యడం వల్ల ఆత్మసాక్షాత్కారం పొందుతాడని బృహదార‌ణ్యకోపనిషత్తు బోధిస్తుంది. అంచేత ఆత్మజ్ఞానం కావాలనే కోరిక గలవాడు అనవసరమైన ఇతర వాగ్వివాదాలను విడిచిపెట్టి ఆత్మను గురించే ధ్యానం చెయ్యాలని ముండకోపనిషత్తు కూడా చెబుతోంది.